అభిమానుల చప్పట్లే ముందుకు నడిపిస్తున్నాయి

ABN , First Publish Date - 2023-01-29T01:21:33+05:30 IST

చిరంజీవి కథానాయకుడిగా నటించిన చిత్రం ‘వాల్తేరు వీరయ్య’. రవితేజ ప్రఽధాన పాత్రఽధారి. బాబీ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని...

అభిమానుల చప్పట్లే ముందుకు నడిపిస్తున్నాయి

చిరంజీవి కథానాయకుడిగా నటించిన చిత్రం ‘వాల్తేరు వీరయ్య’. రవితేజ ప్రఽధాన పాత్రఽధారి. బాబీ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని మైత్రీ మూవీస్‌ సంస్థ నిర్మించింది. సంక్రాంతికి విడుదలై మంచి విజయాన్ని అందుకొంది. శనివారం వరంగల్‌ లో ‘వీరయ్య విజయ విహారం’ పేరుతో సక్సెస్‌ మీట్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా చిరంజీవి మాట్లాడుతూ ‘‘ఈ సినిమా విజయం సాధిస్తుందని అనుకొన్నాం కానీ.. నాన్‌ ‘ఆర్‌.ఆర్‌.ఆర్‌’ రికార్డులు అందుకొనే సినిమా అవుతుందని మేం అనుకోలేదు. ఈ విజయంలో ప్రేక్షకులకే అగ్ర తాంబూలం. ఇది ఆషామాషీ విజయం కాదు. రోజు రోజుకీ వసూళ్లు పెరుగుతున్నాయి. ఈ రోజుకి రూ.250 కోట్ల గ్రాస్‌ వసూలు చేసిందంటే మామూలు విషయం కాదు. తెరపై నేను ఎలా ఉండాలని కోరుకుంటున్నారో.. నన్ను ‘వాల్తేరు వీరయ్య’లో బాబీ అలా చూపించాడు. ఈ సినిమా చూస్తూ ఓ గ్యాంగ్‌ లీడర్‌, ఓ ఘరానా మొగుడు, రౌడీ అల్లుడు సినిమాలు గుర్తు చేసుకొన్నారు. దీనికి ప్రధాన కారణం బాబీనే. తన అభిమానాన్ని ఈ సినిమా రూపంలో చూపించుకొన్నాడు. ‘ఖైదీ’ నాకెలాటి స్టార్‌డమ్‌ ఇచ్చిందో.. ఈ ‘వాల్తేరు వీరయ్య’ బాబీకి ఓ స్టార్‌ స్టేటస్‌ని కల్పించింది. ఈ సినిమా కోసం తను ఎంత కష్టపడ్డాడో నాకు తెలుసు. కష్టపడేవాడ్ని ప్రేక్షకులు గుర్తిస్తారు అని చెప్పడానికి ఈ సినిమానే సాక్ష్యం. ఈ సినిమా చూశాక బాబికి నేను అభిమానిని అయిపోయా. చాలా తక్కువ రోజుల్లో, పరిమిత బడ్జెట్‌లో ఈ సినిమా తీశాడు. ఎక్కడా వేస్ట్‌ చేయలేదు. ఇలాంటి దర్శకుడు ఉండడం నిర్మాతలకు లాభదాయకం. ఈ విషయంలో రాబోయే దర్శకులు బాబిని స్ఫూర్తిగా తీసుకోవాలి. ‘రంగస్థలం’ చేసినప్పుడు మైత్రీ మూవీస్‌ గురించి చరణ్‌ చాలా గొప్పగా చెప్పాడు. ‘వాల్తేరు వీరయ్య’లో వాళ్లేంటో నేను చూశాను. నిజమైన నిర్మాతకు నిర్వచనంలా నిలబడ్డారు. సినిమాపై వాళ్లకున్న ప్యాషన్‌ వల్లే ‘వాల్తేరు వీరయ్య’ ఇంత బాగా వచ్చింది. రవితేజని చూస్తుంటే పవన్‌ కల్యాణ్‌లా అనిపిస్తాడు. తనని నా తమ్ముడిలా భావిస్తాను. తనలో నేను పవన్‌ కల్యాణ్‌ని చూసుకొన్నా. అందుకే మా ఇద్దరి మధ్య సన్నివేశాలు అంతలా పండాయి. తెరపై ఏం చేసినా, ఏం చేస్తున్నా.. ప్రేక్షకుల రెస్పాన్స్‌ ఎలా ఉంటుందో ఊహించుకొంటూ చేస్తా. దర్శకుడు ‘యాక్షన్‌.. కట్‌’ అన్నప్పుడు మాత్రమే సీన్‌ గురించి ఆలోచిస్తా. మిగిలిన సమయంలో గుర్తొచ్చేది అభిమానుల ఈలలూ, చప్పట్లే. నన్ను ముందుకు నడిపించేవి అవే. ఆ ఉత్సాహంతో ఇలాంటి ‘వీరయ్య’లు ఎన్నయినా చేస్తా’’ అన్నారు.

మేం మాత్రం క్వయిట్‌గా ఉండం : రామ్‌ చరణ్‌

రామ్‌చరణ్‌ మాట్లాడుతూ ‘‘నాకు ‘రంగస్థలం’ లాంటి సూపర్‌ హిట్‌ ఇచ్చిన మైత్రీ మూవీస్‌ ఇప్పుడు నాన్నగారికి మర్చిపోలేని విజయాన్ని అందించింది. సినిమా అంటే ప్రేమతో వచ్చిన నిర్మాతలు వీళ్లు. దమ్మున్న నిర్మాతలు. సినిమాలు ఎలా చేయాలో వీళ్ల నుంచి నేర్చుకోవాలి. బాబీ ఈ సినిమాని చెక్కినట్టు రాశారు. ఈ సినిమాలో చిరంజీవిగారు నాన్నగారిలా లేరు. బ్రదర్‌లా ఉన్నారు. రవితేజతో సీరియస్‌ క్యారెక్టర్‌ చేయించి.. మెప్పించారు. ఈ సినిమా చూశాక రవిగారి పాత్ర ఇంకా చూడాలనిపించింది. వెంటనే ‘ధమాకా’ చూశా. అదీ పూనకాలు లోడింగ్‌ అంటే. ఈ సినిమాలో మూడు అద్భుతమైన పాటలు ఇచ్చాడు దేవిశ్రీ ప్రసాద్‌. నాన్నగారి సినిమాలకే కాదు.. నాక్కూడా మంచి పాటలు ఇవ్వాలని కోరుకుంటున్నా. మా నాన్నగారు చాలా క్వయిట్‌గా ఉంటారు. ఎవరి గురించి ఏం మాట్లాడరు. కానీ ఆయన వెనుక మేం ఉన్నాం. మేం మాత్రం క్వయిట్‌గా ఉండమని చాలా క్వయిట్‌గా చెబుతున్నా’’ అన్నారు. దర్శకుడు బాబి మాట్లాడుతూ ‘‘మా నాన్నగారు చిరంజీవిగారికి వీరాభిమాని. ఆయన కాలం చేస్తారని తెలుసుకొని, మా నాన్నగారిని చిరంజీవిగారు ఇంటికి పిలిపించారు. అప్పటికి 30 శాతం షూటింగ్‌ అయ్యింది. ఈ విజయాన్ని చిరంజీవి గారు ముందే ఊహించారు. ‘ఈ సినిమా తప్పకుండా పెద్ద హిట్టవుతుంది.. మీ అబ్బాయి పెద్ద దర్శకుడు అవుతాడు’ అని మా నాన్నగారికి చెప్పారు. ఆయన ఆ సంతృప్తితోనే వెళ్లిపోయారు. 24 గంటలూ చిరంజీవిగారికి అభిమానుల గురించి తప్ప ఇంకో ధ్యాసలేదు. ఇప్పటి వరకూ నాలుగు సినిమాలు చేశా. కానీ ఏ సినిమాకీ ఇంత గుర్తింపు రాలేదు. మా చిరంజీవిని మాకిచ్చావ్‌ అని అభిమానులు అంటుంటే సంతోషంగా ఉంద’’న్నారు.

Updated Date - 2023-01-29T01:21:35+05:30 IST