Dasara film review: 'దసరా' అంచనాలకి తగ్గట్టుందా లేదా...

ABN , First Publish Date - 2023-03-30T12:46:51+05:30 IST

నాని నటించిన 'దసరా' సినిమాకి బాగా హైప్ వచ్చింది. నాని అయితే ఈ సినిమా కచ్చితంగా అందరికీ నచుతుంది అని మరీ విశ్వాసంగా చెప్పాడు. కొత్త దర్శకుడు శ్రీకాంత్ ఓదెల ఈ సినిమాకి దర్శకుడు, కీర్తి సురేష్ కథానాయిక, మరి సినిమాల ఎలా వుందో చూద్దాం

Dasara film review: 'దసరా' అంచనాలకి తగ్గట్టుందా లేదా...

సినిమా: దసరా (Dasara)

నటీనటులు:: నాని, కీర్తి సురేష్, దీక్షిత్ శెట్టి, పూర్ణ, షైన్ టామ్ చాకో, సముద్రఖని, సాయి కుమార్ తదితరులు

ఛాయాగ్రహణం: సత్యన్ సూరన్

సంగీతం : సంతోష్ నారాయణన్

నిర్మాత‌ : సుధాకర్ చెరుకూరి

కథ, కథనం, ద‌ర్శ‌క‌త్వం : శ్రీకాంత్ ఓదెల

-- సురేష్ కవిరాయని

నాని (Nani) ఈమధ్య వరస విజయాలతో దూసుకుపోతున్నాడు. ఆ క్రమం లోనే ఇప్పుడు తన 'దసరా' (DasaraFilmReview) సినిమాని పాన్ ఇండియా గా తెరకెక్కించి, మొత్తం భారత దేశంలోని ప్రధాన నగరాలూ అన్నీ తిరిగి ప్రచారం చేసాడు. ముందుగా చెప్పినట్టుగానే ఈ సినిమా నేపధ్యం సింగరేణి (Singareni Coal Mines) గనుల చుట్టుపక్కల వున్న ఒక గ్రామం లోని కథ. ఈ సినిమా కోసం ఒక వూరు సెట్ మొత్తం వేసి, అందులోనే చాలా భాగం షూట్ చేశారు. అలాగే ఈ సినిమా దర్శకుడు శ్రీకాంత్ ఓదెల (Srikanth Odela) మొదటి సారిగా ఈ సినిమాతో పరిచయం అయ్యాడు. నాని ఈ దర్శకుడుని ఎంతలా నమ్మాడు అంటే, ఈ సినిమా విడుదల అయ్యాక ఇండస్ట్రీ లో ఈ దర్శకుడి చుట్టూ అందరూ తిరుగుతారు అని పదే పదే ప్రచారం కూడా చేసాడు. దానికి తోడు ఈ సినిమా ట్రైలర్‌ ఆసక్తికరంగా ఉండటం, విడుదల రోజు శ్రీరామనవమి సెలవు దినం కావటంతో ఈ సినిమా కి బాగా హైప్ వచ్చింది. కీర్తి సురేష్ (Keerthy Suresh) ఇందులో కథానాయిక, ఈ 'దసరా' (Dasara) ఎలా ఉందొ, ఏంటో చూద్దాం.

dasarafirstdayfirstshow1.jpg

Dasara Story కథ:

ఈ సినిమా కథ మొత్తం తెలంగాణలో సింగరేణి బొగ్గు గనుల దగ్గర ఉన్న వీర్లపల్లి అనే గ్రామంలో జరిగింది. ధరణి (నాని), సూరి (దీక్షిత్ శెట్టి) ఇద్దరూ చిన్నప్పటి నుంచీ స్నేహితులు, అలాగే మిగతా స్నేహితులతో కలిసి ఆ వూరు మీదుగా వెళుతున్న బొగ్గు రైళ్లు నుండి బొగ్గు దొంగతనం చేస్తూ వుంటారు. వీళ్లిద్దరికీ ఇంకో స్నేహితురాలు వెన్నెల (కీర్తి సురేష్) కూడా ఉంటుంది, ఆమె అదే గ్రామం లో అంగన్ వాడి టీచర్ గా పని చేస్తూ ఉంటుంది. ఇక్కడో చిన్న మెలిక వుంది వెన్నెలని ధరణి ప్రేమిస్తాడు, కానీ సూరి వెన్నెలని ప్రేమిస్తున్నాడని తెలిసి, ధరణి, సూరికి, వెన్నెలకి పెళ్లి అయేట్టు చూస్తాడు, స్నేహితుడి కోసం తన ప్రేమని త్యాగం చేస్తాడు. అయితే అదే ఊర్లో సిల్క్ బార్ అని ఒకటుంటుంది, ఆ వూర్లో వున్న మగవాళ్ళు అందరూ తాగుబోతులు. మందు పడకపోతే ముందుకు నడవరు. అదే వూరిలో చిన్న నంబి (షైన్ టామ్ చాకో), శివన్న (సముద్ర ఖని), ఇంకా రాజన్న (సాయి కుమార్) లు అనే ధనికులు కూడా వుంటారు. ఆ ఊరి సర్పంచ్ పదవి కోసం ఈ సిల్క్ బార్ ఒక కీలకం అవుతుంది. ఇంతకీ ఆ సిల్క్ బార్ ఎందుకు అంత ప్రాముఖ్యం, ఆ ఊరి ప్రజలు ఎందుకు అంత తాగుబోతులు అయ్యారు, చిన్న కులం వాళ్ళని ఎందుకు బార్ లోకి రానియ్యరు, ఇంతకీ ఏమయిందో తెలియాలంటే 'దసరా' సినిమా చూడాల్సిందే.

Dasara-Film.jpg

విశ్లేషణ:

నాని ఈ సినిమా కథని బాగా నమ్మాడు, అందుకే కొత్తవాడు అయినా కూడా శ్రీకాంత్ ఓదెల కి అవకాశం ఇచ్చాడు. అయితే ఈమధ్య అందరూ కెజియఫ్ (KGF), పుష్ప (Pushpa) సినిమాలు హిట్ అవటం తో అదే బాటలో సినిమాలు తీయడం మొదలెట్టారు. ఈ నాని 'దసరా' సినిమా కూడా కెజియఫ్ లో లా, నాని కథ చెపుతూ ఉంటాడు, సినిమా మొదలవుతుంది. అలాగే 'పుష్ప' లో గంధం చెక్కలు అయితే ఈ సినిమాలో బొగ్గు దొంగతనం. అంతే కానీ కథ ఏమంత పెద్ద గొప్పది కాదు, మామూలు కథే. అయితే కొంచెం తెలంగాణ నేపధ్యం, బొగ్గు నేపధ్యం ఉంటుంది అంతే. ఆ బొగ్గు దొంగతనం కూడా మొదట్లో ఒక సన్నివేశంలో చూపించాడు అంతే, ఆ తరువాత మళ్ళీ ఆ దొంగతనం చూపించలేదు.

అలాగే సినిమా మొదలవ్వటం కూడా బొగ్గు రవాణా చేస్తున్న ట్రైన్ నుండి నాని అతని స్నేహితులు (DasaraFilmReview) ఎలా బొగ్గుని దొంగతనం చేశారు అన్న దానితో మొదలవుతుంది. ఆ సన్నివేశం అదిరేటట్టు తీసాడు దర్శకుడు. ఆ తరువాత గ్రామం లోకి షిఫ్ట్ అవుతుంది కథ. దర్శకుడు సినిమా కథని చాలా స్లోగా నేరేట్ చేసాడు. కథనంలో (DasaraMovieReview) ఆసక్తి ఎక్కడ ఉండదు. సినిమా చూస్తుంన్నంత సేపు ఎదో మిస్ అయేట్టు ఉంటుంది. సరిగ్గా కనెక్ట్ కాలేము.

dasara-nani.jpg

ధరణి, సూరి, వెన్నెల స్నేహితులు చిన్నప్పటి నుంచి. ధరణి వెన్నెలని ప్రేమిస్తాడు, అలాగే సూరి కూడా వెన్నెలని ప్రేమిస్తాడు, వెన్నెల కూడా సూరిని ప్రేమిస్తుంది. ఇక్కడ ధరణి త్యాగం చేసాడు తన ప్రేమని. అయితే ఇందులో వెన్నెల కూడా ధరణి వైపు అలా చూస్తే, త్యాగం చేసినట్టవుతుంది కానీ, సూరి, వెన్నెల చిన్నప్పటి నుంచే ప్రేమలో వున్నారు. ధరణి తన ప్రేమని వెన్నెలకి ఎప్పుడూ చెప్పలేదు, ఒక్క ప్రేక్షకులకే చెప్పాడు, మరి అది త్యాగం ఎలా అవుతోందో? అలాగే సూరి, వెన్నెల మధ్య ఆ ప్రేమ సన్నివేశాలు ఏవీ సరిగ్గా చూపించలేకపోయారు దర్శకుడు.

ఎంతసేపూ ధరణి ఎలా తాగాడు, ఎంత తాగాడు, ఈ మద్యపానం తాగడం మీదే ఎక్కువ దృష్టి పెట్టాడు దర్శకుడు అనిపిస్తుంది. అలాగే స్నేహితుల మధ్య వున్న ఆ స్నేహాన్ని కూడా భావోద్వేగంగా చూపలేకపోయాడు దర్శకుడు. అలాగే సినిమాలో ఎందుకో ఎక్కడా కూడా ఆ భావోద్వేగాలు అంతగా లేవు, అందుకే సినిమా ఎక్కడా కూడా కనెక్ట్ కాలేకపోయింది. ఇంకా సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది కదా, మందంటే మాకు వ్యసనం కాదు అలవాటుపడ్డ సంప్రదాయం, అలాగే సినిమాలో ఈ ఆల్కహాల్ విపరీతంగా చూపించాడు, బొడ్డుకు నాలుగయిదు బాటిల్స్ కూడా కట్టుకుంటాడు. నా పక్కనున్న అతను తన ఏడో తరగతి చదువుతున్న కూతురిని కూడా తీసుకు వచ్చాడు. ఆమె వాళ్ళ నాన్నని , 'డాడీ అంత తాగితే ఆరోగ్యం చెడిపోదా' అని అడిగింది. అంటే సినిమాలో ఎంత మద్యపానం చూపించాడో మీకు అర్థం అయి ఉంటుంది.

Dasara.jpg

ఇంకా నాని, విలన్, కీర్తి సురేష్ వాళ్ళు తెలంగాణ యాస మాట్లాడుతున్నారో, లేదా వేరే యాస మాట్లాడుతున్నారో అర్థం కాదు. ఒక సమయంలో అయితే నాని చెపుతున్న డైలాగ్స్ అర్థం కావు కూడా. తెలంగాణ యాసలో మాట్లాడటానికి ప్రయత్నం చేసాడు, కానీ అవి మెల్లగా నోట్లో గొణుక్కున్నట్టుగా మాట్లాడేడు. అర్థం కాలేదు. పోనీ నాకే అర్థం కాలేదా అని పక్కవాళ్ళని అడిగితే, వాళ్లదీ అదే సమాధానం. మొదటి సగం స్లోగా వెళుతూ ఉంటుంది కథ లేకుండా, రెండో సగం కూడా ఇంచుమించు అంతే. ఏమి జరుగుతుందో, ఎలా ఉండబోతోందో ప్రేక్షకులకు ముందే అన్నీ తెలిసిపోతుంటాయి. ఒక విధంగా ఈ సినిమా అందరి అతి విశ్వాసం ఏమో అని అనిపిస్తూ ఉంటుంది, ముఖ్యంగా నాని. ఇవన్నీ ఒక ఎత్తు అయితే, సినిమా ఒక డార్క్ కలర్ లో ఉంటుంది, గ్రామం లో మనుషుల కలర్ కూడా డార్క్ గా కనిపిస్తూ ఉంటుంది, అది అర్థం కాదు. సినిమాకి బాగా హైప్ వచ్చేసింది, అందువల్ల ఆ అంచనాలకి తగ్గట్టుగా లేదనే చెప్పాలి. దర్శకుడు కథనాన్ని చాలా స్లోగా, ఆసక్తికరంగా లేకుండా చూపించాడు.

ఇంకా నటీనటుల విషయానికి వస్తే నాని కి కొంచెం కొత్త ఈ పాత్ర చెయ్యడం. ఎందుకంటే గెట్ అప్ మార్చాడు, తెలంగాణ యాస కొంచెం ప్రాక్టీస్ చేసి ఉంటే బాగుండేది. అలాగే దీక్షిత్ శెట్టి (Deekshith Shetty) నాని ఫ్రెండ్ గా బాగా చేసాడు. కొత్తవాడు అవటం వలన అతనికి ఈ సినిమా బాగా ప్లస్ అవుతుంది. కీర్తి సురేష్ (Keerthy Suresh) కూడా చాలా బాగా అభినయం చేసింది. ఇంకా సముద్రఖని (Samuthirakani) కి ఇదేమి కొత్త కాదు. మలయాళం నటుడు షైన్ టామ్ చాకో (Shine Tom Chacko) అనే అతను విలన్ గా చేసాడు. కానీ తెలంగాణ యాస అతనికి లిప్ సింక్ కాలేదు. పాన్ ఇండియా అని ఒక మలయాళం నటుడిని పెట్టినట్టుగా అనిపిస్తుంది. మంచి రోల్ అతనిది, కానీ అతను చెయ్యలేకపోయాడు, తెలుగు వాడిని పెడితే బాగుండేది. అలాగే సాయి కుమార్ (Sai Kumar) అక్కడక్కడా కనపడతాడు. పూర్ణ (Poorna) చాలా బాగా చేసింది, చెప్పాలంటే ఆమె రోల్ ఆశ్చర్యంగా ఉంటుంది. మిగతా వాళ్ళు అందరూ కూడా ఓకే గా చేశారు. ఛాయాగ్రహణం బాగుంది, లాంగ్ వ్యూ లో కొండలు, బొగ్గు గనులు అవన్నీ బాగుంటాయి. సంగీతం పరవాలేదు. మాటలు కూడా బాగున్నాయి. అవినాష్ కొల్ల ని మాత్రం ప్రశంచించాలి, ఎందుకంటే ఒక గ్రామం సెట్ నిజంగానే గ్రామం లో కనపడేట్టు వేసాడు. ట్రైన్ పట్టాలు, పక్కనే వూరు ఇవన్నీ నిజంగానే ఒక వూరు ఉందా అన్నంతగా చాలా బాగా సెట్ వేసాడు.

Dasara-Movie-3.jpg

చివరగా, 'దసరా' (Dasara) సినిమాకి చాలా హైప్ వచ్చింది, కానీ ఆ హైప్ కి తగ్గట్టుగా సినిమా లేదనే చెప్పాలి. దర్శకుడు శ్రీకాంత్ ఓదెల (Srikanth Odela) ఎంతసేపూ మద్యపానం, హింస మీదే ఎక్కువ దృష్టి పెట్టాడు (DasaraFilmReview) అనిపిస్తుంది. ఇది ముందు బెంచి లో కూర్చున్న వాళ్ళ సినిమా (Front benches), అందుకని సినిమాలో చాలా ధూళి కనపడుతూ ఉంటుంది, థియేటర్ లో ముందు సీట్లలో కూర్చున్న వాళ్ళు జాగ్రత్త, మీ మీద పడొచ్చు. పిల్లలని, ఆడవాళ్ళని తీసుకెళ్ళేముందు ఆలోచించండి, అడిగి వెళ్ళండి.

Updated Date - 2023-03-30T14:46:30+05:30 IST