ఆడవాళ్లకూ ఆ అర్హత ఉంది
ABN , First Publish Date - 2023-10-27T01:36:20+05:30 IST
అంటే కేవలం పడక గది సుఖం కోసమే కాదు, మగవాళ్లకు మల్లే గొప్ప నేతలుగా ఎదగడానికి అవసరమైన అన్ని అర్హతలు ఆడవాళ్లకూ ఉన్నాయి’’ అని బాలీవుడ్ నటి కంగనా రనౌత్...

అంటే కేవలం పడక గది సుఖం కోసమే కాదు, మగవాళ్లకు మల్లే గొప్ప నేతలుగా ఎదగడానికి అవసరమైన అన్ని అర్హతలు ఆడవాళ్లకూ ఉన్నాయి’’ అని బాలీవుడ్ నటి కంగనా రనౌత్ బీజేపీ మాజీ ఎంపీ సుబ్రహ్మణ్యస్వామిపై మండిపడ్డారు. దసరా సందర్భంగా ఢిల్లీలోని రామ్‌లీలా మైదానంలో నిర్వహించిన రావణ దహనం కార్యక్రమానికి కంగన ముఖ్య అతిథిగా హాజరై రావణ దహనం చేశారు. ఈ గౌరవం పొందిన తొలి మహిళగా ఆమె చరిత్రలో నిలిచారు. అయితే దీనికి కంగన అర్హురాలు కాదంటూ సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తాయి. కంగన స్విమ్‌సూట్ ధరించిన ఫొటోను ఓ నెటిజన్ ఎక్స్‌లో షేర్ చేసి, ‘మోదీ ప్రభుత్వాన్ని ఎంటర్టైన్ చేస్తున్న ఒకే ఒక బాలీవుడ్ లేడీ’ అని కామెంట్ చేశారు. దీనికి సమర్థనగా కంగనపై సుబ్రహ్మణ్యస్వామి అనుచిత వ్యాఖ్యలు చేశారు. ‘రావణ దహనం కార్యక్రమానికి కంగనను ఆహ్వానించారంటేనే ఆమెకు ప్రభుత్వం ఎంత గౌరవం ఇస్తోందో అర్థం అవుతోంది. ఆమె కోసం ఎస్పీజీ కాస్త ఎక్కువగానే పనిచేస్తోంది. కంగనను ముఖ్య అతిథిగా ఎంపిక చేయడం మర్యాదా పురుషోత్తముని గౌరవం తగ్గించడమే’ అని విమర్శించారు. దీనిపై కంగన స్పందిస్తూ ‘రాజకీయాల్లోకి రావడానికి నాకు నా శరీరం తప్ప మరేమీ అర్హతలు లేవన్నట్లుగా మీ వ్యాఖ్యలు ఉన్నాయి. స్విమ్‌సూట్ ఫొటో గురించి ఇంత నీచంగా మాట్లాడారంటే, మీ స్వభావం ఏమిటో అర్థం అవుతోంది, మహిళల విషయంలో మీ వక్రబుద్ధి తెలుస్తోంది. నా స్థానంలో ఒక యువకుడు ఉండుంటే ఇలాంటి వ్యాఖ్యలు చేసేవారా’ అని కంగన తనదైన శైలిలో ప్రశ్నించారు.