King of Kotha Review: ‘కింగ్ ఆఫ్ రోత’!

ABN , First Publish Date - 2023-08-24T21:14:39+05:30 IST

మలయాళం స్టార్ దుల్కర్ సల్మాన్ తెలుగు వాళ్ళకి ‘మహానటి, సీతారామం’ అనే తెలుగు సినిమాలతో బాగా పరిచయమున్న నటుడు. అదీ కాకుండా అతని సినిమాలు కొన్ని తెలుగులో డబ్బింగ్ అయి విడుదలయ్యాయి కూడా. ఇప్పుడలాంటి చిత్రంతోనే ప్రేక్షకుల ముందు వచ్చాడు దుల్కర్. ఆయన నటించిన ఈ ‘కింగ్ ఆఫ్ కోత’లో ప్రేక్షకులను ఆకర్షించే కంటెంట్ అయితే లేదనే చెప్పుకోవాలి.

King of Kotha Review: ‘కింగ్ ఆఫ్ రోత’!
King of Kotha Movie Poster

సినిమా: ‘కింగ్ ఆఫ్ కొత్త’

నటీనటులు: దుల్కర్ సల్మాన్, ఐశ్వర్య లక్ష్మి, అనిఖా సురేంద్రన్, షబ్బీర్ కళ్లారక్కల్, నైలా ఉష, చెంబన్ వినోద్, గోకుల్ సురేష్, షమ్మి తిలకన్, శాంతి కృష్ణ తదితరులు

ఛాయాగ్రహణం: నిమిష్ రవి

నేపథ్య సంగీతం: జేక్స్ బిజోయ్

పాటలు: జేక్స్ బిజోయ్, షాన్ రెహమాన్

నిర్మాతలు: జీ స్టూడియోస్, వేఫేరర్ ఫిల్మ్స్

స్క్రీన్‌ప్లే, మాటలు, దర్శకత్వం: అభిలాష్ జోషీ

-- సురేష్ కవిరాయని

మలయాళం స్టార్ దుల్కర్ సల్మాన్ (Dulquer Salmaan) తెలుగు వాళ్ళకి ‘మహానటి, సీతారామం’ అనే తెలుగు సినిమాలతో బాగా పరిచయమున్న నటుడు. అదీ కాకుండా అతని సినిమాలు కొన్ని తెలుగులో డబ్బింగ్ అయి విడుదలయ్యాయి కూడా. తెలుగులో కాస్త పేరు తెచ్చుకున్నాక, దుల్కర్ తన మలయాళం సినిమాలని అన్ని భాషల్లోకి డబ్బింగ్ చేసి విడుదల చేస్తున్నాడు, అలాగే ఇప్పుడు తాజా సినిమా ‘కింగ్ ఆఫ్ కొత్త’ సినిమా కూడా తెలుగులో విడుదల చేశాడు. అయితే ఈ సినిమా టైటిల్ ఎలా పలకాలని అనే విషయంలో కూడా గందరగోళం వుంది. కొందరేమో ‘కింగ్ ఆఫ్ కోత’ అని కొందరు, ‘కింగ్ ఆఫ్ కొత్త’ అని మరికొందరు అంటున్నారు. చిత్రనిర్వాహకులు ‘కింగ్ ఆఫ్ కొత్త’ అని ఇచ్చారు తెలుగు టైటిల్, సినిమాలో మాత్రం కోత అంటూ వుంటారు. సరే అది పక్కన పెడితే ఈ సినిమాకి నిర్మాతగా కూడా దుల్కర్ సల్మాన్ వ్యవహరించాడు. ఇందులో ఐశ్వర్య లక్ష్మి (Aishwarya Lekshmi), అనిఖా సురేంద్రన్, షబ్బీర్ కళ్లారక్కల్ ముఖ్య పాత్రల్లో కనపడతారు. ఈ సినిమా ఎలా ఉందంటే.. (King of Kotha Review)

కథ (King of Kotha Story):

ఈ సినిమా నేపధ్యం 1980, 90లో జరిగిన కథ. కొత్త అనే సిటీకి ఒక కొత్త పోలీస్ ఆఫీసర్ సీఐ (ప్రసన్న) వస్తాడు. ఆ వూర్లో వున్న కన్నా (షబ్బీర్ కళ్లారక్కల్) అనే రౌడీని కటకటాల వెనక్కి పంపిస్తా అని అంటాడు, కానీ ఆ పని చెయ్యలేకపోతాడు. ఎందుకంటే కన్నా, ఆ సీఐని బెదిరించటమే అందుకు కారణం. అతని కింద పని చేసిన ఎస్సై టోనీ (గోకుల్ సురేష్) అప్పుడు ఆ సిటీ గురించి చెప్తాడు. ఒకప్పుడు ఆ సిటీ ప్రశాంతంగా ఉండేదని, అప్పుడు రాజు (దుల్కర్ సల్మాన్) అనే అతను ఇక్కడ రౌడీగా ఉండేవాడని, అయితే అతను రాబిన్ హుడ్‌లా పేద ప్రజలకి సాయం చేసేవాడని, అతని గురించి చెప్తాడు. అప్పుడు అసలు కథ మొదలవుతుంది. రాజు కొత్త సిటీలో ఎలా ఉండేవాడంటే.. అతనికి ఫుట్ బాల్ మీద వున్న ప్రేమ, అతను ప్రేమించిన అమ్మాయి (ఐశ్వర్య లక్ష్మి), అతని చెల్లెలు రీతు (అనిఖా సురేంద్రన్).. ఇలా అన్నీ ఉన్న రాజు ఒక్కసారిగా ఆ సిటీ విడిచి వెళ్ళిపోతాడు. కన్నా ఆ సిటీని తన ఇష్టం వచ్చినట్టు ఏలుతూ అక్కడి ప్రజలను మత్తు పదార్థాలకి బానిసలుగా చేసేస్తాడు. ఎదురు తిరిగిన వారిని తన అనుచరులతో కొట్టిస్తాడు. అలాంటి సిటీకి వచ్చి ఏదో చేసేద్దాం అనుకున్న ఆ పోలీస్ అధికారి ఏమి చేసాడు చివరికి? రాజు ఎందుకు ఆ సిటీ విడిచి వెళ్ళాడు? అతన్ని ఎలా మళ్ళీ రప్పించారు? కన్నా, రాజు ఇద్దరూ ఒకప్పుడు మంచి స్నేహితులు, ఇప్పుడు ఎందుకు శత్రువులయ్యారు, ఇవన్నీ తెలుసుకోవాలంటే ‘కింగ్ అఫ్ కొత్త’ చూడాలి.


Kok-4.jpg

విశ్లేషణ:

ఇది ఒక మలయాళం సినిమా, తెలుగులోకి డబ్బింగ్ చేశారు, అదీ కాకుండా పేర్లు అన్నీ మళయాళంలోనే కనపడతాయి. మామూలుగా అయితే ఏదైనా అగ్ర నటుడి సినిమా తెలుగులోకి డబ్బింగ్ చేసినప్పుడు ఒక్కోసారి తెలుగు పేర్లును మారుస్తారు, కానీ ఇందులో పూర్తిగా మలయాళం పేర్లు కనిపిస్తాయి. ఇక దీనికి అభిలాష్ జోషీ దర్శకుడు, కథ కూడా అతనే ఇచ్చాడు. అయితే ఈ కథ ఏమీ కొత్త కథ కాదు, పాత కథే. ఎన్నో తెలుగు సినిమాలు ఇలాంటి కథతో వచ్చాయి. ఒక వూర్లో ఇద్దరు రౌడీ స్నేహితులు వుంటారు, అందులో ఒకడు మంచి రౌడీ, రెండో వాడు చెడ్డ రౌడీ. మంచి రౌడీకి భావోద్వేగాలుంటాయి, అందుకని ఒక సంఘటన తరువాత ఆ వూరు విడిచి పెట్టి వెళ్ళిపోతాడు, రెండో రౌడీ ఆ ఊరుని ఆక్రమించుకుంటాడు. ఆ ఊరుకి ఒక కొత్త ఆఫీసర్ వచ్చి బాగు చెయ్యాలని అనుకుంటాడు, కానీ అతని వలన అది సాధ్యం కాదు, అందుకు అతని వూరు వదిలి వెళ్ళిపోయిన మంచి రౌడీని మళ్ళీ ఆ వూరు రప్పిస్తాడు. ఇది సారాంశం. ఇందులో ఎటువంటి ఉత్కంఠ భరితమైన సన్నివేశాలు కానీ, ఆసక్తికర సన్నివేశాలు కానీ వుండవు. ఇది ఒక యాక్షన్ సినిమా అని అనుకున్నా, అలా కూడా కనిపించదు. అసలు దుల్కర్ సల్మాన్ సినిమా మొదలైన చాలాసేపటికి కానీ కనపడడు. ఇక అతని మొహం చూపించడానికి దర్శకుడు ఎందుకు అంత సమయం తీసుకున్నాడో అర్థం కాదు. అంత ఎలివేషన్ ఎందుకో మరి. (King of Kotha Review)


Kok-3.jpg

ఇక దుల్కర్ వచ్చాక కథ ఏదైనా మలుపులు తిరిగి, ఉత్కంఠ భరితంగా సాగుతుంది అనుకుంటే, ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న సామెతలా, మరీ నత్త నడకలా సాగుతోంది. మధ్యలో ఒక ఫుట్ బాల్ మ్యాచ్ కూడాను. అవి చాలవన్నట్టు చాలా సన్నివేశాలు, సాగదీసి, అరగదీసి, ఏదో చేశాడు దర్శకుడు. మొదటి సగం అంతా అలానే సాగుతూ ఉంటుంది, అక్కడక్కడా ఒకటి రెండు సన్నివేశాలు తప్ప, సినిమాలో విషయం ఏమీ ఉండదు. ఇక రెండో సగం, దుల్కర్ ఇంకో షేడ్‌లో కనిపిస్తాడు. ఈ లుక్ అతనికి బాగుంది. ఇది కొంచెం సీరియస్‌గా ఉంటుంది. కథ కొంచెం ఆసక్తికరంగా ఉండేది ఈ రెండో సగం మాత్రమే. అయితే చివర్లో మళ్ళీ ఒక పోరాట సన్నివేశం దర్శకుడు పెట్టాడు, అదేంటో అది కొడుతూనే ఉంటాడు దుల్కర్. అందరికీ తెలుసు ఏమి జరుగుతుంది, జరగబోయేది, చెప్పా కదా, కథలో ఏమీ అంత ట్విస్ట్స్, టర్న్స్ లేవని. తెలుగు ప్రేక్షకులకి మాత్రం ఈ సినిమా కాస్త సాగదీసినట్టుగా కనిపిస్తూ ఉంటుంది, అంత నడవకపోవచ్చు కూడా. అదీ కాకుండా ఇందులో దుల్కర్ అందరికీ పరిచయం తెలుగు సినిమాలు చేసాడు కాబట్టి, ఇక అనిఖా సురేంద్రన్ కూడా ఒక తెలుగు సినిమా చేసింది, ప్రసన్న కూడా కాస్త పరిచయమే.. ఇక మిగతా వాళ్ళు అందరూ మలయాళం నటులే. (King of Kotha Review)


Kok-1.jpg

ఇక నటీనటుల విషయానికి వస్తే దుల్కర్‌కి ఈ సినిమాలో రెండు షేడ్స్ ఉంటాయి, అతను మంచి నటుడు బాగానే చేసి చూపించాడు. కథ బాగోలేకపోతే అతను మాత్రం ఏం చేస్తాడు. ఇక ఇతనితో పాటు కన్నా పాత్ర వేసిన షబ్బీర్ కళ్లారక్కల్ కూడా చాలా బాగా చేసాడు. ఐశ్వర్య లక్ష్మి కథానాయకురాలిగా బాగానే చేసింది. అనీఖా, ప్రసన్న, గోకుల్ సురేష్ అందరూ తమ పాత్రల పరిధి మేరకి చేశారు. మిగతా నటీనటులు కూడా బాగానే సపోర్ట్ చేశారు. (King of Kotha Review)

చివరగా, ‘కింగ్ ఆఫ్ కొత్త’ అనే సినిమాలో కొత్తదనం ఏమీ లేదు. కొంచెం పీరియడ్ డ్రామా కాబట్టి, అందులో నటీనటుల స్టైలింగ్ అప్పటిలా చేశారు అంతే. రెండో సగం కాస్త పర్లేదు. దుల్కర్ సల్మాన్ నటన బాగుంది. కానీ చాలా సన్నివేశాలు సాగదీశాడు, చివరి పోరాట సన్నివేశం అయితే తలనొప్పి. ఇక మీరే ఆలోచించుకోండి.


ఇవి కూడా చదవండి:

====================

*Harish Shankar and Prakash Raj: మన సెలబ్రిటీస్ కి ఏమైంది, సమయం సందర్భం చూడాలి కదా అంటున్న నెటిజన్స్


*****************************************

*National Film Awards: విజేతలు వీళ్లే, ఉత్తమ అవార్డు అందుకున్న మొదటి తెలుగు నటుడు అల్లు అర్జున్


Updated Date - 2023-08-24T21:17:49+05:30 IST