అందుకే ఆ రిస్క్ తీసుకున్నా
ABN , First Publish Date - 2023-11-22T00:12:45+05:30 IST
‘మన్మథుడు’ చిత్ర నిర్మాణ సమయంలో దర్శకుడిని కావానుంది అని నాగార్జునగారికి చెప్పాను. ‘నీ మెంటాలిటీకి దర్శకత్వం కష్టం కానీ నిర్మాతగా ట్రై చెయ్’ అని ఆయన సలహా ఇచ్చారు...

‘మన్మథుడు’ చిత్ర నిర్మాణ సమయంలో దర్శకుడిని కావానుంది అని నాగార్జునగారికి చెప్పాను. ‘నీ మెంటాలిటీకి దర్శకత్వం కష్టం కానీ నిర్మాతగా ట్రై చెయ్’ అని ఆయన సలహా ఇచ్చారు. ‘సూపర్’ టైమ్‌లో అనుష్కగారికి మేకప్ చేస్తూ ‘మీరు పెద్ద హీరోయిన్ అవుతారు.. అప్పుడు నాకు డేట్స్ ఇవ్వాలి’ అన్నాను. అలా చాలా మందిని అడిగాను. కానీ అనుష్క మాత్రమే మాట నిలబెట్టుకున్నారు’ అన్నారు నిర్మాత బొమ్మదేవర రామచంద్రరావు. తనయుడు తేజ్‌ను హీరోగా పరిచయం చేస్తూ ఆయన స్వీయ దర్శకత్వంలో నిర్మించిన ‘మాధవే మధుసూదన’ చిత్రం ఈ నెల 24న విడుదల కానుంది. ఈ సందర్భంగా మీడియాతో రామచంద్రరావు మాట్లాడుతూ ‘ఈ సినిమా కోసం చాలా మంది హీరోలను అడిగాను. కానీ ఒక మేక్‌పమన్ దర్శకుడు, నిర్మాతగా మారుతున్నాడని ఎవరూ నమ్మలేదు. వేరే వాళ్లతో రిస్క్ ఎందుకని మా అబ్బాయి తేజ్‌ని హీరోగా పరిచయం చేశాను. సినిమా చూస్తే కొత్త హీరో నటించాడని మీకు అనిపించదు’ అన్నారు. ‘స్ర్కీన్ మీద ఏం చూపించాలనేది దర్శకుడికి తెలుస్తుంది. అదే టైమ్‌లో బడ్జెట్ గురించి నిర్మాత టెన్షన్ పడుతుంటాడు. కానీ ఆ రెండు బాధ్యతలూ నావే కనుక ముందే ఓ బడ్జెట్ అనుకుని అంతలోనే సినిమా తీశాను.’ అని చెప్పారు రామచంద్రరావు. హీరోయిన్ గురించి వివరిస్తూ ‘దర్శకుడు తేజ ‘అహింస’ చిత్రం కోసం రిషికీ లోక్రేను సెలెక్ట్ చేశారు. కానీ ఆ చిత్రంలో అవకాశం ఇవ్వలేదు. నాకు ఆ అమ్మాయి గురించి తెలిసి హీరోయిన్‌గా తీసుకున్నాను. జాన్వీ కపూర్‌లా ఉందని అందరూ అంటున్నారు’ అన్నారు రామచంద్రరావు. నాగార్జున మొదటి నుంచి సపోర్ట్ చేస్తున్నారని చెబుతూ ‘నాగచైతన్య, అఖిల్, మంచు విష్ణు, బ్రహ్మనందం.. ఇలా ఎంతోమంది సహాయం చేయడం వల్లే సినిమా ఇక్కడి వరకూ వచ్చింది. కుటుంబం అంతా కలసి చూసేలా చిత్రం ఉంటుంది’ అన్నారాయన.