Prem Kumar film review: పాపం సంతోష్ శోభన్...

ABN , First Publish Date - 2023-08-18T17:24:51+05:30 IST

సంతోష్ శోభన్ మరో సినిమా 'ప్రేమ్ కుమార్' విడుదలైంది. పాపం ఎప్పటి నుండో హిట్ కోసం ఎదురు చూస్తున్న శోభన్ ఈసారి కొత్త దర్శకుడు, నటుడు, రచయిత అయిన అభిషేక్ మహర్షితో చేతులు కలిపాడు. ఈ సినిమా అయినా శోభన్ కి హిట్ ఇస్తుందో లేదో చూద్దాం.

Prem Kumar film review: పాపం సంతోష్ శోభన్...
Prem Kumar Film Review

సినిమా: ప్రేమ్ కుమార్

నటీనటులు: సంతోష్ శోభన్, రాశి సింగ్, రుచిత సాధినేని, అశోక్ కుమార్, కృష్ణ చైతన్య, కృష్ణ తేజ, సుదర్శన్, శ్రీ విద్య, రాజ్ మాదిరాజు, సురభి ప్రభావతి తదితరులు

కథ: అభిషేక్ మహర్షి, అనిరుధ్ కృష్ణమూర్తి

ఛాయాగ్రహణం: రాంపీ నందిగాం

సంగీతం: ఎస్ అనంత్ శ్రీకర్

రచన, దర్శకత్వం: అభిషేక్ మహర్షి

నిర్మాత: శివప్రసాద్ పన్నీరు

-- సురేష్ కవిరాయని

నటుడిగా సంతోష్ శోభన్ (SantoshSobhan) సినిమాలు చాలా విడుదల అవుతున్నాయి కానీ, ఒక్క సినిమా కూడా అతనికి సరైన బ్రేక్ ఇవ్వటం లేదు. అయినా కూడా తన పంధాలో వైవిధ్యంగా సినిమాలు చేసుకుంటూ వెళుతున్నాడు సంతోష్. ఆమధ్య ఎప్పుడో విడుదలైన 'ఓ మినీ కథ' #OMiniKatha బాగుంది కానీ అది ఓటిటి లో విడుదలైంది. ఇప్పుడు 'ప్రేమ్ కుమార్' #PremKumarReview అనే ఇంకో సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. చాల సినిమాల్లో నటుడిగా అందరికీ పరిచయం అయిన అభిషేక్ మహర్షి (AbhishekMaharshi) ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు, కథ కూడా అతను రాసుకున్నదే. రాశి సింగ్ (RashiSingh), రుచిత సాధినేని (RuchithaSadhineni) కథానాయకురాలుగా నటించారు. ఈ సినిమా ఎలా వుందో చూద్దాం.

premkumar4.jpg

Prem Kumar story కథ:

ప్రేమ్ కుమార్ అలియాస్ పీకే (సంతోష్ శోభన్) తన స్నేహితుడు సుందర లింగం (కృష్ణ తేజ) తో కలిసి పెళ్లిళ్లు చెడగొట్టే కంపెనీ మొదలు పెట్టి డబ్బులు గడిస్తూ ఉంటాడు. అయితే పీకే ఫ్లాష్ బ్యాక్ లో చాలా పెళ్లిళ్లు, మంటపం దాగా వచ్చి ఆగిపోతాయి, అందులో నేత్ర (రాశి సింగ్) తో కూడా ఒక పెళ్లి ఆగిపోతుంది. నేత్రతో పెళ్లి జరుగుతున్నప్పుడు రోషన్ (కృష్ణ చైతన్య) అనే ఒక రైజింగ్ స్టార్ వచ్చి నేత్రని తీసుకు వెళ్ళిపోతాడు. అప్పటి నుండి పీకే కి పెళ్లి అవటం కష్టం అవుతూ ఉంటుంది. అయితే తన కష్టాలు ఏవో తాను పడుతూ తన వ్యాపారాన్ని చూసుకుంటూ వుండే సమయంలో మళ్ళీ నేత్ర అతనికి తారసపడుతుంది. #PremKumarReview నేత్ర తో జరగాల్సిన రోషన్ పెళ్లి, ఇంకో అమ్మాయి అంగన (రుచిత సాధినేని) తో జరగడానికి అన్ని ఏర్పాట్లు పూర్తవుతాయి. నేత్ర కదా రోషన్ తో మంటపం నుండి లేచిపోయి వచ్చింది, మరి ఆమెతో ఎందుకు వివాహం కావటం లేదు? ఇంతకీ ఈ ప్రేమ్ కుమార్ అనేవాడికి పెళ్లవుతుందా? అంగనతో వివాహం అనగానే, నేత్ర ఎటువంటి నిర్ణయం తీసుకుంది? ఇవన్నీ మీరు తెర మీద చూడాల్సిందే. (Prem Kumar film review)

premkumar2.jpg

విశ్లేషణ:

అభిషేక్ మహర్షి నటుడిగా అందరికీ పరిచయమే, మొదటి సారి దర్శకత్వ బాధ్యతలు చేపట్టాడు ఈ 'ప్రేమ్ కుమార్' అనే సినిమాతో. ఇది ఒక వినోదాత్మక సినిమాగా తీద్దామని అతని ప్లాన్ అని తెలుస్తూనే వుంది. అయితే ఇంతకు ముందు జంధ్యాల, ఇవివి లాంటి వాళ్ళు ఇలాంటి సినిమాలు తీసేవారు, అయితే వాళ్ళు తీసేటప్పుడు అందులో కొన్ని ఆసక్తికర అంశాలతో పాటు చాలా సున్నిత హాస్యం కూడా వుంది అవన్నీ బాగా పండేవి. అభిషేక్ 'ప్రేమ్ కుమార్' సినిమాలో ఆ రెండూ లోపించాయి. #PremKumarFilmReview కథ అయితే పేపర్ మీద బాగుంటుంది, కానీ అది తెర మీద ఆసక్తికరంగా, వినోద భరితంగా చూపించంటంలో అభిషేక్ విఫలం అయ్యాడు అని చెప్పాలి. అక్కడక్కడా కొన్ని సన్నివేశాలు నవ్వు తెప్పించేవిగా ఉంటాయి, కానీ మొత్తం సినిమాగా చూస్తే మాత్రం ఇందులో అంతగా ఏమీ లేదు అనిపిస్తుంది.

santoshsobhan5.jpg

ఒక పెళ్లి మంటపంలో పెళ్ళవాల్సిన సమయంలో పెళ్లికూతురు వేరేవాడిని చేసుకుంటాను అని పీటల మీద నుండి లేచిపోతే ఆ పెళ్ళికొడుకు పరితస్థితి ఏంటి అనేది అభిషేక్ చెప్పాలనుకున్న కథ. అయితే ఇది బాగుంది, అది చెప్పటంలో సినిమాలో ఎక్కడా భావోద్వేగాలను చూపించలేదు. అదీ కాకుండా పెళ్లి ఆగిపోయినప్పుడు కుటుంబం ఎంత బాధపడుతుంది, వాళ్ళ బాధ, ఆ భావోద్వేగాలు ఉంటే బాగుండేది. మొదట్లో అంతా చాలా కృత్రిమంగా ఉన్నట్టు చూపించేసారు అన్నీ. #PremKumarFilmReview సినిమాలో సహజత్వం లేదు, కథనం కూడా ఆసక్తికరంగా లేదు. దర్శకుడు కథనం మీద కొంచెం దృష్టి పెట్టి ఉంటే బాగుండేది. రోషన్ ఎందుకు నేత్రని వద్దు అనుకున్నాడు, ఎందుకు అంగనని పెళ్లి చేసుకోవాలన్నాడు అనే విషయం మీద క్లారిటీ లేదు. అలాగే పెళ్లిళ్లు చెడగొట్టడం కూడా అంతగా ఆకట్టుకోలేదు. దర్శకుడు తను పేపర్ మీద రాసుకున్న కథని సరిగ్గా చూపించటంలో విఫలం అయ్యాడనే అనిపిస్తోంది.

premkumar6.jpg

ఇక నటీనటుల విషయానికి వస్తే సంతోష్ శోభన్ ప్రేమ్ కుమార్ పాత్రకి సరిగ్గా సరిపోయాడు, బాగా అభినయించాడు. తనవరకు తాను బాగా చేసి చూపించాడు అంతే. రాశి సింగ్, రుచిత సాధినేని లు ఇద్దరూ పరవాలేదు, తమ పాత్రకి తగ్గట్టుగా చేశారు. కృష్ణ తేజ, సుదర్శన్ ఇద్దరూ కొంచెం నవ్వించారు. మిగతా పాత్రలో అంత గొప్పగా చెప్పుకోవాల్సినవి ఏమీ లేవు. సంగీతం, ఛాయాగ్రహణం పరవాలేదు అనిపించింది.

చివరగా, అభిషేక్ మహర్షి మొదటిసారిగా దర్శకత్వం వహించిన ఈ 'ప్రేమ్ కుమార్' సినిమా అక్కడక్కడా నవ్విస్తుంది, కానీ మొత్తం మీద అంత ఆసక్తికరంగా సాగాడు. పాపం సంతోష్ శోభన్ కి ఇంకో సినిమా విడుదలైంది, వెళ్ళిపోయింది అన్నట్టుగా ఇది ఉంటుంది. ఓటిటిలోకి తొందరగానే వచ్చేస్తుంది.

Updated Date - 2023-08-18T17:24:51+05:30 IST