విడుదలకు ముందే వివాదం
ABN, First Publish Date - 2023-04-29T01:32:49+05:30
వివాదాలు, అభ్యంతరాలు వినిపిస్తున్నా ‘ద కేరళ స్టోరీ’ చిత్రాన్ని వచ్చే నెల 5న విడుదల చేస్తున్నట్లు చిత్ర నిర్మాత విపుల్ షా ప్రకటించారు.
‘ద కేరళ స్టోరీ’ చిత్రాన్ని నిషేధించాలంటూ ఆందోళన
వివాదాలు, అభ్యంతరాలు వినిపిస్తున్నా ‘ద కేరళ స్టోరీ’ చిత్రాన్ని వచ్చే నెల 5న విడుదల చేస్తున్నట్లు చిత్ర నిర్మాత విపుల్ షా ప్రకటించారు. కేరళలోని హిందూ, క్రిస్టియన్ మతాలకు చెందిన యువతుల్ని ఐసీస్ ఉగ్రవాదులు లవ్ జీహాద్‌లో భాగంగా వలలో వేసుకుని, ఆ తర్వాత, వారిని సిరియా, ఇరాక్ దేశాలకు పంపించి, బలవంతంగా టెర్రరిస్టులుగా మార్చి ఉగ్రవాదానికి ఉపయోగిస్తున్నారనే ఇతివృత్తంతో ఈ చిత్రం రూపుదిద్దుకుంది. అదా శర్మ ముఖ్య పాత్ర పోషించిన ఈ సినిమాకు విపుల్ అమృత్‌లాల్ షా నిర్మాత,. సుదిప్తో సేన్ దర్శకత్వం వహించారు.
గత ఏడాది నవంబర్‌లో ఈ సినిమా టీజర్ విడుదల చేసినప్పుడే పెద్ద రచ్చ జరిగింది. సినిమాను బ్యాన్ చేయాలని కూడా అప్పట్లో చాలా మంది డిమాండ్ చేశారు. ఇప్పుడు ట్రైలర్‌ను కూడా విడుదల చేయడంతో ఆ వివాదం మరింత ముదిరింది. అయితే ఇది కల్పిత గాథ కాదనీ, కేరళలో 2016లో జరిగిన కొన్ని సంఘటనల ఆధారంగా చిత్రాన్ని తీశామనీ, తప్పిపోయిన 21 మంది అమాయకపు యువతులు ఆ తర్వాత ఉగ్రవాదులుగా మారారనీ, బాధిత కుటుంబ సభ్యులతో మాట్లాడామనీ దర్శకనిర్మాతలు అంటున్నారు. ఇలా అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థ ఐసీస్ కారణంగా 32 వేల మంది అమాయకపు యువతులు ఆ రాష్ట్రంలో మిస్ అయ్యారనే సమాచారం తమ దగ్గర ఉందని చెప్పారు. ఈ చిత్రంలో మతం మార్చుకుని ఫాతిమాగా మారిన మలయాళీ నర్సు పాత్రను అదా శర్మ పోషించారు. ఒక పక్క పోలీసు కేసులు, మరో పక్క సినిమాను నిషేదించాలంటూ ఆందోళనలు ఎక్కువ కావడంతో మే 5న ‘ద కేరళ స్టోరీ’ విడుదలవుతుందా లేదా అన్నది వేచి చూడాలి.