PAPA Review: ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి ఎలా ఉందంటే..

ABN , First Publish Date - 2023-03-17T14:24:34+05:30 IST

ముచ్చటగా మూడో సారి నాగ శౌర్య, దర్శకుడు అవసరాల శ్రీనివాస్ కాంబినేషన్ లో వచ్చిన సినిమా 'ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి' ఎలా ఉందంటే..

PAPA Review: ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి ఎలా ఉందంటే..

సినిమా: ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి

నటీనటులు: నాగ శౌర్య, మాళవిక నాయర్, శ్రీనివాస్ అవసరాల, మేఘ చౌదరి, అభిషేక్ మహర్షి, శ్రీ విద్య తదితరులు

సంగీతం: కళ్యాణి మాలిక్, వివేక్ సాగర్(కాఫీఫై సాంగ్)

ఛాయాగ్రహణం : సునీల్ కుమార్ నామ

నిర్మాత‌లు: టీజీ విశ్వ ప్రసాద్, పద్మజ దాసరి

కథ, కథనం, మాటలు, ద‌ర్శ‌క‌త్వం: శ్రీనివాస్ అవసరాల

-- సురేష్ కవిరాయని

నాగాశౌర్య (Naga Shaurya) మంచి నటుడే కానీ, సరి అయిన బ్రేక్ మాత్రం రావటం లేదు. మధ్య మధ్యలో సినిమాలు విడుదల అవుతున్నాయి, కానీ అవి అలానే వెళ్లిపోతున్నాయి. ఇప్పుడు 'ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి' (Phalana Abbayi Phalana Ammayi) తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. దీనికి నటుడు శ్రీనివాస్ అవసరాల (Srinivas Avasarala) దర్శకత్వం వహించాడు. ఇదే కాంబినేషన్ అంటే అవసరాల, నాగ శౌర్య కలిపి ఇంతకు ముందు 'ఊహలు గుసగుసలాడే' (Oohalu Gusagusalade), 'జ్యో అచ్యుతానంద' (Jyo Achyutananda) అనే సినిమాలు చేశారు, అవి బాగున్నాయి అని అన్నారు. ఈ 'ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి' (Phalana Abbayi Phalana Ammayi) మూడో సినిమా వాళ్ళ కాంబినేషన్ లో. ఇందులో మాళవిక నాయర్ (Malavika Nair) కథానాయికారాలుగా వేసింది. మరి సినిమా ఎలా ఉందొ చూద్దామా ?

phalanaabbayiphalanaammayi1.jpg

Phalana Abbayi Phalana Ammayi story కథ:

సంజయ్ (నాగశౌర్య) బి.టెక్. చదువుతున్నప్పుడు సీనియర్స్ ర్యాగింగ్ చేస్తూ వుంటారు. ఒకసారి ఆలా చేస్తున్నప్పుడు అనుపమ (మాళవిక నాయర్) అనే అమ్మాయి ర్యాగింగ్ నుంచి సంజయ్ ని కాపాడుతుంది. అతను మాకు తెలిసినవాళ్లబ్బాయి అని చెపుతుంది సీనియర్స్ కి. ఇంక ఎవరు తనని ర్యాగింగ్ చెయ్యాలని వచ్చినా నేను అనుపమ కలిసి చదువుకున్నాం అని సంజయ్ చెపుతూ ఉంటాడు, అలా చెప్పి తప్పించుకుంటూ ఉంటాడు కూడా. ఆ ఇద్దరూ ఆలా మంచి స్నేహితులు అయిపోతారు. ఇక్కడ చదువు అయిపోయాక ఇద్దరూ మళ్ళీ పై చదువుల కోసం లండన్ వెళతారు, అక్కడ ప్రేమలో పడతారు. అనుపమ ఒక ఏడాది సీనియర్ కావడంతో ఆమె చదువు ముందు అయిపోయి, వుద్యోగం కూడా వేరే సిటీలో వస్తుంది. సంజయ్, తనకు చెప్పకుండా అనుపమ ఉద్యోగానికి అప్లయి చేసినందుకు, అలాగే తనకు దూరంగా వెళుతోంది అన్న బాధ వలన సంతోషంగా ఉండడు. ఇద్దరి మధ్య కొంచెం దూరం పెరుగుతుంది. అదే సమయంలో సంజయ్ కి పూజ (మేఘా చౌదరి) అనే అమ్మాయి పరిచయం అవుతుంది. ఆ అమ్మాయి వలన సంజయ్, అనుపమలు దూరం అవుతారు. అనుపమకు కూడా గిరి (అవసరాల శ్రీనివాస్) అనే అబ్బాయి పరిచయం అవుతాడు. వీళ్లందరికి స్నేహితుడు అయిన వాలెంటైన్ (అభిషేక్ మహర్షి) పెళ్లి కి అందరూ కలుస్తారు. ఆ పెళ్ళికి సంజయ్, అనుపమ కూడా వస్తారు. అప్పుడు ఏమైంది, వాళ్లిద్దరూ వేరే పెళ్లి చేసుకున్నారా, కలిసారా తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

phalanaabbayiphalanaammayi.jpg

విశ్లేషణ: PAPA Review

శ్రీనివాస్ అవసరాల మంచి నటుడు, అలాగే మంచి దర్శకుడు కూడా. ఎందుకంటే అతను ఇంతకు ముందు దర్శకత్వం చేసిన రెండు సినిమాలు బాగుంటాయి. ఇప్పుడు అలాగే ఈ 'ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి' (PAPA Review) కూడా బాగుంటుంది అని అనుకొనే వెళతాము. కానీ అవసరాల ఎందుకో ఈ సినిమా మీద అంత శ్రద్ధ పెట్టలేదు అనిపిస్తూ ఉంటుంది. సినిమా చూస్తుంటే ఈ సినిమా అక్కడ కొంచెం, ఇక్కడ కొంచెం, మళ్ళీ వెనక్కి ఎలా అనిపిస్తూ ఉంటుంది అంటే, ఇందులో నటించిన నటులు ఎప్పుడు దొరికితే అప్పుడు షూటింగ్ చేశారేమో అనిపిస్తూ ఉంటుంది.

శ్రీనివాస్ అవసరాల సినిమాలు నీట్ గా ఉంటాయి, అలాగే అతను హాస్య సన్నివేశాలను కూడా నీట్ గా తీస్తాడు. భావోద్వేగాలు కూడా ఇంతకు ముందు సినిమాలలో బాగా చూపించాడు. కానీ ఈ సినిమాకి (PAPA) వచ్చేసరికి అవసరాల ఎందుకో గాడి తప్పాడు. కొన్ని సన్నివేశాలు బాగున్నాయి, సరదాగా వున్నాయి, కానీ సినిమాలో భావోద్వేగాలు లేవు, లీడ్ పెయిర్ ఎందుకు విడిపోతారు, మళ్ళీ ఎందుకు కలుస్తారు అనే విషయం బలంగా ఉంటే బాగుండేది. అదీ కాకుండా ముందు, వెనక కొంచెం ఈ ఫ్లాష్ బ్యాక్ లు కూడా ఎక్కువ అయ్యాయేమో అనిపిస్తూ ఉంటుంది.

phalanaabbayiphalanaammayi2.jpg

సినిమా చూస్తున్నంత సేపూ ఒక పూర్తి సినిమా చూస్తున్నాం అన్న భావన రాదు. ఎందుకంటే సినిమా ఆలా తీశారు మరి. మధ్య మధ్యలో కొన్ని హాస్య సన్నివేశాలు, ఒకటి రెండు పాటలు మినహా సినిమాలే అంత బలమయిన కథ లేదు. వూరికే అలా కాలేజ్ సన్నివేశాలు, స్నేహితుల మధ్యలో చిన్న చిన్న జోక్స్ బాగున్నాయి. (PAPA Review) ఒక్కోసారి ఆ సన్నివేశం ఇండియా లో అవుతోందా, లండన్ లో అవుతోందా అని కూడా ఆలోచించాల్సి వచ్చేది. ఈ సినిమా మొదలెట్టి కూడా మూడు సంవత్సరాలు పైన అయినట్టుంది, అందుకనే సినిమా సన్నివేశాలు కూడా అలానే ఉంటాయి. చివరలో పెళ్లిలో నాగ శౌర్య, ఇంకొక ఆమె చేసిన 'రత్నబాబు' సన్నివేశాలు బాగా నవ్వు తెప్పిస్తాయి.

phalanaabbayiphalanaammayi3.jpg

నటీనటులు ఎలా చేశారు:

ఇంక నటీనటుల విషయానికి వస్తే నాగ శౌర్య మంచి నటుడు, చాలా బాగా చేస్తాడు, ఎటువంటి పాత్ర అయినా. ఇందులో కూడా కాలేజీ కుర్రాడిగా, తరువాత అబ్బాయిగా చాలా బాగా చేసాడు. కానీ మంచి కథ లేకపోతే అతను మాత్రం ఏమి చేస్తాడు. వున్న నటీమణుల్లో మాళవిక నాయర్ ఒక మంచి నటి. ఇందులో ఆమె బాగానే చేసింది, మంచి అభినయం చూపించింది. అలాగే చాల సినిమాల్లో లీడ్ యాక్టర్ పక్కన కనపడే అభిషేక్ మహర్షికి ఈ సినిమాలో ఒక మంచి పాత్ర వచ్చింది. శ్రీ విద్య కూడా బాగుంది. శ్రీనివాస్ అవసరాల నటుడిగా కూడా ఇందులో కనిపిస్తాడు. మిగతా వాళ్ళు కూడా వున్నారు, కానీ వాళ్ళు అంతగా ప్రభావం చూపించరు. కళ్యాణి మాలిక్ సంగీతం పరవాలేదు. ఇంద్రగంటి మోహనకృష్ణ పాడిన పాట వింటూ ఉంటే ఏదో పాత పాట విన్నట్టుగా ఉంటుంది, బాగుంది. ఛాయాగ్రహణం కూడా ఒకే గా వుంది.

phalanaabbayiphalanaammayi4.jpg

చివరగా, 'ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి' (PAPA Review) అనే సినిమా ఒక ఫీల్ గుడ్ రొమాంటిక్ ఎంటర్ టైనర్ అవ్వాలి, కానీ సినిమాలో అక్కడక్కడా కొన్ని సన్నివేశాలు తప్పితే, ఇంకేమి లేవు. అవసరాల శ్రీనివాస్ మార్కు సినిమాలో కనిపించేది చాలా తక్కువ. ఈ సినిమా తీయడానికి మూడేళ్ళకి పైగా అయినట్టుంది, సినిమా కూడా అలానే అనిపిస్తుంది.

Updated Date - 2023-03-17T14:24:35+05:30 IST