Aadikeshava movie review: రొటీన్ కథతో తీసిన మసాలా సినిమా ఇది!

ABN , First Publish Date - 2023-11-24T09:22:12+05:30 IST

వైష్ణవ్ తేజ్, శ్రీలీల జంటగా నటించిన 'ఆదికేశవ' సినిమా ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. శ్రీకాంత్ రెడ్డి దీనికి దర్శకుడు, ఇది అతనికి మొదటి సినిమా. నిన్న కొన్ని పట్టణాల్లో ఈ సినిమా ప్రీమియర్స్ కూడా వేశారు, సినిమా ఎలా వుందో చదవండి.

Aadikeshava movie review: రొటీన్ కథతో తీసిన మసాలా సినిమా ఇది!
Aadikeshava movie review

నటీనటులు: వైష్ణవ్ తేజ్, శ్రీలీల, జోజు జార్జి, రాధిక శరత్ కుమార్ (RadhikaSarathKumar), సుమన్, జయప్రకాశ్, సుదర్శన్, అపర్ణా దాస్, సద తదితరులు

సంగీతం: జీవీ ప్రకాష్ కుమార్

ఛాయాగ్రహణం: డడ్లీ

రచన, దర్శకత్వం: శ్రీకాంత్ ఎన్ రెడ్డి

నిర్మాతలు: సూర్యదేవర నాగ వంశి, సాయి సౌజన్య

విడుదల: నవంబర్ 24, 2023

-- సురేష్ కవిరాయని

రేటింగ్: 2 (రెండు)

మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్ (VaishnavTej) 'ఉప్పెన' #Uppena సినిమాతో ఆరంగేట్రం చేసి చాలా పెద్ద విజయాన్ని నమోదు చేసుకున్నాడు. తరువాత వచ్చిన 'కొండపొలం', 'రంగ రంగ వైభవంగా' సినిమాలు అంతంతమాత్రంగానే వున్నాయి. అతనికి ఇప్పుడు ఒక మంచి బ్రేక్ కావాలి, అందుకని ఒక మాస్ అవతార్ లో కనపడాలని 'ఆదికేశవ' #AadikeshavaReview సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. దీనికి శ్రీకాంత్ రెడ్డి (SrikanthReddy) దర్శకుడు, అతనికి ఇదే మొదటి సినిమా. శ్రీలీల (Sreeleela) కథానాయకురాలి, జీవీ ప్రకాష్ కుమార్ (GVPrakashKumar) సంగీతం. పెద్ద నిర్మాణ సంస్థ అయిన ఎంటర్ టైనమెంట్స్ (SitharaEntertainments) ఈ సినిమాని నిర్మించింది, మరి ఈ సినిమా ఎలా వుందో చూవుద్దం. (Aadikeshava movie review)

Aadikeshava

Aadikeshava story కథ:

బాలు (వైష్ణవ్ తేజ్) అల్లరి చిల్లరిగా తిరిగే ఒక మంచి యువకుడు, అతనికి చిన్నపిల్లల మీద అత్యాచారాలు ఎవరైనా చేసినా, ఆడపిల్లలని ఎవరైనా ఇబ్బంది పెట్టినా ఊరుకునే మనస్తత్వం కాదు. అతని తల్లిదండ్రులు (రాధిక శరత్ కుమార్, జయప్రకాశ్) అతన్ని వుద్యోగం చెయ్యమని బతిమాలుతూ వుంటారు, వాళ్ళ కోరిక కాదనలేక ఒక కాస్మొటిక్స్ కంపెనీ కి అప్లై చేస్తాడు. ఆ కంపెనీ సీఈవో చిత్ర (శ్రీ లీల) బాలుని ఇంటర్వ్యూకి చేసి అతను బెస్ట్ అని సెలెక్ట్ చేస్తుంది. తరువాత బాలు వ్యక్తిత్వం చిత్రకు నచ్చి, ఇద్దరూ ప్రేమలో పడతారు. చిత్ర పుట్టినరోజు నాడు, ఆమె తండ్రి అదే కంపెనీ లోనే పనిచేస్తున్న ఇంకొక యువకుడికి చిత్రని ఇచ్చి పెళ్లి చేయాలని ప్రకటన చేసేస్తాడు. అదే వేడుకలో బాలుకు వార్నింగ్ ఇవ్వడానికి కొంతమంది రౌడీలను కూడా పిలిపిస్తాడు. అదే సమయంలో రాయలసీమకు చెందిన ఎమ్మెల్యే మహా కాళేశ్వర్ రెడ్డి (సుమన్) అన్నయ్య (తనికెళ్ళ భరణి) వచ్చి బాలుని అత్యవసరంగా రాయలసీమ తీసుకొని వెళతాడు. ఇదిలా ఉండగా బ్రహ్మపురంలో చెంగారెడ్డి (జోజు జార్జి) అనే అతను అక్రమంగా మైనింగ్ చేయిస్తూ పిల్లలచేత పనులు చేయిస్తూ ఉంటాడు. అతన్ని అడ్డుకునేవాళ్ళందరినీ చంపేస్తూ ఉంటాడు. హైదరాబాదులో కాస్మొటిక్ కంపెనీలో పనిచేసే బాలుకి రాయలసీమకి ఏంటి సంబంధం? బాలు పేరు రుద్రా కాళేశ్వర్ రెడ్డి గా ఎందుకు మారింది? చెంగారెడ్డి, బాలు ఎలా కలుసుకున్నారు, అసలు బాలు నేపధ్యం ఏంటి? ఇవన్నీ తెలియాలంటే 'ఆదికేశవ' సినిమా చూడాల్సిందే. (Aadikeshava Movie Review)

aadikeshavafilm.jpg

విశ్లేషణ:

దర్శకుడు శ్రీకాంత్ రెడ్డి తన మొదటి సినిమా వ్యాపారాత్మకమైన విలువలతో కూడిన కథని ఎంచుకున్నాడు. ఈ సినిమా ప్రచార చిత్రాలు చూస్తేనే అది అర్థం అవుతుంది. అతను ప్రచార చిత్రంలో చెప్పినట్టుగానే ఈ సినిమా కథ మొదటి నుండీ కేవలం కథానాయకుడిని ఒక మాస్ అవతార్ లో చూపించడానికి అన్నట్టుగా సాగుతుంది. అంబులెన్స్ కి దారివ్వకుండా ఒక రౌడీ రోడ్డు మధ్యలో పుట్టినరోజు కేక్ కట్ చెయ్యాలనుకోవటం, కథానాయకుడు అతన్ని కొట్టి అంబులెన్స్ కి దారి చూపించటంతో అతని మాస్ మొదలవుతుంది. బాగానే వుంది కానీ, దర్శకుడు కథ మీద కొంచెం దృష్టి పెట్టి ఉంటే బాగుండేది.

ఎందుకంటే సినిమా సన్నివేశాలు ఏమి జరగబోతాయి అనేవి చాలా సులువుగా ప్రేక్షకులకి అర్థం అయిపోతూ ఉంటాయి. కథానాయకుడు సినిమా కథానాయకురాలి వెనకాల 'మేడం మేడం' అంటూ తిరగటం మనం ఎక్కడో విన్నట్టుంది కదా. అలాగే మొదటి సగం అంతా వినోదాత్మకమైన సన్నివేశాలతో సాగదీసాడు దర్శకుడు. దర్శకుడుకి ఎంటర్ టైన్ చెయ్యడంలో కొంచెం పట్టున్నట్టుగా ఆ సరదా సన్నివేశాలు చూస్తే అర్థం అవుతోంది. ఇక రెండో సగం అంతా రాయలసీమకి షిఫ్ట్ అవుతుంది. ఇక్కడ కూడా దర్శకుడు కథ మీద కాకుండా కొన్ని సన్నివేశాలు సాగదీసేసాడు. భావోద్వేగాలు అంతగా పండలేదు. అదే పోరాట సన్నివేశాలు, అదే రొటీన్ కథ అయిపోవడంతో ఈ సినిమాలో కొత్తదనం లేదు. వ్యాపార విలువలతో సినిమా తీసాడు కాబట్టి, మిగతావి పట్టించుకోనవసరం లేదు. అందరికీ చాలా పెద్ద గొంతులతో రాయలసీమ యాసతో డబ్బింగ్ చెప్పించటంతో, అది వినటానికి కొంచెం బోర్ కొడుతుంది. దానికి తోడు ఆ పోరాట సన్నివేశాలు మరీ ఎక్కువయిపోయాయి, సినిమాలో భావోద్వేగాలు బాగా మిస్ అయ్యాయి. (Aadikeshava Movie Review)

aadikeshavafilmstill.jpg

జీవీ ప్రకాష్ కుమార్ పాటలు జనరంజకంగా వున్నాయి, ముందు వరుసల్లో కూర్చున్న వాళ్ళకి బాగా ఎక్కుతాయి. నేపథ్య సంగీతం మరీ లౌడ్ గా వుంది అనిపించింది. ఛాయాగ్రహణం బాగుంది, సినిమా మీద పెట్టిన ఖర్చు కనిపిస్తుంది, సాంకేతిక విలువలు కూడా బాగున్నాయి. మాటలు అక్కడక్కడా బాగా రాసాడు శ్రీకాంత్. 'పెద్దవాళ్ళకి పనులు లేవు, పిల్లకాయలకి బడుల్లేవు' లాంటివి చాలా మాటలు వున్నాయి.

ఇక నటీనటుల విషయానికి వస్తే వైష్ణవ్ తేజ్ ఒక కమర్షియల్ సినిమాలో కథానాయకుడు ఎలా ఉండాలో ఆలా చేసి చూపించాడు. మొదటి సగంలో సినిమా కథానాయకురాలి చుట్టూ తిరుగుతూ సరదాగా సాగె పాత్ర, రెండో సగం అంతా యాక్షన్. పరవాలేదు బాగానే చేసాడు అనిపించింది. ఇక శ్రీలీల చాలా అందంగా, క్యూట్ గా, చలాకీగా వుంది. అసలు చెప్పాలంటే ఆమె సినిమాకి ఒక హైలైట్ గా వుంది. అంటే ఆమె ఎదో ప్రతిభ చూపే పాత్ర చేసింది అని కాదు, ఆమె సినిమాలో అట్రాక్టివ్ గా ఉంటుంది. ఆమె డాన్సులు ఇరగదీసింది అనే చెప్పాలి. ఆమెకి వైష్ణవ్ కి మధ్య వచ్చే సన్నివేశాలు బాగుంటాయి, అలాగే వైష్ణవ, సుదర్శన్ మధ్య వచ్చే సన్నివేశాలు నవ్విస్తాయి. జోజు జార్జి (JojuGeorge) మలయాళంలో మంచి నటుడు, అతని సినిమాలు అంటే ఓటిటి లో అందరూ చూస్తారు, నాకు కూడా ఇష్టమైన నటుడు. కానీ అతన్ని ఎందుకు ఈ తెలుగు సినిమాలో ఒక రొటీన్ విలన్ గా పెట్టారో అర్థం కాలేదు. అతని వలన సినిమాకి ఎటువంటి ఉపయోగం లేదు. అతనికి బదులు ఒక తెలుగు నటుడికి అవకాశం ఇస్తే బాగుండేదేమో? ఎందుకు తెలుగు నటులు అంటే చులకన అయిపోయారో, ఇతర బాషా నటుల్ని ఎక్కువ పారితోషికాలు ఇచ్చి మరీ వేస్టు చేస్తున్నారు. ఇక రాధిక, జయప్రకాశ్ తల్లిదండ్రులుగా చేశారు. సద, అపర్ణ దాస్ పాత్రలు అంతగా ఆకట్టుకోవు. సుమన్, తనికెళ్ళ భరణి ఇలాంటి పాత్రలు ఎన్నో చేశారు.

Aadikeshava

చివరగా, 'ఆదికేశవ' ఒక రొటీన్ కథతో కేవలం వ్యాపారాత్మక విలువలతో తీసిన సినిమా. చాలా సన్నివేశాలు ఎక్కడో చూసినట్టుగా అనిపిస్తూ ఉంటుంది. కొంతమంది డబ్బు, పరపతి కోసం చిన్నపిల్లల్ని తమ మైనింగ్ వ్యాపారంలో పావులుగా చేస్తూ వాళ్ళని ఎలా వాడుకుంటున్నారు అనే ఇతివృత్తం బాగుంది, కానీ ఆ విషయం తక్కువై, మిగతా విషయాలకి ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చాడు దర్శకుడు. శ్రీలీల డాన్సులు, ఆమెకి వైష్ణవ్ కి మధ్య వచ్చే సన్నివేశాలు సరదాగా బాగుంటాయి. కానీ సినిమా విజయానికి అది సరిపోదు కదా!

Updated Date - 2023-11-24T09:22:13+05:30 IST