బూతు లేకుండా తీసిన సిరీస్‌ ఇది!

ABN , First Publish Date - 2023-08-03T00:22:19+05:30 IST

‘‘బూతు, సెక్స్‌ ఉంటేనే సినిమాలూ, వెబ్‌ సిరీస్‌లూ చూస్తారంటే నేను నమ్మను. తెలుగుతో పాటు అన్ని భాషల్లోనూ వచ్చిన గొప్ప సినిమాల్ని ఒక్కసారి చూడండి. వాటిలో బూతు ఉండదు...

బూతు లేకుండా తీసిన సిరీస్‌ ఇది!

‘‘బూతు, సెక్స్‌ ఉంటేనే సినిమాలూ, వెబ్‌ సిరీస్‌లూ చూస్తారంటే నేను నమ్మను. తెలుగుతో పాటు అన్ని భాషల్లోనూ వచ్చిన గొప్ప సినిమాల్ని ఒక్కసారి చూడండి. వాటిలో బూతు ఉండదు. మేం చేసిన ‘దయా’లోనూ ఒక్క బూతు సన్నివేశం కూడా ఉండద’’న్నారు జేడీ చక్రవర్తి. ఆయన నటించిన సరికొత్త వెబ్‌ సిరీస్‌ ‘దయా’. పవన్‌ సాధినేని దర్శకత్వం వహించారు. ఈనెల 4 నుంచి హాట్‌ స్టార్‌లో స్ర్టీమింగ్‌ కానుంది. ఈ సందర్భంగా బుధవారం హైదరాబాద్‌లో జేడీ చక్రవర్తి పాత్రికేయులతో మాట్లాడారు.

  • ‘‘పవన్‌ సాధినేని ఫోన్లో పది నిమిషాల పాటు కథ చెప్పాడు. ఆ తరవాత నేను హైదరాబాద్‌ వచ్చినప్పుడు పూర్తి స్ర్కిప్టు వినిపించడానికి నా దగ్గరకు వచ్చాడు. అది వినకుండానే నేను ఓకే చెప్పేశా. ఎందుకంటే ఓ పెద్ద కథని పది నిమిషాల్లో అర్థమయ్యేలా చెప్పగలగడం ఓ ఆర్ట్‌. కథపై పట్టుంటేనే అది సాధ్యం. పవన్‌ సాధినేని స్టామినా ఏమిటో అప్పుడే అర్థమైంది. ఆ తరవాత తను చేసిన ‘సేనాపతి’ వెబ్‌ సిరీస్‌ చూశా. మైండ్‌ బ్లోయింగ్‌గా అనిపించింది. తనలో ఎంత మంచి టెక్నీషియన్‌ ఉన్నాడో అర్థమైంది’’

  • ‘‘ఈ సిరీస్‌లో నేను ఫ్రీజర్‌ వ్యాన్‌ డ్రైవర్‌గా నటించాను. చేపల్ని ఒక ఊరి నుంచి మరో ఊరికి తీసుకెళ్తుంటా. అనుకోకుండా ఓ రోజు నా వ్యాన్‌లో ఓ శవం కనిపిస్తుంది. అప్పటి నుంచీ నా తిప్పలు మొదలవుతాయి. ఓ సాదీ సీదా డ్రైవర్‌ జీవితంలో జరిగిన ఘటనల్ని చాలా ఆసక్తికరంగా మలిచాడు. పవన్‌లో నాకు నచ్చిన మరో విషయం... మహిళా పాత్రలకు ప్రాధాన్యం ఇవ్వడం. ఈ సిరీస్‌లో మూడు శక్తిమంతమైన మహిళా పాత్రలున్నాయి. ప్రతీ పాత్రా ఆకట్టుకొనేదే’’.

  • ‘‘ఓటీటీకీ, సినిమాకీ పెద్ద తేడా ఏం లేదు. నా కళ్లకు రెండూ ఒకటే. కాకపోతే ఓటీటీలో కొన్ని ఎమోషన్స్‌ ఇంకా బాగా చెప్పొచ్చు. ఓటీటీలో నేను చేసిన ‘తాజా ఖబర్‌’ అనే వెబ్‌ సిరీస్‌ పెద్ద హిట్‌. ఇక ముందూ.. వెబ్‌ సిరీస్‌లలో నటిస్తా. బహుశా.. ఏదో ఓ రోజు ఓ సిరీస్‌ని డైరెక్ట్‌ చేస్తానేమో. అది ఇప్పుడే చెప్పలేను. బాలీవుడ్‌ నాకు పొరుగిల్లు లాంటిది. అందుకే అక్కడ నిరూపించుకొని, ఆ తరవాత టాలీవుడ్‌కి వద్దామనుకొన్నా. అంతే కానీ, ఇక్కడ అవకాశాలు రాక కాదు. కొన్ని పాత్రలు నచ్చకపోవడం వల్ల వదులుకొన్న సందర్భాలున్నాయి’’.

Updated Date - 2023-08-03T00:22:19+05:30 IST