ప్రపంచానికి నా కథ చెబుతా
ABN , First Publish Date - 2023-03-23T00:58:58+05:30 IST
అట్టడుగు స్థాయి నుంచి విజయ శిఖరాల అధిరోహణ అంత సులువు కాదు. ముఖ్యంగా రంగుల ప్రపంచంగా పిలిచే సినిమా రంగంలో. ఎన్నో కలలు మోసుకుంటూ హీరోగా, హీరోయిన్‌గా, దర్శకులుగా రాణించాలనే లక్ష్యంతో...
అట్టడుగు స్థాయి నుంచి విజయ శిఖరాల అధిరోహణ అంత సులువు కాదు. ముఖ్యంగా రంగుల ప్రపంచంగా పిలిచే సినిమా రంగంలో. ఎన్నో కలలు మోసుకుంటూ హీరోగా, హీరోయిన్‌గా, దర్శకులుగా రాణించాలనే లక్ష్యంతో యువత ఇండస్ట్రీకి వస్తారు. కానీ అక్కడ ఎదురయ్యే ఇబ్బందులు, అవమానాలు తట్టుకొని నిలిచి గెలిచేది ఏ ఒక్కరో ఇద్దరో. అలాంటి విజేతల జాబితాలో మృణాళిని ఠాకూర్ ఒకరు. ఇటు దక్షిణాదిన అటు బాలీవుడ్‌లో డిమాండ్ ఉన్న కథానాయికగా దూసుకుపోతున్నారామె. ‘సీతారామం’ చిత్రంలో తనదైన శైలిలో నటించి ప్రేక్షకుల మెప్పు పొందారు. అయితే ఈ విజయాలేవి తనకు అంత సులువుగా దక్కలే దన్నారు మృణాళిని. కథానాయికగా నిలదొక్కుకోవాలనే కసితో కష్టాలను, ఇబ్బందులను పంటి బిగువున ఓర్చుకుంటూ ఇక్కడిదాకా నా ప్రయాణాన్ని కొనసాగించానని అన్నారు. కన్నీళ్లతో ఉన్న తన ఫొటోను మృణాళిని ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చే శారు. అయితే ఆ ఫొటో ఇప్పటిది కాదని చెప్పారు. గతంలో తాను కుంగుబాటుకు గురైన సమయంలో దిగిన ఫొటో అని తెలిపారు. ఇప్పుడు ఆ ఫొటోను నెటిజన్లతో పంచుకోవడానికి గల కారణాన్ని వివరించారు. ‘ఇప్పటిదాకా జీవితం ఎన్నో కష్టాలతో గడిచింది. ఇన్నాళ్లూ ఇబ్బందులు ఎదుర్కొన్నా ఇప్పుడు మాత్రం సంతోషంగా ఉన్నా. మనలో ప్రతి ఒక్కరిదీ ఒక్కో కథ. కాకపోతే అందరూ పైకి చెప్పుకోవడానికి ఇష్టపడరు. నేను మాత్రం నా కథను ప్రపంచానికి వినిపిస్తాను. నా అనుభవాలను ఇతరులు ఒక పాఠంగా తీసుకుంటారని అనుకుంటున్నాను. కొన్నిసార్లు ఎన్ని ఇబ్బందులు వచ్చినా వాటిని ధైర్యంగా ఎదుర్కోవాలి. ముందుకు సాగాలి’ అని చెప్పారు.