Leo movie review: లోకేష్ కనకరాజ్, విజయ్ సినిమా అనుకున్నంతగా లేదు!

ABN , First Publish Date - 2023-10-19T19:14:47+05:30 IST

లోకేష్ కనకరాజ్ సినిమాల కోసం సినిమా ప్రేక్షకులు ఆసక్తికాగా ఎదురు చూస్తూ వుంటారు. ఈసారి అతను తమిళ సూపర్ స్టార్ విజయ్ తో జతకట్టి 'లియో' అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకి వచ్చాడు. చాలా పెద్ద అంచనాలు ఈ సినిమా మీద వున్నాయి, మరి ఈ సినిమా ఎలా ఉందొ చదవండి.

Leo movie review: లోకేష్ కనకరాజ్, విజయ్ సినిమా అనుకున్నంతగా లేదు!
Leo movie review

సినిమా: లియో

నటీనటులు: విజయ్, త్రిష, ప్రియా ఆనంద్, అర్జున్ సర్జా, సంజయ్ దత్, గౌతమ్ వాసుదేవ్ మీనన్, మన్సూర్ అలీ ఖాన్, మాథ్యూ, మడోన్నా సెబాస్టియన్ తదితరులు

ఛాయాగ్రహణం: మనోజ్ పరమహంస

సంగీతం: అనిరుధ్ రవిచందర్

నిర్మాతలు : ఎస్ఎస్ లలిత్ కుమార్, జగదీష్ పళనిసామి

దర్శకత్వం : లోకేష్ కనగరాజ్ (LokeshKanagaraj)

విడుదల తేదీ: అక్టోబర్ 19, 2023

రేటింగ్: 2 (రెండు)

-- సురేష్ కవిరాయని

తమిళ సూపర్ స్టార్ విజయ్ కి తెలుగులోనూ విపరీతమైన అభిమానులు వున్నారు. అతని తాజా సినిమా 'లియో' #LeoReview పెద్ద అంచనాల మధ్య విడుదలైంది. ఎందుకంటే దీనికి దర్శకుడు లోకేష్ కనగరాజ్ (LokeshKanagaraj), ఇంతకు ముందు కమల్ హాసన్ (KamalHaasan)తో 'విక్రమ్' #Vikram సినిమా చేసి చాలా పెద్ద విజయం నమోదు చేసుకున్నాడు. ఇప్పుడు విజయ్ (VIjay) తో ఈ 'లియో' దర్శకత్వం చేసాడు. విజయ్ తో పాటు, లోకేష్ కి కూడా అభిమానులు ఎక్కువగా వున్నారు, అతని సినిమా అంటే ఎదురుచూస్తూ వుంటారు. ఈ 'లియో' లో చాలామంది స్టార్స్ వున్నారు. బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ (SanjayDutt), యాక్షన్ కింగ్ అర్జున్ సర్జా (ArjunSarja), ప్రియా ఆనంద్ (PriyaAnand), మడోన్నా సెబాస్టియన్ (MadonnaSebastian), గౌతమ్ మీనన్ (GautamVasudevMenon) ఇలా చాలామంది వున్నారు. త్రిష (Trisha) కథానాయికగా నటించింది. అనిరుధ్ రవిచందర్ (AnirudhRavichander) సంగీతం సమకూర్చారు. ఈ సినిమా తెలుగులో సితార ఎంటరటైనమెంట్ (SitharaEntertaiments) విడుదల చేశారు. ఈ సినిమా ఎలా వుందో చూద్దాం. (Leo movie review)

Leo-2.gif

Leo story కథ:

పార్తీబన్ (విజయ్) హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో, థియో అనే చిన్న పట్టణంలో కాఫీ షాప్ రన్ చేసుకుంటూ ఉంటాడు, అలాగే అతను జంతు రక్షకుడు కూడాను. అతనికి భార్య సత్య (త్రిష), పిల్లలు సిద్ధార్థ్, చిన్నమ్మాయి మతి, వీళ్ళతో సంతోషంగా జీవిస్తున్నాడు. ఆ చిన్న పట్టణంలోకి జంతువులు ఏవి వచ్చినా పార్తీబన్ వాటిని కాపాడుతూ ఉంటాడు. ఒకరోజు ఒక గ్యాంగ్ ఆ కాఫీ షాపు దోచుకోవడానికి వచ్చి అక్కడ పని చేస్తున్న అమ్మాయిని అడ్డం పెట్టుకుంటారు. పార్తీబన్ వాళ్ళతో పోట్లాడి వాళ్లందరినీ గన్ తో కాల్చి పడేస్తాడు. తనకి ఏమయిందో తెలియదని, ఆ క్షణంలో వాళ్ళని రక్షించటం కోసం ఆలా చేశానని చెప్తాడు. జంతువులకు కూడా హాని చెయ్యని పార్తీబన్ కేవలం ఆత్మ రక్షణకు కాల్చాడని అతన్ని విడిచిపెట్టేస్తుంది కోర్టు, బ్రేవరీ అవార్డుకు కూడా సిఫార్సు చేస్తుంది. ఇప్పుడు మొదలవుతాయి అతనికి కష్టాలు, ఎందుకంటే అతని ఫోటో పేపర్ లో పడుతుంది. #LeoReview వెంటనే అతడిని వెతుక్కుంటూ తెలంగాణ నుంచి ఆంటోనీ దాస్ (సంజయ్ దత్) అతని అనుచరులు హిమాచల్ ప్రదేశ్ వస్తారు. పార్తీబన్ ని తన కొడుకు లియో దాస్ (విజయ్) అని అంటాడు ఆంటోనీ, అదే విషయాన్ని పార్తీబన్ భార్య సత్యకి కూడా చెపుతాడు. #LeoReview ఈలోపు పార్తీబన్ ఇంకొంతమంది గ్యాంగ్ మనుషులను కూడా చంపుతాడు, అప్పుడు అతని భార్యకి అనుమానం వచ్చి భర్త మీద పరిశోధన మొదలెడుతుంది. అసలు ఈ పార్తీబన్ ఎవరు? ఇతను లియో ఒక్కరేనా? లేదా ఇద్దరు వేరా? పోలీస్ ఆఫీసర్ జోషి (గౌతమ్ వాసుదేవ్ మీనన్) కూడా పార్తీబన్ గురించి పరిశోధిస్తాడు, అతనికి నిజం తెలుసా? ఆంటోనీ దాస్ అతని తమ్ముడు హరోల్డ్ దాస్ (అర్జున్) తెలంగాణాలో ఏమి చేస్తూ వుంటారు? వాళ్ళ కథ ఏంటి? ఇవన్నీ తెలియాలంటే 'లియో' సినిమా చూడాల్సిందే.

Leo.jpg

విశ్లేషణ:

'విక్రమ్' సినిమా విజయం తరువాత దర్శకుడు లోకేష్ కనగరాజ్ కి అభిమానులు ఎక్కువయ్యారు, అతని సినిమాలు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తూ వుంటారు. ఎందుకంటే అతని కథ, కథనం, చెప్పే తీరు ఒక వైవిధ్యంగా ఉంటుంది. ఇప్పుడు ఈ 'లియో' #LeoMovieReview సినిమా కూడా చాలా అంచనాలు మధ్య విడుదలైంది. ఇక కథ విషయానికి వస్తే, కథలో ఏమీ కొత్తదనం ఉండదు, ఇలాంటి కథలు తెలుగులో చాలా వచ్చాయి. పాత సినిమాలు కూడా చాలా వున్నాయి. సినిమా మొదలవడం ఒక గ్యాంగ్ ఒక ఇల్లు దోచుకోవటంతో మొదలవుతుంది. తరువాత ఒక హైనా పట్టణంలోకి రావటంతో ప్రజలు భయబ్రాంతులవుతారు, దానిని పట్టుకోవటం కోసం విజయ్ అదే పార్తీబన్ రంగంలోకి దిగుతాడు. తరువాత అతని కాఫీ షాపు, కుటుంబం, పిల్లలు అతనికి ఎంత ప్రాణమో చూపిస్తాడు. ఆ ఇల్లు దోచుకున్న గ్యాంగ్ కాఫీ షాపుకి రావటంతో కథ మొదలవుతుంది. అక్కడ పోరాటం జరగటం పార్తీబన్ పేరు, ఫోటో బయటకి రావటం, ఆ ఫోటో చూసి తెలంగాణ నుంచి దాస్ బ్రదర్స్ చూడటం కాఫీ షాపుకి రావటం, అతను పార్తీబన్ కాదు లియో అని చెప్తారు. ఇదంతా బాగానే ఉంటుంది ఇంతవరకు. అయితే అక్కడక్కడా చాలా సన్నివేశాలు సాగదీసినట్టుగా అనిపించింది. సినిమా మొదట్లో చూపించిన హైనాని పట్టుకోవటం సన్నివేశం కూడా చాలా సాగదీతే.

మొదటి సగం వరకు బాగానే వుంది సినిమా. ప్రేక్షకులకి కూడా ఇతను పార్తీబన్ లేదా లియో ఇద్దరా, లేక అతనే ఇతనా అనే అనుమానం వస్తుంది. పోరాట సన్నివేశాలు కూడా బాగుంటాయి. ఇక రెండో సగం వచ్చేసరికి లోకేష్ కనకరాజ్ పూర్తిగా అదుపు తప్పిపోయాడు. రెండో సగం అంతా బోరింగ్ గా పెట్టాడు. పోరాట సన్నివేశాలు ఎక్కువయిపోయాయి, ఒక దశలో తలనొప్పికూడా వస్తుంది. అలాగే నరబలి ఇవ్వటం, అందులోనూ తండ్రి తన కూతురు అని చూడకుండా ఆమెని నరబలి ఇవ్వటానికి ప్రయత్నించటం ఇవన్నీ అంతగా ప్రేక్షకులకు రుచించవు. రెండో సగంలో కొన్ని సన్నివేశాలు తప్పు మిగతావి చాలా సాగదీత, బోర్ గా ఉంటాయి. అలాగే క్లైమాక్స్ కూడా అంతగా పండలేదు. ఛాయాగ్రహణం బాగుంది, అనిరుద్ రవిచందర్ (ArirudhRavichander) నేపధ్య సంగీతం బాగుంది కానీ రెండో సగంలో కథ సరిగ్గా చెప్పలేకపోయాడు లోకేష్. విజయ్ లోకేష్ అంటే ఆ సినిమా మీద చాలా అంచనాలు వున్నాయి, కానీ ఆ అంచనాలకు తగ్గట్టుగా సినిమా తీయలేకపోయాడు లోకేష్.

Leo Movie.jpg

ఇక నటీనటుల విషయానికి వస్తే విజయ్ నటన బాగుంది, ఆకట్టుకుంటుంది. పార్తీబన్, లియో రెండు షేడ్స్ లో కనిపిస్తాడు, రెండు లుక్స్ వేరుగా ఉంటాయి. ఇందులో విజయ్ ఒక మాస్ సాంగ్ లో, పోరాట సన్నివేశాల్లో తనదైన శైలి చూపించాడు. త్రిష, విజయ్ భార్యగా సరిగ్గా సరిపోయింది, ఆమె తన ప్రతిభని కనపరిచింది. విజయ్, త్రిష మధ్య కెమిస్ట్రీ బాగుంది. విజయ్ కొడుకుగా మేత్యు థామస్ బాగా చేసాడు. అలాగే సంజయ్ దత్, అర్జున్ సర్జ వాళ్ళ పాత్రల పరిధిమేరకు నటించారు. గౌతమ్ వాసుదేవ్ మీనన్ ఈమధ్య నటుడిగా ఎక్కువ కనపడుతున్నాడు. మన్సూర్ అలీ ఖాన్ చిన్న పాత్రలో తళుక్కుమంటాడు. ప్రియా ఆనంద్, మడోన్నా సెబాస్టియన్, ఇంకా చాలామంది నటీ నటులు కనిపిస్తూ వుంటారు.

చివరగా, 'లియో' సినిమా చాలా పెద్ద అంచనాల మధ్య విడుదలైంది, కానీ దర్శకుడు లోకేష్ కనగరాజ్ ఆ అంచనాలను అందుకోలేకపోయాడు. సినిమాలో చాలా సాగదీత సన్నివేశాలు ఉంటాయి, అలాగే రెండో సగం సరిగ్గా తీయలేకపోయాడు. విజయ్ నటన ఆకట్టుకుంటుంది, అతని అభిమానులకు మాత్రమే ఈ సినిమా నచ్చుతుందేమో!

Updated Date - 2023-10-19T19:15:46+05:30 IST