Love Today Ivana: ఇవానా భవిష్యత్తు దిల్ రాజు చేతుల్లో

ABN , First Publish Date - 2023-12-01T16:53:43+05:30 IST

'లవ్ టుడే' సినిమా తమిళనాడులో ఎంత పెద్ద సంచలనం సృష్టించిందో అందరికీ తెలిసిన విషయమే, ఆ సినిమా తెలుగులో కూడా విడుదలై విజయం సాధించింది. ఆ సినిమాలో చేసిన కథానాయకురాలు ఇవానా ఇప్పుడు దిల్ రాజు నిర్మిస్తున్న 'సెల్ఫిష్' లో ఆశిష్ రెడ్డి పక్కన చేస్తోంది. ఈ సినిమా మొదలై సంవత్సరం అయినా ఇంకా పూర్తి కాలేదు, ఇవానా భవితవ్యం కూడా తేలటం లేదు అని వార్త. ఎందుకంటే...

Love Today Ivana: ఇవానా భవిష్యత్తు దిల్ రాజు చేతుల్లో
Ivana of 'Love Today' fame

గత సంవత్సరం తమిళ సినిమా 'లవ్ టుడే' #LoveToday విడుదలై పెద్ద సంచలనం సృష్టించింది. ఆ సినిమాని అదే పేరుతో తెలుగులో ప్రముఖ నిర్మాత దిల్ రాజు #DilRaju విడుదల చేశారు, తెలుగులో కూడా బాగానే ఆడింది. ఆ సినిమాలో నటించిన కథానాయకురాలు ఇవానాకు మంచి పేరు కూడా వచ్చింది. ఆ సినిమా విడుదలయ్యాక దిల్ రాజు తన అన్న కుమారుడు ఆశిష్ ని కథానాయకుడిగా 'సెల్ఫిష్' #Selfish అనే సినిమాకి శ్రీకారం చుట్టారు. ఇందులో 'లవ్ టుడే' కథానాయకురాలు ఇవానా ని తీసుకున్నారు.

ఆమెతో రెండు సినిమాలకి గాను దిల్ రాజు ఒప్పందం కుదుర్చుకున్నట్టుగా టాలీవుడ్ లో టాక్ నడుస్తోంది. ఆ రెండు సినిమాలు అయ్యే వరకు ఇవానా వేరే తెలుగు సినిమా చెయ్యకూడదు అని దిల్ రాజు షరతు పెట్టినట్టుగా వార్త వస్తోంది. అందుకనే ఇవానా కి తెలుగులో చాలా సినిమాలు వస్తున్నాయి, కానీ దిల్ రాజు తో కుదిరిన ఒప్పందం వలన ఆమె వేరే తెలుగు సినిమా చేయలేకపోతోంది అని పరిశ్రమలో టాక్ నడుస్తోంది.

ivanalovetoday.jpg

అయితే ఇవానా కూడా దిల్ రాజు మామూలుగా సినిమాలు తొందరగా తీస్తారు అని పేరుంది అని అతనితో ఈ షరతులకు ఒప్పుకుంది అని, అయితే దిల్ రాజు 'సెల్ఫిష్' సినిమా మొదలయ్యి ఏడాది అయినా ఇంకా తీస్తూనే వున్నారు అని టాక్. ఈ సినిమా ఇప్పుడు మళ్ళీ రీషూట్ కూడా చేస్తున్నారని వినికిడి. దీనితో ఇవానా కెరీర్ ఇప్పుడు చిక్కులో పడినట్టుగా అయింది. ఎందుకంటే ఆమె వేరే తెలుగు సినిమా చెయ్యలేదు, ఇప్పుడు చేస్తున్న సినిమా అంత తొందరగా అయ్యేట్టు కనిపించడం లేదు. అది అయితే కానీ, వేరే ప్రాజెక్ట్ ఒప్పుకోవడానికి లేదు అని దిల్ రాజు ఖరాఖండీగా చెప్పినట్టు భోగట్టా.

ఈ నెలలో ఒక కొత్త నిర్మాణ సంస్థ ఒక చిన్న తెలుగు సినిమా తీయడానికి సంకల్పించినట్టుగా భోగట్టా. ఆ దర్శకుడు ఇవానాకి కథ వినిపించడానికి వెళ్ళినప్పుడు ఈ విషయం తెలిసిందని వార్త. ఇప్పుడు ఆ నిర్మాణ సంస్థ దిల్ రాజుని అభ్యర్ధించి అతను ఒప్పుకుంటే తమ సినిమాలో ఇవానా ని తీసుకోవచ్చు అని ఒక వార్త బయటకి వచ్చింది.

Updated Date - 2023-12-01T16:53:44+05:30 IST