Pareshan Film Review: ఇదో ఓటిటి సినిమా, అంతే !

ABN , First Publish Date - 2023-06-02T15:23:56+05:30 IST

తెలంగాణ నేపధ్యం కథగా మరో సినిమా 'పరేషాన్' విడుదల అయింది. రూపక్ రోనాల్డ్ సన్ దీనికి దర్శకుడు కాగా, తిరువీర్ కథానాయకుడు. ఈ సినిమాకి ప్రముఖ నటుడు రానా దగ్గుబాటి ప్రెజంటర్ గా వుంది, సినిమాని ప్రమోట్ చేసాడు.

Pareshan Film Review: ఇదో ఓటిటి సినిమా, అంతే !

సినిమా: పరేషాన్

నటీనటులు: తిరువీర్ (Thiruveer), పావని కరణం, బన్నీ అభిరన్, మురళీధర్ గౌడ్ (MuralidharGoud), సాయి ప్రసన్న, అర్జున్ కృష్ణ, పద్మ, వసంత తదితరులు

ఛాయాగ్రహణం: వాసు పెండమ్

సంగీతం: యశ్వంత్ నాగ్

రచన, దర్శకత్వం: రూపక్ రోనాల్డ్ సన్ (Roopak Ronaldson)

నిర్మాత: సిద్ధార్థ్ రాళ్లపల్లి (Siddharth Rallapalli)

-- సురేష్ కవిరాయని

నటుడు తిరువీర్ చాలా వెబ్ సిరీస్ లో చేసాడు, ఇప్పుడు 'పరేషాన్' #PareshanFilmReview అనే మూవీలో కథానాయకుడిగా నటించాడు. ఈ సినిమాకి ప్రత్యేకం ఏంటంటే, రానా దగ్గుబాటి (RanaDaggubati) దీనిని బాగా ప్రమోట్ చెయ్యడమే కాకుండా, దీనికి ప్రెజంటర్ గా కూడా వున్నాడు. ఈమధ్య తెలంగాణ నేపథ్యంలో సినిమాలు ఎక్కువగా వస్తున్నాయి. గత వారం 'మేమ్ ఫేమస్' (MemFamous) వస్తే, ఈ వారం ఈ 'పరేషాన్' #PareshanFilmReview కూడా అటువంటిదే. తెలంగాణ నేపధ్యం వున్న సినిమాల్లో ఎక్కువగా కనిపించే మురళీధర్ గౌడ్ ఈ సినిమాలో ఒక ముఖ్య పాత్ర పోషించాడు. ఈ సినిమాకి దర్శకుడు రూపక్ రోనాల్డ్ సన్, నిర్మాత సిద్ధార్థ్ రాళ్ళపల్లి. ఈ సినిమా ఎలా వుందో చూద్దాం.

pareshan1.jpg

Pareshan film story కథ:

ఐజాక్ (తిరువీర్) ఇంకో నలుగురు స్నేహితులతో తాగుతూ తిరుగుతూ ఉంటాడు, కానీ జీవితంలో సెటిల్ అవుదాం అనే దాని మీద దృష్టి పెట్టడు. అతని తండ్రి సమర్పణ్ (మురళీధర్ గౌడ్) సింగరేణి చిన్న ఉద్యోగి. తండ్రి కష్టపడి ఐజాక్ కి వుద్యోగం రావాలంటే లంచం ఇవ్వాలని, తన స్నేహితుడికి 50 వేలు ఇవ్వమని చెప్పి కొడుకుతో డబ్బు పంపిస్తాడు. ఐజాక్ ఆ డబ్బులు తీసుకెళ్లి తన స్నేహితులకు అవసరం వచ్చిందని వాళ్ళ కోసం ఖర్చు పెట్టేస్తాడు. డబ్బులు తండ్రి స్నేహితుడికి ఇచ్చాను అని తండ్రికి అబద్ధం చెప్తాడు. స్నేహితులతో తాగి తందానాలు ఆడటమే కాకుండా, ఇతనికి శిరీష (పావని కరణం) అనే గర్ల్ ఫ్రెండ్ కూడా ఉంటుంది. ఒకరోజు వీరిద్దరూ శారీరక సంబంధం కూడా పెట్టుకుంటారు, మరుసటి రోజే ఆమెకు వాంతులు రావడంతో కడుపు వచ్చిందని ఇద్దరూ గాబరపడుతూ వుంటారు. అదే వూర్లో డాక్టరుకు చూపించాలని అనుకుంటే ఆ డాక్టరు శిరీష తండ్రికి ఫోన్ చేస్తాను అనడంతో, సిటీకి పోయి పరీక్షలు చేయిద్దాం అంటాడు. అయితే అతని దగ్గర డబ్బులు లేవు, స్నేహితుల దగ్గర కూడా వుండవు. సమర్పణ తన కొడుకు ప్రయోజకుడు అయితే, తను ఒక బ్రదర్ దగ్గర వాక్యాలు చెప్పుకోవాలని అనుకుంటాడు. అయితే ఇంతకీ ఐజాక్ డబ్బులు సంపాదించాడా? దానికోసమని అతను, స్నేహితులు ఏమి చేశారు? సమర్పణ్ కొడుకు చేసిన పనికి ఏమి చేసాడు? స్నేహితుల గొడవలు, పక్క వూర్లో వున్నవాళ్ళతో గొడవలు ఇలా చివరికి ఏమైంది అన్నదే 'పరేషాన్' సినిమా.

విశ్లేషణ:

ఈమధ్య దర్శకులు ఎక్కువ తెలంగాణా నేపథ్యంలో కథలు రాస్తున్నారు, 'జాతి రత్నాలు' (JathiRatnalu), 'దసరా' (Dasara), 'బలగం', (Balagam) 'మేమ్ ఫేమస్' ఇప్పుడు ఈ 'పరేషాన్' ఇలా వరసగా వస్తున్నాయి. అయితే ఇక్కడ ఒక పాయింట్ చెప్పాలి, తెలంగాణ నేపధ్యం వున్న సినిమాలు ఎన్ని వస్తే అంత మంచిదే, కానీ అందులో ఎన్ని సినిమాల్లో తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు చూపెడుతున్నారు అనే విషయం చూడాలి. ఆమధ్య వచ్చిన 'బలగం' సినిమా తెలంగాణా పల్లె జీవనానికి అద్దం పట్టింది. అందులో భావోద్వేగాలు బాగా పండాయి, సినిమా అందుకే పెద్ద హిట్ అయింది. 'దసరా' సినిమా కూడా ఇక్కడ బాగా ఆడింది, కానీ ఆంధ్ర ప్రాంతంలో అంత పెద్దగా ఆడలేదు. ఇక 'మేమ్ ఫేమస్' కూడా ఒక యూట్యూబ్ కి తీయాల్సిన సినిమా. మహేష్ బాబు (MaheshBabu) ఆ సినిమా కోసం ట్వీట్ చెయ్యడం, ఆ సినిమా ప్రచారాలు కూడా కొంచెం వెరైటీ గా ఉండటం తో ఆ సినిమాకి కొంచెం ఓపెనింగ్స్ వచ్చాయి.

pareshan2.jpg

ఇప్పుడు ఈ 'పరేషాన్' #PareshanFilmReview మూవీ విడుదల అయింది. దర్శకుడు రూపక్ రోనాల్డ్ సన్ ఇందులో పాత్రలను సహజంగా చూపించాడు. ప్రతీ పాత్ర చాలా సహజంగా వుండి ఆ పాత్రే కనపడుతుంది తప్ప అందులో నటుడు కనిపించడు, అంతలా తీసాడు. కానీ తెలంగాణా అంటే తాగుడు, తినుడు అనేట్టుగా ఈ సినిమాలో చూపించాడు. పల్లె వాతావరణం, స్నేహితులు, బలాదూర్ గా తిరిగే కొడుకు, ఆ కొడుకును మంచి ఉద్యోగంలో చూడాలనుకున్న తండ్రి ఇవన్నీ బాగున్నాయి. కానీ సినిమాలో కథానాయకుడు 50 వేల రూపాయలకు తిరుగుతూ, లక్ష రూపాయల మద్యం స్నేహితులతో తాగాడు, తాగించాడు. ఇదేనా తెలంగాణ నేపధ్యం అంటే. పచ్చని పొలాలు, ఆ సంస్కృతి, సంప్రదాయాలు ఎన్ని మంచి కథలు లేవు, ఒక మంచి కథ చెప్పొచ్చు కదా ఇవే పాత్రలతో.

ఎంతసేపూ తాగుడూ, తినుడూ, గర్ల్ ఫ్రెండ్ తో తిరుగుడేనా. కొంతమందికి అయితే మధ్యమధ్యలో వచ్చే కొన్ని సన్నివేశాలు నవ్విస్తాయేమో కానీ, సినిమా అయితే కేవలం ఓటిటి కోసమే తీసినట్టుగా వుంది. సినిమాలో క్రైస్తవ పాటలు, ఆ సన్నివేశాలు కొన్ని నవ్విస్తాయి. తప్పితే సినిమాలో ఒక బలమైన కథ లేదు, కేవలం తాగుడు, తినుడు కామెడీ సన్నివేశాలతో సినిమా నడిపించేద్దామని అనుకున్నాడు దర్శకుడు రూపక్ రోనాల్డ్ సన్. ఒక్కసారి కలిస్తే మరుసటి రోజుకే ప్రగ్నంట్ ఎలా అయిపోతుంది అని ఇప్పటి వాళ్ళకి మరీ అంతలా తెలియకుండా ఉన్నారా? ఇలాంటివే లాజిక్ లేని సన్నివేశాలు చాలా వున్నాయి. కానీ సినిమా అంత తెలంగాణ యాస, కామెడీ తో నడిపించేసాడు.

pareshan3.jpg

ఇక నటీనటుల విషయాన్ని వస్తే, తిరువీర్ బాగా చేసాడు. ఒక పక్క తండ్రితో తిట్లు తింటూ, ఇంకో పక్క స్నేహితుల దగ్గర డబ్బుల కోసం, గర్ల్ ఫ్రెండ్ దగ్గర ఇంకోలా ఇలా వైవిధ్యం చూపిస్తూ బాగా చేసాడు. మురళీధర్ గౌడ్ ఇప్పుడు సూపర్ స్టార్ అయిపోతున్నాడు క్యారెక్టర్ ఆర్టిస్టుల కోవలో. అతను ప్రతి తెలంగాణ సినిమాలో కనిపిస్తున్నాడు, అలాగే చాలా సహజంగా నటిస్తున్నాడు కూడా. అతను ఈ సినిమాకి ఒక ప్లస్ అని చెప్పుకోవాలి. పావని కరణం, శిరీష పాత్ర చేసింది, చాలా సహజంగా నటించి, మాటలు, అభినయం కూడా చేసి చూపింది. మిగతా పాత్రల్లో అందరూ బాగా చేశారు అనే చెప్పాలి. ఇంకా సంగీతం కూడా పరవాలేదు, క్రైస్తవ పాట బాగుంది. ఛాయాగ్రహణం చాలా చక్కగా పల్లె వాతావరణాన్ని చూపించారు.

చివరగా 'పరేషాన్' అనే సినిమా కేవలం ఓటిటి కోసం తీసినట్టుగా అనిపిస్తుంది. సినిమా అంతా తాగుడు, తినుడు, అమ్మాయితో తిరుగుడు అదే తెలంగాణా నేపధ్యం అని తీశారు. అక్కడక్కడా కొన్ని సన్నివేశాలు నవ్వు తెప్పిస్తాయి తప్పితే, ఈ సినిమా థియేటర్ లో చూసే అంత విషయం లేదు.

Updated Date - 2023-06-02T16:06:56+05:30 IST