Pop Corn Film review: దీనికి రంగు, రుచి, వాసన ఏమి లేదు

ABN , First Publish Date - 2023-02-10T16:42:32+05:30 IST

అవికా గోర్ (Avika Gor) 'ఉయ్యాల జంపాల', 'సినిమా చూపిస్తా మావా' లాంటి సినిమాలతో మొదట్లో మంచి విజయాలు అందుకున్న నటి. కానీ ఆ తరువాత తెలుగు సినిమాలు అడపా తడపా చేసినా, అంత పెద్దగా విజయం అయితే సాధించలేదు. ఇప్పుడు ఆమె నటించిన 'పాప్ కార్న్' (Popcorn) ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

Pop Corn Film review: దీనికి రంగు, రుచి, వాసన ఏమి లేదు

సినిమా: పాప్ కార్న్

నటీనటులు : అవికా గోర్, సాయి రోనక్, చారు హాసన్ తదితరులు

ఛాయాగ్రహణం : ఎం.ఎన్‌. బాల్ రెడ్డి

సంగీతం : శ్ర‌వ‌ణ్ భ‌ర‌ద్వాజ్‌

నిర్మాత‌ : భోగేంద్ర గుప్తా

కథ, మాటలు, కథనం, ద‌ర్శ‌క‌త్వం: ముర‌ళి గంధం

-- సురేష్ కవిరాయని

అవికా గోర్ (Avika Gor) 'ఉయ్యాల జంపాల', 'సినిమా చూపిస్తా మావా' లాంటి సినిమాలతో మొదట్లో మంచి విజయాలు అందుకున్న నటి. కానీ ఆ తరువాత తెలుగు సినిమాలు అడపా తడపా చేసినా, అంత పెద్దగా విజయం అయితే సాధించలేదు. ఇప్పుడు ఆమె కథానాయికగా. సాయి రోనక్ (Sai Ronak) కథా నాయకుడిగా నటించిన సినిమా 'పాప్ కార్న్' (Popcorn) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాకి అవికా గోర్ ఒక్క కథానాయికగానే కాకుండా, నిర్మాతగా కూడా వ్యవహరించింది. ఈ సినిమా ప్రచారం బాగానే చేశారు, మరి సినిమా ఎలా ఉందొ చూద్దాం. (PopCornFilmReivew) చారు హాసన్ (Charu Haasan) ఇందులో ఒక చిన్న పాత్ర పోషించారు.

popcorn2.jpg

Popcorn Story కథ:

సమీరణ (అవికా గోర్) తన తల్లితో ఉంటూ ఉంటుంది, అలాగే తాను ఒక గొప్ప అందగత్తెనని ఆమె అనుకుంటూ ఉంటుంది. షాపింగ్ కి అని వెళ్లి ఒక షాపింగ్ మాల్ లో లిఫ్ట్ ఎక్కుతుంది. పవన్ అనే అబ్బాయి ఒక సంగీత ప్రియుడు, గిటార్ వాయిస్తాడు. తన తాతగారు (చారు హాసన్) అంటే అతనికి చాలా ప్రేమ. తాతగారు, అక్కతో ఉంటూ ఉంటాడు. తాతగారి పుట్టినరోజుకి షాపింగ్ మాల్ కి వచ్చి సామాన్లు కొని లిఫ్ట్ లో ఉంటాడు. అదే లిఫ్ట్ లో సమీరణ కనపడగానే ఆమెకి ఒక చెంప దెబ్బ కొడతాడు. అదే సమయంలో షాపింగ్ మాల్ లో బాంబ్ పేలుడు వలన లిఫ్టు ఆగిపోయి అందులో ఇద్దరూ ఉండిపోవాల్సి వచ్చింది. ఆ లిఫ్టులో ఇద్దరూ ఎలా వున్నారు, ఏమి చేసారు, ఏమి తెలుసుకున్నారు, చెంప దెబ్బ తిన్న సమీరణ బదులు ఏమిచ్చింది, ఆస్తమా వలన ఆమె లిఫ్ట్ లో ఎలా సఫర్ అయింది? ఇవన్నీ తెలుసుకోవాలని ఉందా, అయితే వెండితెర మీద చూడాల్సిందే. (PopCornFilmReivew)

విశ్లేషణ:

మురళి గంధం (Murali Gandham) ఈ 'పాప్ కార్న్' చిత్రానికి దర్శకుడు. ఒక అమ్మాయి, అబ్బాయి ఒక లిఫ్ట్ లో ఒక రోజు చిక్కుకుంటే ఏమి జరుగుతుంది, ఎలా ఆ లిఫ్ట్ లో ఇద్దరూ బయటనుండి సహాయం లేకుండా వున్నారు అనేది ఈ సినిమా భావన. ఇలాంటి సినిమాలు వచ్చాయి ఇంతకు ముందు, కానీ ఇది ఒక వైవిధ్యంగా తీద్దామని దర్శకుడు అనుకోని ఉండవచ్చు. కానీ సినిమా ఎప్పుడు అయిపోతుందా, ఇప్పుటు ఇంటికి వెళ్లిపోదామా అని ప్రేక్షకుడు ఎదురు చూస్తూ ఉంటాడు ఈ సినిమా చూస్తూ. అంతలా సన్నివేశాలు సాగదీసి, అరగదీసి, మసి చేసి చూపించాడు దర్శకుడు. ప్రేక్షకుడు కి ఒక్క సన్నివేశం కూడా ఆసక్తికరంగా ఉండదు, కనిపించదు. అవికా గోర్ కి కొంచెం పేరున్న నటి, దానికి తోడు ఈ సినిమా ప్రచారాలు బాగానే చేశారు, అలాగే ఈ సినిమాలో చాల విషయం వుంది అని విడుదలకి ముందు చెప్పారు.

popcorn3.jpg

కానీ తీరా సినిమా చూసాక, అన్నీ సాగదీతే. బౌల్ లోంచి చేప పిల్ల కింద పడిపోతుంది. ఎవరయినా వెంటనే ఏమి చేస్తారు, ఆ చేప పిల్లని చేతితో తీసి మళ్ళీ నీటి బౌల్ లో వేస్తారు. వెంటనే వచ్చే ఆలోచన ఎవరికయినా అదే వస్తుంది, అదే చేస్తారు. కానీ దర్శకుడు మురళి గంధం మాత్రం వైవిధ్యంగా అలోచించి, ఆ చేప పిల్లని వాటర్ బౌల్ లో వెయ్యడానికి తల్లి కూతురు ఏదేదో వెతుకుతారు, ఏదేదో చేస్తారు, ఒక పది నిముషాల (అంతసేపులా అనిపించింది) తరువాత ఆ చేప పిల్లని ఒక గ్లాస్ తో నీళ్లు తెచ్చి, ఒక పేపర్ తెచ్చి, బాబోయ్ ఏదేదో చేసి, అప్పుడు వాటర్ బౌల్ లో వేస్తారు. ఈ ఒక్క సన్నివేశం చెప్పిన తరువాత సినిమా ఎలా ఉంటుందో వేరే చెప్పాలా, మీరే ఊహించుకోవచ్చు.

ఆ చేప సన్నివేశం తరువాత మళ్ళీ ఈ లిఫ్ట్ సన్నివేశాలు. తదుపరి సినిమా అంతా ఈ లిఫ్ట్, అందులో చిక్కుకున్న ఈ లీడ్ పెయిర్. ఓపిక నశిస్తుంది ఒక్కో సన్నివేశం చూస్తుంటే. కథానాయకుడు పాటలు పాడేస్తాడు, ఎలుకలు పెట్టేస్తాడు, పుట్టినరోజుకి లిఫ్ట్ అంతా డెకరేషన్ చేసేస్తాడు ఒకటేమిటి ఈ లిఫ్ట్ లో దర్శకుడు చాలానే చూపించేసాడు. ఎప్పుడు సినిమా అవుతుందా, ఎప్పుడు ఇంటికి వెళ్లిపోదామా అన్నంతగా సన్నివేశాలు అన్నీపెట్టాడు. ఇవన్నీ భరించలేక మధ్యలో ప్రేక్షకులు చప్పట్లు కొట్టడం (ఈమధ్య ఎవరయినా బోర్ ఉపన్యాసం ఇచ్చినా, లేదా ఇంకా చాలు ఆపండి అని చెప్పాలన్న కూడా చప్పట్లే గతి) ఈ సినిమాకి హైలైట్. అదొకటి చెప్పడం మర్చిపోయా, కథానాయికకు ఆస్తమా వుంది, ఏంటి లిఫ్ట్ లో ఆమెకి ఇంకా ఆస్తమా రాలేదు అని అందరూ ఆతృతగా (టెన్షన్ తో) ఎదురు చూస్తూ వుంటారు, దర్శకుడు ఏమైనా మరిచిపోయాడా అని అనుకుంటుంటూ వుంటారు.

popcorn1.jpg

కానీ చివర్లో ఆమెకి ఆస్తమా రావటం జరిగింది. చేప పిల్లని వాటర్ బౌల్ లో వెయ్యడానికి ఎంత అట్టహాసం దర్శకుడు చేసాడో, దానికి వంద రేట్లు చేసాడు ఈ ఆస్తమా సన్నివేశాన్ని. క్లైమాక్స్ పోరాట సన్నివేశం లో పోలీసులు ఎలా వస్తారో, క్లైమాక్స్ వచ్చేసరికి ఆమెకి ఆస్తమా రావటం, బయట నుండి సహాయం రావటం ఇవన్నీ మామూలు సన్నివేశాలే కదా. ఎంత తక్కువ చెపితే అంత మంచిది ఈ సినిమా గురించి. లీడ్ పెయిర్ మధ్యలో కెమిస్ట్రీ సరిగ్గా లేదు. ఇద్దరూ ఓవర్ యాక్షన్ చేసినట్టుగా అనిపిస్తూ ఉంటుంది. సినిమా అంత ఈ లిఫ్ట్ లోనే జరుగుతుంది కాబట్టి, దర్శకుడు మంచి పాయింట్స్, డైలాగ్స్, సరదాగా, హాస్య సన్నివేశాలు రాస్తే బాగుండేది, కానీ అవేమి చెయ్యలేదు. ఏమైనా కూడా నటీనటులు కూడా కొంచెం ఓవర్ గా చేశారేమో అనిపించింది.

చివరగా, మంచి కథ, కథనం లేనపుడు నటీనటులను అని మాత్రం ఏమి లాభం. చారు హాసన్ చిన్న పాత్రలో కనపడతారు. 'పాప్ కార్న్' సినిమా టైటిల్ ఎందుకు పెట్టారో తెలియదు, కానీ ఈ 'పాప్ కార్న్' కి అస్సలు రుచిగా ఉండదు, అదొక్కటే కాదు రంగు, వాసనా కూడా లేదు. పెద్ద నటుల సినిమాలే ఈమధ్య ఆడటం లేదు, అలాంటిది కథ లేకుండా, కథనం లేకుండా ఇలాంటి ఏ విషయం లేని సినిమాలు ఎవరు చూస్తారు. ప్రేక్షకులు రావట్లేదు థియేటర్ కి అని అంటారు, అది తప్పు, ప్రేక్షకులకి నచ్చే సినిమాలు రావట్లేదు అని అర్థం. మంచి సినిమాలు తీస్తే వస్తారు సినిమా చూడటానికి. (PopCornFilmReview)

Updated Date - 2023-02-10T16:42:33+05:30 IST