Will there be another chance : మరో ఛాన్స్‌ వస్తుందా..?

ABN , First Publish Date - 2023-08-16T03:33:51+05:30 IST

అవకాశమే అన్నింటికంటే పెద్దది. చిత్రసీమ బలంగా నమ్మేమాట ఇది. ‘ఒక్క ఛాన్స్‌.. ప్లీజ్‌’ అంటూ పరితపించిపోయేది అందుకే. ఆ అవకాశం ఎప్పుడు ఎవరి తలుపు తడుతుందో చెప్పలేం. ఆ ఛాన్సు ఎన్ని మలుపులకు...

Will there be another chance : మరో ఛాన్స్‌ వస్తుందా..?

అవకాశమే అన్నింటికంటే పెద్దది. చిత్రసీమ బలంగా నమ్మేమాట ఇది. ‘ఒక్క ఛాన్స్‌.. ప్లీజ్‌’ అంటూ పరితపించిపోయేది అందుకే. ఆ అవకాశం ఎప్పుడు ఎవరి తలుపు తడుతుందో చెప్పలేం. ఆ ఛాన్సు ఎన్ని మలుపులకు కారణం అవుతుందో ఊహించలేం. తొలిసారి కెమెరా ముందుకు రావడానికి నటీనటులు ఎన్నో కలలు కంటారు. ఛాన్స్‌ వచ్చాక దాన్ని నిలబెట్టుకొన్నారా సరే సరి. లేదంటే మళ్లీ ఎదురు చూపులు తప్పవు. స్టార్‌డమ్‌ అనుభవించాక.. కాస్త బ్రేక్‌ వస్తే, మరో అవకాశం కోసం పడిగాపులు మొదలైపోతాయి. తొలి అవకాశం కోసం ఎదురు చూసేవాళ్లు కొంతమందైతే, ఒకప్పుడు వరుస సినిమాలు చేసి, ఇప్పుడు తమ ఉనికిని చాటుకోవడానికి మళ్లీ ఆపసోపాలు పడుతున్నవాళ్లు ఇంకొంతమంది. టాలీవుడ్‌లో కొందరు హీరోయిన్లు ప్రస్తుతం ఇదే పరిస్థితిలో ఉన్నారు. మరో ఛాన్స్‌ వస్తే.. తమ దూకుడు చూపించడానికి సమాయాత్తం అవుతున్నారు.

కథానాయకుల్లా... హీరోయిన్లకు సుదీర్ఘ ఇన్నింగ్స్‌లు ఉండవు. వాళ్ల కెరీర్‌ స్పాన్‌ చాలా తక్కువ. నాలుగేళ్లు చేస్తే.. ఎక్కువ. అయితే ఈమధ్య కథానాయికలు తమ ఇన్నింగ్స్‌ని చక్కగా ప్లాన్‌ చేసుకొంటున్నారు. కనీసం పదేళ్లయినా చిత్రసీమలో ఉండేలా జాగ్రత్తలు తీసుకొంటున్నారు. తమన్నా, శ్రుతిహాసన్‌, సమంత, అనుష్క, కాజల్‌.. వీళ్లంతా పదేళ్లకు పైబడి ప్రయాణం చేస్తున్న వాళ్లే. ఇప్పుడొస్తున్న నవ కథానాయికలకూ వీళ్లే ఆదర్శం. అయితే.. ప్రతిభ కలిగి, అందచందాలు ఉండి, కొన్ని సినిమాలకే ఇంటిమొహం పట్టినవాళ్లూ కనిపిస్తారు. స్టార్‌ హోదా అనుభవించి, ఇప్పుడు ఖాళీగా ఉన్నవాళ్లూ ఉన్నారు. వాళ్లందరి దృష్టి ఇప్పుడు ‘మరో ఛాన్స్‌’పై పడంది. మీడియం సైజు చిత్రాలకు కొన్నాళ్లు కేరాఫ్‌ అడ్రస్‌గా నిలిచారు రకుల్‌ప్రీత్‌ సింగ్‌, రాశీఖన్నా. వీళ్ల హవా రెండు మూడేళ్లు కొనసాగింది. అయితే ఆ తరవాత ఇద్దరూ సడన్‌గా సైలెంట్‌ అయిపోయారు. రకుల్‌కి తెలుగులో అవకాశాలు రావడం లేదు. ‘బాలీవుడ్‌లో బిజీగా ఉన్నాను. అందుకే తెలుగు సినిమాల్ని పట్టించుకోవడం లేదు’ అని రకుల్‌ అంటున్నా... ఆమెను మన దర్శక నిర్మాతలు ఎప్పుడో పక్కన పెట్టేశారన్నది నిజం. రాశీఖన్నా పరిస్థితీ అంతే. గోపీచంద్‌తో కలిసి నటించిన ‘పక్కా కమర్షియల్‌’ తరవాత రాశీ మరో సినిమా చేయలేదు. ‘ఫర్జీ’ అనే వెబ్‌ సిరీస్‌లో నటించింది కానీ, ఆమెకు ఆ సిరీస్‌ కెరీర్‌ పరంగా ఎలాంటి ప్రయోజనాన్నీ అందించలేదు. వీరిద్దరూ ఇప్పుడు టాలీవుడ్‌లో మరోసారి తమ ప్రతాపం చూపించాలని తాపత్రయ పడుతున్నారు. మెహరీన్‌ కెరీర్‌ కూడా ఇలానే సాగింది. వచ్చిన కొత్తలో వరుసగా సినిమాలు చేసింది. ఇప్పుడు అస్సలు కనిపించడం లేదు. 2022లో విడుదలైన ‘ఎఫ్‌ 3’ తన ఆఖరి తెలుగు సినిమా.

‘జాతిరత్నాలు’ చిత్రంలో ముత్యంలా మెరిసింది ఫరియా అబ్దుల్లా. ఆ సినిమా సూపర్‌ హిట్‌ అయ్యే సరికి అందరి కళ్లూ తనపై పడ్డాయి. కొన్ని ఆఫర్లూ అందాయి. కానీ వాటిని నిలబెట్టుకోలేకపోయింది. ‘రావణాసుర’ తరవాత ఫరియా మరో సినిమా చేయలేదు. ‘కంచె’తో పరిచయమైన ప్రగ్యా జైస్వాల్‌ తొలి నాళ్లలో తన గ్లామర్‌తో అందరిదృష్టినీ ఆకర్షించింది. అయితే.. ఆ వైభవం కూడా కొంత కాలమే నడిచింది. ఇప్పుడు తనక్కూడా అవకాశాలు లేవు. ‘ఉప్పెన’తో ఒక్కసారిగా లైమ్‌లైట్‌లోకి వచ్చింది కృతి శెట్టి. ఆ సినిమాలో అందం, అభినయంతో ఆకట్టుకొంది. భవిష్యత్తులో పెద్ద స్టార్‌ అవుతుందని అంతా అనుకొన్నారు. దానికి తగ్గట్టే అవకాశాలు వచ్చాయి. చక చకా సినిమాలూ చేసేసింది. కానీ.. అన్నీ ఫ్లాపులే. ఆ పరాజయాలు కృతిశెట్టిని ఉక్కిరిబిక్కిరి చేశాయి. ఎన్నో ఆశలు పెట్టుకొన్న ‘కస్టడీ’ కూడా నిరాశ పరచడంతో.. ఇప్పుడు కృతి ఖాళీ అయిపోయింది. తెరపై అందంగా, చలాకీగా కనిపించే కథానాయికల్లో నభా నటేశ్‌ ఒకరు. ‘నన్ను దోచుకొందువటే’ చిత్రంతో టాలీవుడ్‌కు పరిచయం అయింది. ఆ సినిమా పెద్దగా ఆడలేదు కానీ, నటిగా నభాకు మంచి మార్కులే పడ్డాయి. ‘ఇస్మార్ట్‌ శంకర్‌’, ‘సోలో బతుకే సోబెటరు’ సినిమాలు బాగా ఆడాయి. కానీ.. నభాకు ఆ చిత్రాలు ఏమాత్రం కలసి రాలేదు. కాస్త బొద్దుగా మారడం, కొత్త కథానాయికల జోరు పెరగడంతో నభాకు అవకాశాలు దొరకలేదు. ఇప్పుడు నభా కూడా మరో ఛాన్స్‌ కోసం పడిగాపులు కాస్తోంది.

వీళ్లంతా ప్రతిభావంతులైన కథానాయికలే. ఒకప్పుడు వెండితెరపై తమ ప్రతాపం చూపించారు. ఇప్పుడు వీళ్లకో ఛాన్స్‌ కావాలి. అందుకోసం చాలారకాలుగా ప్రయత్నిస్తున్నారు. కాకపోతే.. ఆ అవకాశమే ఎప్పుడు దొరుకుతుందో చెప్పడం కష్టం. ఎందుకంటే.. నవతరం భామల హవా ఎక్కువగా కనిపిస్తోంది. శ్రీలీల లాంటి కొత్తమ్మాయిలు తమ జోరు చూపిస్తున్నారు. వాళ్లని దాటుకొని రావడం ఇప్పట్లో కష్టమే. కాకపోతే.. ఎవరి అదృష్టం ఎప్పుడు ఎలా మారుతుందో ఊహించలేం. ఒక్క సినిమాతో మళ్లీ లైమ్‌ లైట్‌లోకి వచ్చి... విజృంభించిన వాళ్లు చాలామంది ఉన్నారు. ఓటీటీలు, వెబ్‌ సిరీ్‌సలూ ఉధృతంగా ఉన్న ఇలాంటి తరుణంలో ఎప్పుడైనా, ఎక్కడి నుంచైనా ఓ పిలుపు రావొచ్చు. అదే.. వీళ్ల కెరీర్‌కు మలుపు కావొచ్చు.

Updated Date - 2023-08-16T04:16:19+05:30 IST