The songs are amazing! : పాటలు మార్మోగుతున్నాయ్‌!

ABN , First Publish Date - 2023-10-17T03:33:37+05:30 IST

‘సంగీతం సగం బలం’ అని నమ్ముతుంది చిత్రసీమ. పాటలు బాగుంటే... సినిమా హిట్టుపై ఆశలు రెట్టింపవుతాయి. అందుకే మ్యూజిక్‌ ఆల్బమ్‌పై దర్శక నిర్మాతలు ప్రత్యేకంగా దృష్టి సారిస్తారు. కేవలం పాటలతోనే...

The songs are amazing! : పాటలు మార్మోగుతున్నాయ్‌!

‘సంగీతం సగం బలం’ అని నమ్ముతుంది చిత్రసీమ. పాటలు బాగుంటే... సినిమా హిట్టుపై ఆశలు రెట్టింపవుతాయి. అందుకే మ్యూజిక్‌ ఆల్బమ్‌పై దర్శక నిర్మాతలు ప్రత్యేకంగా దృష్టి సారిస్తారు. కేవలం పాటలతోనే జనాల్ని థియేటర్లకు రప్పించిన సందర్భాలు కోకొల్లలు. మరీ ముఖ్యంగా చిన్న సినిమాలకు పాటలే బలం. విడుదలకు ముందే సినిమాకు పాజిటీవ్‌ టాక్‌ తీసుకురావడంలో పాటలు ప్రత్యేక పాత్ర పోషిస్తాయి. ఓ పాట హిట్టయిందంటే.. సోషల్‌ మీడియాలో అదే ట్రెండింగ్‌ అయి కూర్చుంటోంది. ఆ పాటపైనే రీల్స్‌ నడస్తున్నాయి. అలా.. ఈమధ్య కొన్ని పాటలు జనంలోకి బాగా వెళ్లిపోయి.. మార్మోగిపోతున్నాయి. ఆయా చిత్రాలకు మంచి బజ్‌ క్రియేట్‌ చేయడంలో సక్సెస్‌ అయ్యాయి.

జయాపజయాలు ఎవరి చేతుల్లోనూ ఉండవు. అవి ప్రేక్షకుల తీర్పుపై ఆధారపడి ఉంటాయి. అయితే... మంచి పాటల్ని సంగీత దర్శకుడి నుంచి రాబట్టుకోవడం మాత్రం దర్శకుడి చేతుల్లో ఉండే విషయమే. అందుకే ప్రీ ప్రొడక్షన్‌ దశలోనే మ్యూజిక్‌ సిట్టింగ్స్‌కి కావల్సినంత సమయం కేటాయిస్తారు. ఆల్బమ్‌లో ఒక్క పాట హిట్టయినా సినిమా క్రేజ్‌ అమాంతం పెరిగిపోతుందని అందరికీ తెలుసు. అందుకే ఆ ఒక్క పాట కోసం కుస్తీపాట్లు పడుతుంటారు. కొన్ని సినిమాలకు పాటల వల్లే మైలేజీ వస్తుంది కూడా. అలా జరిగితే.. సంగీత దర్శకుడు సక్సెస్‌ అయినట్టే.

ఈ దసరాకి రాబోతున్న ‘టైగర్‌ నాగేశ్వరరావు’ మ్యూజికల్‌గానూ బాగానే ‘సౌండ్‌’ చేస్తోంది. ఈ చిత్రంలోని ‘ఏక్‌దమ్‌’ పాట మంచి మాసీగా ఉంది. రవితేజ సినిమాల్లో ఈ తరహా పాట ఒక్కటైనా ఉంటుంది. తన ఇమేజ్‌ని ఇలాంటి పాటలతో రిఫ్లెక్ట్‌ చేస్తుంటారు. ఆ మ్యాజిక్‌ ‘ఏక్‌ దమ్‌’ పాటలోనూ కనిపించింది. జివి.ప్రకాశ్‌ కుమార్‌ ట్యూన్‌ చేసిన ఈ పాటకు భాస్కరభట్ల రవికుమార్‌ క్యాచీగా ఉండే లిరిక్స్‌ అందించారు.

ఈమధ్య యువ సంగీత దర్శకులలో గట్టిగా వినిపిస్తున్న పేరు.. అబ్దుల్‌ హేషమ్‌ వాహబ్‌. ‘ఖుషి’లో అన్ని పాటలూ బాగా క్లిక్‌ అయ్యాయి. ‘హాయ్‌..నాన్న’కు కూడా ఆయనే సంగీత దర్శకుడు. నాని కథానాయకుడిగా నటించిన చిత్రమిది. ఈ చిత్రం నుంచి ఇప్పటి వరకూ రెండు పాటలు విడుదలయ్యాయి. రెండూ శ్రోతల్ని ఆకట్టుకొంటున్నాయి. ముఖ్యంగా ‘సమయమా..’ పాట గట్టిగా వినిపిస్తోంది. అబ్దుల్‌ వాహబ్‌ శైలిలో సాగే మంచి మెలోడీ ఇది. అనంత శ్రీరామ్‌ రాశారు. ఈ సినిమాలోనిదే ‘గాజు బొమ్మ’ పాట తండ్రీ కూతుళ్ల అనుబంధాన్ని ఆవిష్కరించే హృద్యమైన గీతంగా నిలిచిపోయింది. ఈ చిత్రం నుంచి మరో మూడు పాటలు బయటకు రావాల్సివుంది. అందులో మరొక్క పాట హిట్టయినా వాహబ్‌ ఖాతాలో మరో మ్యూజికల్‌ హిట్‌ చేరిపోయినట్టే.

నితిన్‌ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ‘ఎక్స్‌ ట్రా’. వక్కంతం వంశీ దర్శకుడు. ఈ చిత్రం నుంచి ‘డేంజర్‌ పిల్లా’ అనే పాట ఇప్పటికే విడుదలై శ్రోతల్ని ఆకట్టుకొంటుంది. హారీశ్‌ జైరాజ్‌ సంగీతాన్ని అందించారు. కృష్ణకాంత్‌ సాహిత్యం పాటకు తగ్గట్టుగా హాయిగా సాగిపోయింది. ‘ఆరెంజ్‌’లాంటి సూపర్‌ హిట్‌ ఆల్బమ్‌ అందించిన హారీశ్‌ చాలా కాలం తరవాత తెలుగులో చేస్తున్న సినిమా ఇది. కాబట్టి సంగీత ప్రియులు ఈ సినిమాలోని పాటల కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. డిసెంబరులో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

‘టికెట్టే కొనకుండా.. లాటరీ కొట్టిన చిన్నోడా..’ టిల్లుగాడి స్టోరీ మొత్తం ఈ పాటలోనే చెప్పేశాడు దర్శకుడు. ‘డీజే టిల్లు’తో సిద్దు జొన్నలగడ్డ తనదైన మార్క్‌ సృష్టించాడు. ఈ సినిమా యూత్‌కి భలే నచ్చేసింది. ఇప్పుడు ‘టిల్లు స్క్వేర్‌’ వస్తోంది. ‘డీజే టిల్లు’లో టైటిల్‌ సాంగ్‌ సూపర్‌ హిట్టయింది. ఆ పాట కోసమే జనాలు థియేటర్లకు వెళ్లారు. సీక్వెల్‌లోనూ మంచి ఊపున్న పాట డిజైన్‌ చేశారు. రామ్‌ మిరియాల ఎప్పట్లానే హుషారైన బీట్‌తో అలరించాడు. ఈ పాటకు కాశర్ల శ్యామ్‌ అందించిన సాహిత్యం కూడా ఆకట్టుకొంటోంది. విశ్వక్‌సేన్‌ నటిస్తున్న తాజా చిత్రం ‘గ్యాంగ్స్‌ ఆఫ్‌ గోదావరి’. నేహాశెట్టి కథానాయిక. యువన్‌ శంకర్‌ రాజా సంగీతం అందిస్తున్నాడు. ఈ చిత్రం నుంచి ‘సుట్టంలా చూసిపోకే..’ పాటకు మంచి ఆదరణ లభిస్తోంది. శ్రీహర్ష సాహిత్యాన్ని అందించారు. ‘ఊరి పేరు భైరవకోన’లోని ‘నిజమే నే చెబుతున్నా’ పాట యూ ట్యూబ్‌లో పెద్ద హిట్టు. సందీప్‌ కిషన్‌ కథానాయకుడిగా నటించిన చిత్రమిది. శేఖర్‌ చంద్ర అందించిన ట్యూన్‌కి అనంత శ్రీరామ్‌ చక్కటి సాహిత్యాన్ని సమకూర్చారు. సిద్‌ శ్రీరామ్‌ హిట్స్‌లో... ఇది కూడా ఒకటి. వైష్ణవ్‌ తేజ్‌ కొత్త సినిమా ‘ఆది కేశవ’లోని పాట కూడా బాగానే వినిపిస్తోంది. కొన్ని పాటలు విడులయ్యాక మరింత క్లిక్‌ అవుతాయి. ముఖ్యంగా చిన్న సినిమాల్లోని పాటలకు విడుదల తరవాతే తగిన గుర్తింపు లభిస్తుంటుంది. ఇటీవల చిన్న సినిమాలన్నీ మ్యూజికల్‌గా తమ సత్తా చూపించడానికి తగిన కసరత్తులే చేస్తున్నాయి. అందుకే మంచి పాటల్ని మరింతగా వినే అవకాశం దక్కుతోంది.

Updated Date - 2023-10-17T03:33:37+05:30 IST