Samajavaragamana Film Review: నవ్వుల నజరానా !

ABN , First Publish Date - 2023-07-01T20:51:58+05:30 IST

శ్రీ విష్ణు, రెబా మోనికా జాన్ జంటగా నటించిన 'సామజవరగమన' ప్రేక్షకుల ముందుకు వచ్చింది. దీనికి రామ్ అబ్బరాజు దర్శకుడు, కాగా సీనియర్ నరేష్ ఒక ముఖ్యమైన పాత్రలో కనపడతాడు. 'ఏజెంట్' సినిమా తీసిన ఎ కె ఎంటర్టైన్మెంట్స్ ఈ సినిమాని సమర్పించారు.

Samajavaragamana Film Review: నవ్వుల నజరానా !

సినిమా: సామజవరగమన

నటీనటులు: శ్రీవిష్ణు, రెబా మోనికా జాన్, నరేష్ విజయకృష్ణ, సుదర్శన్, శ్రీకాంత్ అయ్యంగార్, వెన్నెల కిశోర్, రాజీవ్ కనకాల, దేవి ప్రసాద్, ప్రియ తదితరులు

మాటలు: నందు సవిరిగాన

ఛాయాగ్రహణం: రామ్ రెడ్డి

సంగీతం: గోపీసుందర్

కథనం, దర్శకత్వం: రామ్ అబ్బరాజు

నిర్మాత: రాజేష్ దండ

-- సురేష్ కవిరాయని

శ్రీ విష్ణు (SreeVishnu) మంచి నటుడు, అలాగే వైవిధ్యమైన కథలు ఎంచుకొని సినిమాలు చేస్తూ ఉంటాడు, కానీ ఈమధ్య అతనికి మంచి బ్రేక్ మాత్రం రావటం లేదు. ఇంతకు ముందు అతను 'అల్లూరి', 'బాల తందనాన', 'అర్జున ఫల్గుణ' చేసాడు, కానీ అవన్నీ అంతగా ఆడలేదు. అయితే ఇప్పుడు శ్రీవిష్ణు కొంచెం రూటు మార్చి కామెడీ జానర్ ఎంచుకొని ఈ 'సామజవరగమన' #SamajavaragamanaFilmReview తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. రామ్ అబ్బరాజు (Ram Abbaraju) దీనికి దర్శకుడు, కాగా రెబా మోనికా జాన్ (RebaMonicaJohn) కథానాయకురాలు. అనిల్ సుంకర (AnilSunkara) కి చెందిన ఏ కె ఎంటర్ టైన్ మెంట్స్ (AKEntertainments) సంస్థ ఈ సినిమాకి సమర్పకులుగా వ్యవహరించింది. ఈ సినిమా ఎలా వుందో చూద్దాం.

samajavaragamana1.jpg

Samajavaragamana Film Story కథ:

బాలు (శ్రీ విష్ణు) ఏషియన్ సినిమాస్ లో పని చేస్తూ ఉంటాడు. అతని తండ్రి (నరేష్) డిగ్రీ పాసవ్వడానికి సంవత్సరాల నుండి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. బాలు వుద్యోగం చేస్తూ ఇంట్లో అవసరాలు కూడా చూసుకుంటూ ఉంటాడు. తండ్రి డిగ్రీ పాసయ్యితే వందకోట్ల ఆస్తి వస్తుంది, కానీ అతను ప్రతి సంవత్సరం పరీక్ష తప్పుతూనే ఉంటాడు. ఒకసారి పరీక్ష రాసేటప్పుడు తండ్రికి సరయు (రెబా మోనికా జాన్) అనే అమ్మాయి పరిచయం అవుతుంది, తన తండ్రి పరీక్ష పాసవ్వడానికి సహాయం చెయ్యమంటాడు. SamajavaragamanaFilmReview బాలు కాలేజీలో ఒకమ్మాయిని ప్రేమించి ఆమెకి ప్రొపోజ్ చేసే సమయంలో ఆ అమ్మాయి బాలుకి రాకీ కట్టి డబ్బులు కూడా తీసుకుంది. అక్కడ నుండి బాలుకి ప్రేమంటే పడదు, అందుకని ఏ అమ్మాయి ప్రేమిస్తున్నాను అని వచ్చినా వెంటనే ఆ అమ్మాయి చేత రాకీ కట్టించుకుంటాడు. ఇప్పుడు సరయు కూడా బాలుతో ప్రేమలో పడుతుంది, అయితే బాలు రాకీ కట్టమంటాడేమో అని భయపడుతుంది. కానీ విచిత్రంగా ఆమె ప్రేమలో బాలు పడతాడు. సరయు తండ్రి ప్రేమ వివాహాన్ని ఒప్పుకోడు, అందుకని బాలు ఆమె తల్లిదండ్రుల చేత ఒప్పించి పెళ్లి చేసుకుంటాను అంటాడు. ఈలోగా బాలు బావకి రాజముండ్రిలో నిశ్చితార్ధం జరిగితే దానికి బాలు కుటుంబం కూడా వెళుతుంది. SamajavaragamanaFilmReview పెళ్లికూతురు ఎవరో కాదు సరయుకి చెల్లెలు. తన బావ చేసుకోబోయేది సరయు చెల్లెలని తెలిసి ఒక చిక్కు వస్తుంది. బావ పెళ్లి జరిగితే, సరయు, బాలుకి చెల్లెలు అవుతుంది. మరి బాలు, సరయుల వివాహం జరిగిందా? బాలు తన బావ పెళ్లి ఆపెయ్యడానికి ఎటువంటి ప్రయత్నాలు చేసాడు? ఈలోగా సరయు తండ్రి ఆమెకి కులశేఖర్ (వెన్నెల కిషోర్) తో వివాహం నిశ్చయం చేసేస్తాడు? బాలు తండ్రి పరీక్ష పాసయ్యాడా? ఇవన్నీ చివరికి ఏమయ్యాయో తెలియాలంటే 'సామజవరగమన' చూడాల్సిందే.

samajavaragamana2.jpg

విశ్లేషణ:

ఈ సినిమా దర్శకుడు రామ్ అబ్బరాజు, రచయిత భాను భోగవరపు ఇంతకు ముందు 'వివాహ భోజనంబు' #VivahaBhojanambu అనే సినిమా చేశారు. అది కామెడీ జానర్. ఆ ఇద్దరూ మళ్ళీ ఈ 'సామజవరగమన' కి కూడా అదే జానర్ లో కథ రాసుకున్నారు. ఈ కథలో పెద్ద విశేషం ఏమీ ఉండదు, అలాగే కథ ఏంటిరా అని అడిగితే పేపర్ మీద రాయటానికి కూడా ఏమీ ఉండదు. ఎందుకంటే ఈ కథ చాలా చిన్నది. SamajavaragamanaFilmReview కథానాయకుడు ప్రేమించే అమ్మాయి తండ్రికి ప్రేమ వివాహం నచ్చదు, అలాగే అందరినీ వరసలు కలుపుతాడు. పోనీ పెద్దలు కుదిర్చిన పెళ్లిగా చేసుకోవాలని అనుకుంటాడు, కానీ ప్రేమించిన అమ్మాయి చెల్లెలు వరస అవుతుందని తెలుస్తుంది. అప్పుడు కథానాయకుడు ఏమి చేస్తాడు, ప్రియురాలిని దక్కించుకోవటాని ఎటువంటి ప్రయత్నాలు చేసాడు అన్నది దర్శకుడు సరదాగా సన్నివేశాలు తెర మీద చూపిస్తూ, కథ నడిపించాడు.

సినిమాలో లాజిక్ లు వదిలేస్తే, సినిమాలో ప్రతి సన్నివేశం ప్రేక్షకుడిని కడుపుబ్బా నవ్విస్తుంది. కొడుకు, తండ్రిని ఎప్పుడు డిగ్రీ పాసవుతావు నాన్నా అని తండ్రి చేత చదివించటం, ట్యూషన్ పెట్టించడం లాంటివి హాస్యంగా ఉంటుంది. అలాగే కథానాయకురాలు తన ఇంట్లో పేయింగ్ గెస్ట్ గా ఉండటం, ఆ ఇంట్లో ఆమె చేసే పనులు, శ్రీవిష్ణు ఆమె మధ్యలో వచ్చే సన్నివేశాలు సరదాగా ఉంటాయి. అలాగే శ్రీవిష్ణు తాను ఎందుకు అమ్మాయిలతో రాఖీ కట్టించుకుంటున్నాడో చెప్పే సన్నివేశం పెద్దదయినా చెప్పే విధానం బాగుంది.

samajavaragamana4.jpg

కొన్ని స్పూఫ్స్ కూడా బాగా నవ్విస్తాయి. నరేష్ (VKNaresh) పరీక్ష పాసయ్యాడు అని తెలిసి కొడుకుని తీసుకుపోయి రైల్వే స్టేషన్ లో ట్రైన్ వస్తున్నప్పుడు తన ఆనందాన్ని పెద్దగా అరిచి చెప్పటం కడుపుబ్బా నవ్విస్తుంది. అది 'జెర్సీ' #Jersey సినిమాలో నాని (Nani) చేసిన సన్నివేశానికి స్పూఫ్ లా తీశారు. అలాంటివి అప్పుడప్పుడు కనిపిస్తూ ఉంటాయి సినిమాలో, కానీ బాగా నవ్విస్తాయి. మల్టిప్లెక్స్ లో పాప్ కార్న్, కూల్ డ్రింక్, వాటర్ బాటిల్స్ ఖరీదుల మీద సెటైర్ కూడా బాగుంది. ఇంకా రెండో సగంలో వెన్నెల కిషోర్ (VennelaKishore) కులశేఖర్ గా బాగా నవ్వించాడు. అలాగే శ్రీకాంత్ అయ్యంగార్, అన్నకి నీళ్లివ్వమ్మా అని అన్న సన్నివేశం ఆ తరువాత అన్న, చెల్లెలు సన్నివేశాలు కూడా సరదాగా ఉంటాయి. అయితే ఇవన్నీ దర్శకుడు చాలా జాగ్రత్తగా, కడుపుబ్బా నవ్వించే రీతిలో తెర మీద చూపించటం ఆసక్తికరం. ఎందుకంటే ఇందులో కథ ఏమీ ఉండదు, కానీ నవ్వుకోడానికి చాలా మెటీరియల్ ఉంటుంది. మొత్తం మీద దర్శకుడు రామ్ అబ్బరాజు మంచి పాయింట్ పట్టుకొని చిన్న కథని పెద్ద తెర మీద సరదాగా నవ్వులతో ముంచెత్తాడు.

samajavaragamana5.jpg

ఇక నటీనటుల విషయానికి వస్తే సినిమా అంత శ్రీ విష్ణు (SreeVishnu) అనే చెప్పాలి. ఆ డైలాగ్ డెలివరీ, పంచ్, హావభావాలు, టైమింగ్ అన్నీ కరెక్టుగా చేసాడు. సినిమా మొత్తం తన భుజాలమీదకి ఎత్తుకున్నాడు. చాలా బాగా చేసాడు, ఈ సినిమా అతనికి మంచి బ్రేక్ ఇస్తుందని అనుకోవచ్చు. రెబా మోనికా జాన్ (RebaMonicaJohn) చాలా అందంగా, క్యూట్ గా వుంది. ఆమెకి పెద్దగా పాత్ర లేకపోయినా చాలా బాగా చేసింది, హుషారుగా వుంది. మంచి భవిష్యత్తు కూడా వుంది. చాలా రోజుల తరువాత సీనియర్ నరేష్ (VKNaresh) ఒక మంచి పాత్రలో కడుపుబ్బా నవ్వించాడు. అతనికి, శ్రీ విష్ణుకి టైమింగ్ సరిగ్గా సరిపోయింది. అయితే నరేష్ విగ్, మీసం మాత్రం అసలు బాగోలేదు. సుదర్శన్, శ్రీ విష్ణు స్నేహితుడు గా చేసాడు, అతనికి కూడా మంచి పాత్ర, బాగా నవ్వించాడు. అతనికి కూడా పంచ్ డైలాగ్స్ బాగున్నాయి. వెన్నెల కిషోర్ రెండో సగంలో వచ్చి నవ్వులతో ముంచెత్తుతాడు. రాజీవ్ కనకాల, శ్రీకాంత్ అయ్యంగార్, దేవి ప్రసాద్, ప్రియ ఇలా చాలామంది కనపడతారు. అందరూ బాగా సపోర్ట్ చేశారు. ఈ సినిమాకి మాటలు ముఖ్యంగా సెటైర్ లు, స్పూఫ్ లు, పంచ్ డైలాగ్స్ అన్నీ సరిగ్గా అమరాయి. మాటలు రాసిన నందు సవిరిగాన (NanduNavirigana) కి క్రెడిట్ ఇవ్వాలి. ఛాయాగ్రహణం, సంగీతం కూడా బాగానే వున్నాయి.

samajavaragamana3.jpg

చివరగా, లాజిక్ ఆలోచించకుండా, సరదాగా, హాయిగా, అందరూ నవ్వుకోవాలి అనుకుంటే ఈ 'సామజవరగమన' #SamajavaragamanaFilmReview తప్పకుండా చూడొచ్చు. ప్రతి సన్నివేశంలోనూ హాస్యం ఉంటుంది. ఒక సినిమా బాగున్నప్పుడు అందులో తప్పులున్నా కొట్టుకుపోతాయి. ఇది కూడా అలాంటిదే. శ్రీవిష్ణు, నరేష్, సుదర్శన్, వెన్నెల కిషోర్ వీళ్లందరి టైమింగ్, పంచ్ డైలాగ్స్, సెటైర్ లు చూసి కడుపుబ్బా నవ్వుకోవచ్చు. ఈమధ్య కాలంలో బాగా ఎంటర్ టైన్ చేసే సినిమా ఏదైనా వుంది అంటే అది ఈ సినిమానే.

Updated Date - 2023-07-01T20:51:58+05:30 IST