KotabommaliPS movie review: 'నాయట్టు' రీమేక్ ఎలా ఉందంటే....

ABN , First Publish Date - 2023-11-24T16:11:13+05:30 IST

మలయాళంలో హిట్ అయిన 'నాయట్టు' సినిమాని తెలుగులో 'కోటబొమ్మాళి పీఎస్' అనే పేరుతో నిర్మించారు. తేజ మార్ని దీనికి దర్శకుడు. మలయాళంలో జోజు జార్జి పాత్ర హైలైట్, తెలుగులో ఆ పాత్రని శ్రీకాంత్ వేశారు. మరి ఈ తెలుగు రీమేక్ ఎలా వుందో చదవండి

KotabommaliPS movie review: 'నాయట్టు' రీమేక్ ఎలా ఉందంటే....
Kotabommali PS movie review

సినిమా: కోటబొమ్మాళి పీఎస్

నటీనటులు: శ్రీకాంత్ (Srikanth), వరలక్ష్మి శరత్ కుమార్ (VaralakshmiSarathKumar), మురళి శర్మ (MuraliSharma), బెనర్జీ, రాహుల్ విజయ్, శివాని రాజశేఖర్ (ShivaniRajasekhar), పవన్ తేజ్ కొణిదెల తదితరులు

ఛాయాగ్రహణం: జగదీశ్ చీకటి

మాటలు: నాగేంద్ర కాశి

సంగీతం: మిథున్ ముకుందన్, రంజిన్ రాజ్

నిర్మాతలు: బన్నీవాసు, విద్యా కొప్పినీడి

దర్శకత్వం: తేజ మార్ని

విడుదల తేదీ: నవంబర్ 24, 2023

రేటింగ్: 2.5

-- సురేష్ కవిరాయని

మలయాళం సినిమా 'నాయట్టు' #Nayattu మంచి హిట్ అయింది, ఓటిటి లో కూడా చాలామంది చూసారు. ఇందులో జోజు జార్జి (JojuGeorge) అత్యుత్తమ నటన కనపరిచాడు. ఈ సినిమాని తెలుగులో 'కోటబొమ్మాళి పీఎస్' #KotabommaliPSReview అనే టైటిల్ తో బన్నీ వాసు (BunnyVasu), విద్యా కొప్పినీడి నిర్మించారు, తేజ మార్ని (TejaMarni) దర్శకుడు. జోజు జార్జి పాత్రను తెలుగులో శ్రీకాంత్ (Srikanth) పోషించారు. రాహుల్ విజయ్ (RahulVijay), శివాని రాజశేఖర్ (ShivaniRajasekhar) రెండు ముఖ్య పాత్రల్లో కనపడతారు. వరలక్ష్మి శరత్ కుమార్ (VaralakshmiSarathKumar) పోలీస్ ఆఫీసర్ గా, మురళి శర్మ (MuraliSharma) హోమ్ మంత్రిగా చేశారు. ఈ సినిమా ఎలా వుందో చూద్దాం. ఈ సినిమాలో 'లింగిడి లింగిడి' పాట చాలా వైరల్ అయిన విషయం తెలిసిందే.

kotabommalipsfilm.jpg

Kotabommali PS story: కథ:

ఆంధ్రప్రదేశ్ లోని టెక్కలి నియోజక వర్గానికి ఉపఎన్నికను ఎన్నికల కమిషన్ ప్రకటిస్తుంది. అధికార పార్టీ ఈ ఉపఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకొని, ఎలా అయినా అక్కడ గెలవాలని అనుకుంటుంది. అందుకు హోమ్ మినిస్టర్ జయరాం (మురళి శర్మ) ని పంపి చూసుకోమని పార్టీ చెపుతుంది. టెక్కలి నియోజకవర్గ పరిధిలో వున్న కోటబొమ్మాళి పోలీసు స్టేషన్ లో పనిచేసే రామకృష్ణ (శ్రీకాంత్), కానిస్టేబుల్ కుమారి (శివాని రాజశేఖర్), కొత్తగా ఉద్యోగంలో చేరిన కానిస్టేబుల్ రవి (రాహుల్ విజయ్) అనుకోకుండా ఒక మర్డర్ కేసులో ఇరుక్కుంటారు. చనిపోయిన అతను ఒక సామజిక వర్గానికి చెందిన వాడు అవటంతో, వాళ్ళు ఈ ముగ్గురి పోలీస్ అధికారులను సస్పెండ్ చెయ్యాలని డిమాండ్ చేస్తారు. లేకపోతే పోలింగ్ బహిష్కరిస్తామని బెదిరిస్తారు ఆ సామజిక వర్గానికి చెందిన ఓటర్లు. వాళ్ళ ఓట్లే కీలకం కావటంతో, హోమ్ మినిస్టర్ 24 గంటల్లో ఆ ముగ్గురు అధికారులని అరెస్టు చేసి చూపిస్తా అని హామీ ఇస్తాడు. ఈ ఘటన పోలింగ్ రెండు రోజుల ముందు జరుగుతుంది. హోమ్ మినిస్టర్ డిజీపీ (బెనర్జీ) ని పిలిచి ఎలా అయినా ఆ ముగ్గురినీ 24 గంటలోగా పట్టుకొని అరెస్టు చెయ్యాలని ఆదేశిస్తాడు. అందుకు స్పెషలిస్ట్ అయినా ఎస్పీ రజియా అలీ (వరలక్ష్మి శరత్ కుమార్) ని నియమిస్తారు. ఆమె ఈ ముగ్గురినీ పట్టుకోవడానికి ఒక టీముని ఏర్పాటు చేసుకొని బయలుదేరుతుంది. ఈ ముగ్గురినీ ఆమె పట్టుకోగలిగిందా, పోలింగ్ రోజు ఆ సామజిక వర్గానికి ఇచ్చిన హామీ కోసం హోమ్ మంత్రి ఏమి చేసాడు, ఇంతకీ ఈ ముగ్గురినీ డిపార్టుమెంట్ ఏమి చేసింది? రాజకీయ చదరంగంలో పావులుగా ఎవరు మారారు, దీనిలో కొందరి జీవితాలు ఎలా ముడిపడ్డాయి ఇవన్నీ తెలుసుకోవాలంటే 'కోటబొమ్మాళి పీఎస్' సినిమా చూడాల్సిందే.

kotabommalips4.jpg

విశ్లేషణ:

ఇప్పుడు తెలుగు సినిమాలు చాలా సులువయిపోయాయి, ఎందుకంటే కథ కోసం వెతుక్కోనక్కరలేదు. మలయాళం, తమిళం, లేదా ఇంకో భాషలో ఏదైనా ఒక సినిమా హిట్ అయితే ఆ సినిమా రీమేక్ హక్కులు కొనేసి తెలుగులో తీసేస్తున్నారు. అలాంటి కోవలోకి వచ్చిందే ఈ 'కోటబొమ్మాళి పీఎస్' సినిమా. మలయాళంలో పెద్ద హిట్ అయిన 'నాయట్టు' సినిమా రీమేక్ ఇది. దర్శకుడికి కథ తెలుసు, మెయిన్ ప్లాట్ చెడిపోకుండా తెలుగు ప్రేక్షకులకి ఎలా ఈ కథని అన్వయించగలం అనే దానిమీద దృష్టి పెడితే దర్శకుడు పని సులువైపోతుంది.

కానీ తెలుగు దర్శకుడు, నిర్మాతలు ఇక్కడే పొరపాట్లు చేస్తూ వుంటారు. ఎందుకంటే మలయాళంలో 'నాయట్టు' సినిమా ఎంతో సహజంగా వుండి, ప్రతి పాత్ర హృదయానికి హత్తుకుంటుంది, ముఖ్యంగా జోజు జార్జి పాత్రకి అయితే చాలా సింపతీ వస్తుంది. తెలుగుకి వచ్చేసరికి ఎందుకో నిర్మాతలు, దర్శకుడు ఎంత ఖర్చు పెడితే ఎంత వస్తుంది, ఎవరిని పెడితే ఎంత బడ్జెట్ లో తీసెయ్యగలం, మలయాళం సినిమాలో చూపించే విధంగా సహజసిద్ధమైన లొకేషన్స్ చూపించినట్టుగా కాకుండా , సెట్ వేసి తెలుగులో కూడా తీస్తే ఎంతవుతుంది, వీటి గురించి ఎక్కువ అలోచించి, కథ మర్చిపోతారు. ఏ పాత్రకి ఎవరు న్యాయం చెయ్యగలరు అనే విషయం కాకుండా, సినిమా ఎంత తక్కువలో చేయొచ్చు, దానిమీద ఎంత లాభం పొందొచ్చు మీదే మైండ్ ఉంటుంది. అందుకే ఒరిజినల్ సినిమాలలో కనీసం పది శాతం కూడా తెలుగు రీమేక్ లు తీయలేకపోతున్నారు, ఈ 'కోటబొమ్మాళి పీఎస్' కూడా అంతే.

కోటబొమ్మాళి అనే వూరు శ్రీకాకుళం జిల్లాలో వుంది. సినిమా మొదలవడంతో శ్రీకాకుళం యాసలో పాత్రలు మాట్లాడుతూ ఒక పావుగంట అయ్యేసరికి అందరూ మామూలు యాసలోకి వచ్చేస్తారు. ముఖ్యంగా శ్రీకాంత్ మొదట్లో మాట్లాడినా కొంతసేపు అయ్యాక అతను మాట్లాడలేక మామూలు భాష మాట్లాడేస్తారు. ఇక్కడే తెలిసిపోతుంది దర్శకుడు, నిర్మాతలు సినిమాని చుట్టేయాలి అనుకున్నారు తప్పితే, నిబద్ధతతో తీయడం లేదు అని. అలాగే భావోద్వేగాలు సినిమాలో ఎక్కడా కనిపించవు. ఒరిజినల్ సినిమాలో ఎంత సహజంగా వుంటాయో, ఈ సినిమాలో సహజత్వానికి అంతా దూరంగా చాలా సన్నివేశాలు కనిపిస్తాయి. నేను శ్రీకాకుళం ప్రాంతానికి చెందినవాడిని, అలాగే ఏజెన్సీ ప్రాంతాలు కొంత అవగాహన ఉన్నవాడిని కావటంతో నాకు రెండో సగంలో ఆ ముగ్గురూ ఎక్కడ తలదాచుకుంటారు, ఆ ప్రాంతం సరిగ్గా తీయ్యలేకపోయారు, చూపించలేకపోయారు అనిపిస్తుంది. అదీకాకుండా ఒరిజినల్ లో ఎలా ఉంటుందో ఈ తెలుగు రీమేక్ లో కూడా అలానే కనిపిస్తూ ఉంటుంది. అంటే మలయాళం ప్రేక్షకులకి, తెలుగు ప్రేక్షకులకి తేడా చూపించలేకపోయారు. కథ అయితే తెలుగుకి బాగా సూట్ అవుతుంది, కానీ దర్శక నిర్మాతలు కేవలం వ్యాపార దృక్పథంతో ఆలోచించటం వలన రీమేక్ కొంచెం పక్కదారి పట్టిందని నాకు అనిపిస్తోంది. దానికి తోడు నేను 'నాయట్టు' చూసాను, నాకు ఎంతో బాగా నచ్చింది, అది కూడా ఒక కారణం అవొచ్చు నాకు ఈ తెలుగు రీమేక్ అంతగా ఆకట్టుకోకపోవడానికి. #KotabommaliPSReview

shivanirajasekharkotabommali.jpg

కొన్ని కొన్ని మాటలు బాగా రాసారు, రాజ్యాంగం, విధేయత, సిస్టమ్ వీటి మీద కానీ అవి సరిగా ప్రేక్షకులకు చేరలేకపోయాయి. ఎందుకంటే ఆ చెప్పే నటులు ఆ మాటలను మామూలుగా చెప్పడం వలన. అదే ఏ రావు రమేష్ లాంటి నటుడు చేసి ఉంటే ఈపాటికి ఆ మాటలు వైరల్ అయివుండేవి. ఒక సినిమాలో టార్చ్ బేరరు, ఇంకో సినిమాలో విమానం ఎగరడం గురించి, ఇంకో సినిమాలో 'కానీ కానీ కానీ', ఇలా ఎన్నో సినిమాలలో అతను చెప్పడం వలెనే ఆ మాటలు ప్రాచుర్యం పొందాయి, కానీ ఈ సినిమాలో కొన్ని మంచి మాటలు రాసినా, అవి ప్రజాదరణ పొందకపోవటానికి ఆ పాత్రలు వేసినవాళ్లు చెప్పే విధానం, అవి మామూలుగా చెప్పేయడం వలన. ఏమైనా ఇది ఒక మంచి కథ, రాజకీయ నాయకుల చదరంగంలో కొందరి నిజాయితీ పరులైన పోలీసు అధికారులు ఎలా బలైపోతున్నారు, వ్యవస్థల్ని రాజకీయ నాయకులూ ఎలా నిర్వీర్యం చేస్తున్నారు అనే విషయం, అందరూ తెలుసుకోవాల్సిన విషయం.

ఇక నటీనటుల విషయానికి వస్తే శ్రీకాంత్ హెడ్ కానిస్టేబుల్ రామకృష్ణగా బాగా చేశారు, కానీ మలయాళం పాత్రతో పోలిస్తే శ్రీకాంత్ కి అంత సానుభూతి రాదు. అయితే అది అతని తప్పు కాదు, దర్శకుడు ఆలా రాసాడు మరి. ఇక శివాని, రాహుల్ విజయ్ తమ పాత్రలకు న్యాయం చేశారు. మురళి శర్మ పాత్రలో వైవిధ్యం లేదు, అసలు అతను తెలుగు రాజకీయ నాయకుడిలా లేడు, ఉత్తర భారతానికి చెందిన వ్యక్తిలా సినిమాలో కనపడతాడు, ఎందుకంటే అతని వేషం, హావభావాలు అలానే ఉంటాయి. పంచకట్టులో తెలుగు రాజకీయనాయకులు ఎంతోమంది వున్నారు, వాళ్ళని చూసి ఎందుకు స్ఫూర్తి పొందరో మరి, ముఖ్యంగా వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఎప్పుడూ పంచె కడతారు, తెలుగుదనం ఉట్టిపడుతుంది అతనిలో, మరి మురళి శర్మకి ఆ లుక్ సరిపోలేదు, అదీ కాకుండా అతని పాత్ర సహజంగా ఉండదు, నటిస్తున్నాడు అని తెలిసిపోతుంది. అతనికి మంచి మాటలు వున్నాయి కానీ, అవి సరిగ్గా ప్రాచుర్యం పొందే విధంగా దర్శకుడు అతనితో చెప్పించలేకపోయాడు. ఇక వరలక్ష్మి శరత్ కుమార్ పాత్ర హైలైట్ అని చెప్పాలి. మలయాళంలో కూడా వుమన్ పోలీసు ఆఫీసర్, తెలుగులో అందుకే వరలక్ష్మి ని పెట్టారు, ఆమె చాలా బాగా చేసింది. బెనర్జీ, పవన్ తేజ్ కొణిదెల ఇంకా చాలామంది ఆర్టిస్టులు తమ పాత్రల పరిధి మేరకి నటించారు. సినిమా ఇటు శ్రీకాకుళంకి చెందినది కాదు, అటు వేరే ప్రాంతానికి చెందినది కూడా కాకుండా పోయింది. 'లింగిడి లింగిడి' పాట బాగా పాపులర్ అయింది, నేపధ్య సంగీతం పరవాలేదు, ఛాయాగ్రహణం కూడా ఒకే.

చివరగా, 'కోటబొమ్మాళి పీఎస్' సినిమాలో ఒక మంచి కథ వుంది, కానీ దాన్ని సరిగా తెలుగు ప్రేక్షకులకి అందించే విధంగా రీమేక్ చెయ్యడంలో దృష్టి పెట్టలేదు అనిపిస్తుంది. మలయాళం 'నాయట్టు' చూసిన వాళ్ళకి ఈ సినిమా అంతగా రుచించకపోవచ్చు, కానీ చూడని వాళ్ళు ఒకసారి ఈ సినిమాని చూడొచ్చు.

Updated Date - 2023-11-24T16:23:01+05:30 IST