Mangalavaaram film review: ఇదొక బోల్డ్ కథ, కానీ...

ABN , First Publish Date - 2023-11-17T12:49:24+05:30 IST

దర్శకుడు అజయ్ భూపతి 'మంగళవారం' అనే సినిమా టైటిల్ తో ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఇందులో పాయల్ రాజపుత్ ప్రధాన పాత్ర పోషించింది. 'కాంతారా' సినిమాకి సంగీతం సమకూర్చిన అజనీష్ ఈ సినిమాకి సంగీతం అందించాడు. ఈ సినిమా ఎలా వుందో చదవండి

Mangalavaaram film review: ఇదొక బోల్డ్ కథ, కానీ...
Mangalavaaram movie review

సినిమా: మంగళవారం

నటీనటులు: పాయల్ రాజ్‌పుత్, నందితా శ్వేతా (NanditaShweta), అజయ్ ఘోష్ (AjayGhosh), రవీంద్ర విజయ్, శ్రీ తేజ్, చైతన్య కృష్ణ, శ్రవణ్ రెడ్డి, దివ్యా పిళ్ళై (DivyaPillai), లక్ష్మణ్ తదితరులు

ఛాయాగ్రహణం: దాశరథి శివేంద్

సంగీతం: అజనీష్ లోక్‌నాథ్ (AjaneeshLoknath)

నిర్మాతలు: స్వాతి రెడ్డి గునుపాటి, ఎం సురేష్ వర్మ, అజయ్ భూపతి

కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: అజయ్ భూపతి

విడుదల తేదీ: నవంబర్ 17, 2023

రేటింగ్: 2.5 (రెండు పాయింట్ ఐదు)

-- సురేష్ కవిరాయని

దర్శకుడు అజయ్ భూపతి (AjayBhupathi) తన మొదటి సినిమా 'ఆర్ఎక్స్ 100' #RX100 తోటే ఒక వైవిధ్యమైన దర్శకుడిగా పేరు తెచ్చుకున్నాడు. ఇదే సినిమాతో పాయల్ రాజపుత్ (PayalRajput) అనే ఆమె కూడా కథానాయికగా తెలుగు తెరకి పరిచయం అయింది. అజయ్ దర్శకుడిగా రెండో సినిమా 'మహాసముద్రం' #MahaSamudram బాక్స్ ఆఫీస్ దగ్గర పెద్ద ఫ్లాప్. ఇప్పుడు మూడో సినిమా ఈ 'మంగళవారం' #MangalavaaramReview ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా ప్రచార చిత్రాలు ఈ సినిమా మీద చాలా అంచనాలు పెంచాయి. దానికి తోడు ఈ సినిమా ప్రచారానికి అగ్ర నటుడు అల్లు అర్జున్ (AlluArjun) వచ్చి ఈ సినిమా ట్రైలర్ చాలా బాగుంది అని, కథ కూడా విన్నాను అని ఈ సినిమా బాగుంటుంది అని చెప్పడంతో ప్రేక్షకులకి ఈ సినిమా మీద ఆసక్తి పెరిగింది. ప్రముఖ వ్యాపారవేత్త నిమ్మగడ్డ ప్రసాద్ (NimmagaddaPrasad) కుమార్తె స్వాతి గునుపాటి, సురేష్ వర్మలు ఈ సినిమాకి నిర్మాతలు కాగా, అజయ్ భూపతి కూడా తొలిసారిగా నిర్మాతగా భాగస్వామ్యం అయ్యాడు. అజయ్ మొదటి సినిమాలో చేసిన పాయల్ రాజపుట్ ఐదేళ్ల తరువాత మళ్ళీ ఈ సినిమాలో అజయ్ భూపతితో పనిచేసింది. ఈ సినిమా ఎలా వుందో చూద్దాం. (Mangalavaaram movie review)

mangalavaaram4.jpg

Mangalavaaram story కథ:

మహాలక్ష్మీపురంలో మంగళవారం రోజు ఇద్దరు ఇద్దరు ప్రాణాలు కోల్పోతూ వుంటారు. అలా పోయినవాళ్ల గురించి ఆ ఊరి గోడ మీద వాళ్ళకి అక్రమ సంబంధాలు ఉన్నాయని ఎవరో రాస్తూ వుంటారు, అందుకే వాళ్ళు ఆత్మహత్య చేసుకుంటున్నారని గ్రామ ప్రజలు కూడా నమ్ముతూ వుంటారు. కానీ ఆ ఊరికి కొత్తగా వచ్చిన ఎస్సై (నందితా శ్వేత) మాత్రం అవి ఆత్మ హత్యలు అంటే నమ్మదు, అందుకని వాళ్ళకి పోస్ట్ మార్టం చేయించాలని అంటుంది. కానీ ఆ ఊరి జమీందారు ప్రకాశం జమీందారు ప్రకాశంబాబు (చైతన్య కృష్ణ) పోస్ట్ మార్టంకి ఒప్పుకోడు. రెండో సారి ఇద్దరూ చనిపోయినప్పుడు ఎస్.ఐ ఆ శవాలని పోస్ట్ మార్టంకి పంపిస్తుంది, ఆ రిపోర్ట్ కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. ఇదిలా ఉండగా ఆ ఊరి ప్రజలు జట్లు జట్లుగా చీలిపోయి ఎవరు ఇలా గోడమీద రాస్తున్నారు, ఎవరు హత్యలు చేయిస్తున్నారో తెలుసుకుందామని రాత్రిపూట గస్తీ తిరుగుతూ వుంటారు. ఇంతకూ ఆ గోడ మీద రాస్తున్నది ఎవరు? ఎందుకు మంగళవారమే ఆ హత్యలు జరుగుతున్నాయి? ఆ ఊరి నుండి వెలివేయబడిన శైలూ (పాయల్ రాజపుత్) కి ఈ హత్యలకు సంబంధం ఏమైనా ఉందా? జమీందారు దేవుడిని నమ్మడు, కానీ అతని భార్య (దివ్యా పిళ్ళై) ఆ వూర్లో అమ్మవారి జాతరకు అయ్యే ఖర్చు ఇస్తూ ఉంటుంది, ఆమె పాత్ర ఏంటి? శైలు చిన్నప్పటి స్నేహితుడు రవి చనిపోయాడా, బతికున్నాడా? అసలు ఈ మిస్టరీ ఏంటి అనేది తెలుసుకోవాలంటే 'మంగళవారం' సినిమా చూడాల్సిందే.

విశ్లేషణ:

దర్శకుడు అజయ్ భూపతి ఈ 'మంగళవారం' సినిమా గురించి చాలా నమ్మకంగా వుండి, ఇందులో ఒక కొత్త పాయింట్ చూపించానని చెప్పాడు. అయితే అతను నిజంగానే ఒక కొత్త నేపధ్యం ఎన్నుకున్నాడు, అయితే అది ఎంతవరకు అందరి ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది అనేది చెప్పడం కష్టం. ఎందుకంటే అతను చెప్పిన పాయింట్ కొంచెం బోల్డ్ గా ఉంటుంది. అజయ్ కథని చాలా ఆసక్తికరంగా మొదలెట్టాడు, మధ్యలో కొంచెం హర్రర్, థ్రిల్లింగ్ పాయింట్స్ చూపించాడు. అసలు కథ రెండో సగంలో మొదలవుతుంది, ఇక్కడ కథ కొంచెం ప్రతీకారం తీర్చుకునే విధంగా ఉంటుంది.

దర్శకుడు అజయ్ అనుకున్న కథా నేపథ్యంకి, దానికి జోడించిన ఈ హత్యలు, ఈ రెండిటిని మీద కలిపే కథనం మీద ఇంకా కొంచెం దృష్టి పెట్టి ఉంటే బాగుండేది. ఎందుకంటే మొదట్లో కొంచెం థ్రిల్లింగ్ సన్నివేశాలు వున్నా, గ్రామ ప్రజలు కొట్టుకోవటం, వాళ్ళ మధ్య వచ్చే కొన్ని సన్నివేశాలు సాగదీతలా అనిపిస్తుంది. గోడమీద పేర్లు రాయటం, ఆ పేర్లు గల వ్యక్తులు చనిపోతూ ఉండటం, ఎవరు దాని వెనక వున్నారు అనే విషయంలో అజయ్ ఆసక్తిని పెంచుకుంటూ వెళ్ళాడు. #MangalavaaramReview అయితే రెండో సగంలో ఎందుకు ఆలా చనిపోతున్నారు అని వివరించాడు బాగానే వుంది, కానీ శైలు పడే ఆవేదన, ఆ భావోద్వేగాలు మీద కొంచెం దృష్టి పెట్టి ఉంటే ఇంకా బాగుండేది. ఎందుకంటే ఆమేథో వచ్చే సన్నివేశాలు, ఆమె నేపధ్యం కుటుంబ ప్రేక్షకులకు చూడటానికి కొంచెం ఎబ్బెట్టుగా ఉండొచ్చు, అది వాళ్ళు ఎలా రిసీవ్ చేసుకుంటారు అనే విషయం చెప్పడం కష్టం. జమీందారు భార్యని చివర్లో ఆలా చూపించటం ఆ పాత్ర అవున్నిత్యం చెడింది.

Mangalavaaram3.jpg

అలాగే రెండో సగంలో శైలు నేపధ్యం వివరించే విధానంలో కొన్ని సన్నివేశాలు సాగదీతలా అనిపిస్తాయి, ముఖ్యంగా శైలు, లెక్టరర్ మధ్య వచ్చే సన్నివేశాలు అంతగా పండవు. తరువాత కొన్ని సన్నివేశాల్లో ఆమె పడే మానసిక వేదన, ఆమెకి ఏమైంది ఎందుకు ఆమె ఆలా ప్రవర్తిస్తుందో చెప్పే విధానం కూడా బాగుంది. కానీ శైలుకుండే ఆ జబ్బు ముందుగానే చెప్పి ఉంటే ఆమె పాత్ర మీద ప్రేక్షకులకి సింపతీ వచ్చేది, కానీ అజయ్ శైలు ప్రతి మగవాడిని ఆకర్షించేస్తోంది కావాలనే అనేట్టు సన్నివేశాలు పెట్టి, ఆ పాత్ర మీద సింపతే లేకుండా చేసాడు. అలాగే ఊరి జమీదారు పాత్ర పరిచయం చెయ్యడం కూడా తన తండ్రి చిత్ర పటానికి చెప్పులతో కొడుతూ చూపిస్తాడు దర్శకుడు, కానీ వెంటనే ఆ వూర్లో అతను అంటే ఎంత గౌరవం అనేది కూడా చూపిస్తాడు. కొన్ని సన్నివేశాలు ఇలా చూపించటం పొంతన లేకుండా కృత్రిమంగా అనిపిస్తూ ఉంటాయి. జమీందారు మీద కూడా అనుమానం కలగటానికి ఆలా చేసాడు అనిపిస్తుంది, కానీ ఆ పాత్ర హుందాతనం పోగొట్టాడు అలా తండ్రిని చెప్పుతో కొట్టడంతో. #MangalavaaramReview ఈ సినిమా మీద మరీ ఎక్కువ అంచనాలు పెట్టుకొని వెళ్లి చూడొద్దు, మామూలుగా చూస్తే పరవాలేదు, కథలో చాలా లాజిక్స్ మిస్సయ్యాడు అజయ్, కానీ ఒక కొత్త పాయింట్ చూపించాడు అది చూడొచ్చు.

ఈ సినిమాకి అజనీష్ లోక్‌నాథ్ అందించిన నేపధ్య సంగీతం ఒక మూల స్థంభం అని చెప్పాలి. అతను ఇంతకు ముందు 'కాంతారా' సినిమాకి సంగీతం ఇచ్చాడు, ఇప్పుడు ఈ సినిమాకి నేపధ్య సంగీతం అద్భుతంగా ఇచ్చాడు. జాతర పాట సినిమాలో మంచి ఆకర్షణ. అలాగే ఇంకో హైలైట్ దాశరథి శివేంద్ర ఛాయాగ్రహణం. గ్రామం, గ్రామంలో జరిగే సన్నివేశాలు, మనుషులు, వాళ్ళమధ్య సాగె సంభాషణ ఇవన్నీ ఎంత సహజంగా ఉండటానికి ఛాయాగ్రహణం ఎంతో ఉపకరించింది. అలాగే పల్లె వాతావరణం, ఆ చక్కని పచ్చని గ్రామీణ నేపధ్యం ఇవన్నీ తన కెమెరాతో బాగా చూపించాడు. మాటలు బాగుంటాయి, నిర్మాణ విలువలు చాలా ఉన్నతంగా వున్నాయి.

ఇక నటీనటుల విషయానికి వస్తే, పాయల్ రాజపుత్ శైలు పాత్రలో చాలా బాగా చేసింది. ఆమె 'ఆర్ఎక్స్ 100' తరువాత ఏదైనా మంచి పాత్ర వుంది అంటే అది ఈ శైలు పాత్ర అని చెప్పాలి. ఆమె కనపడేది రెండో సగంలో అయినా మంచి ప్రతిభ కనపరిచింది. ఒకపక్క గ్లామర్ గా కనపడుతూనే, మంచి నటన కనపరిచే పాత్ర ఇది. ఇక అజయ్ ఘోష్, లక్షణ్ ల మధ్య వచ్చే సన్నివేశాలు వినోదాత్మకంగా ఉంటాయి. నందితా శ్వేతా ఎస్.ఐ గా తన పాత్ర పరిధి మేరకు చేసింది. చైతన్య కృష్ణ (ChaitanyaKrishna) ఆ వూరు జమీందారుగా చాలా చక్కటి హావభావాలని చూపిస్తూ ఆ పాత్రని బాగా ముందుకు తీసుకెళ్లాడు. రవీంద్ర విజయ్, శ్రీతేజ్, శ్రవణ్ మిగతావాళ్ళు తమ పాత్రల పరిధి మేరకు బాగానే చేశారు. #MangalavaaramReview

చివరగా, 'మంగళవారం' ఒక కొత్త కథానేపథ్యం తీసుకొని అల్లిన ఒక థ్రిల్లర్ సినిమా. అజయ్ భూపతి కొంచెం అటు ఇటు తడబడినా ఆసక్తికరంగా వుండే సినిమా అయితే ప్రేక్షకులకి అందించాడు. ఈ సినిమా చూడటానికి కుటుంబ ప్రేక్షకులు కొంచెం దూరంగా ఉండొచ్చు, ఒకసారి అయితే చూడొచ్చు, ఇదొక టైం పాస్ సినిమా.

Updated Date - 2023-11-17T12:53:10+05:30 IST