Devil Movie Review: డబ్బులు బాగా పెట్టారు కానీ…

ABN , Publish Date - Dec 30 , 2023 | 12:24 AM

నందమూరి కళ్యాణ్ రామ్ కథానాయకుడిగా నటించిన సినిమా 'డెవిల్' శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కళ్యాణ్ రామ్ ఇంతకు ముందు ‘బింబిసార’ అనే పీరియడ్ డ్రామా విజయం సాధించడం, ఈ ‘డెవిల్’కథ నేపధ్యం కూడా అటువంటిదే అవటం ఆసక్తిని పెంచింది.  అంచనాలు కూడా పెరిగాయి. ఇంతకీ ఈ సినిమా ఎలా ఉందో చూద్దాం.

Devil Movie Review: డబ్బులు బాగా పెట్టారు కానీ…
Devil movie review

సినిమా: డెవిల్

నటీనటులు: నందమూరి కళ్యాణ్ రామ్, సంయుక్త, మాళవికా నాయర్, సీత, సత్య, అజయ్, శ్రీకాంత్ అయ్యంగార్ తదితరులు 

కథ, స్క్రీన్ ప్లే, మాటలు: శ్రీకాంత్ విస్సా

ఛాయాగ్రహణం: సౌందర్ రాజన్

సంగీతం: హర్షవర్ధన్ రామేశ్వర్

నిర్మాత, దర్శకత్వం: అభిషేక్ నామా

విడుదల తేదీ: డిసెంబర్ 29, 2023

రేటింగ్: 2.5

– సురేష్ కవిరాయని

నందమూరి కళ్యాణ్ రామ్ కథానాయకుడిగా నటించిన సినిమా 'డెవిల్' శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా విడుదలకు ముందు కొంచెం వివాదాల్లో ఉంది. ఈ సినిమాకి మొదట దర్శకుడిగా నవీన్ మేడారం ఉండగా, మధ్యలో అతనికి నిర్మాత అభిషేక్ నామాకి ఎందుకో తగాదాలు రావటంతో నవీన్ పేరు దర్శకుడిగా తీసేసి, అభిషేక్ నామా తన పేరు వేసుకున్నారు. విడుదలకి ముందు రోజు నవీన్ ఒక పెద్ద లేఖను ఈ సినిమా గురించి సామాజిక మాధ్యమంలో పోస్ట్ పెట్టాడు. ఈ వివాదాలు ఇలా ఉంటే, ఈ సినిమా  ప్రచార చిత్రాలు ప్రేక్షకుల్ని ఆకర్షించాయి. దానికి తోడు కళ్యాణ్ రామ్ ఇంతకు ముందు ‘బింబిసార’ అనే పీరియడ్ డ్రామా విజయం సాధించడం, ఈ ‘డెవిల్’కథ నేపధ్యం కూడా అటువంటిదే అవటం ఆసక్తిని పెంచింది.  అంచనాలు కూడా పెరిగాయి. ఇంతకీ ఈ సినిమా ఎలా ఉందో చూద్దాం. (Devil Movie Review)

devil.jpg

 Devil story కథ:

ఈ కథ భారత దేశానికి స్వాతంత్రం రాకముందు బ్రిటీష్ పాలన వున్నప్పుడు జరిగిన కథ. రాసపాడులో జమీందారు కుమార్తె హత్యకు గురవుతుంది. ఆ కేసు దర్యాప్తు చెయ్యడానికి తమ ఏజెంట్ డెవిల్ (నందమూరి కళ్యాణ్ రామ్)కు అప్పగిస్తుంది బ్రిటీష్ ప్రభుత్వం. జమీందారు మేనకోడలు నైషధ (సంయుక్త)తో డెవిల్ ప్రేమలో పడతాడు. అదంతా దర్యాప్తులో భాగమని చెబుతాడు. 'డెవిల్'ను బ్రిటీష్ ప్రభుత్వం రాసపాడు పంపినది జమీందారు హత్య కేసు దర్యాప్తు కోసం కాదని, ఇండియాకి వస్తున్న ఆజాద్ హింద్ ఫౌజ్ వ్యవస్థాపకుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్‌, ఆయన ప్రధాన అనుచరుడు త్రివర్ణ ను పట్టుకోవడం కోసమని తెలుస్తుంది. రాసపాడు జమీందారు సంస్థానానికి నేతాజీకి ఏంటి సంబంధం? నైషధకు, నేతాజీకి సంబంధం ఏమిటి? త్రివర్ణ ఎవరు, రాజకీయ నాయకురాలు మణిమేఖల (మాళవికా నాయర్) పాత్ర ఏమిటి? బ్రిటిష్ ప్రభుత్వం నేతాజీని పట్టుకోగలిగిందా? ఇవన్నీ తెలుసుకోవాలంటే ‘డెవిల్’ సినిమా చూసి తెలుసుకోవాల్సిందే.

Kalyan-Ram-Devil.jpg

విశ్లేషణ:

ఈ సంవత్సరం గూఢచారి సినిమాలు చాలానే వచ్చాయి. అఖిల్ నటించిన ‘ఏజెంట్’, నిఖిల్ ‘స్పై’, వరుణ్ తేజ్ నటించిన ‘గాండీవదారి అర్జున’ ఇవన్నీ ఇప్పుడున్న కాలానికి అనుగుణంగా తీసిన గూఢచారి సినిమాలు, అవన్నీ ఫెయిల్ అయ్యాయి. ఇప్పుడు కళ్యాణ్ రామ్ నటించిన ‘డెవిల్’ కూడా గూఢచారి సినిమానే, కాకపోతే ఇది బ్రిటిష్ కాలంనాటి కథ. ఇలాంటి కథలు రాసేటప్పుడు జాగ్రతగా రాయాలి, లేకపోతే ఆసక్తికరం ఉండదు. ఎందుకంటే కథానాయకుడు ఎంతసేపూ పోరాట సన్నివేశాలు బాగా చేసాడు, రొమాన్స్ బాగా చేసాడు అని కాకుండా ఇలాంటి సినిమాలకి కథ కూడా అంతే ప్రాముఖ్యం, కథనం కూడా అంతే ముఖ్యమైనదిగా ఉండాలి. 

ఆంధ్రాలో ఉన్న ఒక సంస్థానంలో హత్య జరుగుతుంది, పరిశోధించడానికి ఒక గూఢచారిని పంపిస్తారు. కానీ హత్య జరగడానికి అక్కడ పరిస్థితులు కాకుండా ఆ నేపధ్యం నేతాజీ సుభాష్ చంద్రబోస్ కి సంబంధం ఉంటుంది. అంతవరకు బాగుంది వినడానికి, చెప్పడానికి, కానీ తెరమీదకు వచ్చేసరికి మాత్రం దర్శకుడు అభిషేక్ నామా కొంచెం తడబడ్డారు. కథ చెప్పేటప్పుడు చాలా కొత్త పాత్రలు వస్తూ ఉండటం కథనం మామూలుగా ఉండటం విశ్రాంతికి ముందు మాత్రమే కొంచెం ఆసక్తికరంగా ఉండటం ఈ సినిమాకి మైనస్ అనే చెప్పాలి. ట్రోజన్, మాళవిక పాత్రలు కొంచెం ఆసక్తికరంగా మలిస్తే బాగుండేది. కథ మీద ఇంకా కొంచెం దృష్టి పెట్టి ఉంటే ఈ సినిమా చాలా మంచి సినిమా అయ్యేది.

దేశభక్తి, కళ్యాణ్ రామ్ నటన, అతని హావభావాలు, కొన్ని పోరాట సన్నివేశాలు, నేపధ్య సంగీతం ఈ సినిమాకి హైలైట్స్ అని చెప్పొచ్చు. చివరి పోరాట సన్నివేశం మరీ తొందరగా తీసేసినట్టుగా అనిపిస్తుంది, కంప్యూటర్ గ్రాఫిక్స్ కూడా సరిగ్గా లేవు దానికి. మరి ముందుగా అనుకున్న దర్శకుడు నవీన్ మేడారం, తరువాత వచ్చిన అభిషేక్ నామా ఇద్దరూ తగాదాల వలన ఆ ప్రభావం సినిమా మీద పడింది అనిపిస్తోంది. నేతాజీకి ఈ కథకి లింక్ పెట్టె విధానం బాగుంది. ఒక్కో సన్నివేశానికి డబ్బులు బాగా ఖర్చు పెట్టినట్టు కనపడుతోంది, కానీ మొత్తం కథ మీద ఇంకా దృష్టి పెట్టి ఉంటే సినిమా ఇంకా బాగుండేది.

devil3.jpg

ఇక నటీనటుల విషయానికి వస్తే సినిమా మొత్తం కళ్యాణ్ రామ్ తన భుజాలపై మోసాడు అనిపిస్తుంది. అంత బాగా ఇమిడిపోయాడు ఒక గూఢచారిగా. అలాగే అతని హావభావాలు ముఖ్యంగా మాటలు చెప్పే విధానం అబ్బురపరిచింది. ఏదైనా బాగుంది ఈ సినిమాలో అంటే అది ఒక్క కళ్యాణ్ రామ్ మాత్రమే. ఇక సంయుక్త తన పాత్ర పరిధి మేరకు చేసింది. మాళవిక నాయర్ పాత్ర బాగుంది, ఆమె బాగా అభినయించింది. సీత, షఫీ, ఎస్తర్, హరితేజ, మహేష్ అందరూ తమ పాత్రల పరిధి మేరకు చేశారు. కమెడియన్ సత్యకి మంచి పాత్ర లభించింది, అతను బాగా చేసాడు. ఛాయాగ్రహణం బాగుంది, నేపధ్య సంగీతం సినిమాకి హైలైట్.

చివరగా, ‘డెవిల్’ సినిమా 1945లో జరిగిన ఒక గూఢచారి నేపధ్యం ఉన్న కథ. దేశభక్తి,, నేతాజీ, ఒక హత్యతో ముడిపడి ఉన్న ఈ సినిమా మంచి ఆసక్తికరంగా మలచవచ్చు, కానీ కథనం దెబ్బతింది. కళ్యాణ్ రామ్, నేపధ్య సంగీతం కొన్ని పోరాట సన్నివేశాలు బాగుంటాయి. ఇదొక టైమ్ పాస్ మూవీ. అంతే.

Updated Date - Dec 30 , 2023 | 09:28 AM