We are proud of you : నిన్ను చూసి గర్విస్తున్నాం
ABN , First Publish Date - 2023-08-25T03:36:53+05:30 IST
‘పుష్ప: ది రైజ్’ చిత్రానికి గాను జాతీయ ఉత్తమనటుడి అవార్డ్ గెలుచుకొని చరిత్ర సృష్టించిన అల్లు అర్జున్‌కు తెలుగు చిత్రసీమ నుంచి అభినందనలు వెల్లువెత్తాయి. నిన్ను చూసి గర్వపడుతున్నాం అంటూ...

‘పుష్ప: ది రైజ్’ చిత్రానికి గాను జాతీయ ఉత్తమనటుడి అవార్డ్ గెలుచుకొని చరిత్ర సృష్టించిన అల్లు అర్జున్‌కు తెలుగు చిత్రసీమ నుంచి అభినందనలు వెల్లువెత్తాయి. నిన్ను చూసి గర్వపడుతున్నాం అంటూ పలువురు సినీ ప్రముఖులు సోషల్ మీడియాలో బన్నీకి అభినందనలు తెలిపారు.
జాతీయ చలనచిత్ర పురస్కారాల విజేతలందరికీ అభినందనలు. తెలుగు చిత్రపరిశ్రమకు ఇది గర్వకారణం. జాతీయ ఉత్తమ నటుడు పురస్కారాన్ని గెలుచుకున్న బన్నీకి నా హృదయపూర్వక అభినందనలు. నిన్ను చూసి గర్వపడుతున్నాను.
చిరంజీవి
తెలుగు చిత్రపరిశ్రమ నుంచి తొలిసారి ఉత్తమ నటుడు అవార్డుకు ఎంపికైన అల్లు అర్జున్‌కు హృదయపూర్వక అభినందనలు. ఇది మనందరం ఆనందించదగ్గ విషయం.
పవన్ కల్యాణ్
కంగ్రాట్స్ బావా. ‘పుష్ప’ చిత్రానికి గాను ఈ పురస్కారానికి తగినవ్యక్తివి నీవే.
ఎన్టీఆర్
నా ప్రియమైన డార్లింగ్ అల్లు అర్జున్‌కు శుభాకాంక్షలు. జాతీయ అవార్డు గెలుచుకున్న తొలి తెలుగు నటుడు అల్లు అర్జున్ అని గర్వంగా చెబుతున్నాను. ‘పుష్ప 2’ ద రూల్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను. నా అభిమానుల తరపున నీకు ప్రత్యేక అభినందనలు.
ప్రభాస్
తెలుగు ప్రేక్షకులు గర్వించేలా చేసిన పుష్పరాజ్, బన్నీ అన్నకు అభినందనలు
విజయ్ దేవరకొండ
‘పుష్ప’ చిత్రంలో మేటి నటనతో జాతీయ స్థాయిలో ఉత్తమ నటుడి పురస్కారం సాధించి, తెలుగు పరిశ్రమలో చరిత్ర సృష్టించిన అల్లు అర్జున్‌కు హృదయపూర్వక అభినందనలు
సూర్య
నా వందో సినిమా ‘గంగోత్రి’తో బన్నీని హీరోగా పరిచయం చేశాను. బన్నీ చిన్నప్పుడే అతని డాన్స్ చూసి పెద్ద స్టార్ అవుతాడని ఊహించి, రూ. 100 అడ్వాన్స్ ఇచ్చాను. ఆ వంద రూపాయలు బన్నీ అమ్మగారు ఇప్పటికీ దాచుకున్నారు. ఇప్పుడతనికి వచ్చిన అవార్డు నాకే వచ్చినంత ఆనందంగా ఉంది. ఇది 68 ఏళ్ల తర్వాత తెలుగు సినిమా గర్వించే రోజు
కె. రాఘవేంద్రరావు
ఇప్పటివరకూ తెలుగు సినీ రంగానికి దక్కని ఓ అద్భుతాన్ని తీసుకొచ్చిన ఘనత ‘పుష్ప’ దర్శక నిర్మాతలు, మన ప్రేక్షకులకు దక్కుతుంది. ముఖ్యంగా మా కుటుంబ గౌరవాన్ని పతాక స్థాయికి తీసుకెళ్లిన మా అబ్బాయి బన్నీకి కృతజ్ఞతలు. ఇది తెలుగు సినిమా చరిత్రలో మర్చిపోలేని రోజు. ఉత్తమ నటుడిగా అవార్డు అందుకోవడానికి అన్ని అర్హతలు ఉన్న వ్యక్తి అల్లు అర్జున్. నిన్ను చూసి గర్వపడుతున్నాను. 69 ఏళ్ల తెలుగు సినిమా కల నేడు నెరవేరింది.
అల్లు అరవింద్
ఇదొక సిక్సర్. జాతీయ పురస్కారాలకు ఎంపికైన సందర్భంగా ‘ఆర్‌ఆర్‌ఆర్’ చిత్రబృందానికి అభినందనలు. పుష్ప... తగ్గేదే లే... ఉత్తమ నటుడిగా ఎంపికైన బన్నీకు శుభాకాంక్షలు
రాజమౌళి
మేము నిర్మించిన ‘పుష్ప’ చిత్రానికి అల్లు అర్జున్‌కు జాతీయ ఉత్తమ నటుడి అవార్డు రావడం చాలా గర్వంగా ఉంది. ఇదొక చరిత్రగా మిగిలిపోతుంది.
నిర్మాతలు నవీన్ యెర్నేని, వై రవిశంకర్
కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన జాతీయ చలనచిత్ర అవార్డుల్లో పలు పురస్కారాలను గెలుపొంది తెలుగు సినీ రంగానికి గొప్ప గుర్తింపు తెచ్చిన విజేతలందరికీ శుభాభినందనలు. ఉత్తమ నటుడు అవార్డ్ గెలుచుకున్న అల్లు అర్జున్‌కు అభినందనలు. అలాగే వివిధ విభాగాల్లో అవార్డులు సొంతం చేసుకున్న ‘ఆర్‌ఆర్‌ఆర్’, ‘ఉప్పెన’, ‘కొండపొలం’ చిత్రాల దర్శక నిర్మాతలకు, సాంకేతిక నిపుణులకూ, ఉత్తమ విమర్శకుడుగా ఎంపికైన పురుషోత్తమాచార్యులకు అభినందనలు.
టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు
అల్లు అర్జున్‌కు జాతీయ స్థాయిలో ఉత్తమ నటుడిగా అవార్డు వచ్చినందుకు సంతోషంగా ఉంది. ఆయన తెలుగు సినిమా స్థాయిని పెంచారు. ‘ఆర్‌ఆర్‌ఆర్’ టీమ్‌కి నా కంగ్రాట్స్.
కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి
‘పుష్ప’, ‘ఆర్.ఆర్.ఆర్’ చిత్ర బృందాలకు నా శుభాకాంక్షలు. అల్లు అర్జున్ చాలా కష్టపడి జాతీయ ఉత్తమ నటుడిగా ఎదిగారు. భవిష్యత్తులో ఆయన మరిన్ని అవార్డులు అందుకోవాలి.
టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి
తొలి సినిమాకే జాతీయ అవార్డు దక్కుతుందని నేను అస్సలు ఊహించలేదు. ‘ఉప్పెన’ కథ విన్నప్పుడే ఈ సినిమాకు జాతీయ అవార్డ్ వస్తుందని చిరంజీవి గారు, మా గురువు సుకుమార్ చెప్పారు. ఇప్పుడది నిజమైంది. విజేతల జాబితాలో ఉత్తమ తెలుగు చిత్రంగా ‘ఉప్పెన’ పేరు వినిపించగానే ఒక్క క్షణం షాకయ్యాను. రూ. 100 కోట్ల వసూళ్లను సాధించి మంచి కమర్షియల్ విజయాన్ని అందుకొంది. పలు అవార్డులూ దక్కాయి. అయితే జాతీయ అవార్డ్ దక్కడం మాత్రం గొప్ప సంతృప్తిని ఇచ్చింది. మా అమ్మకు అవార్డుల గురించి తెలియదు. జాతీయ అవార్డ్ వచ్చిందని మా అమ్మకు చెబితే ‘ఏదో పెద్ద అవార్డ్ వచ్చిందని అంటున్నావు కదా అదే సంతోషం నాయనా’ అన్నారు.
దర్శకుడు బుచ్చిబాబు సానా