Guntur Kaaram: అమ్మ గురూజీ.. త్రివిక్రమ్ మాములోడు కాదు.. ‘గుంటూరు కారం’ వీడియోలో దాగున్న గుట్టు ఏంటంటే..

ABN , First Publish Date - 2023-06-01T20:00:12+05:30 IST

ఫ్యామిలీ హీరోగా మెప్పించి ఇటీవల విలన్‌గా ఓ వెలుగు వెలుగుతున్న టాలీవుడ్ సీనియర్ నటుడిని ‘గుంటూరు కారం’ గ్లింప్స్‌లో త్రివిక్రమ్ చూపించారు. మహేశ్‌తో పాటు సన్నివేశాల్లో కనిపించింది మరెవరో కాదు. సీనియర్ నటుడు జగపతిబాబు.

Guntur Kaaram: అమ్మ గురూజీ.. త్రివిక్రమ్ మాములోడు కాదు.. ‘గుంటూరు కారం’ వీడియోలో దాగున్న గుట్టు ఏంటంటే..

టాలీవుడ్‌లో (Tollywood) మరో పెద్ద సినిమా సందడి కనిపిస్తోంది. ప్రిన్స్ మహేశ్ బాబు (Mahesh Babu), మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ (Trivikram Srinivas) కాంబోలో రాబోతున్న హ్యాట్రిక్ సినిమాకు సంబంధించిన టైటిల్ గ్లింప్స్‌తో సోషల్ మీడియా హోరెత్తిపోతోంది. యూట్యూబ్‌, ట్విటర్‌లో ఈ ‘గుంటూరు కారం’ (Guntur Kaaram) ఘాటు మాములుగా లేదు. అయితే.. ఈ వీడియోలో ఆసక్తికర విషయం ఏంటంటే.. గతంలో ఫ్యామిలీ హీరోగా మెప్పించి ఇటీవల విలన్‌గా ఓ వెలుగు వెలుగుతున్న టాలీవుడ్ సీనియర్ నటుడిని గ్లింప్స్‌లో త్రివిక్రమ్ చూపించారు. ఇదే త్రివిక్రమ్ దర్శకత్వంలో వచ్చిన ‘అతడు’ (Athadu) సినిమాలో ఎంఎస్ నారాయణలా చెప్పాలంటే.. ‘‘మన మానాన మనం ‘గుంటూరు కారం’ మాస్ స్ట్రైక్‌లో మహేశ్‌ను చూస్తుంటే.. చూపించీ చూపించకుండా, కనిపించీ కనిపించకుండా ఫ్రేమ్‌లోకి వచ్చి పోయిందెవరు..?’’ అనే డౌట్ చాలామందికి వచ్చింది. ఆ సందేహానికి సమాధానం దొరికేసింది.

Mahesh.jpg

మహేశ్‌తో పాటు సన్నివేశాల్లో కనిపించింది మరెవరో కాదు. సీనియర్ నటుడు జగపతిబాబు (Jagapathi Babu). అవును జగ్గూభాయే. ‘‘అక్కడ జపాన్ వాళ్లు ఏవేవో కనిపెడుతుంటే ‘గుంటూరు కారం’ గ్లింప్స్‌లో (Guntur Kaaram Mass Strike) కనిపెట్టింది ఇదా’’ అని అనుకోకుండా నెటిజన్లు ఆ వీడియోను బాగా గమనించండి. వీడియోలో 27 సెకన్ల దగ్గర మహేశ్‌తో పాటు బ్లర్ ఎఫెక్ట్‌లో జగపతిబాబు కనిపించాడు. వీడియోను Pauseలో ఉంచి చూస్తే ఈ విషయం స్పష్టంగా తెలుస్తుంది. 29 సెకన్ల దగ్గర మహేశ్ అగ్గిపుల్లతో బీడీ వెలిగించుకుంటూ బ్యాక్‌గ్రౌండ్‌లో డైలాగ్ వస్తున్నప్పుడు కూడా జగపతిబాబును పక్కనే గమనించవచ్చు.

Mahesh1.jpg

మహేశ్‌ను ఎలివేట్ చేసేందుకు జీప్‌ గాల్లోకి లేచిన క్రమంలో కూడా చెవులు మూసుకుని కనిపించిన జగపతిబాబును క్లియర్‌గా చూడొచ్చు.

Mahesh2.jpg

ఇక.. టైటిల్ రివీల్ చేస్తూ యూట్యూబ్‌లో విడుదల చేసిన ఈ ‘గుంటూరు కారం’ గ్లింప్స్ రికార్డుల వేట మొదలుపెట్టింది. విడుదలై 24 గంటలు కూడా గడవక ముందే 20 మిలియన్ల వ్యూస్ సాధించి సరికొత్త రికార్డుల దిశగా ‘గుంటూరు కారం’ టైటిల్ గ్లింప్స్ దూసుకెళుతోంది. ఈ ‘గుంటూరు కారం’ మాస్ స్రైక్‌ టాక్ ఏంటో ప్రత్యేకంగా చెప్పేదేముంది. చేతిలో బీడీతో, తలకు ఎర్ర తువాలు కట్టుకుని.. గాల్లో లేచిన గుంటూరు మిర్చి మధ్య మహేశ్ నడుచుకుంటూ వస్తున్న సన్నివేశం గ్లింప్స్‌కు హైలైట్‌గా నిలిచింది. ఈ షాట్.. థమన్ కొట్టిన బీజీఎం.. ‘అల వైకుంఠపురంలో’ ‘సిత్తరాల సిరపడు’ సన్నివేశాన్ని గుర్తుచేసింది. ఒక విషయం మాత్రం ఈ గ్లింప్స్‌తో స్పష్టంగా అర్థమైందేంటంటే.. ‘గుంటూరు కారం’ సినిమాను పక్కా మాస్ మసాలా ఎంటర్‌టైనర్‌గా ప్రేక్షకుల ముందుకు త్రివిక్రమ్, మహేశ్ తీసుకురాబోతున్నారు. జనవరి 13, 2024 సంక్రాంతి కానుకగా ఈ ‘గుంటూరు కారం’ థియేటర్లను ఘాటెక్కించబోతోంది.

Updated Date - 2023-06-01T20:00:21+05:30 IST