అలాంటి పాత్రలో కనిపించాలని ఉంది!
ABN , First Publish Date - 2023-01-21T05:35:43+05:30 IST
‘ప్రేమిస్తే’, ‘యువసేన’ తదితర చిత్రాలతో ఆకట్టుకొన్నారు భరత్. తమిళ చిత్రసీమలో బిజీ హీరో అయిపోయారు...
‘ప్రేమిస్తే’, ‘యువసేన’ తదితర చిత్రాలతో ఆకట్టుకొన్నారు భరత్. తమిళ చిత్రసీమలో బిజీ హీరో అయిపోయారు. చాలా కాలం తరవాత తెలుగులో చేసిన చిత్రం ‘హంట్’. సుధీర్‌బాబు కథానాయకుడిగా నటించిన ఈ చిత్రాన్ని ఈనెల 26న విడుదల చేస్తున్నారు. ఈ సందర్భంగా భరత్ మాట్లాడుతూ ‘‘దాదాపు పన్నేండేళ్ల తరవాత తెలుగులో నటిసున్నాను. ఈ గ్యాప్‌లో కొన్ని అవకాశాలు వచ్చాయి. కానీ తమిళ, మలయాళ చిత్రసీమల్లో బిజీగా ఉండడం వల్ల చేయలేదు. దర్శకుడు మహేశ్ కథ చెప్పగానే బాగా నచ్చింది. సుధీర్‌బాబు నాకు చాలాకాలంగా తెలుసు. మంచి స్నేహితుడు. శ్రీకాంత్‌గారితో కూడా పరిచయం ఉంది. అందుకే ఈ సినిమాలో నటించడానికి ముందుకొచ్చా. ఆర్యన్ దేవ్ అనే ఐపీఎస్ అధికారి పాత్రలో కనిపించనున్నా. సుధీర్, శ్రీకాంత్ పాత్రలతో పోటా పోటీగా ఆర్యన్ క్యారెక్టర్ తీర్చిదిద్దారు. యాక్షన్, ఎమోషన్, క్రైమ్.. ఇలా అన్ని అంశాలూ ఈ కథలో ఉంటాయి. యాక్షన్ సీన్లకు పెద్ద పీట వేశారు. అందుకోసం విదేశాల నుంచి ఫైట్ మాస్టర్లని తీసుకొచ్చారు. తెలుగులో ఈ చిత్రం నాకు మంచి పేరు తీసుకొస్తుందనే నమ్మకం ఉంది. మంచి అవకాశాలు వస్తే తెలుగులో తప్పకుండా నటిస్తా. అల్లు అర్జున్‌తో ఓ సినిమా చేయాలని ఉంది. రాజమౌళి, సుకుమార్ ఈ దర్శకులందరితోనూ కలిసి పనిచేయాలని ఉంది. నేను ఇప్పటి వరకూ రకరకాల పాత్రలు చేశా. కానీ పూర్తి స్థాయి కామెడీ పాత్ర చేయలేదు. అలాంటి పాత్ర లో కనిపించాలని ఉంది.’’న్నారు.