ద కేరళ స్టోరీ పై స్టేకు సుప్రీం కోర్టు నిరాకరణ
ABN , First Publish Date - 2023-05-03T02:05:36+05:30 IST
కేరళ రాష్ట్రంలో తప్పి పోయిన నలుగురు యువతులు మతం మార్చుకుని ఉగ్రవాదులుగా మారే ఇతివృత్తంతో రూపుదిద్దుకుని ప్రస్తుతం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన ‘ద కేరళ స్టోరీ’ చిత్రం విడుదలపై స్టే...

కేరళ రాష్ట్రంలో తప్పి పోయిన నలుగురు యువతులు మతం మార్చుకుని ఉగ్రవాదులుగా మారే ఇతివృత్తంతో రూపుదిద్దుకుని ప్రస్తుతం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన ‘ద కేరళ స్టోరీ’ చిత్రం విడుదలపై స్టే ఇవ్వడానికి సుప్రీం కోర్టు నిరాకరించింది. ఈ సినిమాలో విద్వేష పూరిత ప్రసంగాలు, సన్నివేశాలు ఉన్నాయనీ, అందుకే విడుదల కాకుండా స్టే ఇవ్వాలని కోరుతూ దాఖలైన పిటీషన్‌ను మంగళవారం కోర్టు తోసి పుచ్చింది. ఇప్పటికే ఈ చిత్రం సెన్సార్ పూర్తయిందనీ, ఈ సమస్యను హై కోర్టులోనే పరిష్కరించుకోవాలని జస్టిస్ జోసఫ్, జస్టిస్ నాగరత్న సూచించారు. ఈ శుక్రవారమే చిత్రం విడుదలవుతుండడంతో వ్యవధి లేనందున సుప్రీం కోర్టుకు వచ్చినట్లు పిటీషనర్ల తరఫున న్యాయవాదులు కపిల్ సిబాల్, నిజాం పాషా కోర్టుకు వెల్లడించారు. ఇది పద్ధతి కాదనీ, ఇలా అయితే ప్రతి ఒక్కరూ డైరెక్ట్‌గా సుప్రీం కోర్టుకు వస్తారని కూడా న్యాయమూర్తులు వ్యాఖ్యానించారు. ఇదిలా ఉంటే ‘ద కేరళ స్టోరీ’ చిత్రంలో అభ్యంతరకరంగా ఉన్న పది సీన్లు తొలగించి, సినిమాకు ఏ సర్టిఫికెట్ ఇచ్చింది సెన్సార్ బోర్ట్. కేరళ మాజీ ముఖ్యమంత్రి వి.ఎస్.అచ్యుతానందన్‌తో చేసిన ఇంటర్వ్యు తొలగించిన సన్నివేశాల్లో ఒకటి. అలాగే హిందువుల దేవతల మీద చేసిన కొన్ని వ్యాఖ్యలు, కొన్ని షాట్స్ మనోభావాలను దెబ్బ తీస్తాయంటూ సెన్సార్ కత్తెర వేసింది. కేరళలో తప్పిపోయిన 32 వేల మంది యువతులు ఆ తర్వాత ఐసిస్‌లో చేరి ఉగ్రవాదులుగా మారినట్లు చెబుతూ ఇటీవల విడుదలైన ఈ చిత్రం ట్రైలర్ వివాదానికి కారణమైంది. అదా శర్మ కథానాయికగా నటించిన ఈ చిత్రాన్ని సుదీప్తో సేన్ దర్శకత్వంలో విపుల్ అమృత్‌లాల్ షా నిర్మించారు.