జీవితాంతం మనతో ఉండేవి అవే!
ABN , First Publish Date - 2023-05-09T04:15:13+05:30 IST
‘‘చదువు పేరుతో పిల్లలపై తల్లితండ్రులు ఒత్తిడి తీసుకొస్తున్నారు. ఇది వరకు నూటికి 90 మార్కులు వస్తే గొప్ప. ఇప్పుడు 99 వచ్చినా సంతృప్తి ఉండడం లేదు. పిల్లలకు కళల పట్ల అభిరుచి పెరగాలి...

‘‘చదువు పేరుతో పిల్లలపై తల్లితండ్రులు ఒత్తిడి తీసుకొస్తున్నారు. ఇది వరకు నూటికి 90 మార్కులు వస్తే గొప్ప. ఇప్పుడు 99 వచ్చినా సంతృప్తి ఉండడం లేదు. పిల్లలకు కళల పట్ల అభిరుచి పెరగాలి. వాళ్ల మనసులు సృజనాత్మకత వైపు మళ్లాలి. అప్పుడు ఫలితాలు వేరుగా ఉంటా’’యన్నారు శ్రియ. ఆమె కీలక పాత్ర పోషించిన ‘మ్యూజిక్ స్కూల్’ శుక్రవారం విడుదల అవుతోంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో శ్రియ మాట్లాడారు.
‘‘ఓ సీరియస్ విషయాన్ని సంగీతంతో ముడి పెట్టి అందంగా చెప్పే ప్రయత్నం చేశారు దర్శకుడు పాపారావు బియ్యాల. ఇలాంటి కథలు మరీ సీరియస్‌గా తీస్తే డాక్యుమెంటరీ సినిమాల్లా మారిపోతాయి. కానీ ఈ చిత్రంలో వినోదం, భావోద్వేగాలు, కమర్షియల్ అంశాలూ పక్కాగా కుదిరాయి’’.
‘‘ఈ కథ వినగానే కనెక్ట్ అయ్యాను. ఎందుకంటే నాక్కూడా సంగీతం, నృత్యం అంటే చాలా ఇష్టం. నా జీవితంలో అవి కీలకమైన భాగం. చిన్నప్పుడు కథక్ నేర్చుకొన్నా. డాన్స్ డ్రామాల్లో పాల్గొన్నా. అందుకే కథ చెప్పినప్పుడు నా బాల్యం గుర్తొచ్చింది.
‘‘సెట్లో మాత్రం నాకు సవాళ్లు ఎదురయ్యాయి. నృత్యం చేస్తూ అభినయించడం కొంచెం కష్టం. నాకు డాన్స్‌లో ప్రవేశం ఉంది కాబట్టి త్వరగానే ఈ సమస్య నుంచి బయటకు రాగలిగా’’.
‘‘చదువు ముఖ్యమే. కానీ కళలు అంతకంటే గొప్పవి. జీవితాంతం మనతో ఉండేవి అవే. ఈ విషయాన్ని ఈ సినిమాతో అంతర్లీనంగా చెప్పారు’’.