Rangamarthanda film review: కృష్ణవంశీ సినిమా ఎలా ఉందంటే....

ABN , First Publish Date - 2023-03-21T19:29:02+05:30 IST

కృష్ణవంశీ తీసిన 'రంగ మార్తాండ' సినిమా ఉగాది రోజున విడుదల అవుతోంది. ఇది మరాఠీ లో విజయం సాధించిన 'నటసామ్రాట్' సినిమాకి రీమేక్ గా తీసాడు. ఇందులో ప్రకాష్ రాజ్, బ్రహ్మానందం, రమ్యకృష్ణ ప్రధాన పాత్రధారులు. మరి సినిమా ఎలా వుంది అంటే...

Rangamarthanda film review: కృష్ణవంశీ సినిమా ఎలా ఉందంటే....
Rangamarthanda Review

సినిమా: రంగమార్తాండ

నటీనటులు: బ్రహ్మానందం, ప్రకాష్ రాజ్, రమ్య కృష్ణన్, అనసూయ, ఆదర్శ్ బాలకృష్ణ , శివాత్మిక రాజశేఖర్, రాహుల్ సిప్లిగంజ్, అలీ రెజా తదితరులు

మాటలు: ఆకెళ్ళ శ్రీనివాస్

సంగీతం: ఇళయరాజా

ఛాయాగ్రహణం: రాజ్ కె. నల్లి

నిర్మాత‌లు: కాలిపు మధు, ఎస్. వెంకట్ రెడ్డి

ద‌ర్శ‌క‌త్వం: కృష్ణవంశీ

-- సురేష్ కవిరాయని

దర్శకుడు కృష్ణ వంశీ తీసినవి తక్కువ సినిమాలే అయినా, తెలుగు సినిమా చరిత్రలో తనకంటూ ఒక ముద్ర వేసుకున్నాడు. అతని సినిమాలలో భావోద్వేగాలు బాగుంటాయి, తన సినిమాల ద్వారా కుటుంబం, సమాజం, బంధాలు, ఇలాంటివి చెప్పాలని తాపత్రయ పడే దర్శకుడు కృష్ణ వంశీ. సినిమా హిట్ అయినా, ప్లాప్ అయినా, కృష్ణ వంశీ సినిమాల కోసం చూసే ప్రేక్షకులు వుంటారు. అందులో నేను కూడా ఒకడిని. నాకు కృష్ణ వంశీ సినిమాలంటే ఇష్టం. సినిమా ప్లాప్ అయినా అందులో ఎదో ఒక విశేషం ఉంటుంది, అందుకే కృష్ణ వంశీ సినిమాల్లో నటించే నటుల నటనని చూస్తాము. అందుకే ఆయనతో నటించడానికి చాలామంది నటీనటులు ఉత్సాహం చూపిస్తారు. అయితే అటువంటి కృష్ణ వంశీ ఈమధ్య సినిమాలని బాగా తగ్గించేసాడు. ఎందుకో తెలీదు, కానీ మరాఠీ లో బాగా విజయం సాధించిన 'నటసామ్రాట్' (Natsamrat) అనే సినిమాని తెలుగు 'రంగమార్తాండ' (Rangamarthanda) గా రీమేక్ చేసి ప్రేక్షకుల ముందుకు తెచ్చాడు. ఈ సినిమా పూర్తి అయి చాలా కాలం అవుతున్నా, మరి ఎందుకో విడుదలకి నోచుకోలేదు, ఇప్పుడు అంటే ఈ ఉగాది సందర్భంగా విడుదల చేస్తున్నాడు. మరాఠీ సినిమాలో నానా పటేకర్ (Nana Patekar) వేసిన పాత్రని తెలుగులో ప్రకాష్ రాజ్ (Prakash Raj) చేసాడు. ఇంకా 1254 సినిమాలు చేసిన బ్రహ్మానందం (Brahmanandam) ఇందులో ఇంకో ప్రధాన పాత్రలో కనపడతాడు. రమ్యకృష్ణ (Ramyakrishna), అనసూయ (Anasuya), ఆదర్శ్ బాలకృష్ణ, శివాత్మికా రాజశేఖర్ (Sivatmika Rajasekhar), రాహుల్ సిప్లిగంజ్ (Rahul Sipliganj) తదితరులు నటించారు.

brahmanandam1.jpg

Rangamarthanda story రంగమార్తాండ కథ:

రాఘవరావు (ప్రకాష్ రాజ్) రంగస్థల దిగ్గజాలవంటి నటుల్లో ఒక నటుడు. ఒకవిధంగా అతని జీవితం లో చాలా భాగం రంగస్థలమే అయింది. రంగస్థల నటుడిగా అతని ప్రతిభకి మెచ్చి 'రంగమర్తాండ' బిరుదు ప్రదానం చేస్తారు. అదే సత్కార సభలో రాఘవరావు తాను ఇక నటించనని, భార్య, బిడ్డలా కోసం మిగతా కాలాన్ని వినియోగిస్తానని ప్రకటిస్తాడు. ఇంటికి వచ్చి తన ఆస్తిని పిల్లల పేర్ల మీద రాస్త్తూ, ఇష్టపడి కట్టుకున్న ఇంటిని కోడలు గీతా రంగారావు (అనసూయ) పేరు మీద రాస్తాడు. కూతురు శ్రీ (శివాత్మికా రాజశేఖర్)కు తన బ్యాంకు లో డిపాజిట్ల రూపం లో వున్న డబ్బు ఇస్తాడు. (Rangamarthanda Review) అలాగే ఆమె ప్రేమించిన అబ్బాయి రాహుల్ (రాహుల్ సిప్లిగంజ్) కు ఇచ్చి పెళ్లి చేస్తాడు. భార్య పేరుమీద కానీ, తన పేరు మీద కానీ ఏమీ వుంచుకోడు. భార్యకి తాను వున్నానని చెప్తాడు. ఇలా అన్నీ ఇచ్చేసి తన శేషజీవితాన్ని తన స్నేహితుడు చక్రవర్తి (బ్రహ్మానందం), భార్య (రమ్యకృష్ణ) తో సంతోషంగా గడుపుదామని నిశ్చయించుకుంటాడు. స్నేహితుడు, భార్య వారిస్తున్నా అన్నీ పంచేస్తాడు. కానీ రాఘవరావు అనుకొన్నది ఒకటి అయితే, ఆ ఇంట్లో ఇంకొకటి జరుగుతూ ఉంటుంది. కోడలు చేసే పనులు కొన్ని రాఘవరావు కి నచ్చకపోవటం, అలాగే మామగారు చాలా చాదస్తపు మనిషి అని కోడలు అనటం ఇలా ఆ ఇంట్లో అభిప్రాయ భేదాలు వస్తాయి. ఇంక చేసేది లేక భార్య కోరిక మేరకు, రాఘవరావు భార్యతో సహా ఆ ఇంట్లో నుంచి బయటకి వచ్చేస్తాడు. ఈ విషయం తెలిసిన కూతురు తల్లిదండ్రులని ఆదరిస్తుంది. అక్కడ ఏమైంది, కూతురు బాగా చూసుకుందా లేదా? రాఘవరావుకి ఎప్పుడూ వెన్నంటే వున్న అతని ప్రాణ స్నేహితుడు చక్రి ఏమయ్యాడు. చివరకి ఏమైంది తెలియాలంటే 'రంగమార్తాండ' (Rangamarthanda Review) చూడాల్సిందే.

rangamaarthanda.jpg

విశ్లేషణ:

దర్శకుడు కృష్ణ వంశీ (Krishna Vamsi) చాలా కాలం తరువాత ఈ 'రంగమార్తాండ' (Rangamarthanda Review) సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. కృష్ణవంశి ఎంచుకున్న కథావస్తువు చాలా మంచిది. అయితే ఇది మరాఠీ సినిమా 'నటసామ్రాట్' (Natsamrat) ఆధారంగా తీసినది. అయితే మరాఠీలో స్టేజి నాటిక చాలా ప్రాచుర్యం పొందింది, దాని ఆధారంగా మరాఠీ సినిమా తీశారు. అందులో హిందీ నటుడు నానా పాటేకర్ అత్యద్భుతంగా నటించాడు. మిగతా నటీనటులు కూడా బాగా చేశారు అందులో. అయితే మరి కృష్ణ వంశీ ఆ సినిమానే రీమేక్ చెయ్యాలని ఎందుకు అనిపించిందో? ఎందుకంటే ఇలాంటి సినిమాలు తెలుగులో చాలా వచ్చాయి. దాసరి నారాయణ రావు గారు చాలా సినిమాలు చేశారు, మురళి మోహన్ కూడా ఇలాంటి సినిమాల్లో నటించాడు.

rangamaarthanda1.jpg

ఉదాహరణకి 'ఓ తండ్రి తీర్పు', 'బంగారు కుటుంబం', 'సూరిగాడు', 'ఆ నలుగురు', ఇంకా పాత బ్లాక్ అండ్ వైట్ సినిమాలు కూడా చాలా వున్నాయి. చాలా సినిమాలు, కుటుంబ బంధాలు, అనుబంధాలు, మానవ సంబంధాలు మీద వచ్చాయి. అయితే ఈ సినిమా తీసుకోవడానికి రంగస్థలం మీద ఎన్నో ఏళ్లుగా నటించిన ఒక నటుడు జీవితం లో నటించలేకపోవటమే కారణం అయి ఉండొచ్చు అనే నేపధ్యం అని అనిపిస్తుంది. ఇంకా ఈమధ్యనే వచ్చిన 'బలగం' (Balagam) సినిమా కూడా కుటుంబం, బాంధవ్యాలు మీద వచ్చినదే. ఒక మనిషి చనిపోయినప్పుడు కుటుంబ సభ్యులు ఏ విధంగా ప్రవర్తిస్తారు, దేనికి ప్రాధాన్యం ఇలాంటివి బాగా చూపించటమే కాకుండా, కుటుంబం, వూరు కలిసి ఉంటే ఎలా ఉంటుంది అనేది కూడా భావోద్వేగంగా చెప్పాడు దర్శకుడు వేణు (Venu Eldandi) 'బలగం' సినిమాలో.

rangamarthandareview1.jpg

కృష్ణ వంశీ సినిమా చిరంజీవి (Mega Star Chiranjeevi) మాటలతో మొదలెట్టాడు. టైటిల్స్ పడుతున్నప్పుడు చిరంజీవి నటుడి గురించి చెపుతున్న భావోద్వేగ మాటలు హృదయాన్ని హత్తుకుంటాయి. తరువాత కనిపించకుండా పోయిన తండ్రి కోసం, కొడుకు, కూతురు ఆరాటపడటం, అలాగే టీ షాప్ లో పనిచేస్తున్న రాఘవరావు ని అలీ రెజా చూసి అతని గురించి అడగటం, అతని ఫ్లాష్ బ్యాక్ చెప్పటం ఆసక్తికరంగా సాగింది. తరువాత కథలో రాఘవరావు రంగస్థలం మీద నటనకి స్వస్తి చెప్పి ఇంక జీవితంలో నటించడానికి సమాయత్తం అవుతాడు. ఆస్తిని ఏమి మిగుల్చుకోకుండా కొడుకు, కూతురు కి ఇచ్చేయటం, ఆ సన్నివేశాలు అన్నీబాగున్నాయి.

rangamarthandareview6.jpg

అయితే ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే, కథ మనకు తెలిసిపోతూ ఉంటుంది, ఏమి జరగబోతోంది అనే విషయం. తెలిసిన అక్కడ దర్శకుడు సన్నివేశాలను ఎంత రక్తి కట్టించాడు, నటులు ఎంతటి భావోద్వేగాలను పలికించారు అన్నది చాలా ముఖ్యం. కృష్ణవంశీ తన వంతు కృషి బాగా చేసాడు, మాటలు కూడా బాగున్నాయి, కానీ సినిమా చూస్తున్నంత సేపు ఎదో మిస్ అయ్యాం అన్న భావన అయితే కలుగుతుంది. ఎందుకంటే సినిమాలో అక్కడక్కడా తెలుగు భాష గురించి కొన్ని సన్నివేశాలు వున్నాయి. అంతటి ఔన్నత్యాన్ని పొందిన తెలుగు భాషని రంగారావు పాత్రధారి అయిన ప్రకాష్ రాజ్ సరిగ్గా చెప్పలేకపోయాడు అన్నది నా భావన. ఎందుకంటే కొన్ని మాటల్లో అరవం బాగా కలిసిపోయింది. 'దాన వీర షూర కర్ణ' అంటాడు ప్రకాష్ రాజ్, కానీ అది 'దాన వీర శూర కర్ణ' అని పలకాలి. ఆలా చాలా మాటల్లో ఉదాహరణకి ప్రసిద్ధి చెందిన తెలుగు రచయితలు, నటుల పేర్లు చెప్పినప్పుడు కూడా అరవం యాస రావటం కొంచెం ఎబ్బెట్టుగా ఉన్నట్టు అనిపించింది.

rangamarthandareview5.jpg

కృష్ణ వంశీ కొన్ని సన్నివేశాల్లో తన మార్కు చూపించాడు. ముఖ్యంగా చక్రి భార్య చనిపోయినప్పుడు స్మశానం దగ్గర కూర్చొని కన్నీళ్లు ఎందుకు రావటం లేదు అన్న సన్నివేశం, రాఘవరావు కొడుకు, కోడలు దగ్గరికి చక్రి వెళ్లి వాళ్ళని తిట్టిన సన్నివేశం, రాఘవరావుని చెంప దెబ్బ కొట్టి 'ఏమయ్యావురా ఇన్నాళ్లు నన్ను పట్టించుకోలేదు' అని చెప్పి, మళ్ళీ 'గట్టిగా కొట్టనా' అన్న సన్నివేశం ఇలాంటివి మాత్రం కృష్ణ వంశీ మాత్రమే తీయగలడు అని అనిపించాయి.


అయితే ఇక్కడ ఇంకొక విషయం కూడా మాట్లాడాలి. 1254 సినిమాలు చేసిన బ్రహ్మానందంకి ఇందులో చక్రవర్తి పాత్ర చెయ్యటం మొదటి సారి. అతను అతద్భుతంగా చేసాడు. అతని సినిమా కెరీర్ మొత్తం చూసుకుంటే బ్రహ్మానందం ఇంత సీరియస్ రోల్ ఎంత బాగా నటించి చూపించాడా అని అందరూ ఆశ్చర్యపోయేలా చేసాడు. ఎందుకంటే బ్రహ్మానందాన్ని మనం ఎప్పుడూ ఒక కమెడియన్ గా మాత్రమే చూసాము, తెలుసు. కానీ అతన్ని ఇలా ఒక్కసారి సీరియస్ పాత్రలో చూసేసరికి మనకి కొత్తగా అనిపించింది, అలానే అతని నటన కూడా అద్భుతంగా ఉండటం తో బాగా రక్తికట్టింది. మనసులకు హత్తుకుంది బ్రహ్మానందం పాత్ర. ప్రకాష్ రాజ్ లా కాకుండా, బ్రహ్మానందం బాష ఉచ్ఛారణలో కానీ, హావభావాల్లో కానీ శిఖరాగ్రమైన నటన చూపించాడు. అతని కెరీర్ లో ఇదొక అత్యుత్తమ పాత్ర.

rangamarthandareview3.jpg

అదే ప్రకాష్ రాజ్ దగ్గరకి వచ్చేసరికి అతను ఇలాంటివి ఎన్నో చేసాడు, చూసాం కూడా. అందుకని ఇది మామూలు పాత్ర అయిపొయింది. బ్రహ్మానందాన్ని ఎలా అయితే కొత్తగా ఈ పాత్రకి తీసుకున్నారో, అలాగే ప్రకాష్ రాజ్ పాత్రకి కూడా కొత్తవాళ్ళని తీసుకుంటే బాగుండేది అని నా అభిప్రాయం. ఎందుకంటే అతను ఇలాంటివి ఎన్నో చూసాం, ఇందులో కొత్తగా ఏముందీ అనుకుంటాం. ప్రకాష్ రాజ్ గొప్ప నటుడు, అందులో సందేహం లేదు, కానీ ఈ పాత్ర అతనికి కొత్త కాదు (Monotony), మనకి కూడా కొత్తగా అనిపించదు అని మాత్రమే నేను చెప్తున్నా.

‘బలగం’ అంతగా హత్తుకోవడానికి, భావోద్వేగాలు పలకడానికి అందులో అందరూ కొత్తవారే అవటం, నటించారు అనే కన్నా అందులో పాత్రలే మనకి కనపడతాయి. అందుకని ఆ సినిమా హృదయానికి బాగా హత్తుకుంది. అదే అందులో కూడా తెలిసిన ముఖాలే పెడితే ఆ సినిమా కూడా వేరే విధంగా ఉండేదేమో. అందువల్ల కృష్ణ వంశీ 'రంగమార్తాండ' సినిమాకి ప్రకాష్ రాజ్ మైనస్ అవొచ్చు అని నా అభిప్రాయం. ఇది అతన్ని గానీ, కృష్ణ వంశీ ని కానీ కించపరిచే ఉద్దేశ్యం తో అన్నది కాదు. ఇంకా రమ్యకృష్ణ చాలా బాగా చేసింది. ఆమె మంచి నటి అని అందరికి తెలుసు, ఆమె మరోసారి తన నటనని చూపించింది. ముఖ్యంగా కూతురు ఇంట్లో మిమ్మల్ని అది దొంగ అంటోంది అని చెప్పే సన్నివేశం, అద్భుతం.

rangamarthandareview4.jpg

అనసూయ కోడలు పాత్రలో ఒదిగిపోయింది. ఆ మోహంలో చిరాకు, అలాగే విసవిసా వెళ్ళిపోయింది అని చదువుతూ ఉంటాం నవలల్లో, అలానే చాలా సన్నివేశాల్లో సహజంగా ఆమె చేసి చూపించింది. శివాత్మిక రాజశేఖర్ కూతురుగా బాగా చేసింది. తల్లి దండ్రులు అంటే ప్రేమ, ఇంకో పక్క తన భవిష్యత్తు, తెలియక టక్కున మాటలు అనేయటం ఇలాంటి ఎన్నో ఛాయలు ఆమె పాత్రలో కనపడతాయి. రాహుల్ సిప్లిగంజ్ మామా, మామా అంటూ, ఏమయితాది మామా ఏమి కాదు అంటూ భలే వున్నాడు, కొత్తగా కనిపించాడు. ఆదర్శ్ కూడా కొడుకుగా బాగున్నాడు. ఆటో డ్రైవర్ పాత్రలో జబర్దస్త్ వేణు కనిపిస్తాడు, కానీ అతని పాత్ర సరిగ్గా చూపిస్తే బాగుండేది.

rangamarthandareview2.jpg

ఇవన్నీ ఒక ఎత్తు అయితే కృష్ణ వంశీ ఈ సినిమాలో సాహిత్యం బాగా అమర్చాడు. రంగస్థలం మీద నటించడం వేరు, జీవితంలో నటన ఇలా ఒకదానికొకటి పోలికతో మంచి మాటలు రాసాడు రచయితే ఆకెళ్ళ. ప్రసిద్ధ తెలుగు సాహిత్యకారులు పేర్లు వింటూ ఉంటే కొంచెం వొళ్ళు జలదరిస్తుంది. తెలుగు భాషకి ఎంతో పాటుపడిన వాళ్ళందరినీ తలపింప చేసి అలాగే తెలుగు గురించి మంచి మాటలు వినిపించిన కృష్ణ వంశీ నిజంగా సినిమాలు తన కోసం తీయడు, సమాజం కోసం తీస్తాడు అనిపించేలా ఉంటుంది. ఇళయరాజా సంగీతం గురించి చెప్పేది ఏముంది, అతను ప్రాచుర్యం పొందిన సంగీత దర్శకుడు, అంత బాగా సమకూర్చాడు సంగీతం, పాటలు అన్నీ సృజనాత్మకంగా ఉంటాయి. హాస్పిరల్ లో బ్రహ్మానందం, ప్రకాష్ రాజ్ సన్నివేశం సినిమాలో నాకు నచ్చిన అత్యద్భుత సన్నివేశం.

చివరగా 'రంగమార్తాండ' కథ ఏమి కొత్త కాదు. కానీ కొన్ని సన్నివేశాలు కళ్ళు చెమర్చేలా తీసి కృష్ణ వంశీ తనదైన శైలిలో చూపించాడు. ఈ సినిమాకి నన్ను అడిగితే బ్రహ్మానందం హీరో అంటాను. అతనే సినిమాకి వెన్నెముక లా బాగా నటించి చూపించాడు. కానీ అందరూ ఒకసారి చూడవలసిన సినిమా ఇది.

Updated Date - 2023-03-22T00:01:40+05:30 IST