విశ్వనాథుడి విశ్వరూపం సంగీతం, సాహిత్యం.. అంతటా ఆయనే!

ABN , First Publish Date - 2023-02-04T04:42:35+05:30 IST

‘‘కథకుడు కథను రూపొందిస్తాడు. సంభాషణల రచయిత సంభాషణలు రాస్తాడు. పాటల రచయిత పాటలు అల్లుతాడు.

విశ్వనాథుడి విశ్వరూపం సంగీతం, సాహిత్యం.. అంతటా ఆయనే!

‘‘కథకుడు కథను రూపొందిస్తాడు. సంభాషణల రచయిత సంభాషణలు రాస్తాడు. పాటల రచయిత పాటలు అల్లుతాడు. డాన్స్‌ డైరెక్టర్‌ నృత్య రీతులు సమకూరుస్తాడు. మేకప్‌ ఆర్టిస్టు మేకప్‌ చేస్తాడు. ఇవన్నీ అయ్యాక దర్శకుడు దర్శకత్వం మాత్రమే చేస్తాడు’’ అని చాలామంది భావిస్తుంటారు. కానీ వాస్తవంగా సినిమాకు సంబంధించిన ఈ అన్ని విభాగాల్లో దర్శకుడి పాత్ర చాలా ఉంటుంది. అందులో కె.విశ్వనాథ్‌ వంటి దిగ్దర్శకుడి పాత్ర మరింత ఎక్కువగా ఉంటుంది.

తెలుగు సినిమా చరిత్రలో అతి గొప్పవిగా చెప్పుకోదగ్గ సన్నివేశాలు, సంభాషణలు, పాటలు, సంగీతం అన్నీ విశ్వనాథ్‌ సినిమాల్లోనే కనిపిస్తాయి. అదే రచయితలు, సంగీత దర్శకులు వేరే వారి సినిమాల్లో అంత గొప్పగా రాయలేరు. సంగీతం చేయలేరు. ప్రతి కళాకారుడూ తన అత్యుత్తమ ప్రతిభను చూపించే అవకాశం విశ్వనాథ్‌ సినిమాల్లోనే దొరుకుతుంది.

ఇలా జరగాలంటే ఆ దర్శకుడికి అన్ని రంగాల్లో ప్రవేశం, ఒకింత ప్రతిభ ఉండాలి. ఆయా రచయితలకు, సంగీత దర్శకులకు తనకు ఏం కావాలో స్పష్టంగా, హృద్యంగా చెప్పగల నేర్పు ఉండాలి. తనకు కావాల్సింది వచ్చేదాకా వదిలిపెట్టనంత పట్టుదల, ఓర్పు ఉండాలి. అవన్నీ విశ్వనాథ్‌తో పుష్కలంగా ఉన్నాయి కాబట్టే ఆయన సినిమాలు కావ్యాలై చరిత్రలో నిల్చిపోయాయి. దర్శకుడైన విశ్వనాథ్‌ ఇతర రంగాల్లో చూపిన ప్రతిభకు ఉదాహరణలు మచ్చుకు కొన్ని...

టాక్సీ డ్రైవర్‌ ప్రశంస

విశ్వనాథ్‌ అందుకొన్న అవార్డులు, రివార్డులూ లెక్కగట్టలేం. ‘విశ్వనాథ్‌ సినిమా తీస్తే... అవార్డు ఖాయం’ అనేంత ధీమా. ఆయనకి కూడా ఈ పురస్కారాలు ఓ దశలో రొటీన్‌ అయిపోయాయి. అయితే ఓ టాక్సీ డ్రైవర్‌ ఇచ్చిన ప్రశంస మాత్రం ఆయన గుండెల్లో పెట్టుకొన్నారు. ‘నా జీవితంలో అందుకొన్న అతి గొప్ప అవార్డు అదే’ అంటారు. వివరాల్లోకి వెళ్తే...

‘శంకరాభరణం’ విడుదలైన తొలి రోజులు అవి. విశాఖపట్నంలో టాక్సీ ఎక్కారు విశ్వనాథ్‌. డ్రైవర్‌కి విశ్వనాథ్‌ ఎవరో తెలీదు. పెద్దగా చదువుకోలేదు కూడా. సరదాగా డ్రైవర్‌తో మాట కలుపుతూ ‘ఈ మధ్య ఏ సినిమా చూశావ్‌’ అని ఆరా తీస్తే... ‘శంకరాభరణం చూశా.. ఎనిమిదిసార్లు’ అన్నాడట. ‘అంతగా ఏం నచ్చింది..?’ అని అడిగితే.. ‘అదేం తెలీదు సార్‌. కానీ.. థియేటర్లో కూర్చుంటే, గుళ్లో కూర్చున్నట్టే అనిపించింది’ అన్నాడట. దాంతో... పొంగిపోయారు విశ్వనాథ్‌. ‘‘శంకరాభరణం తీసుకొచ్చిన గౌరవం అంతా ఇంతా కాదు. ‘సిరివెన్నెల’ చిత్రీకరణ జైపూర్‌లో చేద్దామనుకొన్నాం. కానీ అనుమతులు రాలేదు. అజ్మీర్‌ కలెక్టర్‌ దగ్గరకు వెళ్లాను. తనది గుజరాత్‌. నన్ను చూడగానే ‘మీరు శంకరా భరణం తీసిన దర్శకుడు కదా’ అని వచ్చి కాళ్లమీద పడినంత పని చేశాడు. వెంటనే పర్మిషన్లు ఇచ్చేశాడు. మన భాష కాదు, మన ప్రాంతం కాదు. అయినా సరే... మన సినిమాపై తాను చూపించిన గౌరవం అది. ఇలాంటి అద్భుతమైన అనుభవాలు ‘శంకరాభరణం’ ఎన్నో ఇచ్చింది’’ అని గుర్తు చేసుకొనేవారు విశ్వనాథ్‌.

స్క్రీన్ ప్లే, ఎడిటింగ్‌ తాగుబోతు అని తిట్టి... తానే తాగుబోతై...

2.jpg

సాగర సంగమం చిత్రం ప్రథమార్ధం మొత్తం వర్తమానం... ఫ్లాష్‌ బ్యాక్‌... వర్తమానం... మళ్లీ ఫ్లాష్‌ బ్యాక్‌ పద్ధతిలో సాగుతుంది. ఫ్లాష్‌ బ్యాక్‌లో కమల్‌ హాసన్‌ గొప్ప డాన్సర్‌. నాట్యాన్ని ఓ కళగా చూస్తాడే తప్ప దాని ద్వారా డబ్బు సంపాదించాలని అనుకోడు. కమల్‌ స్నేహితుడు శరత్‌బాబు అతన్ని బలవంతంగా ఓ సినిమా డాన్స్‌ డైరెక్టర్‌ (మిశ్రో) దగ్గరికి తీసుకువెళ్తాడు. ఆ డాన్స్‌ డైరెక్టర్‌ గ్లాసులో మందు పోసుకుని తాగుతూ ఓ మంచి పాటకు కమల్‌ హాసన్‌తో అసభ్యమైన స్టెప్పులు వేయిస్తాడు. దానితో కమల్‌ హాసన్‌ తాను మహా పాపం చేసినట్టు భావించి రోడ్డు మీద ఉన్న వినాయకుడి విగ్రహం ముందు నిలబడి ప్రాయశ్చిత్తంగా శాస్త్రీయ నృత్యం చేయడం ప్రారంభిస్తాడు. ఇంతలో శరత్‌ బాబు వచ్చి అతన్ని ఆపుతాడు. ‘‘ఏమిట్రా పిచ్చెత్తినట్టు రోడ్డు మీద ఆ డాన్స్‌?’’ అంటూ మందలిస్తాడు. అప్పుడు కమల్‌ హాసన్‌ ఆ సినీ డాన్స్‌ డైరెక్టర్‌ గురించి ప్రస్తావిస్తూ ‘‘వాడో పచ్చి తాగుబోతు. వాడి దగ్గరకి నన్ను ఎందుకు పంపించావు?’’ అంటూ శరత్‌బాబుతో గొడవ పడతాడు. కట్‌ చేస్తే... నెక్ట్స్‌ సీన్‌ వర్తమానంలోకి మారుతుంది. తెగ తాగి పడిపోయిన కమల్‌ హాసన్‌ను శరత్‌ బాబు రిక్షాలో ఇంటికి తీసుకువెళ్తున్న దృశ్యం ప్రత్యక్షమవుతుంది. అంత గొప్ప కమల్‌ హాసన్‌ ఇంతగా ఎలా పతనమైపోయాడనే ఆసక్తి, ఆవేదన ప్రేక్షకుడికి కలుగుతాయి. విశ్వనాథ్‌ స్ర్కీన్‌ ప్లే, ఎడిటింగ్‌ (పర్యవేక్షణ) ప్రతిభకు ఇదో గొప్ప నిదర్శనం.

గేయ సాహిత్యం నా కన్నులు చూడని రూపం..

32.jpg

సిరివెన్నెల సినిమాలో సర్వదమన్‌ బెజర్జీ వేణువు వాయిస్తుంటాడు. కానీ ఆయనకు శాస్త్రీయ సంగీతం రాదు. గుడ్డివాడు కావడంతో రాగాలంటే ఏమిటో, వాటిలో ఉండే అనుభూతి ఏమిటో సరిగా తెలియదు. ఆ పరిస్థితుల్లో మున్‌మూన్‌ సేన్‌ అతడికి ఆ అనుభూతిని తెలియజేస్తుంది. దానితో అతడు గొప్ప సంగీత విద్వాంసుడిగా మారతాడు. ఆమెను దేవతగా ఆరాధిస్తూ ఆమెనే పెళ్లి చేసుకోవాలని అనుకుంటాడు. కానీ వాస్తవానికి మున్‌మూన్‌ సేన్‌ ఒక వేశ్య. తాను అపవిత్రురాలినని ఆమె భావిస్తుంటుంది. తన లాంటి వేశ్యకు బెనర్జీ వంటి కల్మషం లేని వ్యక్తిని పెళ్లి చేసుకునే అర్హత లేదని అనుకుంటుంది. కానీ పైకి ఏవేవో ఉత్తుత్తి కారణాలు చెబుతూ పెళ్లికి నిరాకరిస్తుంది. ఆమె వేశ్య అని తెలియని బెనర్జీ ఆమె చెప్పిన ఉత్తుత్తి కారణాలన్నింటినీ కొట్టి పారేస్తుంటాడు. ఆ సందర్భంలో వచ్చే పాట సిరి వెన్నెల సీతారామశాస్త్రి రాసినప్పటికీ అందులో విశ్వనాథ్‌ సృష్టించిన సన్నివేశ బలమే ఎక్కువగా కనిపిస్తుంది. ‘‘నా కన్నులు చూడని రూపం... గుడిలో దేవత ప్రతిరూపం... నీ రూపం’’ అని బెనర్జీ పాడతాడు. అతడి కోణంలో చూస్తే ‘‘నేను గుడ్డివాడిని కాబట్టి నిన్ను చూడలేను. నువ్వు నాకు దేవత లాంటి దానివి’’ అని అర్థం. కానీ మరో కోణంలో చూస్తే... నా కన్నులు చూడని రూపం అంటే ఆమె చీకటి జీవితం అని అర్థం. గుడిలో దేవతలకు వస్త్రాలు ఉండవంటారు. గుడిలో దేవత ప్రతిరూపం అంటే వస్త్రాలు లేని స్త్రీ అని అర్థం. (ఇక్కడ మున్‌మూన్‌ సేన్‌ స్విమ్‌ సూట్‌లో ఉండి విటులతో గడుపుతున్న దృశ్యాలు చూపిస్తారు) ఇటువంటి మహోన్నత సాహిత్యం రాయడంలో రచయిత పాత్ర ఎంత ఉందో దర్శకుడి పాత్ర అంతకంటే ఎక్కువే ఉంటుంది.

సాగర సంగమం చేయనన్న కమల్‌

52582.jpg

‘సాగర సంగమం’ ఓ ఆల్‌టైమ్‌ క్లాసిక్‌. ఈ సినిమా ఎన్నిసార్లు చూసినా... గుండె చమ్మగిల్లుతుంది. నాట్యానికి సంబంధించిన కథే కానీ, ఇందులో ప్రేమ, స్నేహం, సున్నితమైన భావోద్వేగాలూ అన్నీ ఉంటాయి. కమల్‌హాసన్‌ నటనా పటిమకు ఇందులో బాలు పాత్ర అద్దం పడుతుంది. ఇప్పటికీ కమల్‌ ‘నా బెస్ట్‌ ఫిల్మ్‌ ఇదే’ అంటుంటారు. నిజానికి ఈ పాత్ర చేయడానికి కమల్‌ అంగీకరించలేదు. ఎందుకంటే ఇందులో వయసు పైబడిన పాత్రలో కనిపించాలి. అప్పటికే తమిళంలో ‘కడల్‌ మీంగల్‌’ అనే ఓ సినిమాలో ఇలానే వృద్ధ పాత్రలో కనిపిస్తే, ఆ సినిమా ఫ్లాప్‌ అయ్యింది. దాంతో కమల్‌ భయపడ్డారు. కానీ నిర్మాత ఏడిద నాగేశ్వరరావు.. ‘ఈ సినిమా చేస్తే మీతోనే చేస్తాం’ అని కమల్‌ వెనుక దాదాపు ఐదు నెలలు తిరిగారు. చివరికి కమల్‌ ఒప్పుకోవడం, ఈ సినిమా పట్టాలెక్కడం జరిగిపోయాయి. జయప్రద పాత్రలో ముందు జయసుధని అనుకొన్నారు. కానీ జయసుధ కాల్షీట్లు అందుబాటులో లేకపోవడంతో జయప్రదని ఎంచుకొన్నారు. ‘శంకరాభరణం’ సినిమాలో మంజుభార్గవి కంటే ముందుగా జయప్రదనే ఎంచుకొన్నారు. కానీ అప్పుటికి జయప్రద బిజీగా ఉండడంతో ‘శంకరాభరణం’ మిస్‌ అయ్యింది. అందుకే... జయప్రద ఈ అవకాశాన్ని ఎట్టిపరిస్థితుల్లోనూ వదులుకోకూడదని బాలీవుడ్‌లో బిజీగా ఉన్నా సరే, ఆ సినిమాలన్నీ వదులుకొని ‘సాగర సంగమం’ ఒప్పుకొన్నారు. ఏడిద నాగేశ్వరరావు తీసిన ‘సీతాకోక చిలుక’ చిత్రానికి ముందు అనుకొన్న పేరు.. ‘సాగర సంగమం’. ఈ పేరుతో ఓ పాట కూడా చేశారు. అప్పుడు ఈ టైటిల్‌ పెట్టలేకపోయామని.. విశ్వనాథ్‌ సినిమాకి ‘సాగర సంగమం’ అనే టైటిల్‌ ఫిక్స్‌ చేశారు.

స్వర కల్పన హంసానంది రాగమై...

సాగర సంగమం సినిమా క్లైమాక్స్‌లో కమల్‌ హాసన్‌ మరణం ముంగిట ఉంటాడు. శైలజకు నాట్య శిక్షణ ఇచ్చి ఆమె రూపంలో తనలోని కళాకారుణ్ని బతికించుకోవాలన్న తపనతో ఆమెకు డాన్స్‌ నేర్పిస్తుంటాడు. శైలజ మాత్రం అతణ్ని ద్వేషిస్తూ ఉంటుంది. డాన్స్‌ చేస్తూ అతన్ని కాలితో తన్నుతుంది కూడా! మరణం అంచుల్లో ఉన్న కమల్‌ అటువంటి శిష్యురాలికి డాన్స్‌ నేర్పే సన్నివేశానికి ‘‘వేదం... అణువణువున నాదం. నా పంచ ప్రాణాల నాట్య వినోదం’’ అంటూ వేటూరి అద్భుతంగా పాట రాశారు. దానికి ఇళయరాజా ముందుగానే స్వరం ఇచ్చారు. ఈ పాటకు ఇళయరాజా వినిపించిన రాగాల్లో విశ్వనాథ్‌ హంసానంది రాగాన్ని ఎంపిక చేసుకున్నారు. వేదం ప్రధానంగా రేవతి రాగంలో ఉంటుంది. అందులోని మూడు ప్రధాన స్వరాలు (షట్జమం, శుద్ధ రిషభం, కాకలి నిషాదం) హంసానందిలో కూడా ఉంటాయి. అట్లాగే కల్యాణి వంటి కళాత్మక రాగాల్లో వాడే ప్రతిమధ్యమం కూడా హంసానందిలో ఉంటుంది. అంటే అటు వైరాగ్యాన్ని, ఇటు కళల్ని మేళవించిన రాగాన్ని సందర్భానుసారంగా ఎంచుకోవడం విశ్వనాథ్‌ సంగీత ప్రతిభకు అద్దం పడుతుంది.

డైలాగ్‌ మనలాంటి తుచ్ఛులు

247.jpg

శ్రుతిలయలు సినిమాలో రాజశేఖర్‌ గొప్ప సంగీత విద్వాంసుడు. జయలలిత అతన్ని వలలో వేసుకుంటుంది. అతనితో సంగీత కచేరీల కాంట్రాక్టు మీద సంతకం చేయించుకుంటుంది. అప్పట్నుంచి రాజశేఖర్‌ మద్యానికి, మగువకు బానిసై పక్కదారి పడతాడు. రాజశేఖర్‌ను మార్చడానికి అతడి భార్య సుమలత, తమ కొడుకైన షణ్ముఖ శ్రీనివా్‌సతో సహా అతడి పక్కింట్లో దిగుతుంది. క్రమేపీ రాజశేఖర్‌లో మార్పు వస్తుంది. తాను సంగీతాన్ని వదిలి తప్పుదారి తొక్కానన్న ఆవేదన అతనిలో మొదలవుతుంది. మరోవైపు షణ్ముఖ శ్రీనివాస్‌ గొప్పగా పాడడంతోపాటు అద్భుతంగా డాన్స్‌ కూడా చేస్తుంటాడు. దీంతో జయలలిత కన్ను అతడిపై పడుతుంది. అతడితో కాంట్రాక్టుపై సంతకం చేయించుకోవాలని ప్రయత్నిస్తుంది. కానీ రాజశేఖర్‌ దాన్ని అడ్డుకుంటాడు. దీంతో జయలలిత రాజశేఖర్‌తో గొడవకు దిగుతుంది. ‘‘నన్ను పెట్టుకున్నట్టే ఆ కుర్రాణ్ని కూడా నీ గుప్పిట్లో పెట్టుకోడానికి నేను అంగీకరించను’’ అని రాజశేఖర్‌ ఎదురు తిరుగుతాడు. ‘‘నా దగ్గర ఉండి నువ్వేమీ నష్టపోలేదే? నీ సంగీతాన్ని బతికించి ప్రజలకు అందించింది నేను’’ అని జయలలిత అంటుంది. దీంతో రాజశేఖర్‌ ‘‘అజరామరమైన సంగీతాన్ని మనలాంటి తుచ్ఛులు బతికించక్కర్లేదు’’ అని ఆవేదనతో బదులిస్తాడు. ఇక్కడ సంభాషణల రచయిత ఆకెళ్ల ‘‘మనలాంటి తుచ్ఛులు’’ అని రాయడం నిజంగా అద్భుతం. ఎందుకంటే తాను పతనమైపోవడం పట్ల రాజశేఖర్‌ మనసులో ఎంత ఆవేదన ఉందో ‘‘మనలాంటి తుచ్ఛులు’’ అనడంలో కనిపిస్తుంది. ఈ సన్నివేశానికి సంబంధించి విశ్వనాథ్‌ నుంచి అద్భుతమైన బ్రీఫింగ్‌ ఉంటే తప్ప రచయిత నుంచి ఇంత గొప్ప డైలాగ్‌ రావడం అసాధ్యం.

మేకప్‌ గడ్డం కింద పుట్టుమచ్చ

2543.jpg

స్వయంకృషి సినిమాలో చిరంజీవి ఓ చెప్పులు కుట్టే వ్యక్తి. విజయశాంతి అతన్ని ప్రేమిస్తుంది. పెళ్లి చేసుకోవాలనుకుంటుంది. అయితే చిరంజీవి ఓ పిల్లవాణ్ని పెంచుకుంటుంటాడు. తనకు, విజయశాంతికి పెళ్లయి పిల్లలు పుడితే ఆ పిల్లవాణ్ని సరిగా చూడలేకపోతామేమో అనే చిన్న అనుమానం చిరంజీవికి ఉంటుంది. ఇది గ్రహించి విజయశాంతి పిల్లలు పుట్టకుండా ఆపరేషన్‌ చేయించుకుంటుంది. ఈ సినిమాలో విజయశాంతికి పల్లెటూరి పిల్ల గెటప్‌ వేశారు. అయితే విశ్వనాథ్‌ మేకప్‌ ఆర్టిస్టుకు చెప్పి విజయశాంతి ముఖంపై గడ్డం కింద చిన్న పుట్టుమచ్చను పెట్టించినట్టు సమాచారం. గడ్డం కింద పుట్టుమచ్చ ఉన్న స్త్రీలకు పిల్లలు కలగరని కొన్ని సాముద్రిక గ్రంథాల్లో ఉందట! అందుకని కావాలని ఆ మచ్చ పెట్టించినట్టు చెబుతారు. ఆ నమ్మకం గురించి సామాన్య ప్రజలెవరికీ తెలియకపోయినా... ఆ ఫీల్‌ మాత్రం వారికి కన్వే అవుతుందని విశ్వనాథ్‌ అభిప్రాయమట!

ఆయన విలన్లు ఎంత మంచివాళ్లో?

సినిమాలో విలన్‌ అంటే ఎలా ఉండాలి? క్రూరంగా ఉండాలి. విలన్‌ ఎంత క్రూరంగా ఉంటే హీరో అంత ఎలివేట్‌ అవుతాడనేది చాలామంది కథకులకు, దర్శకులకు, ప్రేక్షకులకు కూడా ఉన్న అభిప్రాయం. క్రూరం అంటే? మంచివాళ్లను తిట్టాలి, కొట్టాలి..... ఇంకా క్రూరం అంటే? తనకు అడ్డొచ్చిన వారిని అడ్డంగా నరికేయాలి. మరీ క్రూరం అంటే...? హీరోను చంపమని తనవాళ్లని పంపినప్పుడు వాళ్లు చంపలేక హీరో చేతిలో దెబ్బలు తిని తిరిగి వస్తే తన మనుషుల్ని తానే చంపెయ్యాలి..... ఇక అత్యంత క్రూరం అంటే... హీరో విలన్‌ కొడుకును కాపాడితే ‘‘నువ్వు కాపాడిన ఎంగిలి ప్రాణం నాకు వద్దు’’ అంటూ తన సొంత కొడుకును తానే చంపేసుకోవాలి. ఇలా విలన్‌ క్రూరత్వాన్ని పెంచుకుంటూ పోయేకొద్దీ హీరో బాగా ఎలివేట్‌ అవుతాడన్న భావన బలంగా ఉంది. కానీ కళాతపస్వి కె.విశ్వనాథ్‌ విలన్లు ఇందుకు పూర్తి భిన్నం. ఓ చిన్న పిల్లవాడు తనకంటే బాగా పాడుతున్నాడని ఓ గాయకుడు అసూయ పడడం విలనీ అవుతుందా? మరో గాయకుడు తన భార్యను వదిలిపెట్టి ఓ అమ్మాయితో ఉంటూ సంగీతాన్ని నిర్లక్ష్యం చేయడం విలనీ అవుతుందా? విశ్వనాథ్‌ సినిమాల్లో అవుతుంది మరి! ఆయన సినిమాల్లో ఉన్నత విలువలు కలిగిన వ్యక్తులు ఉంటారు. ఉన్నతాదర్శాలు ఉంటాయి. లౌకిక సుఖాల్ని ఆశించకుండా కళలకు ప్రాణమిచ్చే వారుంటారు. అలాంటి మహాత్ముల మధ్య చిన్న చిన్న తప్పులు చేసేవారు, చిన్న చిన్న ఈర్ష్యాద్వేషాలు కలిగిన వారు కూడా విలన్లుగా కనిపిస్తారు. విలన్‌ విలన్‌లా కనిపించాలంటే అతడు క్రూరంగా ఉండక్కర్లేదు, సినిమాలో మనం నిర్మించే సద్గుణాల పునాది కంటే కాస్త కింద ఉంటే చాలు అని విశ్వనాథ్‌ నిరూపించారు. మంచివాళ్ల విలువల్ని, చెడ్డవాళ్ల విలువల్ని కూడా కిందికి కాకుండా కాస్త ఎత్తుకు తీసుకువెళ్లారు.

సాగర సంగమం కథ అలా పుట్టింది

విశ్వనాథ్‌ ,కమల్‌ హాసన్‌ కాంబినేషన్‌లో వచ్చిన తొలి సినిమా ‘సాగర సంగమం’. ‘కమల్‌ హాసన్‌ డేట్స్‌ ఉన్నాయి. మంచి సినిమా తీద్దాం’ అని ప్రపోజల్‌తో నిర్మాత వచ్చినప్పుడు అలాంటి కథతో సినిమా చేద్దాం అని ఆలోచించారు విశ్వనాథ్‌. ‘నీకు పలానా పాత్ర చేయాలని ఏమన్నా ఉందా’ అని కమల్‌నే అడిగేశారు. అలాంటిదేమీ లేదని కమల్‌ చెప్పడంతో మళ్లీ ఆలోచించారు విశ్వనాథ్‌. కమల్‌ హీరో కావడానికి ముందు డాన్స్‌ అసిస్టెంట్‌గా పని చేశారు. ఆ కోణం నుంచి ఆలోచించారు.. ‘ఇండియన్‌ డాన్స్‌’ అనే కళను సృష్టించాలని తపన పడే ఓ యువకుడి పాత్రను క్రియేట్‌ చేశారు విశ్వనాథ్‌. ఆ పాత్ర చుట్టూ సన్నివేశాలు అల్లుకుంటూ పోతే ‘సాగర సంగమం’ చిత్ర కథ తయారైంది.

బయోపిక్‌ అంటే భయం

2147.jpg

విశ్వనాథ్‌ నుంచి అన్ని రకాల చిత్రాలూ వచ్చాయి. వాటిలో కళాత్మక కథలకు అగ్ర తాంబూలం. ఈ ప్రయాణంలో ఆయన ‘చేయాలి..’ అనుకొని, వెనుకంజ వేసిన చిత్రాలూ లేకపోలేదు. ముఖ్యంగా ఆయన బయోపిక్‌ల జోలికి వెళ్లలేదు. ఎం.ఎ్‌స.సుబ్బలక్ష్మి కథని విశ్వనాథ్‌ వెండి తెరపై తీసుకొద్దామనుకొన్నారు. ‘విదుషీమణి’ అనే టైటిల్‌ కూడా అనుకొన్నారు. సుబ్బలక్ష్మి పాత్రలో రాధికని ఎంపిక చేశారు. కానీ... ఆ ప్రాజెక్టు సెట్స్‌పైకి వెళ్లలేదు. దానికి చాలా కారణాలున్నాయి. బయోపిక్‌లో ఏ సన్నివేశం ఏది నిజమో, ఏది ఊహాజనితమో తేల్చి చెప్పడం కష్టం. అలాంటప్పుడు.. అభూత కల్పనల్ని నిజమని నమ్మించడం ఎందుకు? అన్నది విశ్వనాథ్‌ ఆలోచన. ‘‘శంకరాభరణం ఫిక్షన్‌. ప్రధాన పాత్రని నేను ఎలా కావాలంటే అలా మలచుకోగలను. బయోపిక్‌లు అలా కాదు. ఎవరో ఓ పుస్తకం రాస్తారు. అందులో నిజాలేంటో మనకు తెలీవు. వాటినే తెరపైకి తీసుకెళ్తే.. చరిత్రకు ద్రోహం చేసినవాళ్లమవుతాం. అందుకే నేను ‘ఎం.ఎ్‌స.సుబ్బలక్ష్మి’ బయోపిక్‌ సైతం పక్కన పెట్టా.’’ అని ఓ సందర్భంలో గుర్తు చేసుకొన్నారు కళా తపస్వి.

258473.jpg

అప్పటి రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ చేతులమీదుగా దాదాసాహెబ్‌ ఫాల్కే అవార్డు అందుకుంటున్న కళాతపస్వి కే విశ్వనాథ్‌, చిత్రంలో అప్పటి కేంద్ర మంత్రులు వెంకయ్యనాయుడు, రాజ్యవర్ధన్‌సింగ్‌ కూడా ఉన్నారు

Updated Date - 2023-02-04T15:34:56+05:30 IST