నా కెరీర్‌లో గుర్తుండి పోయే పాత్ర ఇది
ABN , First Publish Date - 2023-09-17T02:07:59+05:30 IST
నలభై ఏళ్ల సినీ జీవితం.. ఎనిమిది వందలకు పైగా చిత్రాలు... తెలుగు చిత్ర పరిశ్రమలో సీనియర్ నటుడు తనికెళ్ల భరణి ప్రస్థానం ఇది. ఇన్నేళ్ల కెరీర్‌లో ఆయనకు పేరు తెచ్చిన పాత్రలు 30కి పైగా ఉంటాయి. వాటిల్లో ఒకటిగా...

నలభై ఏళ్ల సినీ జీవితం.. ఎనిమిది వందలకు పైగా చిత్రాలు... తెలుగు చిత్ర పరిశ్రమలో సీనియర్ నటుడు తనికెళ్ల భరణి ప్రస్థానం ఇది. ఇన్నేళ్ల కెరీర్‌లో ఆయనకు పేరు తెచ్చిన పాత్రలు 30కి పైగా ఉంటాయి. వాటిల్లో ఒకటిగా ‘పెదకాపు 1’ చిత్రంలోని ఫ్రస్ట్రేటెడ్ స్కూల్ మాస్టర్ పాత్ర నిలుస్తుందని భరణి చెప్పారు. ఈ నెల 29న ‘పెదకాపు 1’ చిత్రం విడుదలవుతున్న సందర్భంగా శనివారం ఈ చిత్ర విశేషాలు మీడియాతో పంచుకున్నారు భరణి.
ఈ మధ్య కాలంలో చాలా వరకూ తండ్రి పాత్రలే చేశాను. వాటిల్లో మూస ధోరణిలో ఉండే పాత్రలు వస్తే తిరస్కరించిన సందర్భాలు ఉన్నాయి. కానీ ‘పెదకాపు 1’లో చాలా విభిన్నమైన పాత్ర పోషించాను. కథలో కీలకమైన పాత్ర ఇది. సమాజంపై విసిగిపోయిన ఓ మేధావి పాత్ర ఇది. స్కూల్ మాస్టర్ కేరెక్టర్. నా పాత్ర దర్శకుడి వాయిస్‌ను వినిపిస్తుంది. ప్రేక్షకుల తరఫున ప్రశ్నించే పాత్ర. చాలా అద్భుతమైన వేషం. చాలా రోజులు ఈ సినిమా కోసం పని చేశాను. నా కెరీర్‌లో నిలిచిపోయే పాత్ర ఇది.
దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల చిత్రాల్లో తెలుగుదనం, గోదావరి జీవం, యాస కనిపిస్తుంటాయి, వినిపిస్తుంటాయి. సహజంగా దర్శకుడు ఏ ప్రాంతానికి చెందినవాడో ఆ ప్రాంతపు పరిమళాలు సినిమాలో ఉంటాయి. కానీ ‘పెదకాపు 1’లో శ్రీకాంత్ ట్రాన్స్‌పర్మేషన్ విభిన్నంగా ఉంటుంది. హింస ఓ మోతాదు మించి ఉంటుంది.
హీరో విరాట్ కర్ణ మొదట్లో కొత్తగా కనిపించాడు కానీ రాను రాను తన పాత్రలో ఒదిగిపోయాడు. తనలో అంకితభావం, కసి కనిపించాయి. కచ్చితంగా ఏదో సాధిస్తాడు. నిర్మాత రవీందర్‌రెడ్డి ‘అఖండ’ చిత్రాన్ని ఎంత భారీగా తీశారో ఒక కొత్త హీరోతో అంత భారీగానే నిర్మించారు.
తొలిసారిగా ఓ కన్నడ చిత్రంలో కీలక పాత్ర పోషిస్తున్నా. ప్రభుదేవా, శివరాజ్‌కుమార్ ఇందులో ముఖ్య పాత్రధారులు. కొత్త దర్శకుడు శేఖర్ తీస్తున్న సినిమాలో కూడా ఓ మంచి పాత్ర చేస్తున్నా. నా 40ఏళ్ల కెరీర్‌లో అనుకున్నవన్నీ దాదాపుగా చేసేశాను. అయితే అంతర్జాతీయ స్థాయిలో ఒక సినిమాను నా దర్శకత్వంలో చేయాలనే కోరిక మాత్రం ఉంది.