కథలోనే ఆ దమ్ముంది
ABN , First Publish Date - 2023-08-16T03:23:59+05:30 IST
‘‘హీరో సంతోష్ శోభన్, దర్శకుడు అభిషేక్ నాకు మంచి మిత్రులు. కేవలం వాళ్ల కోసమే ఈ సినిమా చేయలేదు. ఈ కథలో ఆ దమ్ముంది’’ అన్నారు శివ ప్రసాద్ పన్నీరు. ఆయన నిర్మించిన చిత్రం ‘ప్రేమ్ కుమార్’....

‘‘హీరో సంతోష్ శోభన్, దర్శకుడు అభిషేక్ నాకు మంచి మిత్రులు. కేవలం వాళ్ల కోసమే ఈ సినిమా చేయలేదు. ఈ కథలో ఆ దమ్ముంది’’ అన్నారు శివ ప్రసాద్ పన్నీరు. ఆయన నిర్మించిన చిత్రం ‘ప్రేమ్ కుమార్’. సంతోష్ శోభన్ కథానాయకుడిగా నటించిన ఈ చిత్రానికి అభిషేక్ మహర్షి దర్శకుడు. ఈనెల 18న విడుదల అవుతోంది. ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ ‘‘పదేళ్లుగా వ్యాపార రంగంలో ఉన్నాను. నిర్మాతగా ఇదే తొలి సినిమా. పరిమిత బడ్జెట్‌లో ఓ చక్కటి చిత్రం తీయాలని చాలా కథలు విన్నాను. సంతోష్ కామెడీ టైమింగ్ చాలా బాగుంటుంది. కానీ ఎప్పుడూ పూర్తి స్థాయి వినోదాత్మక చిత్రం చేయలేదు. అందుకే ఈ కథని ఎంచుకొన్నా. సాధారణంగా మన సినిమాల్లో హీరో.. హీరోయిన్‌ని పెళ్లి పీటల నుంచే ఎత్తుకెళ్లిపోతాడు. అక్కడితో సినిమా అయిపోతుంది. కానీ పెళ్లికొడుకు గురించి ఎవరూ ఆలోచించరు. ఆ కోణంలో ఓ సినిమా చేస్తే ఎలా ఉంటుందన్న ఐడియాతో ‘ప్రేమ్ కుమార్’ తీశాం. సంతోష్ శోభన్ చాలా బాగా నటించాడు. తన కెరీర్‌లో ఇదే బెస్ట్ సినిమా అవుతుందన్న నమ్మకం ఉంది. స్నేహితులు, కుటుంబ సభ్యులతో కలిసి, ఎంజాయ్ చేస్తూ ఈ సినిమా చూడొచ్చ’’న్నారు.