ప్రతి నెలా ఒక సినిమా విడుదల చేస్తాం

ABN , First Publish Date - 2023-10-28T04:54:50+05:30 IST

కంచర్ల ఉపేంద్ర, సావిత్రీ కృష్ణ హీరోహీరోయిన్లుగా నటిస్తున్న ‘ఉపేంద్రగాడి అడ్డా’ చిత్రం టీజర్‌ను గురువారం రాత్రి ప్రసాద్‌ ప్రీవ్యూ థియేటర్‌లో జరిగిన కార్యక్రమంలో సంగీత దర్శకురాలు శ్రీలేఖ...

ప్రతి నెలా ఒక సినిమా విడుదల చేస్తాం

కంచర్ల ఉపేంద్ర, సావిత్రీ కృష్ణ హీరోహీరోయిన్లుగా నటిస్తున్న ‘ఉపేంద్రగాడి అడ్డా’ చిత్రం టీజర్‌ను గురువారం రాత్రి ప్రసాద్‌ ప్రీవ్యూ థియేటర్‌లో జరిగిన కార్యక్రమంలో సంగీత దర్శకురాలు శ్రీలేఖ విడుదల చేశారు. ఈ చిత్రం విజయవంతం కావాలని అంటూ ఆమె శుభాభినందనలు తెలిపారు. ఆర్యన్‌ సుభాన్‌ ఎస్‌.కె. దర్శకత్వంలో కంచర్ల అచ్యుతరావు ఈ సినిమా నిర్మిస్తున్నారు. ఈ సమావేశంలో నిర్మాత అచ్యుతరావు మాట్లాడుతూ ‘నటుడు కావాలన్న మా అబ్బాయి ఉపేంద్ర కోరికను గమనించి అతన్ని హీరోగా పరిచయం చేస్తూ ఐదు చిత్రాలు ప్రారంభించాం. ఐదో సినిమాగా మొదలైన ‘ఉపేంద్రగాడి అడ్డా’ మొదట విడుదలవుతోంది. సినిమాలోని చివరి పాటను ఇటీవల ఊటీలో చిత్రీకరించాం. ఈ నెల 29న మా అబ్బాయి పుట్టిన రోజు సందర్భంగా ప్రీ రిలీజ్‌ ఫంక్షన్‌ చేస్తున్నాం. నవంబర్‌లో సినిమాను విడుదల చేస్తాం. అలాగే మేం నిర్మిస్తున్న ఇతర సినిమాలను నెలకొక్కటి చొప్పున రిలీజ్‌ చేస్తాం’ అని చెప్పారు. దర్శకుడు మాట్లాడుతూ ‘ప్రేక్షకులకు పూర్తి స్థాయి వినోదం అందించే చిత్రమిది. అలాగే మాస్‌ అంశాలు కూడా ఉన్నాయి. సోషల్‌ మీడియా వల్ల జరుగుతున్న మంచిని, చెడుని ఈ సినిమాలో చూపిస్తున్నాం. నిర్మాత ఇచ్చిన పూర్తి స్వేచ్ఛ వల్ల సినిమాను వేగంగా పూర్తి చేయగలిగాను’ అన్నారు. హీరో ఉపేంద్ర మాట్లాడుతూ ‘నటుడు కావాలన్న నా కోరికను గ్రహించి, మా నాన్న నన్ను హీరోగా పెట్టి ఒక సినిమాకాదు.. ఏకంగా ఐదు సినిమాలు తీయడం అదృష్టంగా భావిస్తున్నాను. అమ్మ, నాన్నల పెళ్లి రోజు కావడంతో ఇవాళ టీజర్‌ విడుదల చేస్తున్నాం’ అన్నారు. ఈ కార్యక్రమంలో సహ నిర్మాతలు కంచర్ల సుబ్బలక్ష్మి, కంచర్ల సునీత, గీత రచయిత జాలాది కుమార్తె విజయ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2023-10-28T04:54:50+05:30 IST