PS2 review: కుట్రలు, కుతంత్రాలు, రాజకీయాల మధ్య రెండో భాగం ఎలా నడిచింది అంటే..

ABN , First Publish Date - 2023-04-28T16:32:51+05:30 IST

మణిరత్నం దర్శకత్వం వహించిన 'పొన్నియన్ సెల్వన్' రెండో పార్టు 'పీస్ 2' విడుదల అయింది. మొదటి పార్టులో ప్రేక్షకులకు అనేక సందేహాలకు ఇందులో సమాధానాలు దొరుకుతాయి. ఇంతకీ ఈ రెండో భాగం ఎలావుందంటే..

PS2 review: కుట్రలు, కుతంత్రాలు, రాజకీయాల మధ్య రెండో భాగం ఎలా నడిచింది అంటే..

సినిమా: పొన్నియన్ సెల్వన్ 2 (PS2Review)

నటీనటులు: చియాన్ విక్రమ్ (ChiyaanVikram), ఐశ్వర్య రాయి, త్రిష, శోభిత ధూళిపాళ, ఐశ్వర్య లక్ష్మి కార్తీ, జయం రవి, రెహమాన్, శరత్ కుమార్ తదితరులు

సంగీతం: ఎ.ఆర్. రహమాన్ (AR Rahaman)

ఛాయాగ్రహణం: రవి వర్మన్ (RaviVarman)

నిర్మాతలు: మణిరత్నం, సుభాష్ కారం

దర్శకత్వం: మణిరత్నం (ManiRatnam)

-- సురేష్ కవిరాయని

దర్శకుడు మణిరత్నం తాను తీసిన 'పొన్నియన్ సెల్వన్' #Ponniyin Selvan సినిమా రెండో పార్టు 'పీస్ 2' #PS2Review ని విడుదల చేసాడు. మొదటి పార్టులో వున్న అగ్రనటులు అందరూ ఇందులో కనిపిస్తారు. అలాగే మొదటి పార్టు చివర్లో వృద్ధ నందినిలా (ఐశ్వర్య రాయి) వున్న ఆమె నీటిలో పడిపోయిన పొన్నియన్ సెల్వన్ (జయం రవి) ని కాపాడుతుంది. ఇంతకీ ఆమె ఎవరు, ఆమె కూడా నందిని లా ఎందుకుంది, ఆమెకి నందిని ఏమైనా సంబంధం ఉందా, ఇలాంటివి ప్రేక్షకులకు కొంచెం ఆసక్తి కలిగించే అంశాలు. 'బాహుబలి', 'కెజిఫ్' సినిమాలవలె ఈ మణిరత్నం సినిమా కూడా రెండు పార్టులుగా ఆసక్తిగా వచ్చింది. ఇది కల్కి కృష్ణమూర్తి #KalkiKrishnamurthy రచించిన తమిళ నవల 'పొన్నియన్ సెల్వన్' #Ponniyin Selvan ఆధారంగా తీసిన సినిమా. అందుకని తెలుగువాళ్ళకన్నా ఎక్కువగా తమిళులకు నచ్చుతుంది అనుకోవచ్చు. ఇంతకీ ఈ సినిమా ఎలా ఉందొ చూద్దాం.

ps2review4.jpg

Ponniyan Selvan 2 story కథ:

చోళ యువరాజు అరుణ్ మొళి లేదా పొన్నియన్ సెల్వన్ (జయం రవి) తనని కాపాడిన వృద్దురాలు అచ్ఛం నందినిలానే వుంది అని అనుకుంటాడు. అతను చనిపోయాడు అని అందరూ అనుకుంటూ వుంటారు, కానీ అతన్ని ఒక బౌద్ధ ఆశ్రమంలో చేర్చి చికిత్స చేయించి కాపాడతారు. ఇక్కడ మధురాంతకుడిని (రెహమాన్) రాజుని చెయ్యాలని మంతనాలు, రాజకీయాలు నడుస్తూ ఉంటాయి. ఇంకో వేపు నందిని (ఐశ్వర్య రాయి) తన మీద మనసుపడ్డ ఆదిత్య కరికాలుడు (విక్రమ్)ని ఎలా అయినా అంతమొందించాలని తన కోటకు రమ్మని చెపుతుంది. ఇంకో పక్క పాండ్య రాజుల సైన్యం, చోళ రాజుల్ని అంతం చెయ్యాలని కాపు కాసి చూస్తుంటాయి. ఇన్ని తంత్రాలు, కుతంత్రాలు, పన్నాగాలు మధ్య ఎవరెవరు ఏమి చేస్తున్నారు. నందిని, ఆదిత్య ని ఏమి చేసింది. వృద్దురాలుకి నందిని కి ఏంటి సంబంధం, నందిని అసలు తండ్రి ఎవరు, ఇవన్నీ తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

ps2review2.jpg

విశ్లేషణ:

దర్శకుడు మణిరత్నం మొదటి భాగం ఎక్కడ ముగించాడో, అక్కడనుండి మొదలెట్టాడు రెండో భాగం కూడా. నందిని లా కనిపిస్తున్న ఆ వృద్దురాలు ఎవరనే విషయం మీదే ఎక్కువ ఫోకస్ పెట్టాడు మణిరత్నం. అందుకనే రెండో భాగం నందిని, ఆదిత్య కరికాలుడు యువకులుగా వున్నప్పుడు వారి ప్రేమ సన్నివేశాలతో మొదలెట్టాడు. మెల్లగా నందిని ఎవరనే విషయం రివీల్ చేసాడు. అలాగే ఆ కాపాడిన వృద్ధురాలు ఎవరు అనే విషయం కూడా రెవీల్ చేసాడు. అయితే మొదటి పార్టు కన్నా ఇందులో ఎక్కువ భావోద్వేగాలకు చోటిచ్చాడు. నందిని, ఆదిత్య కరికాలుడు మధ్య నడిచే సన్నివేశం బాగా రక్తి కట్టించాడు. ఇంక కోటాలో జరిగే పరిణామాలు, కుట్రలు, కుతంత్రాలు, రహస్య మందిరాలు ఇలాంటివి అన్నీ బాగా చూపించాడు. యుద్ధ సన్నివేశాలు మాత్రం అంత ఆసక్తికరంగా తీయలేకపోయాడు మణిరత్నం.

ps2a.jpg

అలాగే తెలుగు వాళ్ళకి ఈ పాత్రల పేర్లు, ఊరి పేర్లు గుర్తుపెట్టుకోవం కొంచెం కష్టమైనా పనే అయినా, మొదటి పార్టు చూస్తే గానీ ఇది అర్థం కాదు. అలాగే కొన్ని సందేహాలు అలాగే వదిలేసాడు మణిరత్నం #ManiRatnam. నందిని, ఆదిత్యకరికాలుడు విడిపోవడానికి కారణాలు ఏంటి అన్నవి స్పష్టంగా చూపించలేదు, చెప్పలేదు. #AishwaryaRai అలాగే నందిని లా వుండే వృద్ధురాలు మందాకిని సుందరచోళుడి కీ ఏమిటి సంబంధం ఎందుకు ఆమె చివరికి అక్కడికి వచ్చింది అన్న విషయం కూడా స్పష్టంగా లేదు. అవన్నీ కొంచెం గందరగోళంగానే ఉంటుంది.

ps2review3.jpg

నటీనటులు ఎలా చేశారంటే:

రెండో పార్టులో ఐశ్వర్య రాయి #AishwaryaRai కి పెద్దపీట వేసాడు దర్శకుడు. ఆమె తన ప్రతిభని రెండు కోణాల్లో చూపించగలింది. ఒక పక్క మనసుపడ్డ ఆదిత్య కరికాలుడు మీద ప్రేమ, ఇంకో పక్క పగ, రెండూ బాగా చేసింది. అలాగే మందాకినిగా కూడా బాగుంది. ఇంకా విక్రమ్ (ChiyanVikram) ఇందులో కూడా బాగా చేసాడు. అతని పాత్ర నిడివి తక్కువే. ఇక కార్తీ (Karthi) మొదటి పార్టులో ఎలా నవ్వించనాదో ఇందులో కూడా అంతే. జయం రవి (Jayam Ravi) పాత్ర కూడా బాగుంది. త్రిష (Trisha) చాలా అందంగా వుంది అలాగే శోభిత ధూళిపాళ (Sobhita Dhulipala) కూడా. నటీనటులు అందరూ వారి వారి పాత్రల్లో ఒదిగిపోయారు. శరత్ కుమార్, పార్తిపన్, కిశోర్, ప్రభు, ప్రకాష్ రాజ్ ఇలా చాలామంది సీనియర్ నటులు వున్నారు. ఛాయాగ్రహణం బాగుంది, కోటలు, కట్టడాలు, కోటలోపల ఆ రహస్య ద్వారాలు, అవన్నీ చూడటానికి చాలా బాగున్నాయి. రహమాన్ సంగీతం ఈ సినిమాకి ప్రత్యేక ఆకర్షణగా నిలించింది. తోట తరణి అద్భుతమైన కళాకారుడు, అతను ఈ సినిమాకి ఆర్ట్ దర్శకుడిగా చేసాడు. ఇంకొక ప్రత్యేక వ్యక్తిని కూడా ప్రశంసించాలి, అతనే తనికెళ్ళ భరణి (Thanikella Bharani), చాలా కాలం తరువాత మాటలు రాసాడు.

ps2review1.jpg

చివరగా, 'పొన్నియన్ సెల్వం 2' #PS2Review సినిమా మొదటి పార్టు చూస్తే గానీ అర్థం కాదు, అలాగే మొదటి పార్టులో కొన్ని సందేహాల్ని మాత్రమే రెండో పార్టులో దర్శకుడు మణిరత్నం రివీల్ చేసాడు. కొన్ని సందేహాలు అలానే వున్నాయి. రెండిటిలో ఏది బాగుంది అంటే మాత్రం, నాకు మొదటి పార్టు బెటర్ అనిపించింది.

Updated Date - 2023-04-28T16:32:51+05:30 IST