Avatar 2: 14 వేల కోట్ల మార్క్ దాటేసిన కామెరూన్ మూవీ.. ఇండియాలో మొదటి స్థానంలో..
ABN , First Publish Date - 2023-01-09T15:20:50+05:30 IST
దాదాపు పుష్కర కాలంపాటు ప్రపంచం మొత్తం ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన చిత్రం ‘అవతార్: ది వే ఆఫ్ వాటర్’.

దాదాపు పుష్కరకాలంపాటు ప్రపంచం మొత్తం ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన చిత్రం ‘అవతార్: ది వే ఆఫ్ వాటర్’ (Avatar The Way Of Water). జేమ్స్ కామెరూన్ (James Cameron) దర్శకుడు. 2009లో వచ్చిన విజువల్ వండర్ (Visual Wonder) ‘అవతార్’కి సీక్వెల్‌గా తెరకెక్కిన ఈ చిత్రం డిసెంబర్ 16న వరల్డ్ వైడ్ విడుదలైంది. అయితే.. రిలీజ్ అయిన తర్వాత స్టోరీపరంగా మిక్స్డ్ టాక్‌ని సొంతం చేసుకుంది. అయినప్పటికీ విజువల్ ఫీస్ట్ అని టాక్ రావడంతో విడుదలైన ప్రతి చోట రికార్డుల కలెక్షన్లతో దూసుకుపోతోంది. అంతేకాకుండా ఇండియాలోనూ అత్యధిక వసూళ్లు సాధించిన హాలీవుడ్ (Hollywood) సినిమాగా నిలిచింది.
ఈ విషయాన్ని తెలుపుతూ ప్రముఖ ట్రేడ్ అనలిస్ట్ రమేశ్ బాలా ఓ ట్వీట్ చేశాడు. అందులో.. ‘‘జేమ్స్ కామెరూన్ దర్శకత్వం వహించిన ‘అవతార్: ది వే ఆఫ్ వాటర్’ భారతదేశంలో కొత్త బెంచ్‌మార్క్‌ను సృష్టిచింది! ఇప్పుడు భారతదేశంలో రూ.454 కోట్లతో అత్యధిక వసూళ్లు సాధించిన హాలీవుడ్ చిత్రంగా నిలిచింది. ‘అవెంజర్స్: ఎండ్‌గేమ్’ బాక్సాఫీస్ కలెక్షన్లను దాటేసి మొదటి స్థానంలో నిలిచింది. అలాగే ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికే రూ.14,060 కోట్ల వసూళ్లు సాధించింది’’ అని రాసుకొచ్చాడు.
దీంతో ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రాల్లో.. ఈ చిత్రం ఏడో స్థానంలో నిలిచింది. అయితే.. ఈ లిస్ట్‌లో 2009లో వచ్చిన ‘అవతార్’ దాదాపు రూ.23వేల కోట్లకుపైగా వసూళ్లు సాధించి మొదటి స్థానంలో ఉంది. దాని తర్వాతి స్థానంలో ‘అవెంజర్స్: ఎండ్‌గేమ్’ రెండో స్థానంలో ఉంది. కాగా.. ‘అవతార్ 2’లో సామ్ జో సల్దానా, వర్తింగ్టన్, కేట్ విన్స్‌లెట్, సిగౌర్నీ వీవర్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ మూవీ ఇంకా ఎన్ని రికార్డులు తిరగరాస్తుందో చూడాలి మరి.