LGM film review: ధోని సినిమా డకౌట్ అయింది !

ABN , First Publish Date - 2023-08-04T17:40:12+05:30 IST

ప్రపంచ ప్రఖ్యాత క్రికెటర్ ఎమ్ఎస్ ధోని సినిమా రంగంలోకి అడుగు పెట్టాడు. క్రికెట్ లో మెళకువలు అంటే ధోని కి వెన్నతో పెట్టిన విద్య, ఎందుకంటే అతను క్రికెటర్ కాబట్టి. కానీ ఇది సినిమా రంగం, ఇందులో చాలా పరిశ్రమ చేయాలి. అలాంటి ధోని తన ఇన్నింగ్స్ 'ఎల్‌జిఎమ్' అనే సినిమాతో మొదలెట్టాడు. ఇది తమిళనాడులో గతవారం విడుదలైతే, ఈవారం ఇక్కడ తెలుగులో విడుదలైంది.

LGM film review: ధోని సినిమా డకౌట్ అయింది !
LGM Film Review

సినిమా: ఎల్‌జిఎమ్: లెట్స్ గెట్ మారీడ్

నటీనటులు: హరీష్ కళ్యాణ్, ఇవానా, నదియా, యోగిబాబు, ఆర్జే విజయ్, వీటీవీ గణేష్, వెంకట్ ప్రభు తదితరులు

ఛాయాగ్రహణం: విశ్వజిత్ ఒదుక్కత్తిల్

సంగీతం, దర్శకత్వం: రమేష్ తమిళమని

నిర్మాణ సంస్థ: ధోని ఎంటర్‌టైన్‌మెంట్

నిర్మాతలు: సాక్షి సింగ్ ధోని, వికాస్ హస్జా

-- సురేష్ కవిరాయని

భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని (MSDhoni) లేదా ఎమ్ఎస్ ధోని పేరు ప్రతి ఇంట్లోనీ తెలుసు. అతను అంత పాపులర్ క్రికెట్ ఆటగాడు. అదే ధోని ఐపీల్ (IPL) లో చెన్నై సూపర్ కింగ్స్ (ChennaiSuperKings) జట్టుకి కెప్టెన్ గా కూడా ఎన్నో ఏళ్లుగా వ్యవహరిస్తున్నాడు. అందుకని ధోనికి, చెన్నై కి ఒక విడదీయని అనుబంధం వుంది. అందుకేనేమో ధోని #MSDhoni సినిమా పరిశ్రమలోకి కూడా ఆరంగేట్రం చేసాడు. అంటే ధోని ఎదో సినిమాలో నటిస్తున్నాడు అని కాదు, ధోని ఎంటర్‌టైన్‌మెంట్ (DhoniEntertainment) అనే ఒక ప్రొడక్షన్ హౌస్ ని ప్రారంభించి, దానికి అతని భార్య సాక్షిని (SakshiDhoni) అధిపతిని చేసి ముందుగా 'ఎల్‌జిఎమ్: లెట్స్ గెట్ మారీడ్' #LGM:LetsGetMarriedReview అనే ఒక చిన్న బడ్జెట్ సినిమాని తీశారు. #LGMFilmReview దీనికి రమేష్ తమిళమని (RameshTamilmani) దర్శకత్వం వహించగా, హరీష్ కళ్యాణ్ (HarishKalyan), ఇవానా (Ivana) (లవ్ టుడే ఫేమ్) జంటగా నటించారు. నదియా (Nadhiya), యోగిబాబు (Yogibabu) ఇంకో ముఖ్య పాత్రల్లో కనపడతారు. ఈ సినిమా తమిళనాట గత వారం విడుదలైంది, ఈరోజు అంటే ఆగష్టు 4వ తేదీన తెలుగులో విడుదలైంది.

LGM1.jpg

LGM Story కథ:

గౌతమ్ (హరీష్ కళ్యాణ్), మీరా (ఇవానా) ఒకే కంపెనీ లో పనిచేస్తూ రెండేళ్ళ నుంచి ప్రేమించుకుంటూ వుంటారు. గౌతమ్ అతని తల్లి (నదియా) తో ఉంటాడు, తండ్రి లేడు. మీరా పేయింగ్ గెస్ట్ గా ఉంటుంది, ఎందుకంటే తల్లిదండ్రులు వేరే ఊరులో వుంటారు, తండ్రికి బదిలీలు అవుతూ ఉండటంతో. ఒకరోజు గౌతమ్, మీరాకి పెళ్లి చేసుకుందాం అని చెప్తాడు, మీరా అదే విషయం తల్లిదండ్రులకు చెపితే అబ్బాయిని, అతని తల్లిని తీసుకుని ఇంటికి రమ్మంటారు మీరా తల్లిదండ్రులు. గౌతమ్, తల్లితో మీరా ఇంటికి వెళతాడు. అక్కడ గౌతమ్ తల్లి, మీరాతో ఆమెని తన సొంత కూతురులా చూసుకుంటానని చెపుతుంది. ఆ విషయమే మీరాకి నచ్చదు. అక్కడే వెంటనే గౌతమ్ ని పిలిచి పెళ్లి తరువాత వేరు కాపురం పెట్టాలి అని అనుకున్నాం కదా, మళ్ళీ మీ అమ్మగారు మనతో ఉంటే అవదు అని కండిషన్ పెడుతుంది. దానికి గౌతమ్ ఒప్పుకోడు, అమ్మ తనతోపాటు ఉండాలి అంటాడు. #LGMReview పెళ్లి కేన్సిల్ అయిపోతుంది. ఇక అక్కడనుండి రెండు కుటుంబాలు ఎడమొహం పెడమొహం పెట్టుకుంటారు. అయితే మళ్ళీ మీరా చొరవ తీసుకొని ఒక ప్లాన్ చెపుతుంది. కాబోయే భర్త కోసం ఎలా రెండు సంవత్సరాలు ప్రేమించి తెలుసుకుందో, అలాగే కాబోయే అత్తగారి గురించి తెలుసుకోవడం కోసం రెండు కుటుంబాలతో కూర్గ్ టూర్ కి వెళదాం అని చెపుతుంది. గౌతమ్ తల్లికి వేరే ఎదో కారణం చెప్పి ఒప్పిస్తాడు, అలాగే మీరా కూడా తల్లిదండ్రులని కూడా ఒప్పిస్తుంది. గౌతమ్ స్నేహితులు కూడా కొందరు వస్తారు. అందరూ బస్సులో కూర్గ్ టూరు వెళతారు. ఇంతకీ అక్కడ ఏమైంది, అత్తకీ, కాబోయే కోడలికి సయోధ్య కుదిరిందా లేదా గొడవలు పెరిగాయా? మీరా, కాబోయే అత్తగారు అడవిలో ఎందుకు చిక్కుకున్నారు? ఇవన్నీ తెలియాలంటే ఈ సినిమా చూసి తెలుసుకోవాల్సిందే ! (LetsGetMarried film review)

LGM2.jpg

విశ్లేషణ:

దర్శకుడు రమేష్ తమిళమని తీసుకున్న కథ ఏంటంటే పెళ్ళికి ముందు భార్య భర్తలు ఒకరినొకరు అర్థం చేసుకోవటం కోసం ఇద్దరూ కొన్నాళ్లపాటు పరిచయం పెంచుకొని ఆ తరువాత పెళ్లి చేసుకోవటం. అది పాత కథే, అలాంటివి ఇంతకుముందు ఎన్నో వచ్చాయి, అయితే ఇందులో కొత్త అంశం ఏదైనా వుంది అంటే, అది కాబోయే అత్తా కోడళ్ళు కూడా ఒకరికొకరు తెలుసుకోవటం కోసం కొన్ని రోజులు కలిసి ప్రయాణం చెయ్యడం. ఈ కాన్సెప్ట్ కొత్తది. అయితే దర్శకుడు రమేష్ తమిళమని ఇది చెప్పడంలో తడబడ్డాడు. #LGMFilmReview మొదటి సగం అంతా లీడ్ పెయిర్ మీదే ఉంటుంది, వాళ్ళ ప్రేమ విషయం, తల్లిదండ్రులకి ఎలా చెప్పడం, ఇలాంటివి. రెండో సగంలో అత్తగారి గురించి కాబోయే కోడలు తెలుసుకోవటం కోసం ఒక టూరు కి వెళ్లడం. ఇక్కడ నుండి సినిమా ఏటో వెళ్ళిపోయింది, దర్శకుడు సరిగ్గా నేరేట్ చెయ్యలేకపోయాడు, సరికదా కొన్ని సన్నివేశాలు బలవంతంగా చొప్పించటంతో సినిమా మరీ బోర్ కొట్టేసింది.

LGM3.jpg

ఇవన్నీ ఒక ఎత్తు అయితే, యోగిబాబు తమిళనాడు ప్రేక్షకులకి బాగా పరిచయం వున్న కామెడీ నటుడు అని అతని పాత్ర కథకి సంబంధం లేకపోయినా బలవంతంగా సినిమాలో ఇరికించేశాడు. అందుకని అసలు కథ పక్కకి వెళ్ళిపోయింది. దానికి తోడు అడవిలో తప్పిపోవటం, అత్తా కోడళ్ళని ఎత్తుకుపోవటం, పులి వేన్ లో ఉండటం ఇవన్నీ చాలా సిల్లీ గా వున్నాయి. అలాగే నాసిరకం గ్రాఫిక్స్ కూడా అక్కడ పెట్టేసారు. ఎక్కడా భావోద్వేగాలు లేవు, ఆలా అని హాస్య సన్నివేశాలు కూడా లేవు. మొదటి సగం లో అక్కడక్కడా కొన్ని సన్నివేశాల్లో నవ్వుకోవచ్చు అనిపిస్తుంది కానీ, మొత్తం మీద దర్శకుడు తాను అనుకున్న కథని సరిగ్గా తెర మీద చూపించలేకపోయాడు. క్లైమాక్స్ కూడా అదేదో హడావిడిగా ఇక టైం అయిపోతోంది అన్న చందాన పూర్తి చేసేసాడు. #LGMFilmReview ఇంతకీ చివర్లో ఏమి చెప్పాలనుకున్నాడో అది చెప్పలేదు, సడన్ గా సినిమా ఎండ్ అయిపోతుంది. ఎందుకు మరి ఆలా చేశారో దర్శకుడికే తెలియాలి. అత్తా కోడళ్ల సీరియల్ చూస్తున్నట్టుగా అనిపిస్తుంది ఒక టైములో ఈ సినిమా. ఎందుకంటే ఎవరి మధ్య భావోద్వేగాలు కనపడవు, ఎదో మిస్ అయింది సినిమాలో అనిపిస్తూ ఉంటుంది.

LGM4.jpg

ఇక ధోని ప్రపంచ క్రికెట్ లో అత్యుత్తమ క్రికెటర్ అయితే అయ్యుండొచ్చు కానీ, ఈ సినిమా దగ్గరకి వచ్చేసరికి అతనికి ఇందులో అస్సలు అనుభవం లేదు కదా. ఎదో చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ గా, తమిళ ప్రజలతో చాలా అనుబంధం ఉండటం వలన సినిమా రంగంలోకి వచ్చాడా అని అనిపిస్తుంది. ఎందుకంటే ఒక వేళ సినిమాలు కంటిన్యూ గా తీయాలంటే కొంచెం అనుభవజ్ఞులైన వారి సలహాలు తీసుకొని చేసుంటే బాగుండేదేమో. #LGMFilmReview ఏమైనా కూడా మొదట ఒక బడ్జెట్ సినిమాతో పరిశ్రమలోకి వచ్చినందుకు అభినందించాలి. ఇది పూర్తి తమిళ సినిమా, ఒక వారం ముందుగానే తమిళంలో విడుదలైంది, తరువాత తెలుగులోకి అనువదించి విడుదల చేశారు. చెన్నైలో కూడా ఈ సినిమా ఫలితం అందరికీ తెలిసిందే, తెలుగులోనూ అదే కంటిన్యూ అయింది. తెలుగులో అయితే ఈ సినిమా విడుదలవుతున్నట్టు కూడా చాలామందికి తెలియదు, ఎందుకంటే ఇక్కడ ప్రచారాలకు అంతగా ప్రాముఖ్యం ఇవ్వలేదు.

ఇక నటీనటుల విషయానికి వస్తే, హరీష్ కళ్యాణ్ 'జెర్సీ' అనే తెలుగు సినిమాలో చేసాడు. ఇందులో అతను చాలా బాగున్నాడు, కానీ రెండో సగంలో అతని పాత్రని సరిగ్గా డిజైన్ చెయ్యలేదు, అతను కనిపించేది తక్కువ. ఇవానా ఇంతకు ముందు 'లవ్ టుడే' అనే ఒక విజయవంతమైన సినిమాలో చేసింది. ఈ సినిమాలో కూడా అదే కంటిన్యూ చేసింది అనిపించింది. #LGMFilmReview కానీ లీడ్ పెయిర్ మధ్యలో ఆ కెమిస్ట్రీ సరిగ్గా వర్క్ అవుట్ కాలేదు. ఇక నదియా హరీష్ కళ్యాణ్ తల్లిగా తన పాత్రకి తగ్గట్టుగా నటించింది. యోగిబాబు కేవలం మధ్య మధ్యలో హాస్య సన్నివేశాల కోసం కనిపిస్తాడు. అంతే. హరీష్ స్నేహితుడిగా చేసిన ఆర్జే విజయ్ (RJVIjay) బాగున్నాడు. చాలామంది తమిళ నటులు వున్నారు. సంగీతం, కెమెరా, మాటలు మామూలుగా వున్నాయి. అంతే.

LGM-Movie.jpg

చివరగా, 'లెట్స్ గెట్ మారీడ్' #LGMReview సినిమా క్రికెటర్ ధోనికి #MSDhoni సినిమా పరిశ్రమలో మొదటి వన్ డే మ్యాచ్ లాంటిది. అయితే పాపం అతను స్కోర్ ఏమీ చెయ్యకుండానే డకౌట్ అయ్యాడు. ఎందుకంటే దర్శకుడు ఏమి చెప్పాలని అనుకున్నాడో అది తెర మీద చూపించలేకపోయాడు. రెండో సగం అయితే మరీ బోర్ కొట్టేసింది. లీడ్ పెయిర్ మధ్యలో కెమిస్ట్రీ లేదు, మిగతా పాత్రల మధ్య భావోద్వేగాలు లేవు, యోగిబాబు (Yogibabu) ఉంటే సినిమా ఆడేస్తుంది అనుకుంటే అది పెద్ద పొరపాటు. ఇన్ని చెప్పినా ఇక మీ ఇష్టం !

Updated Date - 2023-08-04T17:40:12+05:30 IST