మా అక్క ఇచ్చిన సలహా అదే!
ABN , First Publish Date - 2023-10-12T03:26:26+05:30 IST
‘మా అక్క కృతీసనన్ సినీ ప్రయాణం కూడా తెలుగు చిత్రంతోనే మొదలైంది. ఇప్పుడు నేను కూడా ‘టైగర్ నాగేశ్వరరావు’ చిత్రంతో తెరంగేట్రం చేస్తున్నందుకు ఆనందంగా ఉంది...

‘మా అక్క కృతీసనన్ సినీ ప్రయాణం కూడా తెలుగు చిత్రంతోనే మొదలైంది. ఇప్పుడు నేను కూడా ‘టైగర్ నాగేశ్వరరావు’ చిత్రంతో తెరంగేట్రం చేస్తున్నందుకు ఆనందంగా ఉంది. దర్శకుడు వంశీ ఈ పాత్ర కోసం దాదాపు 200 మందిని ఆడిషన్స్ చేసి చివరకు నన్ను ఎంచుకున్నారని తెలిసింది. ఈ పాత్రకు నేను సరిపోతానని ఆయన భావించడం నాపైన నాకు నమ్మకాన్ని పెంచింది’ అని నూపుర్ సనన్ అన్నారు. రవితేజ హీరోగా నటించిన చిత్రమిది. ఈ నెల 20న విడుదలవుతోంది. ఈ సందర్భంగా నూపుర్ సినిమా విశేషాలను మీడియాతో పంచుకున్నారు.
‘టైగర్ నాగేశ్వరరావు’ కథానాయికగా నాకు తొలి చిత్రం. ఈ చిత్రంలో నా పాత్ర పేరు ‘సారా’. తనో మార్వాడీ అమ్మాయి. ప్రేమించినవాళ్ల కోసం ఎంతకైనా తెగించే స్వభావం ఉన్న యువతి. సగటు అంశాలతో పాటు నటనకూ ఆస్కారమున్న పాత్ర ఇది. మొదటి సినిమాలోనే నటిగా నాకు సవాల్ విసిరే పాత్ర లభించిందని చెప్పవచ్చు.
తొలిచిత్రంగా ఈ సినిమా అంగీకరించడానికి చాలా కారణాలు ఉన్నాయి. రవితేజతో సినిమా చేయడం అదృష్టంగా భావిస్తున్నాను. అలాగే పాన్ ఇండియా విజయాలు అందుకున్న అభిషేక్ అగర్వాల్ ప్రొడక్షన్స్‌లో నాకు మంచి ఆరంభం దక్కుతుందని భావించాను.
తెలుగులో నాని, రామ్ పోతినేని, విష్వక్‌సేన్ సినిమాలు చూస్తుంటాను. సాయిపల్లవి, కీర్తిసురే శ్, అనుష్క శెట్టి అంటే చాలా ఇష్టం. వారిలానే భవిష్యత్‌లో అన్ని రకాల పాత్రలు పోషించి మంచి నటిగా నిరూపించుకోవాలని ఉంది. ప్రస్తుతం హిందీలో నవాజుద్దీన్ సిద్దిఖీతో ఓ చిత్రం చేస్తున్నాను.
అక్క నాకు ఇచ్చిన ఒకే ఒక సలహా... ‘నువ్వు నీలా ఉండు’. నేను దాన్ని అక్షరాలా పాటిస్తాను. మా ఇద్దరి అభిరుచులు భిన్నంగా ఉంటాయి. మేమిద్దరం మంచి విమర్శకులం. నటనలో దోషాలుంటే వాటి గురించి చర్చించుకుంటాం.