ఓ బాధ్యతతో తీసిన సినిమా ఇది

ABN , First Publish Date - 2023-08-24T02:51:10+05:30 IST

‘‘నటీనటులకే కాదు.. ప్రతి ఒక్కరికీ సామాజిక బాధ్యత ఉంటుంది. అదే బాధ్యతతో తీసిన సినిమా ‘గాండీవధారి అర్జున’’ అన్నారు వరుణ్‌తేజ్‌. ఆయన కథానాయకుడిగా నటించిన...

ఓ బాధ్యతతో తీసిన సినిమా ఇది

‘‘నటీనటులకే కాదు.. ప్రతి ఒక్కరికీ సామాజిక బాధ్యత ఉంటుంది. అదే బాధ్యతతో తీసిన సినిమా ‘గాండీవధారి అర్జున’’ అన్నారు వరుణ్‌తేజ్‌. ఆయన కథానాయకుడిగా నటించిన చిత్రమిది. ప్రవీణ్‌ సత్తారు దర్శకత్వం వహించిన ఈ చిత్రం శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ సందర్భంగా బుధవారం హైదరాబాద్‌లో వరుణ్‌ విలేకరులతో మాట్లాడారు.

  • ‘‘తెలుగు సినిమాల్లో తెలుగు టైటిళ్లు చూడడం కష్టమైపోతోంది. చాలా అరుదుగా అలాంటి అవకాశం వస్తోంది. ‘గాండీవధారి అర్జున’ చక్కటి టైటిల్‌. ఇందులో నా పేరు అర్జున్‌. ఎవరికి ఏ సహాయం కావాలన్నా నన్నే పిలుస్తారు. అందుకే ఈ టైటిల్‌ పెట్టాం’’.

  • ‘‘ప్రవీణ్‌ సత్తారు అంటే నాకు ఇష్టం. ఆయన సినిమాలు చూశాను. ‘చందమామ కథలు’, ‘గరుడవేగ’ సినిమాలంటే నాకు ఇష్టం. ‘చందమామ కథలు’లో మంచి ఎమోషన్‌ ఉంటుంది. ‘గరుడవేగ’లో స్టైలీష్‌ యాక్షన్‌ ఉంటుంది. ఆ రెండు సినిమాలూ కలిస్తే ‘గాండీవధారి అర్జున’. ఓసారి ఫోన్‌ చేసి ‘సినిమా చేద్దామా’ అని అడిగారు. ఆయనంటే ముందే నాకు అంచనా ఉంది కాబట్టి.. కథ కూడా వినకుండా ‘చేసేద్దాం’ అని చెప్పా’’.

  • ‘‘ఈ సినిమాలో కేవలం యాక్షన్‌ ఒక్కటే కాదు. చాలా అంశాలు ఉంటాయి. ప్రపంచాన్ని పట్టి పీడుస్తున్న సమస్య కూడా ఉంది. దాన్ని అందరికీ అర్థమయ్యేలా చెప్పాం. ఓ మంచి విషయాన్ని ఎప్పుడూ షుగర్‌ కోటింగ్‌లానే చెప్పాలి. క్లాస్‌ పీకుతున్నట్టు ఉండకూడదు. ఆ జాగ్రత్త తీసుకొన్నాం. ఓ సమస్యని మీ ముందుకు తీసుకొచ్చాం. అది చూసి ప్రేక్షకులు మారతారా? లేదా? అనేది వాళ్ల ఇష్టం’’.

  • ‘‘యాక్షన్‌ సినిమాలంటే నాకు చాలా ఇష్టం. ఆ ప్రాసె్‌సని బాగా ఎంజాయ్‌ చేస్తా. ప్రవీణ్‌కి యాక్షన్‌ సినిమాలు ఎలా తీయాలో బాగా తెలుసు. ఈ సినిమాని చాలా స్టైలీ్‌షగా డిజైన్‌ చేశాడు. ఎక్కడా రోప్‌లూ, సీజీ వర్క్‌ వాడకుండా కొన్ని యాక్షన్‌ సీన్లు చేశాం. అవన్నీ చాలా బాగా వచ్చాయి’’.

  • ‘‘రొటీన్‌ దారిలో వెళ్లి సినిమాలు చేయడం నాకు నచ్చదు. ఏదో ఓ కొత్తదనం ఉండాలని కోరుకొంటాను. కొన్నిసార్లు అది వర్కవుట్‌ అవ్వొచ్చు, అవ్వకపోవొచ్చు. నమ్మిన కథలు పోయినప్పుడు బాధ పడతాను. ‘మనం కూడా కమర్షియల్‌ దారిలో ఆలోచించాల్సిందేనా’ అనిపిస్తుంది. కానీ అది కాసేపే. ‘నేను ఏం అనుకొని ఇక్కడికి వచ్చాను’ అనేది గుర్తు చేసుకొంటాను. మళ్లీ నా పంథాలోనే కథలు ఎంచుకొంటాను’’.

  • ‘‘బాలీవుడ్‌లో సినిమా చేయాలని ఉంది. కానీ అది పనిగట్టుకొని చేసినట్టు ఉండకూడదు. అయినా ఈరోజుల్లో సినిమాకి హద్దుల్లేవు. మంచి సినిమా ఎక్కడైనా ఆడుతుంది. ‘ఆపరేషన్‌ వాలెంటైన్‌’ అనే సినిమా చేస్తున్నా. దీన్ని హిందీలోనూ విడుదల చేస్తాం. నాకు హిందీ పెద్దగా రాదు. అందుకే మూడు నెలలు కష్టపడి హిందీ నేర్చుకొన్నా. సెట్లో నా డైలాగులు నేనే చెప్పా. డబ్బింగ్‌ కూడా చెప్పాలని ఉంది’’.

Updated Date - 2023-08-24T02:51:10+05:30 IST