మనం సినిమా చేయబోతున్నాం అన్నారు
ABN , First Publish Date - 2023-08-10T04:32:04+05:30 IST
చిరంజీవి హీరోగా మెహర్ రమేశ్ దర్శకత్వం వహించిన చిత్రం ‘భోళాశంకర్’. కీర్తిసురేశ్, తమన్నా కీలకపాత్రలు పోషించారు. అనిల్ సుంకర నిర్మాత. ఈ నెల 11న ఈ చిత్రం విడుదలవుతోన్న...

చిరంజీవి హీరోగా మెహర్ రమేశ్ దర్శకత్వం వహించిన చిత్రం ‘భోళాశంకర్’. కీర్తిసురేశ్, తమన్నా కీలకపాత్రలు పోషించారు. అనిల్ సుంకర నిర్మాత. ఈ నెల 11న ఈ చిత్రం విడుదలవుతోన్న సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు.
నేను పరిశ్రమకు వచ్చేనాటికి చిరంజీవి గారు రాజకీయాల్లో ఉన్నారు. ఆయనతో సినిమా చేస్తానని ఊహించలేదు. ఇప్పుడది నెరవేరింది. ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమా వేడుక కోసం చిరంజీవి గారిని ఆహ్వానించడానికి వెళ్లాను. ‘మిమ్మల్ని కలవాలనే కోరిక ఇన్నాళ్లకు తీరింది’ అన్నాను. ఆయన బదులిస్తూ ‘మనం కలసి సినిమా కూడా చేయబోతున్నాం’ అన్నారు. అప్పటికే నా దగ్గర ‘వేదాళం’ రైట్స్ ఉన్నాయి. చిరంజీవి గారు అంగీకరించడంతో మెహర్ రమేశ్ దర్శకుడిగా ‘భోళాశంకర్’ ప్రాజెక్ట్ మొదలైంది.
ఇదొక మాస్ ఫ్యామిలీ ఎంటర్టైనర్. సినిమా చాలా బాగా వచ్చిందనే నమ్మకం ఉంది. అన్నాచెల్లెళ్ల అనుబంఽధం ప్రేక్షకుల హృదయాలకు హత్తుకుంటుంది. చిరంజీవి గారి చెల్లెలి పాత్రలో కీర్తిసురేశ్‌ను తప్ప మరొకరిని ఊహించలేం.
‘నిర్మాత సెట్‌లో ఉంటే చిరంజీవి గారు చాలా ఆనంద పడతారు’ అని మహేశ్‌బాబు ఓ సందర్భంలో చెప్పారు. అందుకే ‘భోళాశంకర్’ షూటింగ్‌లో 40 రోజులు చిరంజీవిగారితో పాటు ఉన్నాను. చిరంజీవిగారి సమయపాలన అద్భుతం. ఏం చేస్తే నిర్మాణ వ్యయం తగ్గి నిర్మాతకు లాభం కలుగుతుందా, అని ఆయన ఆలోచిస్తారు. త్వరలో బెల్లంకొండ శ్రీనివాస్‌తో ఓ చిత్రం చేస్తున్నాం.