‘అడవి రాముడు’ నిర్మాత కన్నుమూత
ABN , First Publish Date - 2023-01-21T05:28:07+05:30 IST
సీనియర్ నిర్మాత, సత్యచిత్ర సంస్థ అధినేతల్లో ఒకరైన ఎ. సూర్యనారాయణ (85) అనారోగ్యంతో శుక్రవారం తుది శ్వాస విడిచారు...
సీనియర్ నిర్మాత, సత్యచిత్ర సంస్థ అధినేతల్లో ఒకరైన ఎ. సూర్యనారాయణ (85) అనారోగ్యంతో శుక్రవారం తుది శ్వాస విడిచారు. ఆయనకు భార్య, ముగ్గురు ఆడ పిల్లలు ఉన్నారు. సత్యనారాయణతో కలసి ఆయన తొలిసారిగా ‘తాసీల్దారుగారి అమ్మాయి’ (1971)లో నిర్మించారు. శోభన్‌బాబు ఈ చిత్రంలో ద్విపాత్రాభినయం చేశారు. జమున కథానాయిక. ఆ తర్వాత ఆయనతోనే ‘ప్రేమబంధం’ (1976) చిత్రం తీశారు. వీరి మూడో చిత్రం ‘అడవిరాముడు’ (1977). ఎన్టీఆర్ హీరోగా నటించిన ఈ చిత్రం సంచలన విజయం సాధించింది. ఆ తర్వాత హీరో కృష్ణతో ‘కుమారరాజా’ సినిమా తీశారు. 1978లో విడుదలైన ఈ సినిమాలో హీరో కృష్ణ తొలిసారిగా త్రిపాత్రాభినయం చేశారు. అనంతరం ఆయనతోనే ‘కొత్త అల్లుడు’ (1979), ‘కొత్తపేట రౌడీ’(1980) ‘ఉద్దండుడు’(1984) , బాలకృష్ణతో ‘భలే తమ్ముడు’ చిత్రాలు నిర్మించారు. సత్యనారాయణ మరణించిన తర్వాత కూడా సూర్యనారాయణ నిర్మాతగా కొనసాగారు. హిందీలో అమితాబ్ బచ్చన్‌తో ‘మహాన్’ చిత్రాన్ని , అనిల్ కపూర్‌తో రెండు సినిమాలు నిర్మించారు. తమ్మారెడ్డి భరద్వాజ దర్శకత్వంలో ‘అత్తా నీ కొడుకు జాగ్రత్త’ (1997) ఆయన చివరి చిత్రం. తెలుగు నిర్మాతలమండలిలో చురుకైన పాత్ర నిర్వహించిన సూర్యనారాయణ నిర్మాతల ఇళ్ల సముదాయం మూవీ టవర్స్ కోసం ఎంతో కృషి చేశారు.