Das Ka Dhamki review: ధమ్కీ ఇచ్చాడా లేదో తెలుసుకోవాలంటే...

ABN , First Publish Date - 2023-03-22T13:08:09+05:30 IST

యువ నటుల్లో విశ్వక్ సేన్ (Vishwak Sen) మెల్ల మెల్లగా తన పరిధిని విస్తరించుకుంటూ వెళుతున్నాడు. ఇటు నటుడిగానే కాకుండా, అటు దర్శకుడిగా కూడా తన ప్రతిభకి సాన పెడుతున్నాడు. ఇప్పుడు 'దాస్ క ధమ్కీ' (Das Ka Dhamki) అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.

Das Ka Dhamki review: ధమ్కీ ఇచ్చాడా లేదో తెలుసుకోవాలంటే...

సినిమా: దాస్ క ధమ్కీ

నటీనటులు: విశ్వక్ సేన్, నివేద పెతురాజ్, రావు రమేష్, రోహిణి, హైపర్ ఆది, జబర్దస్త్ మహేష్, అక్షర గౌడ, పృథ్వి తదితరులు

ఛాయాగ్రహణం: దినేష్ కే బాబు, జార్జ్ సి విలియమ్స్

సంగీతం: లియోన్ జేమ్స్, రామ్ మిరియాల

రచన: ప్రసన్న కుమార్ బెజవాడ

నిర్మాత: కరాటే రాజు, విశ్వక్ సేన్

దర్శకత్వం: విశ్వక్ సేన్

-- సురేష్ కవిరాయని

యువ నటుల్లో విశ్వక్ సేన్ (Vishwak Sen) మెల్ల మెల్లగా తన పరిధిని విస్తరించుకుంటూ వెళుతున్నాడు. ఇటు నటుడిగానే కాకుండా, అటు దర్శకుడిగా కూడా తన ప్రతిభకి సాన పెడుతున్నాడు. ఇప్పుడు 'దాస్ క ధమ్కీ' (Das Ka Dhamki) అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమా మీద చాలా అంచనాలు పెట్టుకున్నాడు కూడా, అందుకే అందులో కథానాయకుడిగా నటించడమే కాకుండా, దర్శకత్వం, నిర్మాతగా కూడా వ్యవహరించాడు (Das Ka Dhamki Film Review) విశ్వక్ సేన్. నివేద పెతురాజ్ (Nivetha Pethuraj) ఇందులో కథానాయికగా చేసింది, ఆమె విశ్వక్ సేన్ గురించి చాలా గొప్పగా మాట్లాడింది, సినిమా ప్రచార చిత్రాల్లో. రావు రమేష్ (Rao Ramesh) కూడా ఒక ముఖ్యమైన పాత్రలో కనపడతాడు. మరి ఈ సినిమా ఎలా వుందో చూద్దాం.

Das Ka Dhamki story కథ:

కృష్ణ దాస్ (విశ్వక్ సేన్) ఒక హోటల్ లో వెయిటర్ గా పని చేస్తూ ఉంటాడు. అతనితో పాటు అతని స్నేహితులు ఇద్దరూ (హైపర్ ఆది, జబర్దస్త్ మహేష్) అదే హోటల్ లో పని చేస్తూ ఉంటూ, ముగ్గురూ కలిసి ఒక రూమ్ లో ఉంటూ వుంటారు. ముగ్గురూ ఆనాధలు. ఆ హోటల్ కి కీర్తి (నివేద పెతురాజ్) అనే అమ్మాయి వస్తుంది, కృష్ణ దాస్ తో ప్రేమలో పడుతుంది. కృష్ణ దాస్ ఆమెకి వెయిటర్ అని చెప్పకుండా తనో పెద్ద కోటీశ్వరుడు అనే భావన ఆమెకి ఇస్తూ మేనేజ్ చేస్తూ ఉంటాడు. ఒకరోజు కృష్ణ దాస్, కీర్తి కారులో వెళుతుంటే ఇంకొక కారు ఇతని కార్ ని ఓవర్ టేక్ చేసుకుంటూ వెళుతుంది. కృష్ణ దాస్ కూడా ఊరుకోకుండా ఆ కారుని ఓవర్ టేక్ చేస్తూ తన దగ్గరున్న కాఫీని ఆ కారు ముందు అడ్డం మీద ఒంపేస్తాడు. ఈలోగా హోటల్ లో వాళ్ళకి కృష్ణ దాస్ చేస్తున్న పనులు తెలిసి అతన్ని, ఇద్దరు స్నేహితులని కూడా తీసేస్తారు. అదే సమయం లో కీర్తి వస్తుంది, నిజం తెలుసుకొని కృష్ణ దాస్ ని అసహ్యించుకొని వెళ్ళిపోతుంది. తాము ఉంటున్న రూమ్ అద్దె కట్టడానికి కూడా డబ్బులు లేక ఇబ్బంది పడుతుంటే ఒక బిజినెస్ మాన్ (రావు రమేష్) వచ్చి కృష్ణ దాస్ ని ఆదుకుంటాడు. తాను చెప్పిన పని చేస్తే కావాల్సినంత డబ్బు ఇస్తా అంటాడు. ఇంతకీ అతను చెప్పిన పని ఏంటి, కృష్ణ దాస్ ఆ పని చేశాడా, కీర్తి ఎవరు? వేరే కారు మీద కాఫీ పోసినప్పుడు ఆ కారులో ఉన్నతను బతికాడా చనిపోయాడా? ఇన్ని ప్రశ్నలకు సమాధానాలు కావాలంటే 'దాస్ క ధమ్కీ' చూడాల్సిందే.

1.jpg

విశ్లేషణ:

విశ్వక్ సేన్ మంచి నటుడు, బాగా కష్టపడతాడు. కానీ ఇక్కడ విషయం ఏంటి అంటే, అతనికి సరి అయిన కథ పడటం లేదు. ఇప్పుడు ఈ 'దాస్ కి ధమ్కీ' సినిమా తీసుకుందాం. ఇందులో నటుడు, నిర్మాత, దర్శకుడు ఇలా మూడు విభాగాల్లో చేసి విశ్వక్ సేన్ బాగా కష్టపడ్డాడు. కానీ ఇక్కడ ఇంకో విషయం ఏంటి అంటే ఈ సినిమా కథ రవితేజ 'ధమాకా' సినిమాకి కథ ఇచ్చిన ప్రసన్న కుమార్ బెజవాడ ఈ 'దాస్ క ధమ్కీ' కూడా ఇచ్చాడు. పొరపాటు ఎక్కడో జరిగి ఉండాలి అనిపిస్తోంది, ఎందుకంటే 'ధమాకా' కథ ఈ 'దాస్ క ధమ్కీ' కథ ఒకేలా వుండే అవకాశం వుంది. అయితే 'ధమాకా' ముందు విడుదల అయింది, అందుకని ఈ 'దాస్ క ధమ్కీ' కథని కొంచెం అటు ఇటు మార్చాల్సి వచ్చింది అని అనుకుంటున్నాం. లేకపోతే రెండు కథల్లో లైన్ కొంచెం ఒకేలా ఉండటం ఏంటి. అక్కడ తేడా కొట్టింది.

ఎప్పుడయితే కథ మార్చాలి వచ్చిందో విశ్వక్ సేన్ ఇక్కడ మొదటి సగం వినోదం తో పంచాలని చూసాడు. అందుకని ఒక ఇంగ్లీష్ సినిమా 'ప్రైస్ లెస్' ని కాపీ కొట్టేసాడు. నివేద పెతురాజ్ హోటల్ కి రావటం, వెయిటర్ గా పని చేస్తున్న విశ్వక్ సేన్ అదే హోటల్ కి కస్టమర్ గా వున్నప్పుడు, ఇద్దరూ కలవటం, తాగటం, అదే హోటల్ రూమ్ లో రాత్రంతా ఉండటం, వాళ్ళిద్దరి మధ్య ప్రేమ సన్నివేశాలు ఇవన్నీ ఆ ఇంగ్లీష్ సినిమాలో నుండి సన్నివేశాలను లేపేసాడు. అయితే ఇక్కడ ఇంకో విషయం ఏంటి అంటే, వాళ్ళిద్దరి మధ్య ఆ ప్రేమ సన్నివేశాలు సరిగ్గా రాకపోవటం, ప్రేక్షకులకి బోర్ కొట్టించటం. మొదటి సగం అంతా ఇలా సాగుతుంటే, రావు రమేష్ ప్రవేశం, విశ్వక్ సేన్ ని ఆడుకోవటం, తాను చెప్పిన పని చేస్తా అంటే డబ్బు ఇస్తా అనటం ఇవన్నీ మామూలుగానే ఉంటాయి.

ఇంకా రెండో సగం లో విశ్వక్ సేన్, రావు రమేష్ ఇంటికి వెళ్ళినప్పుడు అక్కడ కూడా భావోద్వేగ సన్నివేశాలు సరిగా లేవు. అదీ కాకుండా రెండో సగం అంతా కొంచెం గందరగోళం గా తయారయింది. 'ధమాకా' సినిమాలో ఒకరే ఇద్దరుగా చూస్తాం. ఇందులో కూడా ఇంచుమించు అలానే ఉంటుంది, కానీ ఇందులో ఇద్దరా లేక ఒకరేనా, ఎవరు ఎవరి పాత్రలో వుంది కథ నడిపిస్తున్నారు అన్నది కొంచెం గందరగోళంగా ఉంటుంది. కానీ కథ అంత బలంగా సాగదు. రెండో సగం లో కథకి తీసుకున్న నేపధ్యం కూడా అంతగా ఆసక్తికరంగా ఉండదు. అందుకని చాలా పేలవంగా సాగుతుంది. ముందుగా అనుకున్న కథ ఒకటి అయితే, ఇప్పుడు తీసిన సినిమా కథ చాలా మార్చాల్సి వచ్చిందని అర్థం అవుతూనే వుంది. దానికి తోడు సినిమాలో బలమైన కథ నేపధ్యం లేకపోవటం, భావోద్వేగ సన్నివేశాలు కూడా ఉండక పోవటం తో 'దాస్ క ధమ్కీ' మామూలు సినిమా అయిపొయింది.

2.jpg

ఇంకా నటీనటుల విషయానికి వస్తే విశ్వక్ సేన్ తనదైన శైలిలో నటించాడు. మధ్య మధ్య లో సగం సగం బూతు పదాలు (పూర్తిగా చెప్పకపోయినా ప్రేక్షకులకి అర్థం అయిపోతాయి) వాడుతూ రెండు పాత్రల్లో కూడా రెండు కోణాల్లో నటించాడు. అయితే సినిమాలో కథ లేకుండా మొత్తం విశ్వక్ సేన్ ని మాత్రమే తెర మీద చూడలేము కదా. నివేద పెతురాజ్ గ్లామర్ గా కనిపించింది ఈ సినిమాలో. కానీ ఆమె పాత్ర ఏమీ అంత చెప్పుకోదగ్గది కాదు. రెండో సగం లో ఆమె కనిపించేది చాలా తక్కువ. రావు రమేష్ గొప్ప నటుడే కానీ అతని పాత్ర కూడా చెప్పుకోదగ్గ విశేషం కాదు. అతను బాగానే చేసాడు. ఇంక విశ్వక్ సేన్ స్నేహితులుగా హైపర్ ఆది, జబర్దస్త్ మహేష్ కొన్ని సన్నివేశాల్లో నవ్వులు పండించారు. తరుణ్ భాస్కర్ చిన్న పాత్రలో కనపడతాడు. అలాగే పృథ్వి, రజిత కూడా. అజయ్ కూడా ఒక రెగ్యులర్ పాత్రలో కనపడతాడు. ఇంకా సంగీతం ఒకే గా వుంది. రెండు హుషారేతించే పాటలు వున్నాయి. ఛాయాగ్రహణం కూడా పరవాలేదు. పోరాట సన్నివేశాలు కోరియోగ్రఫీ బాగా చేశారు. మాటల్లో ఇంకా కొంచెం పదును ఉంటే బాగుండేది.

చివరగా, 'దాస్ క ధమ్కీ' సినిమా మొత్తం తెర మీద, తెర వెనక కూడా విశ్వక్ సేన్ మాత్రమే కనపడతాడు. సినిమా కథ లో దమ్ము లేదు, నేపధ్యంగా తీసుకున్న పాయింట్ కూడా అంత నమ్మే విధంగా లేదు, రెండు పాత్రలు పెట్టి కొంచెం గందరగోళం చేసాడు. దానికి తోడు, ఈ సినిమాకి రెండో పార్టు కూడా వుంది అని చివరలో చూపిస్తాడు. అక్కడక్కడా కొన్ని సన్నివేశాలు, ఓ రెండు పాటలు తప్పితే, 'ధమ్కీ' ఇచ్చేంత విషయం లేదు.

Updated Date - 2023-03-22T17:58:48+05:30 IST