Vimanam Film Review: వీపు విమానం మోత ఈ సినిమా!

ABN , First Publish Date - 2023-06-09T15:29:07+05:30 IST

'విమానం' సినిమా ఈమధ్య సాంఘీక మాధ్యమాల్లో బాగా వైరల్ అయింది. సముద్రఖని, అనసూయ, రాహుల్ రామకృష్ణ, ధనరాజ్ ఇందులో ప్రముఖ తారాగణం. ఇది బడ్జెట్ సినిమా, తెలుగు తమిళ భాషల్లో విడుదల అయింది, దీనికి శివ ప్రసాద్ యానాల దర్శకుడు.

Vimanam Film Review: వీపు విమానం మోత ఈ సినిమా!
Vimanam Film Review

సినిమా: Vimanam

నటీనటులు: స‌ముద్రఖ‌ని, ధనరాజ్, అన‌సూయ భ‌ర‌ద్వాజ్‌, మీరా జాస్మిన్, రాహుల్ రామ‌కృష్ణ‌, మాస్ట‌ర్ ధ్రువ‌న్‌, రాజేంద్ర‌న్ తదితరులు

ఛాయాగ్రహణం: వివేక్ కాలేపు

సంగీతం: చరణ్ అర్జున్

మాటలు: హను రావూరి

నిర్మాణం: జీ స్టూడియోస్, కిరణ్ కొర్రపాటి

రచన, దర్శకత్వం: శివ ప్రసాద్ యానాల

-- సురేష్ కవిరాయని

ఈమధ్య చిన్న బడ్జెట్ సినిమాలు, కాన్సెప్ట్ బేస్డ్ సినిమాలు వస్తున్నాయి. అలాంటిదే ఈ 'విమానం' #VimanamFilmReview సినిమా కూడా. సముద్రఖని (Samuthirakani), అనసూయ భరద్వాజ్ (AnasuyaBharadwaj), రాహుల్ రామకృష్ణ (RahulRamakrishna), ధనరాజ్ (Dhanraj) ప్రధాన పాత్రలుగా చేసిన ఈ సినిమాని శివప్రసాద్ యానాల (Sivaprasad Yanala) దర్శకత్వం వహించాడు. మీరా జాస్మిన్ (MeeraJasmine) ఈ సినిమాతో మళ్ళీ ఎంట్రీ ఇచ్చింది. అలాగే ప్రముఖ ఛానల్ జీ స్టూడియోస్ (Zee Studios) కొంతమంది నిర్మాతలతో కలిసి చిన్న సినిమాలను నిర్మిస్తోంది, బహుశా అవి తమ ఓటిటి ఛానల్ కి కూడా ఉపయోగపడతాయి అనే కారణంతో కావచ్చు. ఈ 'విమానం' #VimanamReview సినిమా కూడా అదే కాన్సెప్ట్ తో నిర్మించింది అనిపిస్తోంది. ఇక ఈ సినిమా ఎలా ఉందొ చూద్దాం.

Vimanam-1.jpg

Vimanam Film Story కథ:

వీరయ్య (సముద్రఖని) ఒక చిన్న పేట లాంటి ప్రాంతంలో నివసిస్తున్న వికలాంగుడు, అతనికి ఒక కాలు సరిగ్గా పని చెయ్యదు, భార్య లేదు. నాలుగో తరగతి చదువుతున్న కుమారుడు రాజు (మాస్టర్ ధ్రువన్) ఉంటాడు, అతన్ని చాలా గారాబంగా చూసుకుంటూ ఉంటాడు. అతను సులభ్ కాంప్లెక్స్ నడుపుతూ ఉంటాడు, దాని మీద వచ్చే చిల్లర పైసలతో జీవనాధారం చేసుకుంటూ ఉంటాడు. కొడుకు రాజుకు విమానం అంటే పిచ్చి, దగ్గరలో వున్న ఎయిర్ పోర్ట్ కి విమానాలు దిగుతున్నప్పుడు, ఎగురుతున్నపుడు చూసి ఎంతో ఆనందిస్తూ, తన తండ్రిని విమానం ఎక్కించమని అడుగుతూ ఉంటాడు. ఒకసారి కొడుకు స్కూల్లో పడిపోతే డాక్టర్ దగ్గరికి తీసుకు వెళతాడు, అప్పుడు కొడుక్కి లుకేమియా (బ్లడ్ క్యాన్సర్) వ్యాధి ఉందని తెలుస్తుంది, ఎన్ని రోజులో బతకడు అని కూడా డాక్టర్ చెప్తుంది. కొడుకు ఇంక బతకడు అని తెలుసుకున్న వీరయ్య కొడుకు కోరిక విమానం ఎక్కించాలి అనుకుంటాడు. దానికి డబ్బులు కావాలి, అందుకోసం ఏమైనా చెయ్యడానికి సిద్ధపడతాడు. అదే పేటలో సుమతి (అనసూయ భరద్వాజ్) అనే వేశ్య, చెప్పులు కుట్టే కోటి (రాహుల్ రామకృష్ణ), ఆటో డ్రైవర్ డేనియల్ (ధనరాజ్) కూడా నివసిస్తూ వుంటారు. వీరయ్య తన కొడుకు కోర్కెని ఎలా తీర్చాడు, దాని కోసం ఏమి చేసాడు, మిగతా ముగ్గురు వీరయ్యకి ఏమి చేశారు అన్నది తెలియాలంటే సినిమా చూడాల్సిందే. #VimanamFilmReview

Vimanam.jpg

విశ్లేషణ:

దర్శకుడు శివ ప్రసాద్ యానాల కి ఈ 'విమానం' #VimanamReview మొదటి సినిమా అనుకుంటా. ఈమధ్య చాలా వార్తలు చూస్తూనే వున్నాం మనం, పిల్లలు కాన్సర్ లేదా ఒక వింతైన వ్యాధులతో ఎక్కువ రోజులు బతకరు అని తెలిసి వాళ్ళ చివరి కోరికలు ఏమైనా ఉంటే తీరుస్తూ వుంటారు. ఒకరు ఒక్కరోజు పోలీస్ ఆఫీసర్ గా, ఇంకొకరు తనకిష్టమైన నటుడితో గడపాలని ఇలా ఒక్కొక్కరు ఒక్కోలా ఉండాలని అనుకుంటే ఆలా తీర్చడానికి ఒక సంస్థ కూడా వుంది. ఈ 'విమానం' #VimanamFilmReview సినిమా కూడా అలాంటిదే. ఒక తండ్రికి నాలుగో తరగతి చదువుతున్న తన కొడుకు మరణిస్తాడని తెలిసి, అతని కోరిక అయిన విమానం ఎక్కాలి అన్నది ఎలా తీర్చాడు అన్న నేపథ్యంలో తీసిన కథ ఇది.

దర్శకుడు మంచి కథనే ఎన్నుకున్నాడు, కానీ దానికి కావలసిన భావోద్వేగాలను కానీ, సన్నివేశాలను కానీ సరిగ్గా అమర్చలేకపోయాడు, చూపించలేకపోయాడు. ఈ కథకి ఇంకో మూడు పాత్రలు ఆటో డ్రైవర్, ఒక వేశ్య, ఒక చెప్పులు కుట్టే అతన్ని అమర్చాడు. అక్కడే ఈ సినిమా కథ అడ్డం తిరిగింది. దర్శకుడు తాను తీయదలుచుకున్నది తెలుగు సినిమా, తెలుగులో కథ రాసుకున్నాడు, కానీ ఈమధ్య చిన్నా పెద్ద అందరి దర్శకులకీ పాన్ ఇండియా అనే మాటా బాగా పట్టుకుంది. దానికి తోడు ఈ ఓటిటిలు రావటం కూడా ఈ పాన్ ఇండియా పదానికి మరీ డిమాండ్ ఎక్కువయింది. తెలుగు కథ తెలుగులో తీయాలనుకున్నప్పుడు తెలుగులో నీట్ గా తీస్తే బాగుండేది. కానీ ముగ్గురు తెలుగు నటులు, ముగ్గురు అరవ నటులు (నటుల ప్రతిభని కించపర్చటం లేదు) తీసుకోవటంతోటే అక్కడే సినిమా సగం పోయింది అని అర్థం అయిపోతుంది. డైరెక్ట్ గా ఒక మంచి తెలుగు సినిమా తీసి, అది కంటెంట్ బాగుంటే మిగతా భాషల్లో చూడరా ఏంటి? '2018' మలయాళం సినిమా అందులో తెలుగు, హిందీ, కన్నడ నటులు లేరు అయినా సినిమా 150 కోట్ల పైన కలెక్టు చేసింది, ఎందుకంటే అది మలయాళం నటులతో తీసిన మలయాళం సినిమా. ముందు మలయాళంలో విడుదల చేసి, తరువాత తెలుగులో విడుదల చేశారు. తెలుగులో కూడా బాగానే ఆడింది. ఆ సినిమా దర్శకుడు కూడా 'పాన్ ఇండియా' అని ఆలోచిస్తే ఆ సినిమా ఫ్లాప్ అయ్యేదేమో.

Vimanam-FL.jpg

అలాగే 'కాంతారా' కన్నడ నటులతో తీసిన కన్నడ సినిమా. కన్నడం లో ముందు విడుదల అయి, బాగుంది అనుకున్నాక మిగతా భాషల్లో విడుదల చేశారు, పెద్ద హిట్ అయింది, జాతీయంగా మంచి పేరొచ్చింది. మరి 'కాంతారా' లో తెలుగు, ఆరవ నటులు ఎవరూ లేరు కదా. మరి ఈ 'విమానం' సినిమా చేస్తున్నప్పుడు పాన్ ఇండియా ఐడియా ఎందుకు వచ్చిందో. సముద్రఖని మంచి నటుడే కానీ అతని తెలుగు ఉచ్చారణ అంత బాగోదు. సముద్రఖని బదులు ఒక మంచి తెలుగు నటుడిని పెట్టి తీయొచ్చు కదా ఈ సినిమా. కొన్ని సినిమాలకి ఆ భాషని అర్థం చేసుకొని దానికి తగ్గట్టుగా చాలా ఇంటెన్స్ నటన చూపించాలి. తెలుగు ప్రేక్షకుల అభిరుచి వేరు, మిగతా భాషల అభిరుచి వేరుగా ఉంటుంది. ముఖ్యంగా ఇలాంటి భావోద్వేగాల నేపథ్యంలో సినిమాలు తీసినప్పుడు తెలుగు నటులు చేస్తేనే అది బాగా పండుతుంది. అంటే వేరే భాషా నటులని కించపరిచినట్టు కాదు. ఉదాహరణకు మళ్ళీ '2018' సినిమానే. అది మలయాళం భాష తెలిసి చేసిన వాళ్ళు, అందుకే ఆ భావోద్వేగాలు పండాయి అది ప్రేక్షకులకి బాగా ఎక్కింది.

ఇవన్నీ ఒక ఎత్తు అయితే, దర్శకుడు సినిమా ఒక బడ్జెట్ లో తీసేద్దాం అనుకున్నాడు, అందుకే చాలా సన్నివేశాల్లో సహజత్వం లోపించింది. కొన్ని సన్నివేశాలు మరీ లోపభూయిష్టం గా వున్నాయి. ఉదాహరణకు సుమతి పాత్ర తీసుకుందాం. కథ తండ్రీ కొడుకుల చుట్టూ తిరిగి, మిగతా పాత్రలు కూడా వస్తూ ఉంటాయి. కానీ సుమతి పాత్రని కేవలం అనసూయ అంగాంగ ప్రదర్శనకి దర్శకుడు ఎక్కువ ప్రాముఖ్యం ఇచ్చాడు అనిపిస్తుంది. ఆమె సంభాషణలు కూడా రచయిత బాగా రాయలేదు అనిపిస్తుంది. ఎందుకంటే ఆ పదాలు మరీ వినడానికి ఎబ్బెట్టుగా వున్నాయి. ఇంత భావోద్వేగ కథలో అలాంటివి అవసరమా.

Vimanam-2.jpg

అదీ కాకుండా ఆమె మాట్లాడే మాటలు కూడా అంతగా బాగా రాయలేదు. ఆమె ఇంటికి విటులు రావటం, రాహుల్ రామకృష్ణ వెళ్లి కిటికీ లోంచి చూడటం, దర్శకుడు ఏమి చెప్పాలనుకున్నాడు ఆమె పాత్ర, అతని పాత్రల ద్వారా. ఆమె వేశ్య అని తెలిసినా కూడా అతను ప్రేమిస్తాడు, అంతవరకు బాగుంది. కానీ ఈ ఎబ్బెట్టుగా అనిపించే సన్నివేశాలు, మాటలు ఎందుకు. ఇంకా ఆ ఫోటోగ్రాఫర్ సన్నివేశాలు అయితే బాగా చిరాకు తెప్పించాయి. అతను కూడా ఒక ఆరవ నటుడు. చెప్పాను కదా ఇది బడ్జెట్ సినిమా అని, అందుకని క్లైమాక్స్ లో ఆ విమానం అనేది ఒక విమానం సెట్ అని తెలిసేలా చుట్టేశాడు. అది విమానం ఆలా అనిపించటం లేదు. ఒక రూమ్ లో కొన్ని కుర్చీలు వేసి విమానంలా అనిపించారు. ఇలాంటి అసహజ సన్నివేశాలు ఎన్నో వున్నాయి సినిమాలో. కొన్ని సన్నివేశాల్లో చాలామంది ఓవర్ యాక్షన్. కథ చాలా స్లో, ఏమవుతుంది అన్నది అందరికీ ముందే తెలిసిపోతుంది. మంచి కథే, కానీ దర్శకుడు దాన్ని పాడుచేశాడు. తెలుగు సినిమాని తెలుగు సినిమాల తీస్తే బాగా ఉండేదేమో. లేదా తమిళ నటులను పెట్టి తమిళం లో తీయండి, తరువాత దాన్ని తెలుగులోకి అనువదించండి. చాలు. ఈ పాన్ ఇండియా వాపు మన దర్శకులకి పోతే గానీ మంచి సినిమాలు రావేమో అనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే చిన్న దర్శకులు అదే భావనలో పడిపోతే మంచి సినిమాలు కూడా ఇటూ అటూ కాకుండా ఈ విమానంలా తయారవుతాయి.
Samudrakhani.jpg

ఇక నటీనటుల విషయానికి వస్తే, సముద్రఖని మంచి నటుడు, చివర్లో బాగా చేసాడు. కాలు లేకపోవటం అన్నది కొన్ని సన్నివేశాల్లో బాగా చూపించలేదు. ఆ చిన్నపిల్లాడు మాస్టర్ ధృవన్ బాగా చేసాడు. రాహుల్ రామకృష్ణ, ధనరాజ్ పాత్రలు అంత బలమైనవి కావు. అనసూయ కేవలం గ్లామర్ కోసం సినిమాలో తీసుకున్నారు, అంతే కానీ ఎదో వేశ్య పాత్ర, బోల్డ్ పాత్ర ఎవరు చెయ్యరు, ఆమె చేసింది, ఇలాంటివి వద్దు. ఆమె పాత్ర అంత బలమైన పాత్ర అయితే కాదు. 'వేదం' సినిమాలో అనుష్క కూడా చేసింది, అందులో చక్కగా చూపించాడు క్రిష్. మీరా జాస్మిన్ చివర్లో కనపడుతుంది. మిగతా వాళ్ళు ఒకే. సంగీతం పరవాలేదు. ఛాయాగ్రహణం కూడా ఒకే. చాలా సన్నివేశాలు సెట్ అని తెలిసిపోతూ ఉంటుంది. అందుకే సినిమా చుట్టేసాడా దర్శకుడు అనిపిస్తూ ఉంటుంది.

ప్రతి సినిమా బాగా ఆడాలని, డబ్బులు రావాలనే కోరుకుంటారు. కానీ ఈ 'విమానం' సినిమా ఓటిటి కి పనికొచ్చే సినిమా అంతేకానీ థియేటర్ లో చూసేది కాదు. మంచి కథను, దర్శకుడు పాన్ ఇండియా మోజులో తెలుగు, తమిళ నటులను పెట్టి పాడుచేశాడు అనిపిస్తుంది.

Updated Date - 2023-06-09T15:29:07+05:30 IST