Rangabali Film Review: ఇంతకీ ఎవరు బలి, ప్రేక్షకులా? నిర్మాతా?

ABN , First Publish Date - 2023-07-07T19:41:39+05:30 IST

నాగశౌర్య, యుక్తి తరేజా నటించిన 'రంగబలి' ఈరోజు విడుదల అయింది. ఈ సినిమా మీద నాగశౌర్య ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు. ఎప్పటి నుండో బ్రేక్ కోసం చూస్తున్న నాగ శౌర్యకి ఈ సినిమా ఇచ్చిందా? ఇందులో కమెడియన్ సత్య ఒక కీలక పాత్ర పోషించాడు. ఈ సినిమాకి పవన్ బాసంశెట్టి దర్శకుడు.

Rangabali Film Review: ఇంతకీ ఎవరు బలి, ప్రేక్షకులా? నిర్మాతా?
Rangabali Film Review

సినిమా: రంగబలి

నటీనటులు: నాగశౌర్య (NagaShaurya), యుక్తి తరేజ (YuktiThareja), సత్య (Satya), సుదర్శన్ (Sudarshan), శరత్ కుమార్ (SarathKumar), షైన్ టామ్ చాకో, మురళీ శర్మ, గోపరాజు రమణ, అనంత శ్రీరామ్ (AnanthaSreeram), సప్తగిరి, బ్రహ్మాజీ (Brahmaji) తదితరులు

సంగీతం: పవన్ సిహెచ్

ఛాయాగ్రహణం: దివాకర్ మణి

నిర్మాత: సుధాకర్ చెరుకూరి (Sudhakar Cherukuri)

రచన, దర్శకత్వం: పవన్ బాసంశెట్టి

-- సురేష్ కవిరాయని

'రంగబలి' #RangabaliFilmReview సినిమాకి అంతో ఇంతో ప్రచారం వచ్చింది అంటే ఆ సినిమా కోసం కమెడియన్ నటుడు సత్య (Satya), ఆ సినిమా కథానాయకుడు నాగశౌర్య (NagaShaurya) తో చేసిన స్పూఫ్ ఇంటర్వ్యూ వలన. ఈ సినిమాతో ఇంకో తెలుగు బాష రాని నటి యుక్తి తరేజ తెలుగు తెరకి పరిచయం అయింది. పవన్ బసంశెట్టి ఈ సినిమాకి దర్శకుడు, సుధాకర్ చెరుకూరి నిర్మాత. ఈ సినిమా ఎలా వుందో చూద్దాం.

nagashaurya-rangabali.jpg

Rangabali story కథ:

శౌర్య లేదా షో (నాగశౌర్య) కథని నేరేట్ చేస్తూ ఉంటాడు. అతనిది రాజవరం, ఆ ఊర్లో వాళ్ళ నాన్న (గోపరాజు రమణ) మెడికల్ షాప్ పెట్టుకొని, దాని మీద వచ్చే ఆదాయంతో కుటుంబం నడుస్తూ ఉంటుంది. శౌర్య కి ఆ మెడికల్ షాపు అప్పచెప్పి తాను రెస్టు తీసుకోవాలని అనుకుంటాడు, కానీ శౌర్య ఆవారాగా స్నేహితులతో తిరుగుతూ అందరితో గొడవలు పెట్టుకుంటూ ఉంటాడు. #RangabaliReview ఎక్కువగా రంగబలి సెంటర్ దగ్గరే తచ్చాడుతూ ఉంటాడు స్నేహితులతో. ఆ ఏరియా ఎమ్మెల్యే పరశురామ్ (షైన్ టామ్ చాకో) కి ర్యాలీలకు, సభలకు హెల్ప్ చేస్తాడు, అతనితో వున్న ఫోటోల కటౌట్స్ కూడా పెట్టుకుంటాడు. బి ఫార్మసి చదువుతున్న కొడుకు పాడయిపోతున్నాడు అని వైజాగ్ లో వున్న తన స్నేహితుడు మెడికల్ కాలేజీ డీన్ దగ్గరికి ఫార్మసీ ట్రైనింగు పూర్తిచేయడానికి పంపిస్తాడు. అక్కడే మెడిసిన్ చదువుతున్న డాక్టర్ సహజ (యుక్తి తరేజ)తో పరిచయం, ప్రేమలో పడటం, పెళ్లి వరకు వెళతాడు. #RangabaliFilmReview కానీ సహజ తండ్రి (మురళీ శర్మ) పెళ్ళికి ఓకే చెబుతాడు ఇక్కడే చిక్కొచ్చి పడుతుంది. ఎందుకంటే శౌర్య స్వంత వూరు రాజవరం అని తెలిసి సహజతో పెళ్ళికి ఒప్పుకోడు. అతను ఎందుకు శౌర్య, సహజ పెళ్లికి ఒప్పుకోలేదు? ఈ రంగబలి సెంటర్ వెనక వున్న అసలు కథ ఏంటి? ఆ సెంటర్ పేరు మార్చడానికి శౌర్య ఎటువంటి ప్రయత్నాలు చేశాడు? ఎమ్మెల్యే పరశురామ్ కి శౌర్య అంటే ఎందుకు కోపం వచ్చింది? ఇవన్నీ తెలియాలంటే రంగబలి చూడాల్సిందే...

yuktitareja3.jpg

విశ్లేషణ:

'రంగబలి' సినిమాకు బజ్ వచ్చిందంటే కారణం సత్య స్పూఫ్ ఇంటర్వ్యూ వీడియో. ఒక్కోసారి కథ ఏమీ లేకపోయినా, లాజిక్ లేకపోయినా, సినిమాలో కామెడీ సన్నివేశాలు చాలా ఉంటే ఆ సినిమా పాస్ అయిపోతుంది, అందులో నెగేటివ్స్ ఎంచరు. ఉదాహరణకు ఈమధ్యనే విడుదల అయిన 'సామజవరగమన' #Samajavaragamana సినిమానే తీసుకోండి. ఆ సినిమా మొదటి నుండి చివరి వరకు హాస్య సన్నివేశాలతో దర్శకుడు నింపేసాడు, ఇంటిల్లిపాదీ హాయిగా నవ్వుతూ చూసుకోవచ్చు. ఇక్కడ 'రంగబలి' #RangabaliReview కి వచ్చేసరికి ఇందులో కథ ఏమీ లేకపోయినా, మొదటి సగం దర్శకుడు పవన్ బాగానే తీసాడు. సత్య, సుదర్శన్, శౌర్య వీళ్ళమధ్య నడిచే కామెడీ, అలాగే వైజాగ్ వెళ్ళాక అక్కడ సత్య, శౌర్య చేసే కామెడీ ఇవన్నీ బాగా పండాయి.

రెండో సగం వచ్చేసరికి దర్శకుడు తప్పుదోవ పట్టాడు. రంగబలి సెంటర్ పేరు మార్చేద్దాం అని శౌర్య తన స్నేహితులతో చెప్పడం, ఆ ఫ్లాష్ బ్యాక్ అవన్నీ సరిగ్గా కనెక్టు కాలేకపోయాయి. సొంతూరు, తండ్రీ కొడుకుల మధ్య, తండ్రీ కూతురు మధ్య వచ్చే భావోద్వేగాలు ఏవీ అంతగా ప్రేక్షకులని ఆకట్టుకోలేవు. అదీ కాకుండా, ఆ ఎమ్మెల్యేని పొడవటం, మీడియా వాళ్ళ మీద స్పూఫ్ ఇవన్నీ కూడా సిల్లీగా అనిపించాయి. అలాగే 'రంగబలి' సెంటర్‌ పేరును మారుస్తాం అనటం, కొత్త పేరు పెడతాం అనటం ఎంతవరకు సబబు, అదీ అంత బలంగా కథకి కనెక్టు కాలేదు. #RangabaliFilmReview పోనీ పాటలు ఏమైనా సినిమాకి ప్లస్ అవుతాయి అనుకుంటే అవీ అంతగా లేవు. అదీకాకుండా ఆ స్పెషల్ సాంగ్ మరీ బాగోలేదు. ఈ సినిమాకి నేపథ్య సంగీతం పరవాలేదు, అలాగే దివాకర్ మణి కెమెరా వర్క్ కూడా బాగుంది. రెండో సగం మీద దర్శకుడు కొంచెం దృష్టి పెట్టి ఉంటే ఈ సినిమా వేరే లెవెల్లో ఉండేది.

rangabali2.jpg

ఇక నటీనటుల విషయానికి వస్తే, నాగశౌర్య మంచి నటుడు, (NagaShaurya) ఇందులో అతను తన పాత్రకి పూర్తి న్యాయం చేసాడు. కానీ వచ్చిన చిక్కంతా కథ తోటే. అతనికి మంచి కథ పడి, పెద్ద బ్రేక్ కావాలి. కొంచెం కథ మీద అతను దృష్టి పెట్టి చేస్తే ఆ విజయం వరిస్తుంది. కథానాయిక యుక్తి తరేజ పాత్ర పరిమితంగానే వుంది, అలాగే ఓ పాటలో తన అందాలు వొలకబోసింది. #RangabaliReview ఇక కమెడియన్ సత్య ఇప్పుడు చాలా పాపులర్ అయిపోతున్నాడు. అతని కామెడీ టైమింగ్, పంచ్ డైలాగ్స్ అదిరిపోతున్నాయి. #ComedianSatya అతని వలెనే సినిమాలు ఆడుతున్నాయి అన్నా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. మొదటి సగం అంతా అతనే విపరీతంగా నవ్విస్తాడు. ఇక గోపరాజు రమణ తండ్రిగా సరిపోయారు, బాగా చేశారు. మురళీ శర్మ కి తండ్రి పాత్ర మామూలే, అందులో పెద్దగా చెప్పుకోవాల్సింది ఏమీ లేదు. ఆ మలయాళం నటుల్ని తెలుగులో ఎందుకు చేయిస్తారో తెలీదు, మోహంలో నవ్వడం తప్ప ఇంకేమీ ఉండదు. అతనికి బదులులుగా ఒక తెలుగు నటుడికి అవకాశం ఇవ్వొచ్చు కదా. లిరిక్ రైటర్ అనంత శ్రీరామ్ నటుడుగా కనపడతాడు. ఇంకా చాలామంది నటులు సపోర్ట్ చేశారు.

rangabali1.jpg

చివరగా 'రంగబలి' సినిమాలో సత్య వున్న కామెడీ సన్నివేశాలు అన్నీ బాగున్నాయి. మొదటి సగం సరదాగా వెళుతుంది, రెండో సగం లోనే వచ్చిన చిక్కంతా. దర్శకుడుతో మంచి రచయిత వున్నాడు. దృష్టి పెట్టి చేస్తే మంచి సినిమా తీయగలడు. కానీ రెండో సగంలో మాత్రం కథ మీద కాకుండా ఏవో స్పూఫ్స్ అని కొంచెం దారి తప్పదు. ఈ సినిమా మీద ఎన్నో ఆశలు పెట్టుకున్న నాగశౌర్యకి ఈ సినిమా నిరాశ పరుస్తుందనే చెప్పాలి.

Updated Date - 2023-07-07T19:41:39+05:30 IST