రావాల్సిన టైమ్‌లోనే వస్తున్న యూనివర్సిటీ

ABN , First Publish Date - 2023-10-12T03:27:42+05:30 IST

ప్రజానటుడు ఆర్‌.నారాయణమూర్తి స్నేహచిత్ర పిక్చర్స్‌ పతాకంపై స్యీయ దర్శకత్వంలో నిర్మించిన ‘యూనివర్సటీ’ చిత్రం శుక్రవారం విడుదల కానుంది...

రావాల్సిన టైమ్‌లోనే వస్తున్న యూనివర్సిటీ

ప్రముఖుల ప్రశంసలు

ప్రజానటుడు ఆర్‌.నారాయణమూర్తి స్నేహచిత్ర పిక్చర్స్‌ పతాకంపై స్యీయ దర్శకత్వంలో నిర్మించిన ‘యూనివర్సటీ’ చిత్రం శుక్రవారం విడుదల కానుంది. ఈ సందర్భంగా పలువురు ప్రముఖులు మంగళవారం ప్రసాద్‌ ప్రీవ్యూ థియేటర్‌లో ఈ సినిమాను చూశారు. విద్యావ్యవస్థపై చిత్రీకరించిన మంచి సినిమా ఇదనీ, రావాల్సిన టైమ్‌లోనే వస్తున్న చిత్రం అనీ అభినందించారు. ప్రొఫెసర్‌ హరగోపాల్‌ మాట్లాడుతూ ‘ఇది కేవలం విద్యార్థులే కాదు తల్లితండ్రులు, అధ్యాపకులు చూడాల్సిన సినిమా. నలభై ఏళ్లుగా రెండు తెలుగు రాష్ట్రాల్లో, మన దేశంలో జరిగిన, జరుగుతున్న సమస్యలకు స్పందించి నారాయణమూర్తి సినిమాలు తీస్తూ భావి తరాలకు ఒక కాలనాళికలా చరిత్రను నిక్షిప్తం చేస్తున్నందుకు అభినందనలు ’ అన్నారు. ఫ్రొపెసర్‌ కంచె ఐలయ్య మాట్లాడుతూ ‘మన దేశంలో ఉన్న అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ప్రాధమిక దశ నుంచి మాతృ భాషతో పాటు ఇంగ్లిష్‌ నేర్పిస్తూ వనరులు సమకూర్చి క్వాలిఫైడ్‌ ఎడ్యుకేషన్‌ ఇస్తే ప్రభుత్వ విద్యారంగం బలోపేతం అవుతుంది. ప్రైవేట్‌ విద్యారంగం లేకుండా పోతుంది. తల్లితండ్రుల్ని పీల్చి పిప్పి చేసే ఫీజుల దోపిడీ ఉండదు.. అనే అంశాన్ని ఈ సినిమాలో గట్టిగా చెప్పారు’ అని అభినందించారు. ఐఏఎస్‌ ఆఫీసర్‌ ఆకునూరి మురళి మాట్లాడుతూ ‘విద్య హక్కు కోసం, పని హక్కు కోసం రాజ్యాంగం కల్పించిన రిజర్వేషన్ల అమలు కోసం అందరూ ఉద్మమించాల్సిన అవసరం ఉందనీ, నిరుద్యోగ సమస్య ఈ దేశాన్ని ఎలా పట్టి పీడిస్తుందో ఈ సినిమాలో బాగా చెప్పారు’ అన్నారు. దర్శకుడు అనిల్‌ రావిపూడి మాట్లాడుతూ ‘నారాయణమూర్తి చాలా మంచి సినిమా తీశారు. , నా అభిమానులతో పాటు అందరూ చూడాలి’ అని కోరారు. ఈ సందర్భంగా ఆర్‌.నారాయణమూర్తి మాట్లాడుతూ ‘చదువుకొనే రోజుల్లో పేపర్‌ లీకేజ్‌, గ్రూప్‌ వన్‌ , టు పరీక్షల్లోనూ పేపర్‌ లీకేజీలు ..ఇలా అయితే విద్యార్థులు, నిరుద్యోగులు ఎన్నిసార్లు పరీక్షలు రాయాలి? పరీక్షల మీద పరీక్షలు అంటూ నిరుద్యోగుల జీవితాలతో ఆడుకోవడం దుర్మార్గం. విద్యార్థులు మన జాతి సంపద. వాళ్లను రక్షించుకోవాల్సిన బాధ్యత సమాజం మీద, ప్రభుత్వాల మీద, మనందరి మీద ఉంది’ అన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో జూలూరి గౌరీ శంకర్‌, పాశం యాదగిరి, సుద్దాల అశోక్‌ తేజ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2023-10-12T03:27:42+05:30 IST