తరుణ్ భాస్కర్ పేరే.. ఓ బ్రాండ్!
ABN , First Publish Date - 2023-10-28T04:57:51+05:30 IST
‘‘తరుణ్ భాస్కర్ సినిమాలకంటూ ఓ స్టైల్ ఉంటుంది. ఆయన పేరే ఓ బ్రాండ్’’ అన్నారు చైతన్య రావు మాదాడి. తరుణ్ భాస్కర్ దర్శకత్వంలో రూపొందిన ‘కీడా కోలా’లో ఆయన ఓ కీలక పాత్ర పోషించారు. నవంబరు 3న ఈ చిత్రం విడుదల కానుంది...

‘‘తరుణ్ భాస్కర్ సినిమాలకంటూ ఓ స్టైల్ ఉంటుంది. ఆయన పేరే ఓ బ్రాండ్’’ అన్నారు చైతన్య రావు మాదాడి. తరుణ్ భాస్కర్ దర్శకత్వంలో రూపొందిన ‘కీడా కోలా’లో ఆయన ఓ కీలక పాత్ర పోషించారు. నవంబరు 3న ఈ చిత్రం విడుదల కానుంది. ఈ సందర్భంగా శుక్రవారం హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో చైతన్య రావు మాట్లాడారు.
‘‘తరుణ్ భాస్కర్ గారి సినిమాలంటే నాకు చాలా ఇష్టం. ఆయనతో పని చేయాలని ఎప్పటి నుంచో అనుకొంటున్నాను. ఓసారి ఆయన ఆఫీస్ నుంచి కాల్ వచ్చింది. ‘కీడా కోలా’ స్ర్కిప్టు ఇచ్చి చదవమన్నారు. అందులో వాస్తు పాత్ర నాకు బాగా నచ్చింది. ఆ పాత్ర ఇస్తే బాగుంటుందనుకొన్నా. సరిగ్గా అదే పాత్ర చేయమన్నారు. దాంతో మరింత సంతోషం వేసింది’’.
‘‘వాస్తు చాలా డిఫరెంట్ క్యారెక్టర్. ఈ పాత్రకు టూరెట్ సిండ్రోమ్ అనే సమస్య ఉంటుంది. దాని గురించి మనకు పెద్దగా తెలీదు. ఆడిషన్స్ చేయమన్నప్పుడు నాకు మూడు రోజుల సమయం కావాలని అడిగి.. నాలుగో రోజు వచ్చా. ఈలోగా ‘టూరెట్ సిండ్రోమ్’ గురించి పూర్తిగా అధ్యయనం చేశా. కొన్ని హాలీవుడ్ సినిమాలు రిఫరెన్స్‌గా తీసుకొన్నా. ఆ తరవాత ఆడిషన్ ఇచ్చాను. దాంతో.. తరుణ్ భాస్కర్ కూడా చాలా ఇంప్రెస్ అయ్యారు’’.
‘‘దిగ్గజ నటుడు బ్రహ్మానందంగారితో పని చేసే అవకాశం రావడం ఎప్పటికీ మర్చిపోలేను. ఆయన్నుంచి చాలా విషయాలు నేర్చుకొన్నా. తరుణ్ భాస్కర్ కూడా ఈ చిత్రంలో ఓ కీలక పాత్ర పోషించారు. తన నటన కూడా చాలా సహజంగా ఉంటుంది. తరుణ్ సెట్లో చాలా క్యాజువల్‌గా ఉంటారు. ఎవరితో ఎలాంటి నటన రాబట్టుకోవాలో ఆయనకు బాగా తెలుసు. తరుణ్ సినిమాలే ఓ బ్రాండ్. అయినప్పటికీ ఆయన సినిమాలో చిన్న పాత్ర చేసినా చాలు. జనాల్లో గుర్తింపు వచ్చేస్తుంది. ఆ తరహా పాత్రలు ‘కీడా కోలా’లో చాలా ఉన్నాయి’’.
‘‘నేను నటించిన ‘షరతులు వర్తిస్తాయి’ చిత్రం విడుదలకు సిద్దంగా ఉంది. ‘పారిజాత పర్వం’, ‘హనీమూన్ ఎక్స్‌ప్రెస్’ చిత్రాలు రెడీ అవుతున్నాయి. ఇంకొన్ని కథలు వింటున్నాను’’.