Hidimbha film review: కేరళలో అమ్మాయిల మిస్సింగ్ కేసుకి, హైద్రాబాదులో అమ్మాయిల మిస్సింగ్ కేసుకి లింక్ ఏంటి?

ABN , First Publish Date - 2023-07-20T14:44:26+05:30 IST

ఎప్పుడో ఆదిమ జాతిలో వున్న నరమాంస భక్షకులు ఇంకా బతికే ఉన్నారా? బతికుంటే వాళ్ళు ఇప్పుడు ఎలా జీవిస్తూ వుంటారు, కేరళలో, హైద్రాబాదులో అమ్మాయిల మిస్సింగ్ కేసుల వెనక రహస్యం ఏంటి? పరిశోధన ఎటువైపు సాగింది ఎలా ఛేదించారు ఈ కేసును? ఇవన్నీ తెలుసుకోవాలంటే 'హిడింబ' చూడాల్సిందే.

Hidimbha film review: కేరళలో అమ్మాయిల మిస్సింగ్ కేసుకి, హైద్రాబాదులో అమ్మాయిల మిస్సింగ్ కేసుకి లింక్ ఏంటి?
Hidimbha Film Review

సినిమా: హిడింబ

నటీనటులు: అశ్విన్ బాబు, నందిత శ్వేత, సంజయ్ స్వరూప్, రఘు కుంచె, మకరంద్ పాండే, శుభలేఖ సుధాకర్, రాజీవ్ కనకాల, రాజీవ్ పిళ్ళై తదితరులు

ఛాయాగ్రహణం: బి రాజశేఖర్

సంగీతం: వికాస్ బాడిస

దర్శకత్వం: అనీల్ కన్నెగంటి

నిర్మాత: గంగపట్నం శ్రీధర్

-- సురేష్ కవిరాయని

బుల్లితెర మీద యాంకర్ గా బాగా పరిచయం వున్న ఓంకార్ #Omkar, తరువాత సినిమా దర్శకుడయ్యి తన తమ్ముడు అశ్విన్ బాబు (AshwinBabu) తో 'రాజు గారి గది' #RajuGaariGadhi మూవీ సిరీస్ తీసి సక్సెస్ అయ్యాడు. ఆ అశ్విన్ బాబు ఇప్పుడు 'హిడింబ' #HidimbhaFilmReview లో లీడ్ యాక్టర్ గా వేయగా, అతని పక్కన నందిత శ్వేతా (NanditaSweta) కథానాయకురాలిగా నటించింది. అనీల్ కన్నెగంటి (AneelKanneganti) దీనికి దర్శకుడు, గంగపట్నం శ్రీధర్ (GangapatnamSreedhar) నిర్మాత. అనిల్ సుంకర (AnilSunkara) ఈ సినిమాకి ప్రేజంటర్ గా వ్యవహరించారు. 'హిడింబ' #HidimbhaFilmReview ప్రచార చిత్రాలు బాగా ఆసక్తికలిగించేలా ఉండటంతో ఈ సినిమాలో విషయం ఉండొచ్చు అని అనుకున్నారు. ఇంతకీ ఈ సినిమా ఎలా వుంది, ఈ కథ ఏంటో తెలుసుకుందాం.

hidimba1.jpg

Hidimbha Story కథ:

హైదరాబాద్ సిటీలో వరుసగా 16మంది అమ్మాయిలు అదృశ్యం అయిపోతూ వుంటారు. ఎవరు చేస్తున్నారు, ఎందుకు చేస్తున్నారు అని తెలుసుకోవటం కోసం పోలీస్ డిపార్ట్ మెంట్ కేరళ నుండి ఆద్య (నందిత శ్వేతా) అనే మహిళా పోలీస్ ని హైదరాబాద్ రప్పిస్తుంది. ఆమెకి ఇక్కడ అభయ్ (అశ్విన్ బాబు) అనే పోలీస్ ఆఫీసర్ ని సహాయం చెయ్యమని అధికారులు చెప్తారు. అభయ్, ఆద్య ఇద్దరూ పోలీస్ ట్రైనింగ్ అయినప్పటి నుండే స్నేహితులు కావటం వలన, ఇద్దరూ కలిసి ఈ అమ్మాయిల మిస్సింగ్ కేసు ను తీసుకుంటారు. వీళ్ళు చేసే పరిశోధన కాలాబండా లోని బోయా (రాజీవ్ పిళ్ళై) మీదకి వెళుతుంది. అక్కడికి పోలీసులు కాదు కదా, ఎవరూ వెళ్ళలేరు అని తెలిసి, అభయ్ ధైర్యం చేసి వెళతాడు. బోయాని అరెస్టు చేసి, ఆ అమ్మాయిల మిస్సింగ్ కి అతనే కారణం అని చూపిస్తారు. అయితే మిస్సింగ్ ఆయిన అమ్మాయిలు, బోయా చెరలో వున్న అమ్మాయిలు వేరు అని తెలుస్తుంది. ఇంతలో అనూహ్యంగా ఇంకొక అమ్మాయి మిస్ అవటం, ఆ అమ్మాయి డిపార్ట్ మెంట్ మనిషి అవటంతో మళ్ళీ కేసు మొదటికి వస్తుంది. ఇంతకీ ఎవరు ఈ అమ్మాయిలని కిడ్నాప్ చేస్తున్నారు? ఎందుకు చేస్తున్నారు? అప్పుడెప్పుడో జరిగిన కేరళలో అమ్మాయిల మిస్సింగ్ కి, హైదరాబాద్ లో ప్రస్తుతం జరుగుతున్న మిస్సింగ్ కేసులకు ఏమిటి సంబంధం? అంతరించిపోయారు అని అనుకుంటున్న హిడింబ జాతిలో ఇంకా ఎవరైనా బతికే ఉన్నారా? ఇవన్నిటికీ సమాధానాలు తెలియాలంటే 'హిడింబ' చూడాల్సిందే. #HidimbhaFilmReview

hidimbhafilmreview.jpg

విశ్లేషణ:

ఈమధ్య విడుదలైన కొన్ని చిన్న, మీడియం బడ్జెట్ సినిమాలు 'బలగం', 'విరూపాక్ష' #Virupaksha, 'రైటర్ పద్మభూషణ్', 'మేం ఫేమస్' #MemFamous, 'సామజవరగమన' అలాగే గత వారం విడుదలైన 'బేబీ' ఇవన్నీ వివిధ రకాల జానర్స్ మీద వచ్చిన సినిమాలు, ప్రేక్షకులు నచ్చిన సినిమాలు. ఇందులో 'బలగం' #Balagam లాంటి సినిమాని అందరూ ప్రశంసించారు ఎందుకంటే అందులో మానవతా విలువలు, కుటుంబ బంధాలు, పల్లె జీవన విధానం ఇలా చాలా వున్నాయి. #HidimbhaFilmReview మిగతా వాటిల్లో కామెడీ, చేతబడి నేపథ్యంలో వున్నవి, ప్రేమ కథ చిత్రాలు కూడా వున్నాయి. ఎన్ని వున్నా సినిమాలు అన్నీ వ్యాపారాత్మకమే. దర్శకుడు తాను చెప్పబోయే కథతో ప్రేక్షకులని ఆసక్తిగా రెండున్నర గంటలసేపు ఉంచ గలిగితే ఆ సినిమా విజయం సాధించవచ్చు అనే చెప్పాలి.

ఇప్పుడు దర్శకుడు అనిల్ కన్నెగంటి 'హిడింబ' అనే సినిమాతో నరమాంస భక్షకుల్ని తన కథలోకి తీసుకువచ్చాడు. ఆడపిల్లలు మాయం కావటం, దానికోసం పోలీసులు రంగం లోకి దిగటం ఇవన్నీ త్వరత్వరగానే చూపించేసాడు. ఎక్కడా సన్నివేశాలని లాగలేదు. అలాగే కేరళ నుండి వచ్చిన ఆద్య, హైద్రాబాదు లోని అభయ్ ఇద్దరి మధ్య వున్న ఫ్లాష్ బ్యాక్ కొంచెం అవరోధం లా వున్నా, అది కూడా తొందరగానే ముగించటం బాగుంది. అయితే దర్శకుడు అప్పుడు, ఇప్పుడు (past and present) కథలను చెప్పుకుంటూ వెళతాడు. అయితే ఇది కొంతమంది ప్రేక్షకులకు అర్థం కాకపోవచ్చు కానీ, విరామం సమయంలో అది కూడా చెప్పేస్తాడు. #HidimbhaFilmReview ఆలా చెప్పినప్పుడే కథ రెవీల్ అవుతుంది కేరళలో మాయం అయిన అమ్మాయిల కేసుకి, హైద్రాబాదులో మాయం అయిన కేసులకు సంబంధం ఉందని. ఇక కాలాబండా పోరాట సన్నివేశాలు అవీ బాగా చిత్రీకరించటం, అక్కడ మాయం అయిన అమ్మాయిలను తీసుకురావటం బాగుంది.

ఈ రెండో సగం ఇంకా ఆసక్తికరంగా సాగుతుంది. ఆద్య చిన్నప్పటి ఫ్లాష్ బ్యాక్ కూడా బాగుంది, ఎక్కడా సాగతీయకుండా బాగానే చూపించాడు. అలాగే అప్పుడెప్పుడో అంతం అయిపోయిన ఆదిమజాతిలో కొందరు నరమాంస భక్షకులు ఒకరిద్దరు బతికి బయట పడటం, ఆ తరంలో వాళ్లలో ఒకడు ఆలా ఇప్పుడు ఒక పెద్ద నగరంలో ఉండటం, వాళ్ళ కథ కూడా చాలా ఆసక్తికరంగా నమ్మే విధంగా చూపించాడు దర్శకుడు. #HidimbhaFilmReview అయితే మొదట్లో ఒక హాస్పిటల్, దాని మేనేజ్మెంట్, ఒక టాప్ పోలీస్ ఆఫీసర్ కుమ్మక్కవటం కూడా చూపించిన దర్శకుడు, ఆ విషయాన్ని మధ్యలో వదిలేయటంలో లాజిక్ కనిపించలేదు. అయితే రెండో సగం లో ట్విస్ట్ మాత్రం ఊహించనిది. అయితే కొన్ని సన్నివేశాలు మరీ భయానకంగా చూపించారు, వొళ్ళు గగుర్పాటు ఉంటుంది, అలాంటివి చూడలేము, అందుకని ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులకి మాత్రం సూట్ కాదు. ముఖ్యంగా పిల్లలని మాత్రం తీసుకెళ్లకూడదు.

hidimbhafilmreview1.jpg

ముందు చెప్పినట్టుగా ఒక్కో దర్శకుడు ఒక్కో రకంగా తన కథని చూపించడానికి ప్రయత్నం చేస్తాడు. ఇప్పుడు అనిల్ కన్నెగంటి ఒక కొత్త కథని చెప్పడానికి, కొత్తగా ప్రయత్నం చేసాడు, అలాగే చూపించాడు కూడా. అయితే ఇది మంచి సినిమానా కాదా అవునా చెప్పలేం. కథ ఆసక్తికరంగా చెప్పాడా లేదా అనేది ముఖ్యం. #HidimbhaFilmReview అలాగే ఈ సినిమా సాంకేతికంగా కూడా చాలా బాగుంటుంది. ఎందుకంటే ఒక్కో సన్నివేశం చూస్తుంటే ఆలా అనిపిస్తుంది. సినిమాలో అక్కడక్కడా లోపాలున్నా, కొత్త కథని కొత్తగా చూపించడానికి ప్రయత్నం చేసాడు కాబట్టి, యాక్షన్, థ్రిల్లర్, హారర్ కథలు నచ్చే ప్రేక్షకులకి ఇది నచ్చుతుంది.

ఇక నటీనటుల విషయానికి వస్తే, అశ్విన్ బాబు ఇందులో తన పాత్ర కోసం బాగా కష్టపడ్డాడు అని చెప్పాలి. ఎందుకంటే బాగా బరువు పెరిగాడు, అలాగే పోరాట సన్నివేశాల్లో, క్లైమాక్స్ లో తన ప్రతిభని బాగా చూపించాడు. ఇతని కెరీర్ కి ఈ సినిమా ఇంకో మెట్టు పైకి తీసుకువెళుతుంది అనటంలో సందేహం లేదు. అలాగే నందిత శ్వేతా కి ఈ సినిమా బెస్ట్ అని చెప్పొచ్చు. #HidimbhaFilmReview ఆమె పోలీస్ ఆఫీసర్ పాత్రలో ఇమిడిపోయింది. చాలా హోమ్ వర్క్ చేసిందని అర్థం అవుతోంది, తన ప్రతిభని చూపించడానికి తగినంత ప్రాముఖ్యం వున్న పాత్ర ఇది. బాగా చేసింది. ఇక రాజీవ్ కనకాల, సంజయ్ స్వరూప్, శుభలేఖ సుధాకర్, రాజీవ్ పిళ్ళై, రఘు కుంచె, శ్రీనివాస్ రెడ్డి అలాగే మిగతా నటులు అందరూ తమ పాత్రల పరిధి మేరకు బాగా నటించారు. నేపధ్య సంగీతం ఈ సినిమాకి చాలా ముఖ్యం అది వికాస్ అద్భుతంగా ఇచ్చాడు. అలాగే సౌండ్ డిజైన్ కూడా. ఇక రాజశేఖర్ ఛాయాగ్రహణం కూడా సినిమాకి హైలైట్ అని చెప్పొచ్చు. సంగీతం, ఛాయాగ్రహణం ఈ రెండూ సినిమాని బాగా ఎలివేట్ చేశాయి.

చివరగా, 'హిడింబ' సినిమా అక్కడక్కడా లాజిక్ లు కొన్ని మిస్సైయినా, దర్శకుడు అనిల్ కన్నెగంటి ఒక కొత్త కథని, కొత్తగా చెప్పడంలో సఫలీకృతం అయ్యాడు. ప్రతి సన్నివేశం కొత్తగా ఉంటుంది, చూస్తున్న ప్రేక్షకుడికి ఆసక్తికరంగా ఉంటుంది. అన్ని మసాలాలు వున్న పూర్తి వ్యాపారాత్మక సినిమా ఇది. అయితే ఈ సినిమా అందరూ చూడతగ్గది కాదు, ముఖ్యంగా పిల్లలు. థ్రిల్లర్, యాక్షన్, హర్రర్ ప్రేక్షకులకి ఇది నచ్చుతుంది.

Updated Date - 2023-07-20T14:44:26+05:30 IST