Dunki Movie Review: అక్రమ వలసల నేపథ్యంలో తీసిన ఈ సినిమా ఎలా ఉందంటే...

ABN , Publish Date - Dec 21 , 2023 | 01:23 PM

ఈ సంవత్సరంలో షారుఖ్ ఖాన్ మూడో సినిమా 'డంకి' ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. గతంలో ఐదు మంచి సినిమాలని అందించిన రాజ్ కుమార్ హిరాణి ఈ 'డంకి' సినిమాకి దర్శకుడు. అక్రమ వలసల నేపథ్యంలో సాగే ఈ సినిమా ఎలా వుందో చదవండి.

Dunki Movie Review: అక్రమ వలసల నేపథ్యంలో తీసిన ఈ సినిమా ఎలా ఉందంటే...
Dunki movie review

సినిమా: డంకీ

నటీనటులు: షారుఖ్ ఖాన్, బొమ్మన్ ఇరాని, తాప్సీ పన్ను, విక్కీ కౌశల్, విక్రమ్ కొచ్చర్, అనిల్ గ్రోవర్ తదితరులు

కథ, మాటలు: అభిజిత్ జోషి, రాజ్ కుమార్ హిరాణీ, కణికా థిల్లాన్

ఛాయాగ్రహణం: సీకే మురళీధరన్, మనుష్ నందన్, అమిత్ రాయ్, కుమార్ పంకజ్

నేపధ్య సంగీతం: అమన్ పంత్

సంగీతం: ప్రీతమ్ చక్రబొర్తి

నిర్మాతలు: గౌరీ ఖాన్, రాజ్ కుమార్ హిరాణీ (Gauri Khan)

దర్శకత్వం: రాజ్ కుమార్ హిరాణీ (Rajkumar Hirani)

విడుదల: డిసెంబర్ 18, 2023

రేటింగ్: 3 (మూడు)

-- సురేష్ కవిరాయని

గత కొన్ని సంవత్సరాలుగా బాలీవుడ్ లో పెద్ద హిట్ సినిమా రాలేదు, కానీ ఈ సంవత్సరం షారుఖ్ ఖాన్ తన 'పఠాన్' తో మళ్ళీ బాలీవుడ్ లో ఊపిరి పోశారు. తరువాత అతను ఇంకో పెద్ద హిట్ 'జవాన్' రూపంలో ఇచ్చారు. ఇలా ఒకే సవంత్సరం రెండు వరస హిట్స్ ఇచ్చిన షారుఖ్ ఖాన్ ఇప్పుడు మూడో సినిమా 'డంకీ'తో మళ్ళీ ప్రేక్షకుల ముందుకు వచ్చారు. దీనికి రాజ్ కుమార్ హిరాణి దర్శకుడు, అతను ఇంతకు ముందు 'మున్నాభాయ్', 'లగే రహే మున్నాభాయ్', '3 ఇడియట్స్', 'పీకే', 'సంజు' లాంటి చాలా గొప్ప గొప్ప సినిమాలు చేశారు. ఇప్పుడు ఈ 'డంకీ' సినిమా కి దర్శకత్వం చేశారు, ఇది షారుఖ్ ఖాన్ కి ఈ సంవత్సరం హ్యాట్రిక్ హిట్ సినిమా అవుతుందా? ఈ సినిమా ఎలా వుందో చూద్దాం. (Dunki movie review)

SRK---Dunki.jpg

Dunki story కథ:

పంజాబ్ లోని ఒక ఊరులో నలుగురు స్నేహితులు ఇంగ్లాండ్ వెళ్లాలని కలలు కంటారు. మను (తాప్సి), సుఖీ సింగ్ (విక్కీ కౌశల్), బగ్గు (విక్రమ్ కొచ్చర్), బల్లి (అనిల్ గ్రోవర్) నలుగురూ ఇంగ్లాండ్ వెళ్లాలని అనుకుంటారు, కానీ వాళ్ళ దగ్గర వీసాలు లేవు, టికెట్స్ కొనడానికి డబ్బులు కూడా లేవు ఇంగ్లీష్ రాదు. ఆ సమయంలో హార్డీ సింగ్ (షారుఖ్ ఖాన్) అనే ఒక సైనికుడు తన ప్రాణాలు కాపాడిన వ్యక్తిని వెతుకుతూ ఆ గ్రామం వస్తాడు, ఆ వ్యక్తి మనుకి అన్న అని తెలుసుకొని, ఇక ఈ నలుగురినీ ఇంగ్లాండ్ పంపించే బాధ్యత తన మీద వేసుకుంటాడు. అదే ఊరులో ఇంగ్లీష్ నేర్పే వ్యక్తి (బొమ్మన్ ఇరానీ) దగ్గర అందరూ క్లాసుకు వెళతారు. కానీ వీళ్ళకి సరిగా ఇంగ్లీష్ రాకపోవటంతో ఇంగ్లాండ్ కి వెళ్ళడానికి వీసాలు రావు. అప్పుడు హార్డీ సింగ్ ఏమి చేసాడు, ఎలా వీళ్ళని ఇంగ్లాండ్ తీసుకెళ్లాడు, అక్కడ వీళ్ళకి ఎటువంటి సంఘటనలు ఎదురయ్యాయి, చివరికి అందరూ మళ్ళీ ఎటువంటి నిర్ణయం తీసుకున్నారు? ఇవన్నీ తెలియాలంటే 'డంకి' సినిమా చూడాల్సిందే! (Dunki movie review)

విశ్లేషణ:

దర్శకుడు రాజ్ కుమార్ హిరాణి ఒక తెలివిగల దర్శకుడు, ఇంతకు ముందు తాను తీసిన సినిమాలతో ప్రేక్షకుల మనసులను గెలిచిన దర్శకుడు. 'మున్నాభాయ్ ఎంబిబిఎస్', 'లగే రహే మున్నాభాయ్', 'త్రి ఇడియట్స్', 'పీకే', 'సంజు' ఈ సినిమాలనే ఒక వైవిధ్యంతో కూడిన మంచి సినిమాలు. వీటన్నిటిలో రాజ్ కుమార్ హిరాణి ఎంతో భావోద్వేగాలను చూపించగలిగాడు, అలాగే దేశభక్తి గురించి కూడా అంతర్లీనంగా చెపుతూ, తనదైన శైలిలో వినోదాత్మకంతో కూడిన భావోద్వేగాలు బాగా చూపిస్తారు. అందుకే అతను తన ప్రత్యేకతను సంతరించుకున్నారు, అతని సినిమా వస్తోంది అంటే ప్రేక్షకుల్లో చాలా ఆసక్తి ఉంటుంది. బాలీవుడ్ లో దర్శకుడిగా అతను చేసినవి ఈ 'డంకి'తో కేవలం ఆరు సినిమాలే అయినా వాటి తాలూకా ప్రభావం చాలా పెద్దగా ఉంటుంది. అంతలా తన సినిమాలతో ఒక విధమైన ముద్ర వేసుకున్నారు రాజ్ కుమార్.

ఇప్పుడు ఈ 'డంకి' లో 95 దశకంలో పంజాబ్ కి చెందిన ఒక వూరు నుండి నలుగురు కుర్రాళ్ళు డబ్బు సంపాదించి, తమ జీవితాలు బాగుపడాలని అందుకోసం లండన్ వెళ్లాలని కలలు కంటారు. కానీ దానికి వీసా కావాలి, ఇంగ్లీష్ తెలియాలి, కొన్ని పరీక్షలు రాయాలి ఇలా చాలా దాటుకుంటూ వెళ్ళాలి. కానీ ఇంగ్లీష్ రాని, డబ్బులు లేని ఈ నలుగురు దొంగదారిని లండన్ వెళ్ళడానికి నిశ్చయం చేసుకుంటారు. దానికి ఒక మాజీ సైనికుడు హర్దీ సింగ్ సహాయం చేస్తాడు. అయితే ఇక్కడ ఆ నలుగురూ వీసా కోసం పడే బాధలు, కష్టాలు అన్నీ వినోదాత్మకంగా చూపించారు దర్శకుడు రాజ్ కుమార్. ఇందులో ఎన్నో భావోద్వేగాలు కూడా ఉంటాయి. 30 ఏళ్ల కిందట విదేశాలకి వెళ్ళడానికి ఎన్నో కష్టాలు పడేవారు, అక్కడ వాళ్ళ బతుకులు మొదట్లో చాలా దుర్భరంగా ఉండేవి, అవన్నీ కూడా బాగా చూపించగలిగాడు దర్శకుడు. ఇక తీరా వెళ్ళాక అక్కడ ఏమైనా వాళ్ళ బతుకులు, జీవితం బాగుపడిందా అంటే అదీ లేదు, అదీ కాకుండా, సొంత దేశం, సొంత వూరు, సొంత గడ్డ వదులుకొని ఎంత దూరం పోయినా వాళ్ళ మనసులు ఎప్పుడూ ఇక్కడే ఉంటాయి. మాతృ దేశం, దేశభక్తి ఇవన్నీ అంతర్లీనంగా తనదైన శైలిలో చూపించిన రాజ్ కుమార్ ఈ 'డంకి' సినిమా ద్వారా ఇప్పుడు విదేశాలకి ఇబ్బడిముబ్బడిగా ఎగబడుతున్న యువతకి ఒక సందేశంలా ఈ సినిమా ఉపయోగపడుతుంది.

Dunki.jpg

అయితే దొంగ దారిన లండన్ కి తీసుకెళ్లే విధానం బాగా చూపించారు, కానీ 25 ఏళ్ల తరువాత మళ్ళీ భారతదేశం రావాలంటే అదే దారి ఎంచుకోవటం, ఆలా రావటంలో చూపించిన కొన్ని సన్నివేశాలు కొంచెం సాగదీసినట్టుగా, సినిమాటిక్ గా అనిపిస్తాయి. మొదటి సగం అంతా కూడా ఎంతో వినోదాత్మకంగా, భావోద్వేగాలతో సన్నివేశాలు ఉంటాయి. రెండో సగంలోనే కొంచెం సాగదీత ఉంటుంది, కానీ అక్కడక్కడా మళ్ళీ భావోద్వేగ సన్నివేశాలతో, దేశభక్తిని మిళితం చేస్తూ చూపించారు. దర్శకుడు రాజ్ కుమార్ తాను అనుకున్న సందేశాన్ని ఈ సినిమాతో చూపించారు అనే అనుకోవాలి. ఇంగ్లాండ్, అమెరికా లాంటి దేశాలు వెళ్లాలంటే, ఇంగ్లీష్ నేర్చుకోవాలి, ఇంకా చాలా టెస్టులు రాయాలి, కానీ భారతదేశం వచ్చేవాళ్లు హిందీ నేర్చుకొనవసరం లేదా? కానీ అలా జరగటం లేదు కదా. పరాయి దేశం నుండి వచ్చినవాళ్లు భారతదేశంలో జీవనం సాగించగలిగినప్పుడు భారతదేశ పౌరులు వేరే దేశం వెళ్లాలంటే ఇన్ని పరీక్షలు ఎందుకు?

140 సంవత్సరాల క్రితం వేరే దేశం వెళ్లాలంటే ఎటువంటి పరీక్షలు, ఆటంకాలు ఉండేవి కావు, కానీ ఇప్పుడు ఎన్నో అడ్డంకులు, ఎన్నో పరీక్షలు, ఇంక మరెన్నో ప్రతిబంధకాలు. ఇన్ని దాటుకుంటూ వెళ్ళాలి, కానీ ఇవన్నీ అవసరమా? మాతృదేశంలో చదువుకొని, ఇక్కడే ఉద్యోగం చేసుకుంటూ, తన మనుషుల మధ్యలో తిరుగుతూ జీవితం ఆనందమయం చేసుకోవడంలో వున్న తృప్తి, పరాయి దేశం, దేనికోసమో వెళ్లి, ఒంటరిగా అక్కడ వుండి కేవలం డబ్బు సంపాదనే మీదే ఆలోచలనలో జీవితం అంతా దానికోసమే అన్నట్టుగా ఉండటంలో ఆనందం ఉందా? ప్రేక్షకులకి ఇలాంటివి ప్రశ్నలు ఈ సినిమా ద్వారా చాలానే చెప్పారు దర్శకుడు రాజ్ కుమార్.

ఇక నటీనటుల విషయానికి వస్తే, షా రుఖ్ ఖాన్ రెండు విభిన్న పాత్రలో కనపడతారు. ఒకటి యువకుడి పాత్ర, రెండోది వయసు మళ్ళిన పాత్ర. రెండు పాత్రలను తన నటనతో ప్రేక్షకులని కట్టి పడేశారని చెప్పాలి. భావోద్వేగాలను బాగా పలికించి చూపించారు. 'పఠాన్', 'జవాన్' లాంటి యాక్షన్ సినిమాల తరువాత ఇటువంటి భావోద్వేగ, వినోదభరితమైన సినిమా చెయ్యడం షారుఖ్ నిజంగా అభినందనీయుడు. ఇక తాప్సి కి ఇది ఒక మంచి సినిమా అవుతుంది అనటంలో సందేహం లేదు. ఆమె మంచి నటి, మరోసారి ఈ సినిమా ద్వారా నిరూపించుకుంది. విక్కీ కౌశల్ ఒక మంచి పాత్రలో కనపడతాడు, ప్రేక్షకులకి గుర్తిండిపోయే పాత్ర చేశాడు. బొమ్మన్ ఇరానీ తనదైన శైలిలో ఇందులో నటించారు. అలాగే మిగతా పాత్రల్లో అందరూ చక్కగా చేశారు. పాటలు, సంగీతం పరవాలేదు, బాగున్నాయి.

dunki.jpg

చివరగా, 'డంకి' సినిమా దేశభక్తిని చాటిచెపుతోంది, అలాగే మాతృదేశంలో తనవారందిరితో జీవిచటంలో వున్న సంతోషం, విదేశాలకు కేవలం డబ్బుకోసం వెళ్లడంలో వున్న ఆనందంతో పోలిస్తే అక్కడ ఏమీ ఉండదు అని పరోక్షంగా ఈ సినిమాతో చెప్పారు దర్శకుడు రాజ్ కుమార్. అతని ఇంతకు ముందు సినిమాలు ఎలా వుంటాయో, ఇది కూడా ఒక మంచి సందేశంతో కూడిన సినిమా. ఆ సందేశాన్ని వినోదాత్మకంగా, భావోద్వేగంగా చూపించగలిగాడు. అక్కడక్కడా, ముఖ్యంగా రెండో సగంలో చాలా సన్నివేశాలు బాగా స్లోగా వున్నాయి అనిపిస్తుంది. కానీ చూడాల్సిన సినిమా. ఈ సినిమా షారుఖ్ ఖాన్ కి ఇంకో హిట్ ఇస్తుందా, లేదా ఫట్ అవుతుందో ఇంకా కొన్ని రోజులు చూస్తే కానీ తెలియదు.

Updated Date - Dec 21 , 2023 | 03:18 PM