బడ్జెట్‌ని మేం కూడా అదుపులో పెట్టలేకపోతున్నాం

ABN , First Publish Date - 2023-05-07T03:41:37+05:30 IST

వైజయంతీ మూవీస్‌ బాధ్యతల్ని తమ భుజాలపై వేసుకొని, సంస్థని విజయవంతంగా ముందుకు తీసుకెళ్తున్న అక్కాచెళ్లెళ్లు ప్రియాంకాదత్‌, స్వప్నదత్‌. వైజయంతీ మూవీస్‌ సెకండ్‌ ఇన్నింగ్స్‌లో...

బడ్జెట్‌ని మేం కూడా అదుపులో పెట్టలేకపోతున్నాం

వైజయంతీ మూవీస్‌ బాధ్యతల్ని తమ భుజాలపై వేసుకొని, సంస్థని విజయవంతంగా ముందుకు తీసుకెళ్తున్న అక్కాచెళ్లెళ్లు ప్రియాంకాదత్‌, స్వప్నదత్‌. వైజయంతీ మూవీస్‌ సెకండ్‌ ఇన్నింగ్స్‌లో వచ్చిన ‘మహానటి’, ‘సీతారామం’ చిత్రాలు ఈ సంస్థ పేరు ప్రఖ్యాతల్ని రెట్టింపు చేశాయి. ఇప్పుడు ‘అన్నీ మంచి శకునములే’తో మరో మంచి చిత్రాన్ని అందించే ప్రయత్నం చేశారు. ఈనెల 18న ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నారు. ఈ సందర్భంగా ప్రియాంక, స్వప్న ఈ సినిమా గురించి ఏం చెప్పారంటే...?

‘‘ఓ వైపు ‘ప్రాజెక్ట్‌ కె’లాంటి భారీ చిత్రాన్ని నిర్మిస్తూ, ఇలాంటి చిన్న సినిమాలు ఎందుకు చేస్తున్నారు? అని అందరూ అడుగుతున్నారు. మాకు చిన్న సినిమా, పెద్ద సినిమా అనే తేడా లేదు. ఈరోజుల్లో కథే కీలకం. ఓ మంచి కథ చెప్పాలనుకొన్నాం. అందులో భాగంగానే ‘అన్నీ మంచి శకునములే’ తీశాం. వేసవిలో చల్లటి అనుభూతి ఇచ్చే సినిమా ఇది. ఇంటిల్లిపాదీ చూసేలా ఉంటుంది. సంతోష్‌ శోభన్‌కి ఈ సినిమాతో చాలా మంచి పేరొస్తుంది. ‘మహానటి’, ‘సీతారామం’ లాంటి చిత్రాలు మా సంస్థ ప్రతిష్టని పెంచాయి. వాటితో బాధ్యత కూడా పెరిగింది. ఏం చేసినా ఆచి తూచి చేయాలనుకొంటున్నాం. ఒకేసారి రెండు మూడు సినిమాలు నెత్తిన పెట్టుకోవాలని లేదు. కొవిడ్‌ వల్ల.. కొన్ని సినిమాల బాధ్యతలన్నీ ఒకేసారి మీద పడ్డాయి. మా నాన్నగారు బడ్జెట్‌కి మించి ఖర్చు చేసేవాళ్లు. మేం మాత్రం.. అనుకొన్న బడ్జెట్‌లోనే సినిమా తీయాలనుకొంటుంటాం. కానీ మేం కూడా బడ్జెట్‌ని అదుపులో పెట్టలేకపోతున్నాం. ‘ప్రాజెక్ట్‌ కె’ అప్‌ డేట్స్‌ కూడా రావాల్సిన సమయంలోనే వస్తాయి’’ అని స్వప్నదత్‌ అన్నారు.

‘‘ఈ సినిమాలో స్టార్‌ కాస్ట్‌ బలంగా ఉంది. తమిళ, కన్నడ చిత్రాలకు చెందిన నటీనటులు ఉన్నారు. అయితే వాళ్లని మేం మార్కెట్‌ లెక్కలు వేసుకొని తీసుకోలేదు. కథకు, ఆ పాత్రకు ఎవరు కావాలో వాళ్లనే తీసుకొన్నాం. ఈ చిత్రంలో ఊర్వశిగారు నటించారు. ఆమెది చాలా చిన్న పాత్ర. కానీ ఆమె మాత్రమే చేయగలిగే పాత్ర అది. ఏ పాత్రకు ఎవరిని తీసుకోవాలన్నది టీమ్‌ అంతా కలసి తీసుకొనే నిర్ణయం. మేం కథ వింటున్నప్పుడు ఓ ప్రేక్షకుల్లానే ఆలోచిస్తాం. అప్పుడే జడ్జిమెంట్‌ కుదురుతుంది. నాన్నగారు, నాగి ఎలాగూ ఉన్నారు. వాళ్ల అనుభవాలు మాకు ఉపయోగపడతాయి’’ అని ప్రియాంకాదత్‌ అన్నారు.

Updated Date - 2023-05-07T03:41:37+05:30 IST