Ramabanam film review: అన్నదమ్ముల కథన్నారు, కానీ తీరా చూసాక...

ABN , First Publish Date - 2023-05-05T15:43:04+05:30 IST

గోపీచంద్ ఎంతో ఆశ పెట్టుకున్నాడు ఈ 'రామబాణం' సినిమా మీద. శ్రీవాస్ దర్శకుడు, ఇందులో జగపతి బాబు, ఖుష్బూ కూడా ముఖ్య పాత్రలో కనపడతారు. డింపుల్ హయతి కథానాయిక. అన్నదమ్ముల మధ్య జరిగే కథ అని అన్నారు, ఇంతకీ ఎలా ఉందంటే...

Ramabanam film review: అన్నదమ్ముల కథన్నారు, కానీ తీరా చూసాక...
Ramabanam Film Review

సినిమా: రామబాణం

నటీనటులు: గోపిచంద్, డింపుల్ హయతి, నాసర్ (Nasser), జగపతి బాబు, ఖుష్బూ, తరుణ్ అరోరా (Tarun Arora) తదితరులు

సంగీతం: మిక్కీ జే మేయర్

కథ: భూపతి రాజా

ఛాయాగ్రహణం: వెట్రి పళనిసామి

నిర్మాత: టీజీ విశ్వప్రసాద్

స్క్రీన్ ప్లే, దర్శకత్వం: శ్రీవాస్

-- సురేష్ కవిరాయని

'ఎ' గ్రేడ్ నటుల తరువాత సెకండ్ లీగ్ లో వున్న నటుల్లో ఆరడుగుల పొడుగు, చూడటానికి బాగుండి, ఇటు యాక్షన్, అటు ఫామిలీ ఓరియెంటెడ్ సినిమాలు చేసుకుంటూ తనదైన మార్కు సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తూ ఉంటాడు గోపీచంద్ (Gopichand). కానీ ఎంత చేసిన మంచి బ్రేక్ అయితే రావటం లేదు. ఈసారి శ్రీవాస్ (Sriwaas) దర్శకుడిగా 'రామ బాణం' #RamabanamFilmReview అనే సినిమాతో వచ్చాడు. ఇందులో జగపతి బాబు (Jagapathi Babu), ఖుష్బూ (Khushbu) కీలక పాత్రలో నటించారు. ఇది ఇద్దరి అన్నదమ్ముల కథ, మంచి మెసేజ్ ఉంటుంది, కుటుంబం అంత చూడొచ్చు, ఇంకా ఏవేవో చెప్పారు, విడుదలకి ముందు. డింపుల్ హయాతి (Dimple Hayati) ఇందులో కథానాయకురాలు, మరి ఇంతకీ ఈ సినిమా ఎలా వుంది, గోపీచంద్ కి బ్రేక్ వస్తుందా, ఈ సినిమాతో, చూద్దాం?

ramabanam.jpg

Ramabanam Story కథ:

రాజారాం (జగపతి బాబు), అతని భార్య భువనేశ్వరి (ఖుష్బూ) రఘురామ పురం అనే వూర్లో ఆర్గానిక్ హోటల్ నడుపుతూ ఉంటాడు. అదే వూర్లో పాపారావు (నాసర్) అనే విలన్ కూడా ఉంటాడు, రాజారామ్ హోటల్ మూయించాలని చూస్తూ ఉంటాడు. రాజారాం తమ్ముడు విక్కీ (గోపీచంద్) అన్నయ్యలా సంయమనం పాటించడు, దెబ్బకు దెబ్బ అనే మనిషి. ఒకసారి పాపారావు, రాజారాం హోటల్ కి వచ్చి బెదిరిస్తే, వాడిని విక్కీ కొడతాడు. తమ్ముడు చేసింది తప్పు అంటాడు రాజారాం, కానీ విక్కీ అదే రైటు అంటాడు. ఇద్దరూ వాదించుకోవటంలో అన్న చేసింది తప్పని, విక్కీ ఊరు వదిలి కలకత్తా పారిపోయి అక్కడ పెద్ద డాన్ గా ఎదుగుతాడు. అక్కడే భైరవి (డింపుల్ హయాతి) తో ప్రేమలో పడతాడు. కానీ భైరవి తండ్రి (సచిన్ ఖేడ్కర్) ఈ పెళ్ళికి ఒక షరతు పెడతాడు, విక్కీకి కుటుంబం ఉంటేనే పెళ్లి చేస్తానని. దీంతో 14 సంవత్సరాల తర్వాత విక్కీ తనకి కుటుంబం ఉందని చెప్పి మళ్ళీ అన్న దగ్గరకి వస్తాడు. వచ్చిన రెండు మూడు రోజులు బాగానే ఉంటుంది, కానీ ఆ తరువాతే అన్నకి సమస్య, తనకి కూడా సమస్య వస్తాయి. ఇంతకీ ఏమిటా సమస్యలు, విక్కీ, భైరవి లు వివాహం చేసుకున్నారా లేదా, చివరికి ఏమైంది అన్నది ఈ 'రామబాణం' చూసి తెలుసుకోవాల్సిందే.

ramabanam1.jpg

విశ్లేషణ:

రజనీకాంత్ నటించిన 'బాషా' సినిమా నుండి దక్షిణాదిలో, ముఖ్యంగా తెలుగులో చాలా సినిమాలు ఓ కలకత్తా ఫ్లాష్ బ్యాక్, లేదా ముంబై బ్యాక్ డ్రాప్ ఇలా ఎక్కువగా పెట్టి సినిమాలు తీస్తూ వుంటారు. అదీ కాకుండా నా చిన్నప్పటి నుండి తెలుగు సినిమాలలో ఎప్పుడూ చూసే కథ ఏంటంటే కథానాయకుడు చిన్నప్పుడు ఇంట్లోంచి పారిపోవటం, #RamabanamReview పెద్దయ్యాక ఇంటికి రావటం. ఆ కుటుంబాన్ని ఆదుకోవటం, వాడికో ఫ్లాష్ బ్యాక్. ఇలాంటివి కథలు ఎన్నో వచ్చాయి. దర్శకుడు శ్రీవాస్ కూడా ఇలాంటి కథనే ఎంచుకున్నాడు. అయితే ఇలాంటి కథ తీయటం తప్పు కాదు, అప్పట్లో అలాంటి కథలు ఆ ప్రేక్షకులకి నచ్చే విధంగా తీసేవారు. మరి శ్రీవాస్ కూడా ఇప్పటి ప్రేక్షకులకి నచ్చే విధంగా తీయకుండా, ఆ పాత పద్ధతిలోనే తీస్తే ఎలా?

gopichand.jpg

శ్రీవాస్ ఇంతకు ముందు కొన్ని సినిమాలు తీసాడు, అందులో గోపీచంద్ తో 'లక్ష్యం', 'లౌక్యం' రెండు చేసాడు. ఆ రెండు సినిమాలు మంచి హిట్ అయ్యాయి. ఎందుకంటే అందులో ప్రేక్షకులకి నచ్చే అంశాలు వున్నాయి. అయితే ఇప్పుడు ఈ మూడో సినిమా 'రామబాణం' కి #RamabanamReview వచ్చేసరికి గోపీచంద్ పాత కథని ఎంచుకోవటంతో పాటు నేరేషన్ కూడా పాత పద్ధతిలోనే చెప్పాడు. అందుకే ప్రేక్షకుడికి కొంచెం విసుగ్గా వుండి, ఎదో అనీజీ (uneasy) గా ఫీల్ అవుతాడు. దానితో బాలకృష్ణ నామకరణం చేసిన ఈ 'రామబాణం' ఏటో వెళ్ళిపోయింది.

ఇంకో మైనస్ ఏంటంటే సినిమాలో కథంతా మరీ సినిమాటిక్ గా తీసేసాడు. అంటే కథానాయకుడు కలకత్తాలో ల్యాండ్ అవటం, రెండు సన్నివేశాల్లో డాన్ అయిపోవటం, మూడో సన్నివేశంలో కథానాయకురాలిని చూడటం, వెంటనే ఒక డ్రీం సాంగ్, ఆ పాట లోనే ఇద్దరూ ప్రేమించేసుకోవటం, వెంటనే పెళ్లి అనటం, ఇవన్నీ చకచకా ఎదో తీయాలి, అలా జరుగుతుంది అన్నట్టుగా తీసేసాడు. పోనీ 14 ఏళ్ల తరువాత అన్నని చూడటానికి ఇంటికి వచ్చాడా, ఇక్కడ కూడా సన్నివేశాలు అన్నీ ప్రేక్షకుడు ఊహించినట్టే జరుగుతూ ఉంటుంది. విరామం ముందు వచ్చే సన్నివేశం, అలాగే క్లైమాక్స్ లో జగపతి బాబు సన్నివేశం ఆకట్టుకుంటాయి. మిగతా సినిమా అంతా కూడా మామూలు సినిమా. దర్శకుడు శ్రీవాస్, ఇదేదో ప్యాకేజీ (package) అని ఈమధ్య పరిశ్రమలో వినబడుతోంది ఒక పదం, అలా తీసాడేమో అని అనిపిస్తోంది. అన్నదమ్ముల కథ అన్నారు, పోనీ అదీ లేదు, సెంటిమెంట్ లేదు, భావోద్వేగాలు లేవు, అందుకని అలా అనిపించింది.

Gopichand-pic.jpg

నటీనటులు ఎలా చేశారంటే:

గోపీచంద్ కి ఇటువంటి పాత్ర కొత్త కాదు, ఇంతకు ముందు చేసాడు, ఇందులో అంతగా చెప్పుకోదగ్గ మార్పు లేదు. పోరాట సన్నివేశాల్లో బాగున్నాడు. జగపతి బాబు కి కూడా కొత్తదనం వున్న పాత్ర కాదు, మామూలే, సునాయాసంగా చేసాడు. ఖుష్బూ వదినగా కొత్తగా అనిపించింది. డింపుల్ హయాతి కేవలం పాటలకు మాత్రమే పరిమితం. ఈ హిందీ నటులను ఎందుకు పెట్టుకుంటారో తెలియదు, ఆ మొహంలో ఒక భావం ఉండదు, డబ్బింగ్ కూడా అరుస్తూ ఉంటాడు పెద్దగా. అదేనండీ నేను చెప్పబోయేది ఇందులో చేసిన హిందీ నటుడు తరుణ్ అరోరా గురించే. ఇతన్ని ఎక్కడో ఒక గ్లాస్ హౌస్ ముందో, లేదా ఇంకో బిల్డింగ్ లోనే నిలుచోబెట్టి, ఎప్పుడూ ఫోన్ లోనో, లేదా కథానాయకుడిని పొగడటం చేస్తూ కనపడతాడు. సత్య, గెటప్ శీను కామెడీ పండలేదు. పాటలు అంత గొప్పగా లేవు, మాటలు కూడా మామూలుగానే వున్నాయి.

చివరగా, గోపీచంద్, శ్రీవాస్‌ల ఈ 'రామబాణం' గురి తప్పింది. పాత కథని పట్టుకొని, పాత పద్ధతిలోనే చెప్పి, ప్రేక్షకుడిని విసిగిస్తాడే తప్ప, #RamabanamFilmReview కొత్తదనం లేని ఈ సినిమా ఏమాత్రం కూడా ఆసక్తికరంగా లేదు. చివర్లో ఏవో ఒక రెండు మూడు డైలాగ్స్ ఆర్గానిక్ ఆహారం మీద ప్రవచనాలు చెప్పినంత మాత్రాన సరిపోదు, సినిమాలో దమ్ముండాలి, అది లేకపోతే ఈరోజుల్లో ప్రేక్షకుడు థియేటర్ కి రావటం కష్టం.

Updated Date - 2023-05-05T15:59:18+05:30 IST