Save The Tigers Web Series Review: నవ్వులు పండించే టైగర్స్

ABN , First Publish Date - 2023-04-27T18:41:33+05:30 IST

'యాత్ర', 'పాఠశాల' లాంటి సినిమాలకు దర్శకత్వం వహించిన తీసిన మహి రాఘవ ఈసారి ఒక వెబ్ సిరీస్ ని క్రియేట్ చేస్తే, దానికి నటుడు తేజ కాకుమాను మొదటిసారిగా దర్శకత్వం వహించాడు. ఈ వెబ్ సిరీస్ ఎలా ఉందంటే...

Save The Tigers Web Series Review: నవ్వులు పండించే టైగర్స్
Still from Save The Tigers Web Series

వెబ్ సిరీస్: సేవ్ ది టైగర్స్

నటీనటులు: ప్రియదర్శి, చైతన్య కృష్ణ, అభినవ్ గోమటం, జోర్దార్ సుజాత, పావని, దేవయాని, హర్షవర్ధన్, శ్రీకాంత్ అయ్యంగార్, రోహిణి, సునైనా, గంగవ్వ తదితరులు

క్రియేటర్స్: మహి వి. రాఘవ్, ప్రదీప్ అద్వైతం

సంగీతం: శ్రీరామ్ మద్దూరి

ఛాయాగ్రహణం: ఎస్.వి. విశ్వేశ్వర్

దర్శకత్వం: తేజ కాకుమాను (Teja Kakumanu)

విడుదల: డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో

-- సురేష్ కవిరాయని

ఈమధ్య థియేటర్స్ లో సినిమాలు ఎలా విడుదల అవుతున్నాయో, వాటికి సరిసమానంగా ఓటిటి లో కూడా వెబ్ సిరీస్, సినిమాలు విడుదల అవుతున్నాయి. మొదట్లో కొంచెం నాసిరకం వెబ్ సిరీస్ లు వచ్చినా రాను రాను, ఇవి బాగా క్వాలిటీ తో తీస్తే బాగుంటాయి అని తెలుసుకున్నట్టున్నారు అందుకే ఈమధ్య వచ్చిన కొన్ని వెబ్ సిరీస్ లు నిరూపించాయి. ఇప్పుడు ఇంకో వెబ్ సిరీస్ 'సేవ్ ది టైగర్స్' #SaveTheTigersReview డిస్నీ ప్లస్ హాట్ స్టార్ (DisneyPlusHotstar) లో విడుదల అయింది. టైటిల్ చూసి ఇదేదో పులులకు సంబందించినది అనుకునేరు, కాదు, ఇది ఒక కామెడీ వెబ్ సిరీస్ అని చెప్పారు ముందుగానే. 'యాత్ర' (Yatra), 'పాఠశాల' (Paatasala) లాంటి హిట్ చిత్రాలు తీసిన మహి రాఘవ (Mahi V Raghava) ఈ వెబ్ సిరీస్ ని, ప్రదీప్ అద్వైతం (Pradeep Advaitham) తో క్రియేట్ చేసాడు. తేజ కాకుమాను (Teja Kakumanu) నటుడిగా పరిచయమే, కానీ ఈ వెబ్ సిరీస్ తో దర్శకుడిగా ఆరంగేట్రం చేస్తున్నాడు. ఇందులో చైతన్య కృష్ణ (Chaitanya Krishna), ప్రియదర్శి (Priyadarshi), అభినవ్ గోమటం (Abhinav Gomatam) లాంటి నటులు వేశారు. ఇంతకీ ఈ వెబ్ సిరీస్ ఎలా ఉందంటే...

savethetigers.jpg

Save The Tigers Story కథ:

విక్రమ్ (చైతన్య కృష్ణ‌), రాహుల్ (అభిన‌వ్ గోమటం), గంటా రవి (ప్రియదర్శి) అనుకోకుండా తమ పిల్లలు చదివే స్కూల్ దగ్గర స్నేహితులు అవుతారు. ముగ్గురూ డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో పోలీసులకు పట్టుబడతారు, అలాగే వాళ్ళ కారుని కూడా స్టేషన్ లో పెడతారు. ఆ కారు విక్ర‌మ్ భార్య పేరుపై ఉంటుంది, ఫైన్ కట్టి కారు తీసుకు వెళ్లాలంటే అతని భార్య కోర్టుకు రావాల్సి ఉంటుంది. భ‌య‌ప‌డ్డ విక్ర‌మ్ మిగతా ఇద్దరు ఇద్ద‌రు స్నేహితుల‌తో సీఐ (శ్రీకాంత్ అయ్యంగార్‌) ని కలుస్తారు. సీఐ కూడా తమలాగే భార్య బాధితుడిని తెలుస్తుంది. సీఐ కూడా వీళ్ళ బాధలు వినాలని వీళ్ళ కథలు చెప్పమంటాడు. గంటా ర‌వి పాల వ్యాపారం చేస్తాడు, భార్య (జోర్దార్ సుజాత‌) బ్యూటీ పార్ల‌ర్‌లో ప‌ని చేస్తుంటుంది. అక్కడ స్లమ్ ఏరియా లో కాకుండా గేటెడ్ క‌మ్యూనిటీకి వెళ్లిపోవాలని ఎప్పుడూ భ‌ర్త‌తో గొడ‌వ పడుతూ ఉంటుంది. విక్రమ్ ఒక యాడ్ ఏజెన్సీ లో చేస్తాడు, భార్య లాయర్ (దేవయాని). ఆమె ఒక ఫెమినిస్ట్, యాక్టివిస్ట్ కూడాను. ఇంకా మూడోవాడు రాహుల్ వుద్యోగం మానేసి రైట‌ర్ కావాలని ఇంట్లో టీవీ చూస్తూ కాలం గడిపేస్తూ ఉంటాడు, అతని భార్య మాధురి (పావ‌ని) ఓ డాక్ట‌ర్‌. ఆమె మీద అతనికి అనుమానం ఎందుకంటే ఆమె ఫ్రెండ్ న‌వీన్ (రాజా చెంబోలు)తో క్లోజ్‌గా ఉండటమే. ఇలా వీళ్ళు ముగ్గురూ తమ జీవితాలను సాగదీస్తూ ఒక యాడ్ చెయ్యటం కోసం కలుస్తారు. ఆ యాడ్ వలన వీళ్ళ ముగ్గురూ సమస్యల్లో ఇరుక్కుంటారు, ఆ యాడ్ లో ఏముంది, దాని నుంచి ఎటువంటి సమస్యలు వచ్చాయి, వీళ్ళ జీవితాల్లో దాని ప్రభావం ఏంటి అనేది తెలుసుకోవాలంటే ఈ వెబ్ సిరీస్ చూడాల్సిందే.

savethetigers1.jpg

విశ్లేషణ:

క్వాలిటీ, కంటెంట్ తో వెబ్ సిరీస్ చేస్తే బాగుంటాయి, ప్రేక్షకులను ఆకర్షిస్తాయి అని ఈమధ్య కొన్ని వెబ్ సిరీస్ లు ప్రూవ్ చేసాయి. అలాంటిందే ఈరోజు విడుదల అయిన ఈ 'సేవ్ ది టైగర్స్' #SaveTheTigersReview కూడా. మహి రాఘవ కి సినిమాలలో మంచి అనుభవం వుంది, అతను ప్రదీప్ అద్వైతం తో ఈ వెబ్ సిరీస్ ని క్రియేట్ చేస్తే, దాన్ని తేజ కాకుమాను చాలా అద్భుతంగా నేరేట్ చేసాడు. టైటిల్ చూసి ఇది పులులకు సంబంధించింది కాదు, టైగెర్స్ లాంటి మగవాళ్లకు చెందినడి అనే చెప్పే ఒక నవ్వుల వెబ్ సిరీస్ ఇది. భార్య భర్తల మధ్య ప్రేమ, అనురాగం ముఖ్యం కానీ, ఎప్పుడూ ఇద్దరూ కొట్టుకోవటం, నేను మగవాడి కన్నా పై చెయ్యి అని భార్య అనుకోవటం, అలాగే ఆడవాళ్ళూ వుద్యోగం చేస్తూ ఉంటే, వాళ్ళని అనుమానించి, ఇంట్లో ఏమి చెయ్యకుండా ఉండటం, ట్రైలర్ లో బాధితులైన మగవాళ్ల కథ అని అన్న, ఇందులో రెండు వైపులా ఉంటుంది.

అయితే ఇక్కడ దర్శకుడు ఆ విషయాన్ని చాలా సరదాగా, హాస్యంతో ఎక్కడా బోర్ కొట్టకుండా నేరేట్ చేసే విధానం బాగుంది. తేజ కనుమని దర్శకుడిగా ఈ విషయం లో విజయం సాధించినట్టే. మగవాళ్ల కష్టాలు ఎలా ఉంటాయి అనే విషయం మీద ఎక్కువగా కథ సాగినా, చివర్లో డాక్టర్ మాధురి లాంటి పాత్రతో భర్త ఎలా ఉండాలి అనే విషయం కూడా చెప్పాడు. ఇందులో భార్య భర్తల మీద వచ్చే గొడవలు మన ఇళ్లల్లో వచ్చేవిగా, ఎక్కడ విన్నట్టుగా, చూసినట్టుగా అనిపిస్తూ ఉంటుంది. అందుకే ఇది ప్రేక్షకుడికి దగ్గరయ్యే అవకాశం వుంది. ప్రేక్షకుడి చుట్టూ జరిగే సంఘటనలు ఎదురుగా కనిపిస్తూ ఉంటేనే కదా వాళ్ళకి ఆసక్తి కలిగేది. ఈ వెబ్ సిరీస్ లో అలాంటి సంఘటనలు చాలానే వున్నాయి. పనిమనిషోతో సన్నివేశాలు కొంచెం ఓవర్ అనిపించింది, కొన్ని బోర్ కొట్టాయి కూడా. ఇలాంటి వెబ్ సిరీస్ తో వచ్చిన దర్శకుడు, అలాగే క్రియేట్ చేసిన మహి రాఘవ్, ప్రదీప్ అద్వైతం అందరికీ క్రెడిట్ వెళుతుంది.

savethetigers2.jpg

నటీనటులు ఎలా చేసారంటే:

చైతన్య కృష్ణ (Chaitanya Krishna) యాడ్ ఏజెన్సీ లో పనిచేసే విక్రమ్ గా మంచి నటనని కనపరిచాడు. చైతన్య చాలా సినిమాల్లో నటించాడు, మంచి నటుడు, కానీ ఎందుకో బ్రేక్ రాలేదు. ఈ వెబ్ సిరీస్ తో అతనికి మంచి బ్రేక్ వస్తుందని అనుకుంటున్నాను. ఒక సన్నివేశంలో ప్రత్యేకంగా బార్ లో అతని మాటలు, హావభావాలు అన్నీ సహజంగా వున్నాయి. ఇంకా ప్రియదర్శి (Priydarshi Pulikonda) కూడా మంచి నటుడు అని ఎప్పుడో ప్రూవ్ చేసుకున్నాడు. ఇందులో తెలంగాణా యాస లో మాట్లాడే పాలు అమ్మే వ్యక్తిగా ఒదిగిపోయాడు. స్కూల్ లో కూతురితో సన్నివేశం, ఆ వెంటనే ఇంటి దగ్గర భోజనం చేస్తున్నప్పుడు సన్నివేశం లో భావోద్వేగంతో చేసాడు. మిగతావి కూడా అదరగొట్టాడు, ముఖ్యంగా కామెడీ ఇతని బలం. ఇంకా అభినవ్ గోమటం (Abhinav Gomatam) రైటర్ రాహుల్ గా బాగా చేసాడు. హర్షవర్ధన్, మిగతా వాళ్ళు కూడా బాగా సపోర్ట్ చేశారు.

పావని (Pavani Reddy), జోర్దార్ సుజాత (Jordar Sujatha), దేవయాని శర్మ (Devayani Sharma) ముగ్గురూ పోటీపడి నటించారు. పావని డాక్టర్ గా అదరగొట్టింది, మంచి హావభావాలు పలికించింది, అలాగే సహజంగా కూడా చేసింది. ఇంకా జోర్దార్ సుజాత అయితే తెలంగాణ యాసలో సూపర్ అనిపించింది. భర్త మీద కోపం, అలాగే భర్త మీద ప్రేమ రెండు షేడ్స్ బాగా చూపించింది. దేవయాని యాక్టివిస్ట్, ఫెమినిస్ట్ పాత్రకి బాగా సూట్ అయింది. పిల్లలు కూడా బాగా చేశారు. ఈ వెబ్ సిరీస్ కి మాటలు చాలా బాగా రాసారు. కొన్ని పంచ్ డైలాగ్స్, సరదాగా సాగే మాటలు చాలా బాగున్నాయి. అలాగే సంగీతం, ఛాయాగ్రహణం కూడా బాగుంది. మంచి క్వాలిటీ తో తీసారు.

savethetigers3.jpg

చివరగా, 'సేవ్ ది టైగర్స్' #SaveTheTigersReview వెబ్ సిరీస్ నవ్వుల్ని పండించే వెబ్ సిరీస్. సరదాగా, హాయిగా నవ్వుకోవాలంటే, ఏ థియేటర్ లో ఏ సినిమా హాస్యంగా వుందో వెతుక్కోనవసరం లేదు, ఇంట్లోనే ఈ వెబ్ సిరీస్ చూసుకోవచ్చు. అదీ కాకుండా, తలలు నరుక్కోవడాలూ, కత్తులతో పొడుచుకోవడాలూ, క్షుద్రవిద్యలతో భయపడే సన్నివేశాలు ఏమి లేకుండా ప్రశాంతంగా ఉంటుంది ఇది.

Updated Date - 2023-04-27T18:41:33+05:30 IST