Sreeleela: ఇంకో సినిమా వరసగా ఫ్లాప్, క్రేజ్ తగ్గిందా...

ABN , First Publish Date - 2023-12-12T16:36:12+05:30 IST

వచ్చిన సినిమాలన్నీ ఒప్పేసుకొని, ఏ సినిమాకి సరిగా డేట్స్ ఇవ్వలేక, సినిమాల్లో కేవలం పాటలకే పరిమితం అయిన శ్రీలీలకి వరసగా రెండో ఫ్లాప్ వచ్చింది. ఇప్పుడు ఆశలన్నీ మహేష్ బాబు 'గుంటూరు కారం' సినిమా మీదే పెట్టుకున్నారు.

Sreeleela: ఇంకో సినిమా వరసగా ఫ్లాప్, క్రేజ్ తగ్గిందా...
Challenging time for Sreeleela

తెలుగు అమ్మాయి శ్రీలీల (Sreeleela) ముందుగా కన్నడ సినిమాతో సినీ రంగ ప్రవేశం చేశారు. తరువాత తెలుగులో సీనియర్ నటుడు శ్రీకాంత్ కుమారుడు రోషన్ మేక కథానాయకుడిగా, సీనియర్ దర్శకుడు రాఘవేంద్ర రావు పర్యవేక్షణలో, గౌరీ రోణంకి దర్శకత్వంలో వచ్చిన 'పెళ్లిసందD' #PelliSandaD సినిమాతో పరిచయం అయింది శ్రీలీల. ఈ సినిమా గొప్పగా విజయం సాధించకపోయినా శ్రీలీలకి మాత్రం తెలుగులో వరసగా ఎన్నో సినిమాలు వచ్చాయి. అందులో మొదటిగా విడుదలైన సినిమా 'ధమాకా' #Dhamaka, రవితేజ (RaviTeja) పక్కన నటించింది. ఇది ఘన విజయం సాధించింది.

sreeleelagunturkaaram.jpg

ఈ సినిమాలో శ్రీలీల తన నాట్యం, క్యూట్ లుక్స్ తో ప్రేక్షకులని విపరీతంగా ఆకర్షించింది. ఇంకేముంది ఆమెకి వరసగా సినిమాలు వచ్చేసాయి, అంటే ఎన్ని సినిమాలు వచ్చాయంటే, శ్రీలీల ఒక్కో సినిమాకి ఒకటి రెండు రోజులు ఇచ్చి, మళ్ళీ ఇంకో సినిమాకి ఒకటి రోజులు కేటాయించి, అలా అంత బిజీ అయిపొయింది. అయితే ఆమె వచ్చినవన్నీ ఒప్పేసుకోవటం, ఒప్పుకున్న సినిమాలు అన్నిటికీ సరైన సమయం కేటాయించకపోవడంతో కొన్ని సినిమాల్లో ఆమె కేవలం పాటలకి మాత్రమే పరిమితం అయిపోవటం ఆసక్తికరం.

sreeleela-car.jpg

'ధమాకా' తరువాత రామ్ పోతినేనితో చేసిన 'స్కంద' #Skanda బాక్స్ ఆఫీస్ దగ్గర ఫ్లాప్ అయింది, ఆ సినిమాలో కేవలం శ్రీలీల పాటలకే పరిమితం అయిపొయింది. తరువాత వచ్చిన 'భగవంత్ కేసరి', #BhagavanthKesari బాలకృష్ణ కథానాయకుడు కాబట్టి సినిమా ఆడింది అని అంటున్నారు. అందులో శ్రీలీల మంచి పాత్ర చేసింది, విమర్శకుల ప్రసంశలు పొందింది. ఈ సినిమా తరువాత వచ్చిన 'ఆదికేశవ' #Aadikeshava, ఈమధ్య విడుదలైన 'ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్' #ExtraOrdinaryMan రెండూ శ్రీలీలకి మంచి పేరు తీసుకురాలేకపోయాయి. ఆమె రెండు సినిమాల్లో గ్లామర్ గా వుంది అని విమర్శకులు రాసారు తప్ప, ఆమె ప్రతిభకి తగ్గ పాత్ర లేదని, కేవలం పాటలకి మాత్రమే పరిమితమైందని అన్నారు.

మరి శ్రీలీల ఎక్కడ తప్పు చేసింది, వరస సినిమాలు ఒప్పేసుకోవటంతో ఏ సినిమాకి సరైన నాయ్యం చేయలేకపోతోంది అని పరిశ్రమలో టాక్. నితిన్ అయితే శ్రీలీల గురించి తన సినిమా 'ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్' ప్రచారాల్లో సంచలన ప్రకటన చేయడం అందరికీ తెలిసిన విషయమే. శ్రీలీల ఒక రోజా, రెండు రోజులా, లేక రెండు గంటలా ఆమె డేట్స్ ఎలా ఇస్తుంది, ఆ సమయంలో ఆమెతో సన్నివేశాలు ఎలా చిత్రీకరించాలి అనే విషయమే దర్శకుడికి, మిగతా చిత్ర యూనిట్ కి పెద్ద ఛాలెంజ్ అని చెప్పారు నితిన్. అంటే శ్రీలీల ఎక్కువ సినిమాలు ఒప్పేసుకోవటంతో వచ్చిన చిక్కు ఇదంతా అని అంటున్నారు.

gunturkaaramcompleted.jpg

ఇప్పుడు శ్రీలీల ఆశలు అన్నీ సూపర్ స్టార్ మహేష్ బాబు (Mahesh Babu) పక్కన నటిస్తున్న 'గుంటూరు కారం' #GunturKaaram పైనే వున్నాయి. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకుడు (TrivikramSrinivas), మీనాక్షి చౌదరి (MeenakshiChaudhary) కూడా ఈ సినిమాలో ఇంకో కథానాయిక. ఈ 'గుంటూరు కారం' సినిమాకి కూడా శ్రీలీల డేట్స్ దొరకటం కష్టం అయిందని, అందువలన మీనాక్షి పాత్ర కొంచెం పొడిగించాల్సి వచ్చిందని, ఒక టాక్ పరిశ్రమలో నడుస్తోంది. శ్రీలీల ఇంకా చిన్న వయసులో వుంది, మంచి భవిష్యత్తు వుంది, అందుకని ఇలా చేతికి వచ్చిన సినిమాలనే ఒప్పేసుకొని, దేనికీ న్యాయం చెయ్యకుండా, ఫ్లాపులు చవిచూసే కన్నా, క్వాలిటీ వున్న పాత్రలు చేస్తే మంచి పేరు వస్తుందని, పరిశ్రమలో అంటున్నారు. ఆమె చేతిలో ఇంకా అరడజను సినిమాలు వున్నాయి, అన్నిటికి డేట్స్ ఇస్తుందా, లేదా ఆ సినిమాల్లో కూడా కేవలం పాటలకే పరిమితమా? వేచి చూడాల్సిందే.

Updated Date - 2023-12-12T16:36:13+05:30 IST