సహస్ర ఎవరో సినిమా చూస్తేనే తెలుస్తుంది
ABN, First Publish Date - 2023-11-28T06:01:47+05:30
‘సుడిగాలి’ సుధీర్ కథానాయకుడిగా నటించిన చిత్రం ‘కాలింగ్ సహస్ర’. డాలీషా హీరోయిన్. డిసెంబరు 1న విడుదల కానుంది. ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు అరుణ్ విక్కిరాలా...
‘సుడిగాలి’ సుధీర్ కథానాయకుడిగా నటించిన చిత్రం ‘కాలింగ్ సహస్ర’. డాలీషా హీరోయిన్. డిసెంబరు 1న విడుదల కానుంది. ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు అరుణ్ విక్కిరాలా సోమవారం హైదరాబాద్‌లో విలేకరులతో మాట్లాడారు. ‘‘కాలింగ్ అనేది సిమ్ కార్డ్ కంపెనీ పేరు. సహస్ర అనేది హీరోయిన్ పేరు. అందుకే ఈ చిత్రానికి ఈ పేరు పెట్టాం. ఓ సిమ్ కార్డ్ చుట్టూ కథ నడుస్తుంది. సహస్ర ఎవరనేది సస్పెన్స్. ఆమె ఎవరో తెలియాలంటే సినిమా చూడాలి. సుధీర్ సినిమా అనగానే కామెడీ ఆశిస్తారు. కానీ మా సినిమాలో కామెడీ ఉండదు. సుధీర్ ఒక్క షాట్‌లో కూడా నవ్వడు. కానీ ఎంటర్‌టైన్‌మెంట్ మాత్రం చాలా ఉంటుంది. సినిమా మొదలైన తరవాత సుధీర్‌ని చూస్తున్నాం అనే సంగతి మర్చిపోయి, పాత్రతో, కథతో ప్రయాణం చేస్తారు. ఒక్క సెకను కూడా విసుగు అనిపించదు. శివ బాలాజీ పాత్ర కూడా చాలా కొత్తగా ఉంటుంది. హీరోయిన్ విక్కిరాలా నటనకు మంచి పేరు వస్తుంది. తను చేసిన ఫైట్ సీక్వెన్స్ చూసి కొరియోగ్రాఫర్లే సెట్లో క్లాప్స్ కొట్టేశారు. ‘గూఢచారి’ సమయంలో అడవి శే్‌షకి ఈ కథ చెప్పా. ఆయనకు నచ్చింది. కానీ ప్రాజెక్ట్ ముందుకు వెళ్లలేదు. ‘త్రీ మంకీస్’ సమయంలో సుధీర్‌కి వినిపించా. పట్టాలెక్కడానికి ఇంత సమయం పట్టింద’’న్నారు.